ఇష్టారాజ్యంగా గిడ్డంగి పనులు | People who are not experienced in construction | Sakshi
Sakshi News home page

ఇష్టారాజ్యంగా గిడ్డంగి పనులు

Published Mon, Nov 24 2014 2:24 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

People who are not experienced in construction

బోథ్ : రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నచందంగా రూ. లక్షలు వెచ్చించి నిర్మిస్తున్న ప్రభుత్వ పనులపై అధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టరు ఇష్టారాజ్యంగా పనులు చేపడుతున్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక రైతు సహకారం సంఘం గిడ్డంగి నిర్మాణానికి రూ.13.5 లక్షల నిధులు మంజూరయ్యాయి. పనులను సాంఘిక సంక్షేమశాఖ పర్యవేక్షిస్తోంది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టరు మూడో వ్యక్తికి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. కాంట్రాక్ట్ పొందిన వ్యక్తి నేరడిగొండ మండలంలో ఓ ప్రజాప్రతినిధి కావడంతో అధికారులు అడ్డు చెప్పరనే ధీమాతో పనులు సాగిస్తున్నాడు.

నాసిరకం ఇసుక వాడకం

దశాబ్దాలపాటు నిలవాల్సిన పనులకు మేలైన ఇసుక వాడేందుకు అధికారులు అనుమతిచ్చారు. ఇందుకు అవసరమైన ఇసుకను నిజామాబాద్ జిల్లా పెద్దవాగు నుంచి, మహారాష్ట్ర నుంచి అనుమతితో వచ్చిన ఇసుకనుగాని వాడేందుకు అందుకు అవసరమైన దూరాన్ని, ధరను నిర్ణయించారు. కాని సబ్‌కాంట్రాక్టర్ ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ నుంచి తెప్పించిన నాసిరకం మట్టితో కూడిన ఇసుక వాడి పనులు సాగిస్తున్నాడు.

కనిపించని వైబ్రేటర్

రూ. లక్షలు వెచ్చించి నిర్మిస్తున్న పనుల్లో సీసీ భీంలో అన్ని వైపులా చేరుకోవడానికి వైబ్రేటర్‌ను ఉపయోగిస్తారు. వైబ్రేటర్ ఉపయోగించడంతో దాదాపు 25 శాతం మేర కంకర, ఇసుక, సిమెంటు అధికంగా వినియోగం అవుతుంది. పనుల్లో వాడే వస్తువులు విలువను తగ్గించుకోవడానికి, పనుల్లో వైబ్రేటర్‌ను వినియోగించడంలేదు.

అనుభవం లేని వ్యక్తులతో నిర్మాణం

పనులను తక్కువ ఖర్చులో పూర్తి చేసేందుకు పనులు చేపడుతున్నారు. నైపుణ్యం గల కార్మికులను వినియోగించకుండా తూతుమంత్రంగా పనులు చేపడుతున్నారు. పుటింగ్‌లను నుంచి ప్లింత్ భీంల వరకు జరిగిన పనుల్లో వంకరగా చేసిన పనులు వారి పని తనానికి అద్దంపడుతున్నాయి. పైకి కనిపించే పనులు ఇలా ఉంటే లోపల చేపట్టిన కర్టెన్‌వాల్, ఇతర పనులు ఏవిధంగా చేపట్టారో చెప్పనవసరం లేదు.

తీసివేయని మట్టి

ఇక్కడి నల్లరేగడి నేలకు అనుకూలంగా అధికారులు పనుల్లో నాణ్యత లోపించకుండా ప్రతిపాదనలు  పంపుతారు. పునాదుల్లో తీసిన మట్టిని పూర్తిగా తొలగించి, అందుబాటులోని గ్రావెల్‌తో పునాదులను నింపుతారు. అలాంటిది పనుల్లో ఇప్పటివరకు తీసిన మట్టిని పునాదుల్లోనే వేసేశారు. ఇప్పటికీ మట్టిని తొలగించకుండా ప్లోరింగ్‌లో కూడా అదే మట్టిని ఉపయోగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
 
రైతుల ఆవేదన

నాసిరకం పనులపై సంఘానికి చెందిన పలువురు రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రజాసంక్షేమం కోసం పాటుపడతామని అధికారంలో కొచ్చిన నేతలు ఇలాంటి పనులు చేపట్టడం ఏమిటని వాపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి పనులు నాణ్యతతో చేయించాలని కోరుతున్నారు.
 
పనులు పరిశీలిస్తాం
- ప్రభాకర్, డీఈఈ, సాంఘిక సంక్షేమశాఖ

నాసిరకం పనుల విషయం నా దృష్టికి రాలేదు. ప్రస్తుతం బోథ్ మండలంలోనే ఐదు పనులు కొనసాగుతున్నాయి. అన్ని పనులను పర్యవేక్షించడం కష్టసాధ్యం అవుతుంది. గోదాం పనులను సోమవారం పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిస్తా. అవసరమైతే కాంట్రాక్టు రద్దుకు సిఫార్సు చేస్తా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement