జీఎస్‌టీ అమలుకు ఆర్‌బీఐ ‘ఈ-కుబేర్’ బ్యాంకింగ్ విధానం
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) అమలుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ రూపొందించిన కోర్ బ్యాంకింగ్ సాఫ్ట్‌వేర్ ఈ-కుబేర్‌ను ఉపయోగించవచ్చని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సాధికారిక కమిటీ సూచించింది. జీఎస్‌టీ ఖాతాల కన్సాలిడేషన్, సెటిల్‌మెంట్‌కి ఆర్‌బీఐ అనుసంధానకర్తగా వ్యవహరించిన పక్షంలో మరిన్ని బ్యాంకులు వస్తు, సేవల పన్నులను స్వీకరించే వీలుంటుందని, తద్వారా పన్ను చెల్లింపుదారులకూ వెసులుబాటు లభిస్తుందని పేర్కొంది. సమాచారమంతా ఒకే దగ్గర లభ్యమవుతుంది కనుక అటు ప్రభుత్వానికి కూడా అకౌంటింగ్ భారం తగ్గుతుందని కమిటీ అభిప్రాయపడింది.
రిజిస్ట్రేషన్, పేమెంట్.. రీఫండ్ ప్రక్రియలకు సంబంధించి సాధికారిక కమిటీ మూడు నివేదికలు ఇచ్చింది. చెల్లింపుల కోసం ఇంటర్నెట్ బ్యాంకింగ్, నె ఫ్ట్.. ఆర్‌టీజీఎస్, ఓవర్ ది కౌంటర్ తదితర మార్గాలను అందుబాటులో ఉంచాలని సూచించింది. ఇక, రిజిస్ట్రేషన్ ప్రక్రియ విషయంలో.. పన్నుల పరిధిలోకి వచ్చే వారు జీఎస్‌టీ కామన్ పోర్టల్ ద్వారా పన్నుల విభాగాన్ని సంప్రదించవచ్చని కమిటీ పేర్కొంది. ఇటు కేంద్రం, అటు రాష్ట్రాల స్థాయి ఐటీ సిస్టమ్స్‌తో ఈ పోర్టల్ అనుసంధానమై ఉండాలని తెలిపింది.