Core Banking
-
20 వేల పోస్టాఫీసుల్లో కోర్ బ్యాంకింగ్
న్యూఢిల్లీ: దాదాపు 20,106 పోస్టాఫీసు శాఖలకు కోర్ బ్యాంకింగ్ సదుపాయాన్ని విస్తరించినట్లు టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. 2014 మేలో వీటి సంఖ్య 230 మాత్రమేనని సోషల్ నెట్వర్కింగ్ సైటు ట్వీటర్లో పేర్కొన్నారు. కోర్ బ్యాంకింగ్ సదుపాయాలతో పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాలు ఉన్నవారు తమ లావాదేవీలను మరింత మెరుగ్గా నిర్వహించుకోవచ్చని మంత్రి తెలిపారు. చెల్లింపుల బ్యాంకు ఏర్పాటు కోసం పోస్టల్ విభాగానికి 2015 సెప్టెంబర్ 7న రిజర్వ్ బ్యాంక్ సూత్రప్రాయంగా అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. -
జనవరిలోగా పోస్టల్ ఏటీఎంలు
సాక్షి, విజయవాడ బ్యూరో: వచ్చే జనవరి లోగా ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పరిధిలోని 16 పట్టణాల్లో పోస్టల్ ఏటీఎం మెషీన్లను ఏర్పాటు చేయనున్నట్లు చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ సంపత్ పేర్కొన్నారు. ఇన్ఫోసిస్ నుంచి పరికరాలు రాగానే వాటిని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఆదివారం గుంటూరులో జరిగిన అఖిల భారత పోస్టల్ ఉద్యోగ సంఘం గ్రూప్-సీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరైన సీపీఎంజీ సంపత్.. కోర్ బ్యాంకింగ్ సిస్టమ్(సీబీఎస్) గురించి పలు వివరాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా మొత్తం 25 వేల పోస్టాఫీసులున్నాయనీ, దశల వారీగా వీటిని కోర్ బ్యాంకింగ్ పరిధిలోకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. పోస్టాఫీస్లన్నింటినీ కంప్యూటరీకరణ చేస్తున్నామనీ, ఆఫీసులన్నింటినీ మెయిన్ సర్వర్ కిందకు తెచ్చేందుకు సీబీఎస్ పరిధిలోకి తీసుకెళ్తున్నామని తెలిపారు. దీనివల్ల ఖాతాదారులు ఎక్కడైనా నగదు విత్ డ్రా చేసుకునే సదుపాయం కలుగుతుందని వివరించారు. సోమవారం నుంచి ఆంధ్రా, తెలంగాణ సర్కిళ్ల పరిధిలోని 60 పోస్టాఫీస్‌లను సీబీఎస్ పరిధిలోకి తీసుకెళ్తున్నామని, విజయవాడ రీజియన్ పరిధిలోని 15 పోస్టాఫీస్‌లు ఇందులో ఉన్నాయని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించామన్నారు. సర్కిల్ పరిధిలోని అన్ని పోస్టాఫీస్లనూ సీబీఎస్ పరిధిలోకి తీసుకెళ్లడం పూర్తయితే, బ్యాంకు ఏటీఎంలతోనూ పోస్టల్ ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసుకునే సదుపాయం కలుగుతుందని సీపీఎంజీ సంపత్ వివరించారు. -
జీఎస్టీ అమలుకు ఆర్బీఐ ‘ఈ-కుబేర్’ బ్యాంకింగ్ విధానం
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) అమలుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ రూపొందించిన కోర్ బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ ఈ-కుబేర్‌ను ఉపయోగించవచ్చని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సాధికారిక కమిటీ సూచించింది. జీఎస్టీ ఖాతాల కన్సాలిడేషన్, సెటిల్మెంట్కి ఆర్బీఐ అనుసంధానకర్తగా వ్యవహరించిన పక్షంలో మరిన్ని బ్యాంకులు వస్తు, సేవల పన్నులను స్వీకరించే వీలుంటుందని, తద్వారా పన్ను చెల్లింపుదారులకూ వెసులుబాటు లభిస్తుందని పేర్కొంది. సమాచారమంతా ఒకే దగ్గర లభ్యమవుతుంది కనుక అటు ప్రభుత్వానికి కూడా అకౌంటింగ్ భారం తగ్గుతుందని కమిటీ అభిప్రాయపడింది. రిజిస్ట్రేషన్, పేమెంట్.. రీఫండ్ ప్రక్రియలకు సంబంధించి సాధికారిక కమిటీ మూడు నివేదికలు ఇచ్చింది. చెల్లింపుల కోసం ఇంటర్నెట్ బ్యాంకింగ్, నె ఫ్ట్.. ఆర్టీజీఎస్, ఓవర్ ది కౌంటర్ తదితర మార్గాలను అందుబాటులో ఉంచాలని సూచించింది. ఇక, రిజిస్ట్రేషన్ ప్రక్రియ విషయంలో.. పన్నుల పరిధిలోకి వచ్చే వారు జీఎస్టీ కామన్ పోర్టల్ ద్వారా పన్నుల విభాగాన్ని సంప్రదించవచ్చని కమిటీ పేర్కొంది. ఇటు కేంద్రం, అటు రాష్ట్రాల స్థాయి ఐటీ సిస్టమ్స్‌తో ఈ పోర్టల్ అనుసంధానమై ఉండాలని తెలిపింది. -
రెండు నెలల్లో ‘పోస్టు’ బ్యాంకులు
కోర్ బ్యాంకింగ్ సేవల్లోకి తపాలా శాఖ ఎక్కడైనా నగదు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు హైదరాబాద్: పూర్తిస్థాయి బ్యాంకుగా అవతారమెత్తేందుకు ఉవ్విళ్లూరుతున్న తపాలా శాఖ తొలుత కోర్ బ్యాంకింగ్ సేవలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం అన్ని తపాలా కార్యాలయాలను ఆన్‌లైన్‌తో అనుసంధాన పరిచే ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సర్కిల్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల) పరిధిలో మరో రెండు నెలల్లో కోర్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. దీనికి సంబంధించి నగరంలోని సనత్‌నగర్ పోస్ట్ ఆఫీసులో తాజాగా సెంట్రల్ సర్వర్‌ను ఏర్పాటు చేసి కార్యకలాపాలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. బ్యాంకింగ్ సేవలు ప్రారంభం కాగానే ఏ పోస్టాఫీసు నుంచైనా నగదును పొందే వీలుంటుంది. ఇప్పటి వరకు పొదుపు ఖాతా(సేవింగ్స్ అకౌంట్) ఉన్న పోస్టాఫీసు నుంచి మాత్రమే నగదును విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. ఇకపై ఎక్కడి నుంచి ఎక్కడికైనా నగదును పంపే వెసులుబాటు కూడా అందుబాటులోకి రాబోతోంది. ప్రస్తుతం పొదుపు ఖాతాలకు ఐదు అంకెలతో ఉన్న సంఖ్యను 16 అంకెల సంఖ్యగా మార్చబోతున్నారు. రెండు నెలల్లో ఈ కసరత్తు మొత్తాన్ని పూర్తి చేసి బ్యాంకింగ్ సేవలను ప్రారంభించాలని నిర్ణయించారు. దీంతో ఉత్తరాలను ప్రజలు మరిచిపోతున్న తరుణంలో మసకబారుతున్న తపాలా సేవలకు మళ్లీ పాత కళ వస్తుందని ఆ శాఖ ఆశపడుతోంది. క్రమంగా తాము ఇతర బ్యాంకులకు పోటీనిచ్చే స్థాయికి చేరుకుంటామని తపాలా శాఖ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రూ. 18 వేల కోట్లతో ‘ఇంటర్నెట్’ కనెక్టివిటీ తపాలా కార్యాలయాల ఆధునికీకరణ వేగంగా జరుగుతోంది. వాస్తవానికి ‘ఇండియన్ పోస్ట్ ప్రాజెక్టు-2012’ పేరుతో దేశంలోని అన్ని తపాలా కార్యాలయాలను ఆధునికీకరించాలని యూపీఏ ప్రభుత్వం లక్ష్యించింది. కానీ అది నెరవేరలేదు. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం దాన్ని శరవేగంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రూ. 18 వేల కోట్ల వ్యయంతో గ్రామీణ తపాలా కార్యాలయాలను ఆన్‌లైన్‌తో అనుసంధానించే బృహత్తర ప్రాజెక్టును చేపట్టింది. ప్రస్తుతం ఏపీ సర్కిల్ పరిధిలో కేవలం సబ్ పోస్టాఫీసు స్థాయి వరకే ఆన్లైన్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఏపీ సర్కిల్ పరిధిలో ప్రస్తుతం 16,500 పోస్టాఫీసులుంటే కేవలం 2,300 పోస్టాఫీసుల్లోనే ఆన్లైన్ సేవలు ఉన్నాయి. కోర్‌బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చే క్రమంలో అన్నింటినీ ఆన్‌లైన్‌తో అనుసంధానిస్తున్నారు. ప్రస్తుతం గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చాలా ప్రాంతాల్లో నగదు చెల్లింపు లావాదేవీలు తపాలా కార్యాలయాల ద్వారానే జరుగుతున్నాయి. దీని వల్లే ఏపీ సర్కిల్ పరిధిలోనే దాదాపు రెండు కోట్ల పొదుపు ఖాతాలున్నాయి. ఇప్పుడు కోర్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వస్తే ఈ సంఖ్య ఒక్కసారిగా రెట్టింపవడం ఖాయమని తపాలా శాఖ ఆశాభావంతో ఉంది. గంటల్లో ‘మనీ ఆర్డర్’ ప్రస్తుతం మనీ ఆర్డర్ సేవలకు గరిష్టంగా రెండు రోజుల సమయం తీసుకుంటోంది. అన్ని తపాలా కార్యాలయాలకు అన్లైన్ సేవలు లేకపోవడంతో బ్రాంచి పోస్టాఫీసుల నుంచి నగదు తీసుకుని సంబంధిత తపాలా కార్యాలయాలకు చేరవేయాల్సి వస్తోంది. ఇందుకు కొంత సమయం పడుతోంది. అన్ని పోస్టాఫీసులు అన్లైన్ పరిధిలోకి వస్తే ఈ కసరత్తు కొన్ని గంటల్లోనే పూర్తవుతుంది. ఉదయం మనీ ఆర్డర్ చేస్తే మధ్యాహ్నానికి డబ్బులు గమ్యం చేరతాయి. పూర్తి స్థాయి బ్యాంకుగా రూపొందడానికి అనుమతి కోసం తపాలా శాఖ రిజర్వు బ్యాంకుకు దరఖాస్తు చేసుకుంది. అనుమతి రాగానే ఏటీఎంలను ప్రారంభించి పూర్తిస్తాయి పోస్టు బ్యాంకుగా రూపాంతరం చెందనుంది. ఇప్పటికే చెన్నైలో ఏటీఎం సేవలను కూడా ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది.