రెండు నెలల్లో ‘పోస్టు’ బ్యాంకులు
కోర్ బ్యాంకింగ్ సేవల్లోకి తపాలా శాఖ
ఎక్కడైనా నగదు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు
హైదరాబాద్: పూర్తిస్థాయి బ్యాంకుగా అవతారమెత్తేందుకు ఉవ్విళ్లూరుతున్న తపాలా శాఖ తొలుత కోర్ బ్యాంకింగ్ సేవలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం అన్ని తపాలా కార్యాలయాలను ఆన్‌లైన్‌తో అనుసంధాన పరిచే ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సర్కిల్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల) పరిధిలో మరో రెండు నెలల్లో కోర్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. దీనికి సంబంధించి నగరంలోని సనత్‌నగర్ పోస్ట్ ఆఫీసులో తాజాగా సెంట్రల్ సర్వర్‌ను ఏర్పాటు చేసి కార్యకలాపాలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. బ్యాంకింగ్ సేవలు ప్రారంభం కాగానే ఏ పోస్టాఫీసు నుంచైనా నగదును పొందే వీలుంటుంది. ఇప్పటి వరకు పొదుపు ఖాతా(సేవింగ్స్ అకౌంట్) ఉన్న పోస్టాఫీసు నుంచి మాత్రమే నగదును విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. ఇకపై ఎక్కడి నుంచి ఎక్కడికైనా నగదును పంపే వెసులుబాటు కూడా అందుబాటులోకి రాబోతోంది. ప్రస్తుతం పొదుపు ఖాతాలకు ఐదు అంకెలతో ఉన్న సంఖ్యను 16 అంకెల సంఖ్యగా మార్చబోతున్నారు. రెండు నెలల్లో ఈ కసరత్తు మొత్తాన్ని పూర్తి చేసి బ్యాంకింగ్ సేవలను ప్రారంభించాలని నిర్ణయించారు. దీంతో ఉత్తరాలను ప్రజలు మరిచిపోతున్న తరుణంలో మసకబారుతున్న తపాలా సేవలకు మళ్లీ పాత కళ వస్తుందని ఆ శాఖ ఆశపడుతోంది. క్రమంగా తాము ఇతర బ్యాంకులకు పోటీనిచ్చే స్థాయికి చేరుకుంటామని తపాలా శాఖ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
రూ. 18 వేల కోట్లతో ‘ఇంటర్నెట్’ కనెక్టివిటీ
తపాలా కార్యాలయాల ఆధునికీకరణ వేగంగా జరుగుతోంది. వాస్తవానికి ‘ఇండియన్ పోస్ట్ ప్రాజెక్టు-2012’ పేరుతో దేశంలోని అన్ని తపాలా కార్యాలయాలను ఆధునికీకరించాలని యూపీఏ ప్రభుత్వం లక్ష్యించింది. కానీ అది నెరవేరలేదు. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం దాన్ని శరవేగంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రూ. 18 వేల కోట్ల వ్యయంతో గ్రామీణ తపాలా కార్యాలయాలను ఆన్‌లైన్‌తో అనుసంధానించే బృహత్తర ప్రాజెక్టును చేపట్టింది. ప్రస్తుతం ఏపీ సర్కిల్ పరిధిలో కేవలం సబ్ పోస్టాఫీసు స్థాయి వరకే ఆన్‌లైన్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఏపీ సర్కిల్ పరిధిలో ప్రస్తుతం 16,500 పోస్టాఫీసులుంటే కేవలం 2,300 పోస్టాఫీసుల్లోనే ఆన్‌లైన్ సేవలు ఉన్నాయి. కోర్‌బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చే క్రమంలో అన్నింటినీ ఆన్‌లైన్‌తో అనుసంధానిస్తున్నారు. ప్రస్తుతం గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చాలా ప్రాంతాల్లో నగదు చెల్లింపు లావాదేవీలు తపాలా కార్యాలయాల ద్వారానే జరుగుతున్నాయి. దీని వల్లే ఏపీ సర్కిల్ పరిధిలోనే దాదాపు రెండు కోట్ల పొదుపు ఖాతాలున్నాయి. ఇప్పుడు కోర్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వస్తే ఈ సంఖ్య ఒక్కసారిగా రెట్టింపవడం ఖాయమని తపాలా శాఖ ఆశాభావంతో ఉంది.
గంటల్లో ‘మనీ ఆర్డర్’
ప్రస్తుతం మనీ ఆర్డర్ సేవలకు గరిష్టంగా రెండు రోజుల సమయం తీసుకుంటోంది. అన్ని తపాలా కార్యాలయాలకు అన్‌లైన్ సేవలు లేకపోవడంతో బ్రాంచి పోస్టాఫీసుల నుంచి నగదు తీసుకుని సంబంధిత తపాలా కార్యాలయాలకు చేరవేయాల్సి వస్తోంది. ఇందుకు కొంత సమయం పడుతోంది. అన్ని పోస్టాఫీసులు అన్‌లైన్ పరిధిలోకి వస్తే ఈ కసరత్తు కొన్ని గంటల్లోనే పూర్తవుతుంది. ఉదయం మనీ ఆర్డర్ చేస్తే మధ్యాహ్నానికి డబ్బులు గమ్యం చేరతాయి. పూర్తి స్థాయి బ్యాంకుగా రూపొందడానికి అనుమతి కోసం తపాలా శాఖ రిజర్వు బ్యాంకుకు దరఖాస్తు చేసుకుంది. అనుమతి రాగానే ఏటీఎంలను ప్రారంభించి పూర్తిస్తాయి పోస్టు బ్యాంకుగా రూపాంతరం చెందనుంది. ఇప్పటికే చెన్నైలో ఏటీఎం సేవలను కూడా ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది.