Post Bank
-
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, అదనంగా వందల కోట్లు కేటాయించిన కేంద్రం!
న్యూఢిల్లీ: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ)కు రూ. 820 కోట్ల అదనపు నిధుల కేటాయింపు ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. దేశంలోని అన్ని పోస్టాఫీసులకు తన సేవలను విస్తరించేందుకు ఐపీపీబీ ఈ నిధులను వినియోగించుకుంటుంది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విలేకరులకు ఈ విషయాన్ని తెలిపారు. 1.56 లక్షల పోస్టాఫీసులలో ఐపీపీబీ ప్రస్తుతం 1.3 లక్షల పోస్టాఫీసుల నుండి పనిచేస్తోందని తెలిపారు. రెగ్యులేటరీ అవసరాలు, సాంకేతిక అప్గ్రేడేషన్ల కోసం ఐపీపీబీకి రూ.500 కోట్ల కేటాయింపులకు క్యాబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని కూడా ఆయన చెప్పారు. గ్రామీణ ప్రాంతాలు లక్ష్యం: ఐపీపీబీ తన బ్యాంకింగ్ సేవలను 1,56,434 పోస్టాఫీసులకు విస్తరించబోతున్నట్లు మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేదలు, తల్లులు, సోదరీమణులు బ్యాంకింగ్ సౌకర్యాన్ని పొందేందుకు వీలుగా రూ. 820 కోట్ల పెట్టుబడి పెట్టాలని కేంద్ర క్యాబినెట్ తాజా నిర్ణయం తీసుకుందని ఠాకూర్ పేర్కొన్నారు. అధికారిక ప్రకటన ప్రకారం, రెగ్యులేటరీ అవసరాలను తీర్చడానికి ఈక్విటీ పెట్టుబడిగా ఐపీపీబీ ఏర్పాటుకు సంబంధించి ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ. 1,435 కోట్ల నుండి రూ. 2,255 కోట్లకు సవరించడానికి కూడా క్యాబినెట్ ఆమోదముద్ర పడింది. సామాన్యులకు అత్యంత అందుబాటులో, సరసమైన, విశ్వసనీయమైన, పారదర్శకమైన బ్యాంకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ప్రాజెక్ట్ లక్ష్యమని ఆ వర్గాలు వెల్లడించాయి. అందరికీ బ్యాంకింగ్ సదుపాయం లభ్యత, ఆర్థిక సేవల విస్తరణ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడం, నగదు రహిత వ్యవస్థ దిశగా అడుగులు, తదనుగుణమైన ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టు ధ్యేయమని కూడా పేర్కొన్నాయి. ప్రస్తుతం ఐపీపీబీ ఇలా.. ఒక అధికారిక ప్రకటన ప్రకారం, ఐపీపీబీ 1.36 లక్షల పోస్టాఫీసులను బ్యాంకింగ్ సేవలను అందించడానికి వీలు కల్పించింది. డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలను అందించడానికి దాదాపు 1.89 లక్షల మంది పోస్ట్‌మెన్, గ్రామీణ డాక్ సేవక్‌లకు స్మార్ట్‌ఫోన్, బయోమెట్రిక్ పరికరాలను సమకూర్చింది. ఐపీపీబీ 2018 సెప్టెంబర్‌లో 650 శాఖలు/నియంత్రణ కార్యాలయాలతో ప్రారంభమైంది. ప్రారంభించినప్పటి నుండి, ఇది మొత్తం 82 కోట్ల ఆర్థిక లావాదేవీలతో 5.25 కోట్లకు పైగా ఖాతాలను తెరిచింది. లావాదేవీల విలువ రూ.1,61,811 కోట్లు. రూ. 21,343 కోట్ల విలువైన 765 లక్షల ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ లావాదేవీలను కలిగి ఉంది. 5 కోట్ల ఖాతాలలో 77 శాతం ఖాతాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. 48 శాతం మహిళా ఖాతాదారులు సుమారు రూ. 1,000 కోట్ల డిపాజిట్‌తో ఉన్నారు. దాదాపు 40 లక్షల మంది మహిళా ఖాతాదారులు తమ ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ప్రయోజనం పొందారు. దీని విలువ దాదాపు రూ.2,500 కోట్లు. పాఠశాల విద్యార్థుల కోసం 7.8 లక్షలకు పైగా ఖాతాలు ప్రారంభమయ్యాయి. -
పోస్టాఫీస్ ఖాతాదారులు ఇవి గుర్తుంచుకోండి!
ప్రస్తుతం ఎన్నో రకాల పథకాలు పోస్టాఫీస్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో డబ్బులు జమ చేయడం వల్ల ఎటువంటి సమస్య లేకుండా కచ్చితమైన రాబడి పొందవచ్చు. అయితే, పోస్టాఫీస్‌లో ఖాతా కలిగిన వారు, ఇతర రకాల స్కీమ్స్‌లో చేరిన వారు కచ్చితంగా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఇండియా పోస్ట్ ఇటీవలే కొత్త రూల్స్ తీసుకోని వచ్చింది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ రూల్స్ వల్ల పోస్టాఫీస్ ఖాతాదారులపై ప్రభావం పడనుంది. పోస్టాఫీస్ జీడీఎస్(గ్రామీణ్ డాక్ సేవ) బ్రాంచుల్లో వ్యక్తి గత ఖాతా నుంచి క్యాష్ విత్‌డ్రాయెల్ లిమిట్‌ను రూ.20,000 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే వడ్డీ రేటును కూడా సవరించింది. సేవింగ్ ఖాతా నగదుపై ఏడాదికీ 4శాతం వడ్డీ లభించనుంది. పోస్టాఫీస్ జీడీఎస్ బ్రాంచుల నుంచి రూ.5,000 కాకుండా ఇప్పుడు ఒక్కో కస్టమర్ రూ.20 వేలు విత్‌డ్రా చేసుకోవచ్చు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ రోజుకు ఒక అకౌంట్లో రూ.50,000కు మించి డబ్బులు డిపాజిట్ చేయడానికి వీలు లేదు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, మంత్లీ ఇన్కమ్ స్కీమ్, కిసాన్ వికాస్ పత్ర, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వంటి స్కీమ్‌లలో డబ్బు డిపాజిట్ చేయడానికి విత్‌డ్రాయెల్ ఫామ్ లేదా చెక్ ఉపయోగించొచ్చు. అలాగే సేవింగ్స్ ఖాతా కలిగిన వారు కచ్చితంగా రూ.500 మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాలి. ఒకవేళ మీ పోస్టాఫీస్ ఖాతాలోలో రూ.500 మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే.. అప్పుడు మీ ఖాతా నుంచి రూ.100 కట్ అవుతుంది. చదవండి: మీ ఆధార్ ను ఎవరైనా వాడారా తెలుసుకోండిలా..? కరోనా కాలంలో చైనాపై కాసుల వర్షం -
ఇండియా పోస్ట్ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్
ఇండియా పోస్ట్ బ్యాంకు ఖాతాదారులకు పోస్టల్ శాఖ షాకింగ్ న్యూస్ చెప్పింది. డబ్బులు డిపాజిట్ చేయడం, విత్ డ్రా చేయడంపై ఛార్జీలు విధించనున్నట్లు తెలిపింది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1, 2021 నుంచి అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. నగదు లావాదేవీలపై విధించే ఛార్జీలు వివిధ ఖాతాల ప్రకారం మారనున్నట్లు తెలుస్తుంది. ఖాతాదారులు నెలలో నాలుగు సార్లు నగదు ఉపసంహరించుకుంటే ఎటువంటి చార్జీలు లేవు. అంతకన్నా ఎక్కువ సార్లు నగదు తీసిన మొత్తంలో 0.50శాతం(కనీసం రూ.25) వసూలు చేయబడుతుంది. మీకు పొదుపు ఖాతా లేదా కరెంట్ ఖాతా ఉంటే, మీరు అదనపు ఛార్జీలు చెల్లించకుండా ప్రతి నెలా రూ.25 వేలు ఉపసంహరించుకోవచ్చు. అయితే, ఆ తరువాత ప్రతి ఉపసంహరించబడిన మొత్తంలో కనీసం రూ.25 లేదా 0.50 శాతం వసూలు చేయబడుతుంది. మీరు నెలలో 10,000 రూపాయల వరకు నగదు డిపాజిట్ చేస్తే అప్పుడు ఎటువంటి ఛార్జీ ఉండదు. అయితే, మీరు అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే ప్రతి డిపాజిట్‌పై కనీసం రూ.25 వసూలు చేస్తారు. పోస్టు పేమెంట్ నెట్‌వర్క్‌లో లావాదేవీలను పూర్తి ఉచితంగా నిర్వహించుకోవచ్చు. దీంతో పాటు పోస్టాఫీసుల్లో మినీ స్టేట్ మెంట్ తీసుకుంటే రూ.5 వరకు చెల్లించాల్సి ఉంటుంది. చదవండి: ఇండియాలోకి ఎఫ్‌డిఐ పెట్టుబడుల జోరు అలా అయితే రూ.75కే లీటర్ పెట్రోల్! -
పోస్ట్ బ్యాంకు నుంచి రుణాలు
న్యూఢిల్లీ: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో జట్టు కట్టడం ద్వారా రుణాలు, మ్యూచువల్ ఫండ్లు, బీమా పాలసీలు తదితర ఆర్థిక ఉత్పత్తులను అందించేందుకు సన్నద్ధమవుతోంది. థర్డ్ పార్టీ టై అప్ ద్వారా పంజాబ్ నేషనల్ బ్యాంకు తరఫున రుణాలను ఆఫర్ చేయనుంది. అలాగే, బీమా ఉత్పత్తులను అందించేందుకు బజాజ్ అలియెంజ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు అధికార వర్గాలు తెలియజేశాయి. ఈ నెల 21న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు సేవలను ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 650 శాఖల్లో ప్రస్తుతం ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ‘‘1.55 లక్షల తపాలా శాఖలు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుతో(ఐపీపీబీ) అనుసంధానం అవుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో 1.3 లక్షల తపాలా కార్యాలయాలున్నాయి. వీటి ద్వారా దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు సేవలు అందుతాయి’’ అని ఆ వర్గాలు తెలియజేశాయి. పేమెంట్స్ బ్యాంకులు రూ.లక్ష వరకు డిపాజిట్లను సేకరించొచ్చు. ఇతర బ్యాంకుల ఖాతాలకు నగదు బదిలీ సేవలను అందించవచ్చు. కానీ రుణాలు, క్రెడిట్ కార్డు సేవలను అందించేందుకు అనుమతి లేదు. మూడో పక్షంతో ఒప్పందం చేసుకుని వాటి తరఫున ఇతర ఆర్థిక సేవలను అందించొచ్చు. పోస్ట్‌మ్యాన్ పేరు ‘పోస్ట్ పర్సన్’: పోస్ట్‌మ్యాన్‌ను పోస్ట్ పర్సన్‌గా మార్చే ప్రతిపాదను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. లింగపరమైన సమానత్వం కోసం పోస్ట్‌మ్యాన్‌కు బదులుగా పోస్ట్‌పర్సన్ అని పిల వాలని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన పార్లమెంటరీ ప్యానల్ చేసిన సిఫారసే ఇందుకు మూలం. పోస్ట్ ఉమన్ కూడా పనిచేస్తున్నందున పోస్ట్ పర్సన్ అని పిలవడమే సముచితమని పేర్కొంది. -
పోస్ట్ బ్యాంక్ దిశగా మరో అడుగు
♦ ప్రత్యేక విభాగం ఏర్పాటు ♦ బ్యాంకు ఏటీఎంలతో అనుసంధానానికి త్వరలో అనుమతి న్యూఢిల్లీ : పోస్ట్ బ్యాంకు ఏర్పాటు దిశగా మరో అడుగు ముందుకు పడింది. పేమెంట్ బ్యాంకు సేవల నిర్వహణ కోసం తపాలా శాఖ గతేడాదే అనుమతి సంపాదించగా... ఈ దిశగా ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసింది. దీంతో పోస్ట్ ఏటీఎంలు, ప్రభుత్వ రంగ బ్యాంకు ఏటీఎంల మధ్య అంతర్గత లావాదేవీల నిర్వహణకు ఆర్బీఐ నుంచి అనుమతి పొందడానికి మార్గం సుగమం అయింది. ‘పోస్టాఫీసు ఏటీఎంలు, ఇతర బ్యాంకుల ఏటీఎంల మధ్య అంతర్గత లావాదేవీలు వెంటనే ప్రారంభం కావాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, పోస్టాఫీసు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తేనే తన నియంత్రణ పరిధిలోకి వస్తుందని, అప్పుడు అనుమతి జారీ చేస్తామని ఆర్బీఐ స్పష్టం చేసింది. దీంతో తపాలా శాఖ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఈ విభాగం తర్వాత కాలంలో పోస్ట్ బ్యాంకులో విలీనం అవుతుందని వెల్లడించారు. అంతర్గత లావాదేవీల నిర్వహణకు అనుమతి లభిస్తే నగదు చలామణీ తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. పోస్ట్ బ్యాంకు సేవలు లాంఛనంగా ప్రారంభం కావడానికి మరో ఏడాదిన్నర సమయం పడుతుందని, ముందు ఏటీఎంల సేవలను వినియోగించుకోవడం ద్వారా సత్వరమే కార్యకలాపాలు ప్రారంభం కావాలని ప్రభుత్వం కోరుకుంటోందని చెప్పారు. అంతర్గత లావాదేవీలకు అనుమతి లభిస్తే పోస్టాఫీసు ఖాతాదారులు తమ పోస్టల్ ఖాతాల్లోని నగదును ఏ ఇతర బ్యాంకు ఖాతాకైనా బదిలీ చేసుకోవడానికి వీలవుతుంది. తపాలా శాఖకు దేశవ్యాప్తంగా 28 వేల శాఖాపరమైన కార్యాలయాలు, రూ.1.50 లక్షల గ్రామీణ తపాలా కార్యాలయాలు ఉన్నాయి. ఈ ఏడాది చివరికి 20 వేల మైక్రో ఏటీఎంలు సహా మొత్తం 30వేల ఏటీఎంలను ఏర్పాటు చేసే ప్రణాళికతో ముందుకు సాగుతోంది. రూ.800 కోట్ల నిధితో పోస్ట్ పేమెంట్ బ్యాంకు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ గత నెలలో ఆమోదం తెలిపిన విషయం విదితమే. -
రెండు నెలల్లో ‘పోస్టు’ బ్యాంకులు
కోర్ బ్యాంకింగ్ సేవల్లోకి తపాలా శాఖ ఎక్కడైనా నగదు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు హైదరాబాద్: పూర్తిస్థాయి బ్యాంకుగా అవతారమెత్తేందుకు ఉవ్విళ్లూరుతున్న తపాలా శాఖ తొలుత కోర్ బ్యాంకింగ్ సేవలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం అన్ని తపాలా కార్యాలయాలను ఆన్‌లైన్‌తో అనుసంధాన పరిచే ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సర్కిల్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల) పరిధిలో మరో రెండు నెలల్లో కోర్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. దీనికి సంబంధించి నగరంలోని సనత్‌నగర్ పోస్ట్ ఆఫీసులో తాజాగా సెంట్రల్ సర్వర్‌ను ఏర్పాటు చేసి కార్యకలాపాలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. బ్యాంకింగ్ సేవలు ప్రారంభం కాగానే ఏ పోస్టాఫీసు నుంచైనా నగదును పొందే వీలుంటుంది. ఇప్పటి వరకు పొదుపు ఖాతా(సేవింగ్స్ అకౌంట్) ఉన్న పోస్టాఫీసు నుంచి మాత్రమే నగదును విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. ఇకపై ఎక్కడి నుంచి ఎక్కడికైనా నగదును పంపే వెసులుబాటు కూడా అందుబాటులోకి రాబోతోంది. ప్రస్తుతం పొదుపు ఖాతాలకు ఐదు అంకెలతో ఉన్న సంఖ్యను 16 అంకెల సంఖ్యగా మార్చబోతున్నారు. రెండు నెలల్లో ఈ కసరత్తు మొత్తాన్ని పూర్తి చేసి బ్యాంకింగ్ సేవలను ప్రారంభించాలని నిర్ణయించారు. దీంతో ఉత్తరాలను ప్రజలు మరిచిపోతున్న తరుణంలో మసకబారుతున్న తపాలా సేవలకు మళ్లీ పాత కళ వస్తుందని ఆ శాఖ ఆశపడుతోంది. క్రమంగా తాము ఇతర బ్యాంకులకు పోటీనిచ్చే స్థాయికి చేరుకుంటామని తపాలా శాఖ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రూ. 18 వేల కోట్లతో ‘ఇంటర్నెట్’ కనెక్టివిటీ తపాలా కార్యాలయాల ఆధునికీకరణ వేగంగా జరుగుతోంది. వాస్తవానికి ‘ఇండియన్ పోస్ట్ ప్రాజెక్టు-2012’ పేరుతో దేశంలోని అన్ని తపాలా కార్యాలయాలను ఆధునికీకరించాలని యూపీఏ ప్రభుత్వం లక్ష్యించింది. కానీ అది నెరవేరలేదు. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం దాన్ని శరవేగంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రూ. 18 వేల కోట్ల వ్యయంతో గ్రామీణ తపాలా కార్యాలయాలను ఆన్‌లైన్‌తో అనుసంధానించే బృహత్తర ప్రాజెక్టును చేపట్టింది. ప్రస్తుతం ఏపీ సర్కిల్ పరిధిలో కేవలం సబ్ పోస్టాఫీసు స్థాయి వరకే ఆన్లైన్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఏపీ సర్కిల్ పరిధిలో ప్రస్తుతం 16,500 పోస్టాఫీసులుంటే కేవలం 2,300 పోస్టాఫీసుల్లోనే ఆన్లైన్ సేవలు ఉన్నాయి. కోర్‌బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చే క్రమంలో అన్నింటినీ ఆన్‌లైన్‌తో అనుసంధానిస్తున్నారు. ప్రస్తుతం గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చాలా ప్రాంతాల్లో నగదు చెల్లింపు లావాదేవీలు తపాలా కార్యాలయాల ద్వారానే జరుగుతున్నాయి. దీని వల్లే ఏపీ సర్కిల్ పరిధిలోనే దాదాపు రెండు కోట్ల పొదుపు ఖాతాలున్నాయి. ఇప్పుడు కోర్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వస్తే ఈ సంఖ్య ఒక్కసారిగా రెట్టింపవడం ఖాయమని తపాలా శాఖ ఆశాభావంతో ఉంది. గంటల్లో ‘మనీ ఆర్డర్’ ప్రస్తుతం మనీ ఆర్డర్ సేవలకు గరిష్టంగా రెండు రోజుల సమయం తీసుకుంటోంది. అన్ని తపాలా కార్యాలయాలకు అన్లైన్ సేవలు లేకపోవడంతో బ్రాంచి పోస్టాఫీసుల నుంచి నగదు తీసుకుని సంబంధిత తపాలా కార్యాలయాలకు చేరవేయాల్సి వస్తోంది. ఇందుకు కొంత సమయం పడుతోంది. అన్ని పోస్టాఫీసులు అన్లైన్ పరిధిలోకి వస్తే ఈ కసరత్తు కొన్ని గంటల్లోనే పూర్తవుతుంది. ఉదయం మనీ ఆర్డర్ చేస్తే మధ్యాహ్నానికి డబ్బులు గమ్యం చేరతాయి. పూర్తి స్థాయి బ్యాంకుగా రూపొందడానికి అనుమతి కోసం తపాలా శాఖ రిజర్వు బ్యాంకుకు దరఖాస్తు చేసుకుంది. అనుమతి రాగానే ఏటీఎంలను ప్రారంభించి పూర్తిస్తాయి పోస్టు బ్యాంకుగా రూపాంతరం చెందనుంది. ఇప్పటికే చెన్నైలో ఏటీఎం సేవలను కూడా ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది.