పోస్ట్ బ్యాంక్ దిశగా మరో అడుగు
♦ ప్రత్యేక విభాగం ఏర్పాటు
♦ బ్యాంకు ఏటీఎంలతో అనుసంధానానికి త్వరలో అనుమతి
న్యూఢిల్లీ : పోస్ట్ బ్యాంకు ఏర్పాటు దిశగా మరో అడుగు ముందుకు పడింది. పేమెంట్ బ్యాంకు సేవల నిర్వహణ కోసం తపాలా శాఖ గతేడాదే అనుమతి సంపాదించగా... ఈ దిశగా ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసింది. దీంతో పోస్ట్ ఏటీఎంలు, ప్రభుత్వ రంగ బ్యాంకు ఏటీఎంల మధ్య అంతర్గత లావాదేవీల నిర్వహణకు ఆర్‌బీఐ నుంచి అనుమతి పొందడానికి మార్గం సుగమం అయింది. ‘పోస్టాఫీసు ఏటీఎంలు, ఇతర బ్యాంకుల ఏటీఎంల మధ్య అంతర్గత లావాదేవీలు వెంటనే ప్రారంభం కావాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, పోస్టాఫీసు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తేనే తన నియంత్రణ పరిధిలోకి వస్తుందని, అప్పుడు అనుమతి జారీ చేస్తామని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. దీంతో తపాలా శాఖ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
ఈ విభాగం తర్వాత కాలంలో పోస్ట్ బ్యాంకులో విలీనం అవుతుందని వెల్లడించారు. అంతర్గత లావాదేవీల నిర్వహణకు అనుమతి లభిస్తే నగదు చలామణీ తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. పోస్ట్ బ్యాంకు సేవలు లాంఛనంగా ప్రారంభం కావడానికి మరో ఏడాదిన్నర సమయం పడుతుందని, ముందు ఏటీఎంల సేవలను వినియోగించుకోవడం ద్వారా సత్వరమే కార్యకలాపాలు ప్రారంభం కావాలని ప్రభుత్వం కోరుకుంటోందని చెప్పారు. అంతర్గత లావాదేవీలకు అనుమతి లభిస్తే పోస్టాఫీసు ఖాతాదారులు తమ పోస్టల్ ఖాతాల్లోని నగదును ఏ ఇతర బ్యాంకు ఖాతాకైనా బదిలీ చేసుకోవడానికి వీలవుతుంది.
తపాలా శాఖకు దేశవ్యాప్తంగా 28 వేల శాఖాపరమైన కార్యాలయాలు, రూ.1.50 లక్షల గ్రామీణ తపాలా కార్యాలయాలు ఉన్నాయి. ఈ ఏడాది చివరికి 20 వేల మైక్రో ఏటీఎంలు సహా మొత్తం 30వేల ఏటీఎంలను ఏర్పాటు చేసే ప్రణాళికతో ముందుకు సాగుతోంది. రూ.800 కోట్ల నిధితో పోస్ట్ పేమెంట్ బ్యాంకు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ గత నెలలో ఆమోదం తెలిపిన విషయం విదితమే.