ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ తెలంగాణ బ్రాంచ్‌ను ప్రారంభిస్తున్న గవర్నర్. చిత్రంలో ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ బి.చంద్రశేఖర్, పోస్టల్ శాఖ అధికారి రాధికా చక్రవర్తి
హైదరాబాద్: మంచి, చెడుతోపాటు అన్ని విషయాలను చేరవేసే ఒకే ఒక్క మహానుభావుడు పోస్ట్‌మాన్ అని, అలాంటి తపాలా సేవలను మరింత విస్తృతం చేసి ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గడపకు బ్యాంక్ సేవలను అందించడం గొప్ప విషయమని గవర్నర్ నరసింహన్ అన్నారు. శనివారం ఇక్కడ ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్‌లో పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ తెలంగాణ బ్రాంచ్‌ను గవర్నర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సేవలు సీనియర్ సిటిజన్లు, మహిళలకు ఎంతో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. దీనిని పోస్టల్ శాఖలో గొప్ప చరిత్రగా చెప్పవచ్చన్నారు. అనంతరం తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ (సీపీఎంజీ) బి.చంద్రశేఖర్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం పోస్టల్ డిపార్ట్‌మెంట్‌ను మరింత బలోపేతం చేసేందుకుగాను డోర్ స్టెప్ బ్యాంక్ సేవలను అందించే క్రమంలో ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సేవలను ప్రారంభించిందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 23 బ్రాంచ్‌లను, 115 యాక్సెస్ పాయింట్లను ప్రారంభించినట్లు తెలిపారు. పోస్టాఫీస్, సబ్ పోస్టాఫీస్, హెడ్ పోస్టాఫీస్‌లను కలుపుకొని 5,695 యాక్సెస్ పాయింట్లను డిసెంబర్ కల్లా అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
తపాలాశాఖ వనరులతో బ్యాంకింగ్ సేవలు
తపాలాశాఖలో ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ బ్యాంకింగ్ సేవలను విస్తృతం చేస్తామని చెప్పారు. ఇందులో ముఖ్యంగా సేవింగ్, కరెంట్ అకౌంట్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, బయోమెట్రిక్ క్యాష్ డిపాజిట్, విత్‌డ్రా, ఆర్టీజీఎస్, బిల్లు పేమెంట్స్, ఇన్సురెన్స్ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మూడు లక్షల మంది సిబ్బంది మైక్రో ఏటీఎంల ద్వారా డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలు అందించబోతున్నారని వెల్లడించారు. ఇది పేపర్ లెస్ బ్యాంకింగ్ అని, కేవలం ఆధార్, ఫోన్ నెంబర్ ఉంటే బ్యాంకింగ్ సేవలు పొందవచ్చన్నారు.
బ్యాంకింగ్ సేవలపై సందేహాలను తెలుసుకునేందుకు మిస్డ్ కాల్ ఇస్తే చాలు అని పేర్కొన్నారు. పోస్టాఫీస్‌లోని సేవింగ్ అకౌంట్ హోల్డర్లకు కూడా ఐపీపీబీ ద్వారా అన్ని సేవలను పొందవచ్చన్నారు. ఎంపీ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ టెక్నాలజీకి అనుగుణంగా పోస్టల్ డిపార్ట్‌మెంట్ ముందడుగు వేసి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి లక్ష్యాలను సాధిస్తున్నారన్నారు. అనంతరం బ్యాంక్ అకౌంట్‌లు ప్రారంభించి గవర్నర్ చేతుల మీదుగా క్యూర్ కార్డులను అందజేశారు. కార్యక్రమంలో పోస్టల్ శాఖ అధికారి రాధికా చక్రవర్తి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment