న్యూఢిల్లీ: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ)కు రూ. 820 కోట్ల అదనపు నిధుల కేటాయింపు ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. దేశంలోని అన్ని పోస్టాఫీసులకు తన సేవలను విస్తరించేందుకు ఐపీపీబీ ఈ నిధులను వినియోగించుకుంటుంది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విలేకరులకు ఈ విషయాన్ని తెలిపారు. 1.56 లక్షల పోస్టాఫీసులలో ఐపీపీబీ ప్రస్తుతం 1.3 లక్షల పోస్టాఫీసుల నుండి పనిచేస్తోందని తెలిపారు. రెగ్యులేటరీ అవసరాలు, సాంకేతిక అప్‌గ్రేడేషన్‌ల కోసం ఐపీపీబీకి రూ.500 కోట్ల కేటాయింపులకు క్యాబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని కూడా ఆయన చెప్పారు.
గ్రామీణ ప్రాంతాలు లక్ష్యం:
ఐపీపీబీ తన బ్యాంకింగ్ సేవలను 1,56,434 పోస్టాఫీసులకు విస్తరించబోతున్నట్లు మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేదలు, తల్లులు, సోదరీమణులు బ్యాంకింగ్ సౌకర్యాన్ని పొందేందుకు వీలుగా రూ. 820 కోట్ల పెట్టుబడి పెట్టాలని కేంద్ర క్యాబినెట్ తాజా నిర్ణయం తీసుకుందని ఠాకూర్ పేర్కొన్నారు. అధికారిక ప్రకటన ప్రకారం, రెగ్యులేటరీ అవసరాలను తీర్చడానికి ఈక్విటీ పెట్టుబడిగా ఐపీపీబీ ఏర్పాటుకు సంబంధించి ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ. 1,435 కోట్ల నుండి రూ. 2,255 కోట్లకు సవరించడానికి కూడా క్యాబినెట్ ఆమోదముద్ర పడింది.
సామాన్యులకు అత్యంత అందుబాటులో, సరసమైన, విశ్వసనీయమైన, పారదర్శకమైన బ్యాంకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ప్రాజెక్ట్ లక్ష్యమని ఆ వర్గాలు వెల్లడించాయి. అందరికీ బ్యాంకింగ్ సదుపాయం లభ్యత, ఆర్థిక సేవల విస్తరణ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడం, నగదు రహిత వ్యవస్థ దిశగా అడుగులు, తదనుగుణమైన ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టు ధ్యేయమని కూడా పేర్కొన్నాయి.
ప్రస్తుతం ఐపీపీబీ ఇలా..
ఒక అధికారిక ప్రకటన ప్రకారం, ఐపీపీబీ 1.36 లక్షల పోస్టాఫీసులను బ్యాంకింగ్ సేవలను అందించడానికి వీలు కల్పించింది. డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలను అందించడానికి దాదాపు 1.89 లక్షల మంది పోస్ట్‌మెన్, గ్రామీణ డాక్ సేవక్‌లకు స్మార్ట్‌ఫోన్, బయోమెట్రిక్ పరికరాలను సమకూర్చింది. ఐపీపీబీ 2018 సెప్టెంబర్‌లో 650 శాఖలు/నియంత్రణ కార్యాలయాలతో ప్రారంభమైంది. ప్రారంభించినప్పటి నుండి, ఇది మొత్తం 82 కోట్ల ఆర్థిక లావాదేవీలతో 5.25 కోట్లకు పైగా ఖాతాలను తెరిచింది. లావాదేవీల విలువ రూ.1,61,811 కోట్లు. రూ. 21,343 కోట్ల విలువైన 765 లక్షల ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ లావాదేవీలను కలిగి ఉంది. 5 కోట్ల ఖాతాలలో 77 శాతం ఖాతాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. 48 శాతం మహిళా ఖాతాదారులు సుమారు రూ. 1,000 కోట్ల డిపాజిట్‌తో ఉన్నారు. దాదాపు 40 లక్షల మంది మహిళా ఖాతాదారులు తమ ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) ప్రయోజనం పొందారు. దీని విలువ దాదాపు రూ.2,500 కోట్లు. పాఠశాల విద్యార్థుల కోసం 7.8 లక్షలకు పైగా ఖాతాలు ప్రారంభమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment