సామాన్యులకు కేంద్రం శుభవార్త చెప్పింది. వచ్చే వారం నుంచి ‘భారత్ రైస్’ పేరిట కిలో బియ్యం రూ.29కే విక్రయించనున్నట్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ తెలిపింది. తద్వారా సామాన్య ప్రజలకు ఊరట కలిగిస్తుందని పేర్కొంది. ఈ మేరకు బియ్యం నిల్వలు ఎంత మేర ఉన్నాయో ట్రేడర్లు ప్రకటించాలని ఆదేశించింది.
‘వివిధ రకాలపై ఎగుమతి పరిమితులు ఉన్నప్పటికీ.. బియ్యం రిటైల్, టోకు ధరలు సంవత్సరానికి 13.8 శాతం నుంచి 15.7శాతం పెరిగాయి. ధరలను నియంత్రించడానికి, ఆహార ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ ధోరణులను గుర్తించేలా వచ్చే వారం నుండి రిటైల్ మార్కెట్‌లో సబ్సిడీతో కూడిన భారత్ రైస్‌ను కిలో రూ.29 చొప్పున విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది’ అని యూనియన్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెక్రటరీ సంజీవ్ చోప్రా తెలిపారు.
భారత్ రైస్‌ను ఎక్కడ కొనుగోలు చేయాలి?
నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (నాఫెడ్), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌సీసీఎఫ్), రిటైల్ చైన్ కేంద్రీయ భండార్‌లలో భారత్ రైస్ 5 కిలోలు, 10 కిలోల ప్యాక్ అందుబాటులో ఉంచనుంది కేంద్రం. తొలి దశలో, ప్రభుత్వం రిటైల్ మార్కెట్‌లో అమ్మకానికి 500,000 టన్నుల బియ్యాన్ని కేటాయించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం భారత్ కిలో గోదుమ పిండిని రూ. 27.50, భారత్ దాల్ (చనా) కిలో రూ. 60కి విక్రయిస్తోంది .
బియ్యంపై స్పష్టత ఇవ్వాల్సిందే
ట్రేడర్ల వద్ద అన్నీ రకాల బియ్యం బ్రోకెన్ రైస్, నాన్ బాస్మతీ వైట్ రైస్, పార్బాయిల్డ్ రైస్, బాస్మతి రైస్, వరి ఇలా ఎంత మేరకు నిల్వ ఉన్నాయో తెలపాలని, ఇందుకోసం ప్రతి వారం ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ పోర్టల్‌లో ప్రకటించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా దేశీయంగా ధరలు స్థిరపడే వరకు బియ్యం ఎగుమతులపై ఆంక్షలను ఎత్తివేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని చోప్రా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment