ఏప్రిల్- మే 2024 నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పీఎం- కిసాన్ సమ్మాన్ ప్రత్యక్ష బదిలీ మొత్తాన్ని పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కో రైతుకు ప్రస్తుతం అందించే రూ.6,000 మొత్తాన్ని రూ.8,000కు పెంచే అవకాశం ఉందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
దీంతో పాటు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద అందించే ఉచిత రేషన్ బియ్యాన్ని మరిన్ని కేజీలు పెంచడాన్ని మోదీ ప్రభుత్వం పరిశీలిస్తోందని, తుది నిర్ణయం త్వరలో తీసుకోనుందని నివేదికలు పేర్కొన్నాయి.
16 విడుత విడుదల ఎప్పుడంటే?
ఈ ఏడాది ఫిబ్రవరి - మార్చి నెలలో పీఎం కిసాన్ పథకం 16వ విడుతను కేంద్రం విడుదల చేసే అవకాశం ఉంది. అయితే, దీనికి సంబంధించి కేంద్రం ఎలాంటి అధికారికంగా తెలపలేదు. ఈ పథకం 15వ విడతను నవంబర్ 15, 2023న కేంద్రం విడుదల చేసింది.
ఎంఎస్‌ఎంఈలకు అండగా
ఇదిలా ఉండగా, 2024 మధ్యంతర బడ్జెట్‌లో పేదలు, రైతులు, యువత, మహిళలకు అదనపు సహాయక చర్యలను అందించాలని కేంద్రం భావిస్తోంది. నివేదిక ప్రకారం.. సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు (msme) అందించే ఆర్థిక సహాయాన్ని మరింత పెంచనున్నట్లు సమాచారం.
2018 నుంచి ప్రత్యక్ష నగదు బదిలీ
దేశంలోని రైతులకు సాయం కింద 2018 నుంచి ఏటా రూ.6 వేల చొప్పున కేంద్రం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తుంది. రూ.2వేలు చొప్పున మూడు విడతలుగా ఏడాదికి రూ.6వేల చొప్పున అర్హులైన రైతుల ఖాతాల్లో వేస్తున్నారు.
5 కిలలో ఆహార ధాన్యాలు
2020లో కోవిడ్ మహమ్మారి సమయంలో పేదలకు అదనంగా 5 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేయడం ప్రారంభించింది. ఇందుకోసం డిసెంబర్ 2022లో జాతీయ ఆహార భద్రతా చట్టం కింద, గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment