Pradhan Mantri Garib Kalyan Yojana
-
మరో నాలుగేళ్లు ఫోర్టీఫైడ్ రైస్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మరో నాలుగేళ్ల పాటు ఉచిత ఫోర్టీఫైడ్ రైస్ అందించనున్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనతో పాటు ఇతర సంక్షేమ పథకాల ద్వారా 2028 డిసెంబర్ వరకు ఉచిత ఫోర్టిఫైడ్ రైస్ సరఫరా కొనసాగింపునకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. సూక్షపోషకాలైన ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12లను బియ్యానికి జోడిస్తారు. దీన్నే ఫోర్టీఫైడ్ రైస్‌గా పిలుస్తారు. 2024 జూలై నుంచి 2028 డిసెంబర్ వరకు ఈ కార్యక్రమం అమలు కోసం రూ.17,082 కోట్లు ఖర్చు చేయనున్నారు. బుధవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఫోర్టీఫైడ్ రైస్ ఉచిత సరఫరాను కొనసాగించడంతో పాటు పలు అంశాలకు ఆమోదముద్ర వేశారు. గుజరాత్లో ని లోథాల్లో జాతీ య మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ (ఎన్ఎంహెచ్సీ)ని ఏర్పాటు చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్ఎంహెచ్సీ అభివృద్ధిలో 22 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్రం తెలిపింది. ‘ఫేజ్ 1ఎ’లో జాతీయ మారిటైమ్ హెరిటేజ్ మ్యూజియం, ఆరు గ్యాలరీలు ఉంటాయని వివరించింది. భారత నావికాదళం, తీరప్రాంత రక్షకదళం గ్యాలరీలు ఉంటాయని, దేశంలోనే అతిపెద్దవిగా ఇవి నిలుస్తాయని తెలిపింది. ఫేజ్–2లో తీరప్రాంత రాష్ట్రాల పెవిలియన్లు, మారిటైమ్ ఇనిస్టిట్యూట్, హాస్టల్, నాలుగు థీమ్ బేస్డ్ పార్క్‌లను ఏర్పాటు చేస్తారు. -
రైతులకు శుభవార్త.. ఉచిత రేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం?
ఏప్రిల్- మే 2024 నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పీఎం- కిసాన్ సమ్మాన్ ప్రత్యక్ష బదిలీ మొత్తాన్ని పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కో రైతుకు ప్రస్తుతం అందించే రూ.6,000 మొత్తాన్ని రూ.8,000కు పెంచే అవకాశం ఉందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పాటు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద అందించే ఉచిత రేషన్ బియ్యాన్ని మరిన్ని కేజీలు పెంచడాన్ని మోదీ ప్రభుత్వం పరిశీలిస్తోందని, తుది నిర్ణయం త్వరలో తీసుకోనుందని నివేదికలు పేర్కొన్నాయి. 16 విడుత విడుదల ఎప్పుడంటే? ఈ ఏడాది ఫిబ్రవరి - మార్చి నెలలో పీఎం కిసాన్ పథకం 16వ విడుతను కేంద్రం విడుదల చేసే అవకాశం ఉంది. అయితే, దీనికి సంబంధించి కేంద్రం ఎలాంటి అధికారికంగా తెలపలేదు. ఈ పథకం 15వ విడతను నవంబర్ 15, 2023న కేంద్రం విడుదల చేసింది. ఎంఎస్ఎంఈలకు అండగా ఇదిలా ఉండగా, 2024 మధ్యంతర బడ్జెట్లో పేదలు, రైతులు, యువత, మహిళలకు అదనపు సహాయక చర్యలను అందించాలని కేంద్రం భావిస్తోంది. నివేదిక ప్రకారం.. సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు (msme) అందించే ఆర్థిక సహాయాన్ని మరింత పెంచనున్నట్లు సమాచారం. 2018 నుంచి ప్రత్యక్ష నగదు బదిలీ దేశంలోని రైతులకు సాయం కింద 2018 నుంచి ఏటా రూ.6 వేల చొప్పున కేంద్రం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తుంది. రూ.2వేలు చొప్పున మూడు విడతలుగా ఏడాదికి రూ.6వేల చొప్పున అర్హులైన రైతుల ఖాతాల్లో వేస్తున్నారు. 5 కిలలో ఆహార ధాన్యాలు 2020లో కోవిడ్ మహమ్మారి సమయంలో పేదలకు అదనంగా 5 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేయడం ప్రారంభించింది. ఇందుకోసం డిసెంబర్ 2022లో జాతీయ ఆహార భద్రతా చట్టం కింద, గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. -
FCI data: ఐదేళ్ల కనిష్టానికి ఆహార ధాన్యాల నిల్వలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఆహార ధాన్యం నిల్వలు ఏడాదిలో భారీగా తగ్గాయి. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సెంట్రల్ ఫూల్ కింద సేకరించి పెట్టిన గోధుమ, బియ్యం నిల్వలు ఐదేళ్ల కనిష్టానికి పడిపోయినట్లు అక్టోబర్ గణాంకాలు చెబుతున్నాయి. ఐదేళ్ల క్రితం 2017లో బియ్యం, గోధుమల మొత్తం నిల్వలు 4.33 కోట్ల మెట్రిక్ టన్నుల కనిష్టానికి పడిపోగా, ప్రస్తుతం అదేరీతిన నిల్వలు 5.11 కోట్ల మెట్రిక్ టన్నులకు పడిపోయింది. గత ఏడాది నిల్వలు 8.16 కోట్లతో పోల్చినా 37 శాతం నిల్వలు తగ్గడం, ఇందులో ముఖ్యంగా గోధుమల నిల్వలు ఏకంగా 14 ఏళ్ల కనిష్టానికి పడిపోవడం కేంద్రానికి ఆందోళన కలిగిస్తోంది. ఉచితంతో బియ్యం.. దిగుబడి తగ్గి గోధుమలకు దెబ్బ.. దేశంలో కరోనా నేపథ్యంలో కేంద్రం 2020 ఏప్రిల్ నుంచి ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద 81 కోట్ల జనాభాకు ఉచిత బియ్యాన్ని సరఫరా చేస్తోంది. ఇప్పటికే ఆరు విడతలుగా అమలు చేసిన బియ్యం పథకం కింద 11.21 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేసింది. ప్రస్తుత అక్టోబర్ నుంచి మరో మూడు నెలలు ఉచిత బియ్యం పథకాన్ని కొనసాగిస్తూ కేంద్రం నిర్ణయం చేసింది. ఈ మూడు నెలల కాలానికి మరో 1.22 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరాలు ఉంటాయని అంచనా వేసింది. ఉచిత బియ్యం పథకం నేపథ్యంలో ఎన్నడూ లేనంతగా బియ్యం నిల్వలు కేంద్రం వద్ద తగ్గాయి. గత ఏడాది కేంద్రం వద్ద అక్టోబర్‌లో 3.47 కోట్ల బియ్యం నిల్వలు ఉండగా, అది ఈ ఏడాది 2.83 కోట్లకు పడిపోయింది. అయితే బియ్యం నిల్వలు తగ్గినంత మాత్రాన ఇప్పటికిప్పుడు వచ్చే ప్రమాదం ఏం లేదని, కేంద్ర పథకాల కొనసాగింపునకు ఇదేమీ అడ్డుకాదని కేంద్రం చెబుతోంది. ఇప్పటికే ఖరీఫ్ పంటల కోతలు ఆరంభం అయినందున వీటితో మళ్లీ నిల్వలు పెంచుకునే అవకాశం ఉందని అంటోంది. అయితే గోధుమల పరిస్థితి మాత్రం కొంత భిన్నంగా ఉంది. గోధుమల నిల్వలు గతంతో పోల్చితే తీవ్రంగా తగ్గాయి. 2017లో గోధుమల నిల్వలు 2.58 కోట్ల టన్నులు, 2018లో 3.56 కోట్లు, 2019లో 3.93 కోట్లు, 2020లో 4.37 కోట్లు, 2021లో 4.68 కోట్ల టన్నుల మేర నిల్వలు ఉండగా, అవి ఈ ఏడాది ఏకంగా 2.27 కోట్ల టన్నులకు తగ్గాయి. కరోనా పరిస్థితులు, ప్రపంచ వ్యాప్తంగా కరువు పరిస్థితులు, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇతర దేశాలకు భారత్ నుంచి ఎగుమతులు పెరిగాయి. ఎగుమతులు పెరగ్గా, దేశంలో అతివృష్టి కారణంగా పంటలు దారుణంగా దెబ్బ తినడంతో దిగుబడులు తగ్గాయి. దీంతో కేంద్రం వద్ద నిల్వలు తగ్గాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ ఏడాది మే నెలలో గోధుమల ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. అయినప్పటికీ మే నుంచి అధిక ఉష్ణోగ్రతల కారణంగా గోధుమ పంట దిగుమతులు తగ్గాయి. దీంతో అనుకున్న స్థాయిలో కేంద్రం నిల్వలు సేకరించలేకపోయింది. డిమాండ్‌ను గుర్తించి వ్యాపారులు ముందస్తు నిల్వలు చేశారు. ఈ ప్రభావం స్టాక్‌లపై పడింది. ఇదే పరిస్థితి కొనసాగితే ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యాపారుల గోధుమ నిల్వలను బహిర్గతం చేయాలని ఆదేశాలివ్వడం, దేశీయ లభ్యతను పెంచడానికి స్టాక్ పరిమితులను విధించడం వంటి చర్యలను కేంద్రం పరిగణించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. -
రేషన్ కార్డుదారులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై ) కింద ఉచిత బియ్యం పంపిణీని మరో మూడునెలలు పొడిగించింది. పీఎంజీకేఏవై 7వ దశలో భాగంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు జాతీయ ఆహార భద్రత (ఎన్ఎఫ్ఎస్ఏ) కార్డుదారులకు ఉచితంగా బియ్యం ఇవ్వనుంది. దేశవ్యాప్తంగా కార్డులోని ఒక్కో వ్యక్తికి ఐదుకిలోల చొప్పున 122 లక్షల టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయనుంది. వచ్చే మూడునెలలు పండుగలు ఉండటంతో పేదలకు ఆర్థిక బాధలు లేకుండా ఆహారధాన్యాలను ఉచితంగా అందించాలని నిర్ణయించింది. కోవిడ్–19 విజృంభణ నేపథ్యంలో 2020 ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం పీఎంజీకేఏవైకు శ్రీకారం చుట్టింది. మొదటి రెండు దశల్లో ఎనిమిది నెలల పాటు (ఏప్రిల్ 2020 నుంచి నవంబర్ 2020), మూడు నుంచి ఐదు దశల్లో 11 నెలలు (మే 2021 నుంచి మార్చి 2022), ఆరోదశలో ఆరునెలలు (ఏప్రిల్ 2022 నుంచి సెప్టెంబర్ 2022) వరకు.. మొత్తం 25 నెలల పాటు ఉచితంగా బియ్యం పంపిణీ చేసింది. 88 లక్షల కార్డులకే ఉచిత బియ్యం రాష్ట్రంలో ఉన్న 1.45 కోట్ల రేషన్ కార్డుల్లో 88 లక్షల కార్డులనే కేంద్ర ప్రభుత్వం ఎన్ఎఫ్ఎస్ఏ కింద పరిగణిస్తోంది. 88 లక్షల ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులకే ప్రతినెలా కేంద్రం బియ్యం 5 కిలోల చొప్పున (నాన్–సార్టెక్స్) ఇస్తుండగా మిగిలిన 57 లక్షల కార్డులకు రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చులతో మొత్తం అందరికి సార్టెక్స్ బియ్యం అందిస్తోంది. ఇక్కడ ఎన్ఎఫ్ఎస్ఏ, నాన్–ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుదారులందరూ దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్) ఉండగా కేంద్రం మాత్రం కొన్ని కార్డులకే బియ్యం ఇస్తోంది. కోవిడ్ సమయంలో ప్రారంభించిన పీఎంజీకేఎవై కింద ఉచిత బియ్యాన్ని కూడా ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులకే పరిమితం చేయడంతో రాష్ట్రంలో 88 లక్షల కార్డులకు మాత్రమే ఉచిత బియ్యం దక్కనున్నాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాల్లోని అన్ని కార్డులను ఎన్ఎఫ్ఎస్ఏ కింద పెట్టి మొత్తం అందరికీ కేంద్రమే బియ్యం ఇస్తుండటం గమనార్హం. ఎన్ఎఫ్ఎస్ఏ పరిధిని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్రాన్ని కోరినా పట్టించుకోవడంలేదు. -
ఉచిత బియ్యం పంపిణీ నిలిపివేత!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా విపత్కర పరిస్థితుల దృష్ట్యా దేశంలో నిరుపేదలకు ఉచితంగా అందించిన బియ్యం, ఇతర ఆహార ధాన్యాల పంపిణీ నవంబర్ తర్వాత నిలిచిపోనున్నట్లు తెలుస్తోంది. ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ పథకం కింద పేదలకు ఉచితంగా బియ్యం/గోధుమల పంపిణీ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. గడువు పొడిగింపుపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆహార ధాన్యాల పంపిణీని కొనసాగించే అంశమై ఎలాంటి ప్రతిపాదన కేంద్రం వద్ద లేదని కేంద్ర ఆహార, పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే ఇటీవలే ప్రకటించారు. కోవిడ్–19 మహహ్మరి వ్యాప్తి, లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన పేద, మధ్య తరగతి ప్రజలకు ఊరటనిచ్చేలా కేంద్రం ప్రభుత్వం ఏప్రిల్ నుంచి మూడు నెలల పాటు ఉచితంగా 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పును పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అనంతరం దీన్ని ఈ ఏడాది నవంబర్ వరకు పొడిగించారు. ఈ పథకం ద్వారా కేంద్ర ఆహార భద్రతా చట్టం పరిధిలోని 80 కోట్ల మందికి లబ్ధి చేకూరింది. ఇందుకోసం రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పథకాన్ని మరో ఆరు నెలలపాటు కొనసాగించాలని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణముల్ కాంగ్రెస్ తదితర విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయినా కేంద్ర ప్రభుత్వం లెక్కచేయడం లేదు. -
గరీబ్ కల్యాణ్ అన్నయోజన... ఐదు నెలలపాటు పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ ఆహార భద్రతాచట్టం పరిధిలోని 81.35 కోట్ల మంది పేదలకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున అదనంగా ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ చేసేలా ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన(పీఎంజీకేఏవై)ను మరో ఐదు నెలల పాటు వర్తింపజేసే ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈనెల ఏడో తేదీన ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ 18 ఏళ్ల పైబడిన వారందరికీ కేంద్రమే ఉచిత టీకాలిస్తుందని, నవంబరు వరకు ఉచిత రేషన్‌ను అందజేస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఉచిత రేషన్‌కు ఆమోదం తెలిపింది.ఈ పథకాన్ని కోవిడ్–19 లాక్డౌన్ నేపథ్యంలో తొలుత 2020 మార్చిలో ప్రధాని ప్రకటించారు. ఇప్పటివరకు మూడో విడతలుగా ఈ పథకం అమలైంది. నాలుగో విడతలో భాగంగా జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలోని 81.35 కోట్ల మందికి మరో 5 నెలల పాటు అంటే 2021 జులై మొదలుకొని 2021 నవంబరు వరకు ప్రతి ఒక్క వ్యక్తికి 5 కిలోల వంతున ఉచితంగా అదనపు ఆహారధాన్యాలను పంపిణీ చేస్తారు. ఇందుకు రూ. 64,031 కోట్ల మేర ఆహార సబ్సిడీపై వెచ్చించాల్సి వస్తుందని అంచనా. రైల్‌సైడ్ వేర్‌హౌజ్ కంపెనీ విలీనం సెంట్రల్ రైల్ సైడ్ వేర్‌హౌస్ కంపెనీ లిమిటెడ్ (సీఆర్‌డబ్ల్యూసీ)ను దాని మాతృసంస్థ అయిన సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ (సీడబ్ల్యూసీ)లో విలీనం చేయడానికి ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. -
చేతులెత్తేసిన కేంద్రం, వలస కార్మికులకు నో ఫ్రీ రేషన్
సాక్షి, న్యూఢిల్లీ: గత ఏడాది మాదిరిగా దేశ వ్యాప్త సంపూర్ణ లాక్డౌన్ లేదని, పరిశ్రమలు కూడా నడుస్తున్నందున ఈసారి వలస కార్మికులకు ఉచితంగా ఆహారధాన్యాలను ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన(పీఎంజీకేఏవై)కింద 80 కోట్ల రేషన్ కార్డుదారులకు రెండు నెలల (మే, జూన్)పాటు అదనంగా ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ పథకం అమలు తో బహిరంగ మార్కెట్లో ఆహారధాన్యాల ధరలపై ఎటువంటి ప్రభావం లేదని పేర్కొంది. ఇప్పటివరకు 12 రాష్ట్రాల్లో 1 లక్ష మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలను సుమారు 2 కోట్ల మంది లబ్ధిదారులకు అందించినట్లు కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే తెలిపారు. పీఎంజీకెఎవై పంపిణీ షెడ్యూల్ ప్రకారం ఆహార ధాన్యాల పంపిణీ జరుగుతోందని తెలిపారు. సోమవారం నాటికి 34 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు 15.55 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా డిపోల నుంచి తరలించుకున్నట్లు పేర్కొన్నారు. దాదాపు అన్ని రాష్ట్రా లు మే, జూన్ నెలల పీఎంజీకేఏవై ఆహార ధాన్యాల పంపిణీని జూన్ చివరి నాటికి పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళికను సూచించాయన్నారు. ఆహార ధాన్యాల పంపిణీ పురోగతిపై ఏప్రిల్ 26వ తేదీన రాష్ట్రాల ఆహార కార్యదర్శులు, ప్రతినిధులతో సమీక్ష నిర్వహించినట్లు వివరించారు. అంతేగాక వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకం ప్రారంభించిన 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతా ల్లో 69 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు. రైతుల ఖాతాలకు నగదు దేశంలో గోధుమల సేకరణతో ఇప్పటివరకు రూ.49,965 కోట్లను నగదు బదిలీ చెల్లింపులో నేరుగా రైతుల ఖాతాలోకి బదిలీ చేశామని సుధాన్షు పాండే తెలిపారు. ఇందులో పంజాబ్‌లో రూ.21,588 కోట్లు, హరియాణాలో రూ.11,784 కోట్లు నేరుగా బదిలీ చేసినట్లు కార్యదర్శి తెలిపారు. కోవిడ్ కారణంగా గోధుమ, బియ్యం నిల్వలను బహిరంగ మార్కెట్లో సులభంగా అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో, ప్రభుత్వం 2021–22 సంవత్సరానికి ఓఎంఎస్ఎస్(డి) విధానాన్ని సరళీకృతం చేసిందని పాండే పేర్కొన్నారు. కోవిడ్ –19 మహమ్మారి సమయంలో 928.77 లక్ష మెట్రిక్ టన్నుల(ఎల్ఎమ్టీ) ఆహార ధాన్యాలు, 363.89 ఎల్ఎమ్టీ గోధుమలు, 564.88 ఎల్ఎమ్టీ బియ్యం గతేడాది సెంట్రల్ పూల్ నుంచి పంపిణీ చేసినట్లు ఆయన వివరించారు. చదవండి: డబుల్ మాస్క్‌పై కీలక మార్గదర్శకాలను జారీ చేసిన కేంద్రం -
ఈపీఎఫ్‌పై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
ఢిల్లీ : ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్)పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ నుంచి ఆగస్టు వరకు మరో మూడు నెలల పాటు చందాను చెల్లించేందుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో 72లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నది. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన, భారత్ ఆత్మనిర్భర్ కింద ఈ జూన్ నుంచి ఆగస్టు వరకు మరో మూడు నెలల పాటు ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ 24శాతం (12 శాతం ఉద్యోగుల వాటా, 12 శాతం యజమానుల వాటా) పొడిగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కేబినెట్ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. (ఏడుగురికి కరోనా హైకోర్టు మూసివేత) వంద మంది కంటే తక్కువ ఉద్యోగులున్న సంస్థలు, రూ.15వేల కంటే తక్కువ వేతనం పొందుతున్న కార్మికులు, ఉద్యోగులు, యజమానుల వాటా పీఎఫ్‌ను కేంద్రం మూడు నెలల పాటు చెల్లిస్తుందన్నారు. ఈ చర్యతో 72 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలిగిందని జవదేకర్ తెలిపారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజనను మరో ఐదు నెలల పాటు పొడిగించేందుకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు చెప్పారు. దీంట్లో 81 కోట్ల మందికి 203 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు నవంబర్ వరకు కేటాయించనున్నట్లు చెప్పారు. గత మూడు నెలల్లో 120 లక్షల టన్నులు పంపిణీ చేశామని చెప్పారు. గతంలో నాలుగు 4.60లక్షల టన్నుల పప్పు ఇవ్వగా, ఇప్పుడు 9.70లక్షల టన్నులు ఇవ్వనున్నట్లు వివరించారు. -
33 కోట్ల మందికిపైగా ప్రత్యక్ష నగదు బదిలీ
న్యూ ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్యాకేజీ నిధులను విడుదల చేసింది. 33 కోట్ల మందికి పైగా ప్రత్యక్ష నగదు బదిలీ చేసినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజి కింద రూ. 31,235 కోట్లు, 20 కోట్ల మహిళా జన్‌ధన్ ఖాతాల్లోకి రూ. 10,025 కోట్లను బదిలీ చేసినట్టు తెలిపింది. 2.82 కోట్ల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పెన్షన్ కోసం రూ. 1,405 కోట్లు, పీఎం-కిసాన్ యోజన కింద 8 కోట్ల మంది రైతులకు రూ. 16,146 కోట్లను బదిలీచేశామని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. 68,775 కంపెనీల్లో పనిచేసే 10.6 లక్షల ఉద్యోగులకు ఈపీఎఫ్ వాటాగా రూ. 162 కోట్లు బదిలీ చేసినట్టు తెలిపింది. -
బయటపడిన నల్లధనం రూ.4,900 కోట్లే
న్యూఢిల్లీ: గతేడాది నవంబర్‌లో పెద్ద నోట్లను రద్దు చేసిన అనంతరం స్వచ్ఛందంగా నల్లధనం వెల్లడికి మోదీ సర్కారు తీసుకొచ్చిన ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన’ పథకానికి స్పందన స్వల్పంగానే ఉంది. 21 వేల మంది ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. రూ.4,900 కోట్ల మేర నల్లధనం వివరాలను వీరు స్వచ్ఛందంగా వెల్లడించారు. ఈ పథకం మార్చి 31తో ముగిసిపోయింది. ఇవి తుది వివరాలని, వీటి ఆధారంగా రూ.2,451 కోట్ల పన్ను రాబట్టినట్టు ఆదాయపన్ను శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. కొన్ని కేసుల్లో వివరాల ఆధారంగా న్యాయపరమైన ప్రక్రియను ప్రారంభించనున్నట్టు చెప్పారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం లెక్కల్లో చూపని ఆదాయాన్ని (బ్యాంకుల్లో చేసిన డిపాజిట్లు సైతం) గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద స్వయంగా వెల్లడించి 50 శాతం పన్ను చెల్లింపుతో బయటపడొచ్చని కేంద్ర సర్కారు సూచించింది. మిగిలిన మొత్తంలో సగాన్ని నాలుగేళ్ల పాటు వడ్డీ రహితంగా ప్రభుత్వం వద్ద కొనసాగించాల్సి ఉంటుందని పేర్కొంది. నల్లధనం కలిగిన వారికి ఇదే చివరి అవకాశమని, ఆ తర్వాత అధికారులు గుర్తిస్తే 200 శాతం వరకూ పన్ను చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఓ దశలో హెచ్చరిక కూడా చేసింది. ఈ పథకం మార్చిలో ముగియగా, వచ్చిన స్పందన ఆశాజనకంగా లేదని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా అప్పట్లోనే అభిప్రాయం వ్యక్తం చేశారు.