సాక్షి, న్యూఢిల్లీ: గత ఏడాది మాదిరిగా దేశ వ్యాప్త సంపూర్ణ లాక్‌డౌన్ లేదని, పరిశ్రమలు కూడా నడుస్తున్నందున ఈసారి వలస కార్మికులకు ఉచితంగా ఆహారధాన్యాలను ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన(పీఎంజీకేఏవై)కింద 80 కోట్ల రేషన్ కార్డుదారులకు రెండు నెలల (మే, జూన్)పాటు అదనంగా ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ పథకం అమలు తో బహిరంగ మార్కెట్‌లో ఆహారధాన్యాల ధరలపై ఎటువంటి ప్రభావం లేదని పేర్కొంది.
ఇప్పటివరకు 12 రాష్ట్రాల్లో 1 లక్ష మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలను సుమారు 2 కోట్ల మంది లబ్ధిదారులకు అందించినట్లు కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే తెలిపారు. పీఎంజీకెఎవై పంపిణీ షెడ్యూల్ ప్రకారం ఆహార ధాన్యాల పంపిణీ జరుగుతోందని తెలిపారు. సోమవారం నాటికి 34 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు 15.55 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా డిపోల నుంచి తరలించుకున్నట్లు పేర్కొన్నారు.
దాదాపు అన్ని రాష్ట్రా లు మే, జూన్ నెలల పీఎంజీకేఏవై ఆహార ధాన్యాల పంపిణీని జూన్ చివరి నాటికి పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళికను సూచించాయన్నారు. ఆహార ధాన్యాల పంపిణీ పురోగతిపై ఏప్రిల్ 26వ తేదీన రాష్ట్రాల ఆహార కార్యదర్శులు, ప్రతినిధులతో సమీక్ష నిర్వహించినట్లు వివరించారు. అంతేగాక వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకం ప్రారంభించిన 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతా ల్లో 69 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు.
రైతుల ఖాతాలకు నగదు
దేశంలో గోధుమల సేకరణతో ఇప్పటివరకు రూ.49,965 కోట్లను నగదు బదిలీ చెల్లింపులో నేరుగా రైతుల ఖాతాలోకి బదిలీ చేశామని సుధాన్షు పాండే తెలిపారు. ఇందులో పంజాబ్‌లో రూ.21,588 కోట్లు, హరియాణాలో రూ.11,784 కోట్లు నేరుగా బదిలీ చేసినట్లు కార్యదర్శి తెలిపారు. కోవిడ్ కారణంగా గోధుమ, బియ్యం నిల్వలను బహిరంగ మార్కెట్లో సులభంగా అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో, ప్రభుత్వం 2021–22 సంవత్సరానికి ఓఎంఎస్‌ఎస్(డి) విధానాన్ని సరళీకృతం చేసిందని పాండే పేర్కొన్నారు. కోవిడ్ –19 మహమ్మారి సమయంలో 928.77 లక్ష మెట్రిక్ టన్నుల(ఎల్‌ఎమ్‌టీ) ఆహార ధాన్యాలు, 363.89 ఎల్‌ఎమ్‌టీ గోధుమలు, 564.88 ఎల్‌ఎమ్‌టీ బియ్యం గతేడాది సెంట్రల్ పూల్ నుంచి పంపిణీ చేసినట్లు ఆయన వివరించారు.
చదవండి: డబుల్ మాస్క్‌పై కీలక మార్గదర్శకాలను జారీ చేసిన కేంద్రం
Comments
Please login to add a commentAdd a comment