Rice Sale
-
సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్!
సామాన్యులకు కేంద్రం శుభవార్త చెప్పింది. వచ్చే వారం నుంచి ‘భారత్ రైస్’ పేరిట కిలో బియ్యం రూ.29కే విక్రయించనున్నట్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ తెలిపింది. తద్వారా సామాన్య ప్రజలకు ఊరట కలిగిస్తుందని పేర్కొంది. ఈ మేరకు బియ్యం నిల్వలు ఎంత మేర ఉన్నాయో ట్రేడర్లు ప్రకటించాలని ఆదేశించింది. ‘వివిధ రకాలపై ఎగుమతి పరిమితులు ఉన్నప్పటికీ.. బియ్యం రిటైల్, టోకు ధరలు సంవత్సరానికి 13.8 శాతం నుంచి 15.7శాతం పెరిగాయి. ధరలను నియంత్రించడానికి, ఆహార ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ ధోరణులను గుర్తించేలా వచ్చే వారం నుండి రిటైల్ మార్కెట్లో సబ్సిడీతో కూడిన భారత్ రైస్‌ను కిలో రూ.29 చొప్పున విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది’ అని యూనియన్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెక్రటరీ సంజీవ్ చోప్రా తెలిపారు. భారత్ రైస్‌ను ఎక్కడ కొనుగోలు చేయాలి? నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (నాఫెడ్), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్సీసీఎఫ్), రిటైల్ చైన్ కేంద్రీయ భండార్లలో భారత్ రైస్ 5 కిలోలు, 10 కిలోల ప్యాక్ అందుబాటులో ఉంచనుంది కేంద్రం. తొలి దశలో, ప్రభుత్వం రిటైల్ మార్కెట్లో అమ్మకానికి 500,000 టన్నుల బియ్యాన్ని కేటాయించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం భారత్ కిలో గోదుమ పిండిని రూ. 27.50, భారత్ దాల్ (చనా) కిలో రూ. 60కి విక్రయిస్తోంది . బియ్యంపై స్పష్టత ఇవ్వాల్సిందే ట్రేడర్ల వద్ద అన్నీ రకాల బియ్యం బ్రోకెన్ రైస్, నాన్ బాస్మతీ వైట్ రైస్, పార్బాయిల్డ్ రైస్, బాస్మతి రైస్, వరి ఇలా ఎంత మేరకు నిల్వ ఉన్నాయో తెలపాలని, ఇందుకోసం ప్రతి వారం ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ పోర్టల్‌లో ప్రకటించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా దేశీయంగా ధరలు స్థిరపడే వరకు బియ్యం ఎగుమతులపై ఆంక్షలను ఎత్తివేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని చోప్రా చెప్పారు. -
72 గంటల్లో డబ్బులు
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ధాన్యం కొనుగోలు చేసిన 72 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు. రైతు ఖాతాల్లోనే డబ్బు జమచేసే ఆన్లైన్ ప్రక్రియను గురువారం ఆమె సమీకృత కలెక్టరేట్ ఎదుట ఉన్న ఆక్సిస్ బ్యాంకులో ప్రారంభించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలో ప్రారంభించిన ఈ పద్ధతి ద్వారా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన 79 మంది రైతులకు ఇవ్వాల్సిన రూ.44,11,062 ఈ పేమెంట్ ద్వారా ఆయా రైతుల ఖాతాల్లోనే జమ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ధాన్యం అమ్మిన రైతులకు చెల్లించాల్సిన డబ్బును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే 72 గంటల్లో జమ చేసేందుకు ఆక్సిస్ బ్యాంకు సహకారం తీసుకున్నామన్నారు. ఈ ప్రక్రియ వల్ల దళారుల ప్రమేయం అరికట్టడంతో పాటు రైతులకు సకాలంలో డబ్బు చెల్లించవచ్చన్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 107 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామనీ, ఇందులో ఐకేపీ ద్వారా 95, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా 12 కేంద్రాల్లో 739 మంది రైతుల నుంచి రూ.3.92 కోట్ల విలువ గల 2,916 మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. బ్యాంకు ఖాతాలు లేని రైతులను గుర్తించి వారి జీరో బ్యాలెన్స్ అకౌంట్లను తెరిపించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రైతుల సెల్‌ఫోన్ నంబర్లకు ఎస్ఎంఎస్ ద్వారా జమ అయిన విషయాన్ని తెలియజేస్తామన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, డీఎస్ఓ ఏసురత్నం, డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి, ఆక్సిస్ బ్యాంక్ బిజినెస్ విభాగం వైస్ ప్రెసిడెంట్ హరినాథ్, జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ జైపాల్‌రెడ్డి, బ్రాంచ్ మేనేజర్ శ్యామ్‌సుందర్, ఇతర జిల్లా అధికారుల పాల్గొన్నారు. -
ధాన్యం అమ్మకాలకు అడ్డొస్తున్న షరతులు
పరిగి, న్యూస్‌లైన్ : సవాలక్ష షరతుల మధ్య రైతులు తమ ఉత్పత్తులను ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించలేకపోతున్నారు. దీంతో డీసీఎంఎస్, ఐకేపీల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కేంద్రాలు వెలవెలబోతున్నాయి. తప్పని పరిస్థితుల్లో రైతులు వ్యాపారులు, దళారులను ఆశ్రయిస్తున్నారు. ధర తక్కువైనా అమ్మేసుకుని ఇంటిదారి పడుతున్నారు. పరిగిలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేసి 15రోజులు దాటినా ఇప్పటికి కేవలం 100 క్వింటాళ్ల మక్కలు మాత్రమే కొనుగోలు చేయడం ఇందుకు ఉదాహరణ. ఇన్ని షరతులా? మొక్కజొన్నలు, ధాన్యానికి మద్దతు ధరను నిర్ణయిస్తూనే ప్రభుత్వం కొనుగోళ్లకు కొన్ని నిబంధనలు పెట్టింది. మొక్కజొన్నలో తేమశాతం14, ధాన్యానికి 17 శాతంలోపే ఉండాలని నిర్ణయిం చింది. ఈ నిబంధనతోనే సగం మంది రైతుల ధాన్యం తిరస్కారానికి గురవుతోంది. ఇక పండించిన ఉత్పత్తులు తమవేనని రైతులు రెవెన్యూ అధికారుల నుంచి ధ్రువీకరణ తెచ్చుకోవాలి. ఇది అదనపు తతంగం. ఈ ఇబ్బంది పడలేక రైతులు వెనకడుగు వేస్తున్నారు. ఇవన్నీ దాటుకుని తేమశాతం సరిగ్గానే ఉండి విక్రయించినా 15రోజుల తర్వాత డబ్బులు వస్తాయని చెబుతారు. కానీ నెల రోజులు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. చివరకు చెక్కు రూపంలో డబ్బులు వస్తాయి. దాన్ని తీసుకుని అకౌంట్ ఉన్న తమ బ్యాంకుకు వెళ్తే అక్కడ పాత బకాయి పట్టుకుంటారనే భయం. ఇన్ని చిక్కులు ఎందుకని చాలా మంది రైతులు షరామామూలుగా దళారుల చెంతకే చేరుతున్నారు. మార్కెట్ మాయ ఒక పక్క ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతుంటే వ్యవసాయ మార్కెట్, దళారుల అడ్డాలు మాత్రం ధాన్యం బస్తాలతో కళకళలాడుతున్నాయి. ఒక్కో వారం ఐదు వేల నుంచి 10 వేల క్వింటాళ్ల వరకు మక్కలు పరిగి మార్కెట్‌కు వస్తుండగా బయట రైతుల వద్దకే వెళ్లి కొనుగోలు చేసే దళారులు రోజుకు 20నుంచి 40 లారీల మక్కలు కొనుగోలు చేస్తున్నారు. వ్యవసాయ మార్కెట్లో తూకాల్లో మోసం, వ్యాపారుల సిండికేట్‌తో రైతులను నిండా మునుగుతున్నారు. ఇక దళారులు ఇళ్లు, పొలాల వద్దకే వెళ్లి అడ్డగోలు ధరలతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దోచుకుంటున్నారు. పరిగికి చెందిన ఒక్కో వ్యాపారి ప్రస్తుతం రూ.5 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు మక్కల వ్యాపారం చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మక్కల మద్దతు ధర రూ.1,310 దక్కడంలేదన్నది వాస్తవం.