కలెక్టరేట్, న్యూస్‌లైన్: ధాన్యం కొనుగోలు చేసిన 72 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు. రైతు ఖాతాల్లోనే డబ్బు జమచేసే ఆన్‌లైన్ ప్రక్రియను గురువారం ఆమె సమీకృత కలెక్టరేట్ ఎదుట ఉన్న ఆక్సిస్ బ్యాంకులో ప్రారంభించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలో ప్రారంభించిన ఈ పద్ధతి ద్వారా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన 79 మంది రైతులకు ఇవ్వాల్సిన రూ.44,11,062 ఈ పేమెంట్ ద్వారా ఆయా రైతుల ఖాతాల్లోనే జమ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ధాన్యం అమ్మిన రైతులకు చెల్లించాల్సిన డబ్బును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే 72 గంటల్లో జమ చేసేందుకు ఆక్సిస్ బ్యాంకు సహకారం తీసుకున్నామన్నారు.
ఈ ప్రక్రియ వల్ల దళారుల ప్రమేయం అరికట్టడంతో పాటు రైతులకు సకాలంలో డబ్బు చెల్లించవచ్చన్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 107 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామనీ, ఇందులో ఐకేపీ ద్వారా 95, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా 12 కేంద్రాల్లో 739 మంది రైతుల నుంచి రూ.3.92 కోట్ల విలువ గల 2,916 మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. బ్యాంకు ఖాతాలు లేని రైతులను గుర్తించి వారి జీరో బ్యాలెన్స్ అకౌంట్‌లను తెరిపించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రైతుల సెల్‌ఫోన్ నంబర్లకు ఎస్‌ఎంఎస్ ద్వారా జమ అయిన విషయాన్ని తెలియజేస్తామన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, డీఎస్‌ఓ ఏసురత్నం, డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి, ఆక్సిస్ బ్యాంక్ బిజినెస్ విభాగం వైస్ ప్రెసిడెంట్ హరినాథ్, జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ జైపాల్‌రెడ్డి, బ్రాంచ్ మేనేజర్ శ్యామ్‌సుందర్, ఇతర జిల్లా అధికారుల పాల్గొన్నారు.
72 గంటల్లో డబ్బులు
Published Fri, Nov 15 2013 1:28 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement