Smitha sabarwal
-
వెనక్కి తగ్గని స్మితా సబర్వాల్.. పోలీసులకు దివ్యాంగుల ఫిర్యాదు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తన ఎక్స్ అకౌంట్లో చేసిన ఓ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో దివ్యాంగ కోటా ఎందుకు? ఇతర విభాగాల్లోని టెక్నికల్, ఆర్అండ్డీ, డెస్క్ జాబ్‌లు సరిపోతాయని అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆమె‘ఎక్స్’వేదికగా చేసిన పోస్టులో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సోషల్ మీడియాలో ఆమెపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. తాజాగా.. దివ్యాంగులపై అనుచిత వాక్యాలు చేసినా ఐఏఎస్ స్మితా సబర్వాల్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య, మరికొంతమంది దివ్యాంగులు ఫిర్యాదు చేశారు. ఐఏఎస్ స్మితా సబర్వాల్ దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలను ఐఏఎస్ అకాడమి నిర్వాహకురాలు, మెంటర్, కోచ్ బాలలత తీవ్రంగా ఖండించారు. స్మితా సబర్వాల్ వెంటనే రిజైన్ చేయాలని, తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.‘స్మితా సబర్వాల్ వెంటనే దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలి. లేదంటే రేపటి అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటాం. అసెంబ్లీ ముట్టడిస్తాం. దివ్యాంగులపై సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. ఇది ప్రభుత్వం ఆలోచన లేదా.. ఆమె మాటలా?. ఆమె మెంటల్‌గా అప్సెట్ అయ్యారు. తెలంగాణలో దివ్యాంగులు ఉండాలా వద్దా? చెప్పండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మొదటి ఉద్యోగం దివ్యాంగురాలికి ఇచ్చారు.... స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించి చర్యలు తీసుకోవాలి. అలాగే.. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ కూడా తక్షణమే స్పందించాలి. మా మీద ఏ అధికారంతో ఈ వ్యాఖ్యలు చేశారామె. ఇప్పటికే నాతో చాలా విద్యార్థులు చర్చించారు. ఈ విషయాన్ని కచ్చితంగా ఖండించాలి. స్మితా సబర్వాల్ వెంటనే రిజైన్ చేయాలి. మాకు న్యాయం జరగాలి’’ అని అన్నారు. మరోపైపు.. తనపై వస్తున్న విమర్శలపై స్మితా సబర్వాల్ మరోసారి ‘ఎక్స్’ వేదికగానే స్పందించారు. ఐపీఎస్/ ఐఎఫ్‌ఒఎస్‌తో పాటు రక్షణ వంటి కొన్ని రంగాలలో వికలాంగుల కోటా ఇప్పటికీ ఎందుకు అమలు చేయబడలేదో తనను ప్రశ్నిస్తున్నవారు చెప్పాలన్నారు. ఐపీఎస్, ఐఎఫ్‌ఒఎస్ లాగే ఐఏఎస్‌లు అంతే కదా అని అన్నారు. ఇది కూడా పరిశీలించవలసిందిగా హక్కుల కార్యకర్తలను అభ్యర్థిస్తున్నానని తెలిపారు. అంతేకానీ సున్నిత స్వభావానికి నా మనసులో చోటు లేదనడం కరెక్ట్ కాదు’ అని తెలిపారు.See a lot of outrage on my timeline. I suppose addressing the elephant in the room gets you that reaction. Would request the Rights Activists to also examine why this quota has still not been implemented in the IPS/ IFoS and certain sectors like defence. My limited point is…— Smita Sabharwal (@SmitaSabharwal) July 22, 2024 -
TS IAS Officers Transfer: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 26 మంది ఐఏఎస్ అధికారులకు బదిలీ, పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎంవో సెక్రటరీగా చంద్ర శేఖర్ రెడ్డి(IFS)ని నియమించింది. బదిలీ అయిన వారిలో సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబాబాద్, నల్గొండ, గద్వాల కలెక్టర్లు ఉన్నారు. ఇక సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌పై కూడా బదిలీ వేటు పడింది. సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా ఉన్న స్మిత.. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా స్థానచలనం పొందారు. ► రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా శశాంక నియామకం ►నల్గొండ కలెక్టర్‌గా దాసరి హరిచందన. ►మహబూబాబాద్ కలెక్టర్‌గా అద్వైత్ కుమార్. ►సంగారెడ్డి కలెక్టర్‌గా వల్లూరు క్రాంతి. ►గద్వాల కలెక్టర్‌గా బీఎం సంతోష్ ►సీఎం ఓఎస్డీగా వేముల శ్రీనివాసులు ►నీటిపారుదలశాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జ ►మైన్స్ అండ్ జియోలజి ప్రిన్సిపల్‌గా మహేష్ ధత్ ఎక్కా.. ►పురావస్తు శాఖ డైరెక్టర్‌గా భారతీ హోళికేరి ►మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్‌గా డీ దివ్య నియామకం ►టీఏస్ డైరీ కార్పొరేషన్ ఎండీగా చిట్టెం లక్ష్మి ►ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా శరత్. ► ప్రణాళికాశాఖ ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీమ్ ►కార్మికశాఖ కార్యదర్శిగా కృష్ణ ఆదిత్యా . ►మైనార్టీ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఎంఎం ఖానమ్. ►సీఎంఓ జాయింట్ సెక్రటరీగా సంగీత సత్యనారాయణ. ►జీహెచ్ఎంసీ జోనల్ కమిషర్‌గా అభిలాష అభినవ్. ►హైదరాబాద్ లోకల్ బాడిస్ అడిషనల్ కలెక్టర్‌గా ఖదిరావన్. ►బీసీ సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శిగా బుర్ర వెంకటేష్ నియామకం. ►పంచాయతీరాజ్, ఆర్డీ కార్యదర్శిగా సందీప్ కుమార్ సల్తానియా. ►పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీగా జ్యోతి బుద్ధ ప్రకాశ్. ►GAD పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా రఘునందన్ రావు నియామకం. ►ఆయుష్ డైరెక్టర్‌గా ఎం ప్రశాంతి. ►ఫైనాన్స్, ప్లానింగ్ స్పెషల్ సెక్రటరీగా కృష్ణ భాస్కర్. ►TSMSIDC ఎండీగా కర్ణన్. ►రిజిష్టర్ అండ్ కో - ఆ సొసైటీ డైరెక్టర్ హరిత. ఇక ఫైనాన్స్ సెక్రెటరీగా చేసిన రామకృష్ణ రావుకు ఎలాంటి పోస్ట్ కేటాయించలేదు ప్రభుత్వం. -
కొత్త సర్కార్ ప్లాన్!.. కేంద్ర సర్వీసులకు స్మితా.. రాష్ట్రానికి ఆమ్రపాలి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రభుత్వంలో కొత్త టీమ్‌పై ఫోకస్ పెట్టారు. సీఎం ఆఫీసులో పనిచేసే అధికారుల ఎంపికపై రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఇక, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అధికారులకు స్థానచలనం మొదలైంది. కాగా, తెలంగాణలో త్వరలోనే ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే హైదరాబాద్‌లో మూడు కమిషనరేట్ల పరిధిలో కమిషనర్లు బదిలీ అయ్యారు. ఇక, ఆయా శాఖల్లో పలువురు అధికారుల జాబితా కూడా సిద్దమైనట్టు తెలుస్తోంది. శాఖల సమీక్షలు పూర్తి కాగానే బదిలీలు ఉంటాయన్న చర్చ ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది. ఒకే స్థానంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న అధికారులకు స్థాన చలనం ఉంటుందనే చర్చ మొదలైంది. మరోవైపు.. సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సెంట్రల్ సర్వీసుల్లోకి వెళ్లేందుకు స్మితా సబర్వాల్ దరఖాస్తు పెట్టుకున్నట్టు సమాచారం. కాగా, ప్రస్తుతం ఆమె.. నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్నారు. మరోవైపు.. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్మితా సబర్వాల్ ఏ సమీక్షకు హాజరు కాకపోవడం గమనార్హం. అంతకుముందు మాజీ సీఎం కేసీఆర్.. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సామర్థ్యాన్ని మెచ్చుకుని ఆమెను కార్యదర్శిగా నియమించారు. సీఎంవో ప్రత్యేక కార్యదర్శితో పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు కూడా అప్పగించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులతో పాటు మిషన్ భగీరథ పనులు కూడా స్మితా సబర్వాల్ పర్యవేక్షించారు. తాజాగా స్మితా సబర్వాల్ ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. తన 23 ఏళ్ల కేరీర్ గురించి ప్రస్తావిస్తూ ఆమె ఫొటోను షేర్ చేశారు. కొత్త ఛాలెంజ్‌కు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాను. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. Some pics remind us how far we have come.. through the valleys and the summits. 23 years to this pic… a driven young lady who always walked her will! Thanks to all your love ♥️, ever ready for a new challenge. pic.twitter.com/xahFAszBYv — Smita Sabharwal (@SmitaSabharwal) December 13, 2023 ఇదిలా ఉండగా.. స్మితా సబర్వాల్, ఆమ్రపాలి.. మహిళా ఐఏఎస్ అధికారుల పేర్లు మాత్రం ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఒకరు సీఎం ఆఫీసుకు గుడ్ బై చెప్పాలనుకుంటే మరొకరు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. స్మితా సబర్వాల్ సెంట్రల్ సర్వీసుల్లోకి వెళ్లాలని చూస్తుండగా.. ఇటు కేంద్ర సర్వీసులో ఉన్న మరో ఐఏఎస్ ఆమ్రపాలి.. రేవంత్ రెడ్డి టీమ్‌లో జాయిన్ కానున్నారు అనే చర్చ జరుగుతోంది. దీంతో, ఈ ఐఏఎస్‌ల అంశం ఆసక్తికరంగా మారింది. -
మహిళా ఉద్యోగుల భద్రతకు ప్రత్యేక చర్యలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగుల భద్రత, సౌకర్యాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతో సమావేశం సందర్భంగా భోజన విరామ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా ఉద్యోగులతో ప్రత్యేకంగా మాట్లాడారు. శాఖల వారీగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులు సౌకర్యవంతంగా విధులు నిర్వహించేలా చూస్తామని హామీ ఇచ్చారు. మహిళా ఉద్యోగులతో మాట్లాడి వారికి కావాల్సిన ఏర్పాట్లు చేసే బాధ్యతను తన కార్యదర్శి స్మితా సభర్వాల్ కు సీఎం అప్పగించారు. తమ పట్ల సీఎం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధకు మహిళా ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. -
మే 15 నాటికి ‘మేడిగడ్డ’ పూర్తి చేయాలి
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో మరింత వేగం పెంచాలని సీఎంఓ కార్యదర్శి స్మితాసబర్వాల్ అన్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనులను త్వరగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్, కాంట్రాక్టర్ల ప్రతినిధులను ఆదేశించారు. శనివారం ఆమె మేడిగడ్డ బ్యారేజీ పనులను పరిశీలించారు. బ్యారేజీలో మొత్తం 85 గేట్లకు గాను 61 గేట్ల నిర్మాణం, బిగింపు పనులు పూర్తి చేశామని, మిగతావి జరుగుతున్నాయని తెలిపారు. మహారాష్ట్రకు ఆవలి వైపున బ్యారేజీ పనులకు సంబంధించి భూసేకరణ వేగవంతం చేసి పనులు మే 15 వరకు ఎట్టి పరిస్ధితుల్లో పూర్తి చేసి ఖరీఫ్ నాటికి నీరందించాలని స్మితాసబర్వాల్ ఆదేశించారు. అక్కడి నుంచి ఆమె కన్నెపల్లిలోని మేడిగడ్డ పంపుహౌస్‌కు చేరుకున్నారు. పంపుహౌస్‌లో 11 మోటార్లకు 7 మోటార్ల బిగింపు పూర్తయిందని, మిగతావి మేలో పూర్తి చేయనున్నట్లు మెగా కంపెనీ డైరెక్టర్ బ్రహ్మయ్య తెలిపారు. గ్రావిటీ కాల్వలో మిగిలి ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్, ఇంజనీర్లను ఆమె ఆదే శించారు. ఆమె వెంట కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు, సీఎం ఓఎస్డీ దేశ్‌పాండే, ఇరిగేషన్ సలహాదారు పెంటారెడ్డి, ఎస్ఈ సుధాకర్‌రెడ్డి, ఈఈ రమణారెడ్డి, డీఈఈలు సూర్యప్రకాశ్, ప్రకాశ్ తదితరులు ఉన్నారు. -
15 రోజుల్లో మిషన్ భగీరథ నీరు అందిస్తాం
-
'వాటర్ గ్రిడ్ పనులను వేగవంతం చేయండి'
కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి పర్సనల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ బుధవారం వేములవాడ మండలం అగ్రహారం వద్ద వాటర్ గ్రిడ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వాటర్ గ్రిడ్ పనులను వేగవంతం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. వాటర్ గ్రిడ్ పనులు జరుగుతున్న ప్రాంతానికి సమీపంలో ఉన్న క్వారీల్లో బ్లాస్టింగ్ల వలన పనులకు అంతరాయం కలుగుతున్నందున వాటిని నిలిపివేయాలని కోరారు. -
స్మితా సభర్వాల్‌కు నిధుల విడుదలపై కోర్టులో పిటిషన్
హైదరాబాద్: 'ఔట్లుక్' మ్యాగజైన్ కథనం వివాదంలో సీఎం కార్యాలయం అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్‌కు న్యాయపరమైన ఖర్చుల కోసం రూ.15 లక్షలు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో గురువారం మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని హైదరాబాద్‌కు చెందిన కె.ఈశ్వరరావు దాఖలు చేశారు. ఇందులో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డెరైక్టర్, పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్, అకౌంటెంట్ జనరల్, స్మితాసబర్వాల్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాన్ని శుక్రవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించనున్నది. స్మితా సబర్వాల్ ఓ హోటలో పాల్గొన్న ప్రైవేటు కార్యక్రమం గురించి సదరు పత్రిక కథనం, కార్టూన్ ప్రచురించిందని, ఇది పూర్తిగా ఆమె వ్యక్తిగత వ్యవహారమని, దీని వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినలేదని పిటిషనర్ తెలిపారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని ప్రభుత్వ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని కోరారు. -
స్మితా సబర్వాల్ కు అండగా నిలిచిన టీసర్కార్
హైదరాబాద్ : ఔట్ లుక్ మ్యాగజైన్ పై పరువు నష్టం కేసులో ఐఏఎస్ అధికారణి, సీఎంఓలో అడిషనల్ సెక్రటరీ స్మితా సబర్వాల్‌కు తెలంగాణ సర్కారు అండగా నిలిచింది. ఈ కేసు విషయమై ఆమెకు కోర్టు ఖర్చుల కింద రూ.15 లక్షలను ఇస్తున్నట్లు టీఎస్ సర్కార్ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మ్యాగజైన్ ఆమె గురించి అభ్యంతరకరంగా కార్టూన్ ప్రచురించినప్పటి నుంచి ఆ మ్యాగజైన్ పై సబర్వాల్ న్యాయ పోరాటం కొనసాగిస్తున్న విషయం విదితమే. ఔట్ లుక్ మ్యాగజైన్ కొన్ని రోజుల కిందట 'నో బోరింగ్ బాబు' అనే శీర్షికతో ఓ కామెంట్ ప్రచురించింది. 'ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగే సమావేశాలకు అద్భుత వస్త్రధారణతో హాజరయ్యే ఓ బ్యూరోక్రాట్.. 'కంటికి ఇంపైన మహిళా అధికారి'గా అందరూ కితాబిస్తుంటారని చెబుతూ.. జీన్స్, టీషర్ట్ వేసుకున్న ఓ అధికారిణి ర్యాంప్‌పై నడుస్తుంటే.. సీఎం కేసీఆర్, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు ఆమెనే చూస్తోన్న అభ్యంతరకర కార్టూన్ ను ప్రచురించిన విషయం విదితమే. అప్పటి నుంచి ఈ విషయంపై సబర్వాల్ న్యాయ పోరాటం చేస్తున్నారు. తన న్యాయవాది ద్వారా ఆ మేగజైన్ కు నోటీసులు పంపి.. క్షమాపణలు చెప్పాలని గతంలోనే డిమాండ్ చేశారు. -
సెక్సిస్ట్ ఔట్లుక్ని ఇకనైనా బద్దలు కొట్టాలి
బిగుతైన దుస్తులు వేసుకుని స్మిత ర్యాంప్ మీద నడుస్తుంటే కెమెరా పట్టుకుని కేసీఆర్ ఆమె వంక చూస్తున్నట్లు వేసిన క్యారికేచర్... తను స్వయంగా అన్నట్లు ప్రజల్లో ఒక ‘అభిప్రాయాన్ని’ ఏర్పరుస్తుంది. ఔట్లుక్ ‘నో బోరింగ్ బాబు’ వివాదం గురించి ఎన్డీటీవీతో మాట్లాడుతూ స్మితా సబర్వాల్ ఈ మొత్తం విషయాన్ని ‘కాన్స్పిరసి’ అ న్నారు. ఈ పదానికి తె లుగులో కుట్ర, దురా లోచన, మంత్రాంగం అనే అర్థాలున్నాయని శబ్దకోశం చెబుతోంది. మన రాజ్యాంగం, ఆర్టికల్ 164(2)లో ముఖ్య మంత్రితోపాటు మంత్రులు కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీకి సమష్టి బాధ్యత వహించాలి అని చెబు తుంది. కాని నేటి మన రాజకీయ పార్టీలు, మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలోని ప్రాంతీ య పార్టీలు వ్యక్తి కేంద్రంగా ఉంటూ వస్తున్నా యి. దాంతో ముఖ్యమంత్రి అవుతున్న ఆ పార్టీ నేత సార్వభౌమత్వాన్ని పొందుతున్నాడు. అతని కార్యాలయం ‘పవర్ సెంటర్’గా మారిపోయిం ది. ఆ పవర్ సెంటర్లో అధికారిగా కీలకమైన స్థానంలోకి చిన్న వయసులో అనేక మందిని దాటుకుని చేరుకున్నది స్మిత. ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రులు తమ కార్యాలయాల్లో పనిచేసే అత్యున్నత స్థాయి అధికారులను, మంత్రుల్ని ఎంపిక చేసుకున్నట్లే, తమకు అనుకూలంగా పనిచేసేవారిని ఎంపిక చేసుకుని తెచ్చుకోవడం ఇప్పుడొక రివాజుగా ఉంది. మన రాష్ట్రం వరకు వస్తే ఆయా ముఖ్య మంత్రులు వారి కార్యాలయాల్లో అత్యున్నత పదవుల్లో నియమించుకున్న అధికారులను బట్టి ఆ ముఖ్యమంత్రి ప్రాధమ్యాలు ఏ రకంగా ఉం డబోతున్నాయో అనే సూచన కొన్నేళ్లుగా ఉంటూ వస్తోంది. రాజశేఖరరెడ్డి వంటి దార్శనిక ముఖ్య మంత్రులు దళిత మైనారిటీ వర్గాల అధికారు లను నియమించడం ద్వారా ఆ వర్గాలకు ఆత్మ స్థైర్యాన్ని ఇవ్వడమే కాకుండా ఆ వర్గాల అభివృ ద్ధిని ఉద్యమ స్థాయిలోకి తీసుకెళ్లడానికి ప్రయ త్నించారు. ఒక సుదీర్ఘ ఉద్యమ ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. ఒక ప్రత్యేక అస్తిత్వ పోరాటాన్ని అతి నేర్పుగా నడి పిన ఈ నాయకుడు రాష్ట్ర అవతరణ దినోత్సవా నికి ముందు, దళితుడే తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అవుతాడని ప్రకటించి ఉన్నాడు. అలాగే నవ తెలంగాణ నిర్మాణం కోసం ఇతర రాష్ట్రాలలో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన ఉన్నత స్థాయి అధికారులను డెప్యుటేషన్ మీద తీసుకొస్తానని కూడా ప్రకటించి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కార్యాలయంలో అధికారు లు పూర్తిగా తెలంగాణ నేపథ్యం ఉన్నవారే అయి ఉంటారని.. వారిలో దళితులు, మైనారిటీలు కూడా ఉంటారని చాలామంది అనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా.. సుదీర్ఘ అనుభవం, ప్రతిభ ఉన్న ఒక తెలంగాణ వాసిని ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించడంతోపాటు బెంగాలీ నేపథ్యం ఉన్న సమర్థులైన యువ అధికారిణిని అదనపు కార్యదర్శిగా నియమించుకున్నారు. స్మిత తన నియామకంపై మాట్లాడుతూ, ‘ఇంత వరకు మహిళలు లేని చోట మహిళలను నియ మించి, సీఎం కేసీఆర్ సమాజానికి ఒక సందేశా న్నిచ్చారు’ అని అన్నారు. అయితే ఈ మొత్తం విషయాన్ని పరిశీలిస్తే మనలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. తెలంగాణ ఆత్మగౌరవం పేరిట ఏర్పడ్డ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేయడానికి సమర్థత, ప్రతిభ కలిగిన బలహీ నవర్గాలకు చెందిన ఒక్క తెలంగాణ ఐఏఎస్ కూడా కేసీఆర్‌కి కనిపించలేదా? చరిత్ర పొడవునా అధికారం కోసం జంతు నీతితో మనం పోట్లాడుతూనే వచ్చాం. అది ఇవా ళ కొత్త కాదు. కొత్త ఏమిటంటే ఇక్కడ అధికారం కోసం జరిగిన పాచికలాటలో ఒక మహిళ గెలు పొందింది. గెలుపు సాధించడానికి పురుషుడి కైనా, స్త్రీకైనా పరిచయాలు, కులాలు, మతాలు, నేపథ్యాలు వంటి ఎన్నో అంశాలు కీలకపాత్రలు పోషిస్తాయి. కానీ పురుషుడికి భిన్నంగా అధికా రంలో ఉన్న ఒక స్త్రీ మీద దాడి జరిగేటప్పుడు మాత్రం ఆమె లైంగికత అక్కడ ప్రధాన అంశమై నిలుస్తుంది. ఔట్లుక్ పత్రిక చేసింది కూడా అదే. బిగుతైన దుస్తులు వేసుకుని స్మిత ర్యాంప్ మీద నడుస్తుంటే కెమెరా పట్టుకుని కేసీఆర్ ఆమె వంక చూస్తున్నట్లు వేసిన క్యారికేచర్... స్మిత స్వయంగా ఎన్డీటీవీతో అన్నట్లు ప్రజల్లో ఒక అభి ప్రాయాన్ని ఏర్పరుస్తుంది. స్మితలాగే సమాన ప్రతిభ ఉన్నవాళ్లు చాలామంది ఉన్నా స్మిత సౌం దర్యం ఆమెని ఆ స్థానానికి తీసుకెళ్లిందని, కేసీ ఆర్ ఆమెని ఒక వస్తువుగానే చూసి తీసుకెళ్లి ఆ స్థానంలో కూర్చోబెట్టాడనేదే ఆ అభిప్రాయం. ఈ తరహా దాడి పురుషులతో పోటీ పడ గలిగే స్థాయికి చేరిన స్త్రీలందరికీ అనుభవమే. ఒక స్త్రీ ఈ పురుషస్వామ్య ప్రపంచంలో కీలక స్థానంలో నిలిచిందంటే ఆమె కత్తిమీద సాము చేసి వచ్చిందని అర్థం. స్మిత కీలక పదవిని పొం దడంలోనే కాదు ఈ ప్రపంచం చేసిన లైంగిక పరమైన దాడిని ధైర్యంగా ఎదుర్కోవడం ద్వారా కూడా సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనే సోషల్ డార్వి నిజం ప్రకారం ఫిట్టెస్ట్ ఆఫ్ ది ఫిట్టెస్ట్గా నిలి చింది. మన సమాజం స్మిత పట్ల లేదా ఆమె లాం టి స్త్రీలపట్ల వ్యక్తపరుస్తున్న ఈ సెక్సిస్ట్ ఔట్ లుక్ ని ఇకనైనా బద్దలు కొట్టాల్సిన అవసరం ఉంది. (వ్యాసకర్త కథా రచయిత్రి) మొబైల్: 80196 00900 - సామాన్య -
ఔట్‌లుక్‌పై సీసీఎస్‌లో కేసు నమోదు
హైదరాబాద్: ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌ను అవమానించేవిధంగా ‘ఔట్లుక్’ మ్యాగజైన్ ఒక కథనంతో పాటు కార్టూన్‌ను వేశారని ఆమె భర్త అకున్ సబర్వాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు వివిధ సెక్షన్ల కింద శనివారం ‘ఔట్లుక్’ పై కేసు నమోదు చేశారు. 509 ఐసీసీ, ఐటీ యాక్ట్ 67 సెక్షన్‌తో పాటు 3 ఆర్/డబ్ల్యూ సెక్షన్ల కింద ఔట్లుక్ యాజమాన్యంతో పాటు ఉద్యోగులపై కేసు నమోదు చేశామని సీసీఎస్ ఏసీపీ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. -
'ఔట్ లుక్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం'
కాచిగూడ(హైదరాబాద్): ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్‌తో పాటు సీఎం కేసీఆర్‌పై అభ్యంతర కథనాలు ప్రచురించిన ఔట్లుక్ పత్రికపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల విద్యార్థి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపర్తి సంతోష్‌కుమార్ డిమాండ్ చేశారు. తమ తప్పును ఒప్పుకుని, క్షమాపణలు చెప్పాలని.. లేని పక్షంలో ఢిల్లీలోని ఔట్లుక్ కేంద్ర కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రగతిశీల విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం కాచిగూడ చెప్పల్‌బజార్‌లోని అవుట్‌లుక్ కార్యాలయం వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆ పత్రిక ప్రతులను తగులబెట్టారు. ఔట్లుక్ యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంతోష్‌కుమార్ మాట్లాడుతూ మహిళల మనోభావాల్ని కించపరిచే విధంగా కథనాన్ని ప్రచురించిన ఔట్లుక్ యాజమాన్యం బహిరంగ క్షమాపణ చేప్పాలని డిమాండ్ చేశారు. -
నల్లగొండ కలెక్టర్‌గా స్మితా సబర్వాల్!
సాక్షి, హైదరాబాద్: సీఎం కె.చంద్రశేఖర్‌రావు కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్న ఐఏఎస్ స్మితా సబర్వాల్ నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా వెళ్లనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గతంలో మెదక్, కరీంనగర్ జిల్లాల కలెక్టర్‌గా పనిచేసిన ఆమె... కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పేషీలో తొలి అధికారిగా నియామకం అయ్యారు. ప్రస్తుతం ఆమె సీఎం కార్యాలయంలో కీలకమైన నీటి పారుదల, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల బాధ్యతలను నిర్వహిస్తున్నారు. పారిశ్రామికీకరణకు అవసరమైన భూమి గుర్తింపులో చొరవ తీసుకుని.. కలెక్టర్ల నుంచి విస్తృత సమాచారాన్ని సేకరించారు. అయితే నల్లగొండ జిల్లా నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో ఆమెను ఆ జిల్లా కలెక్టర్‌గా నియమించే విషయాన్ని సీఎం పరిశీలిస్తున్నారని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. -
నేడు సింగపూర్ పర్యటనకు కేసీఆర్
రాత్రి 11.20కి ప్రయూణం ఈనెల 25వ తేదీన తిరిగి రాక సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం రాత్రి 11.20 గంటలకు సింగపూర్ వెళ్తున్నారు. ముఖ్యమంత్రి, ఆయన బృందం సభ్యులు సింగపూర్‌తోపాటు మలేషియా కూడా వెళ్తున్నారు. ఈ రెండు దే శాల పర్యటన తరువాత వారు ఈ నెల 25వ తేదీ రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. కేసీఆర్‌తోపాటు, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, సీఎం కార్యాలయ ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, ఐటీ శాఖ కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్, ఏపీఐఐసీ మేనేజింగ్ డెరైక్టర్ జయేష్‌రంజన్‌లు ఈ పర్యటనకు వెళ్తున్నారు. ఈ నెల 20న సింగపూర్‌లో జురాంగ్ ఇండస్ట్రియల్ పార్క్‌ను సందర్శిస్తుంది. ఆరోజు రాత్రి సింగపూర్‌లో ఉండే తెలంగాణ ప్రజలతో సమావేశం అవుతారు. 21వ తేదీ న సింగపూర్‌లోని స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, పరి శ్రమ వర్గాలతో సమావేశం అవుతారు. 22వ తేదీన ఐఐఎం పూర్వ విద్యార్థుల సదస్సులో పాల్గొంటారు. సదస్సులో సింగపూర్ ప్రధానమంత్రి కూడా పాల్గొంటారని సమాచారం. 23న సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు, మంత్రులతో సమావేశం, సింగపూర్ పట్టణ నమూనా, అభివృద్ధిపై పరిశీలన, ఈ-గవర్నెన్స్‌పై అధ్యయనం ఉంటుంది. 24వ తేదీన మలేషియా బయలుదేరి వెళ్తారు. ఆ దేశంలో కౌలాలంపూర్ నగర అభివృద్ధిని పరిశీలిస్తారు. 25వ తేదీన పట్టణీకరణ, రవాణా వ్యవస్థ, పోలీసింగ్ ను పరిశీలిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
పదవులకే కొత్త కళ తీసుకొచ్చిన స్మితా !
-
కలెక్టర్ స్మితా సబర్వాల్ బదిలీ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా సమగ్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో ‘మార్పు’నకు శ్రీకారం చుట్టిన కలెక్టర్ స్మితా సబర్వాల్ బదిలీ అయ్యారు. తెలంగాణ తొలి సీఎం కె.చంద్రశేఖర్‌రావు బృందంలో సభ్యురాలిగా నియామకమయ్యారు. సీఎం అదనపు కార్యదర్శిగా స్మితా సబర్వాల్‌ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. జాయింట్ కలెక్టర్ శరత్‌కు కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొంది. స్మితా సబర్వాల్ కరీంనగర్ నుంచి మెదక్ జిల్లాకు గత ఏడాది అక్టోబర్‌లో వచ్చారు. అక్టోబర్ 16న కలెక్టర్‌గా ఆమె బాధ్యతలు స్వీకరించారు. సుమారు తొమ్మిది నెలలపాటు పనిచేశారు. ఆమె జిల్లా అభివృద్ధికి పాటుపడటంతోపాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పేదలకు అందేలా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా సార్వత్రిక, స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థంగా నిర్వహించారు. అలాగే స్వల్ప వ్యవధిలో వచ్చిన పంచాయతీ, మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. ‘మార్పు’నకు శ్రీకారం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే స్మితా సబర్వాల్ జిల్లాలో విద్య, వైద్యశాఖలపై దృష్టి పెట్టారు. మిహ ళలకు ముఖ్యంగా గర్భిణులకు మెరుగైన వైద్యసేవలతోపాటు పౌష్టికాహారం అందించేందుకు ‘మార్పు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలాగే గర్భిణుల కోసం సిద్దిపేట, పటాన్చెరు, మెదక్‌లో హై రిస్కు కేంద్రాలను ఏర్పాటు చేశారు. సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రిని రూ.3 కోట్లతో అభివృద్ధి చేశారు. పదో తరగతి ఫలితాలు మెరుగుపర్చేందుకు తగిన చర్యలు చేపట్టారు. అలాగే వసతి గృహాలలో విద్యార్థులకు మెరుగైన వసతులు అందుబాటులోకి తెచ్చారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా 30 రోజుల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి స్మితా సబర్వాల్ చర్యలు చేపట్టారు. సీఎం కె.చంద్రశేఖర్‌రావు బుధవారం నాటి తన పర్యటన సందర్భంగా కలెక్టర్ స్మితా సబర్వాల్ పనితీరుపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. -
మెదక్ కలెక్టర్ స్మితా సబర్వాల్ భావోద్వేగం!
-
సంబురాలకు సమాయత్తం
తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కల సాకరమయ్యే సమయం సమీపిస్తున్నది. అనేక ఉద్యమాలు, పోరాటాలు, త్యాగాల వల్ల సిద్ధించిన తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావాన్ని అదిరిపోయేలా చేసుకునేందుకు తెలంగాణ సకల జనులు సిద్ధమవుతున్నారు. అపాయింటెడ్ డే జూన్ 2 కావడంతో ఆదివారం అర్ధరాత్రి నుంచే సంబురాలు హోరెత్తనున్నాయి. మరోవైపు అధికారులు వేడుకలను అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సంగారెడ్డిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో కలెక్టర్ స్మితాసబర్వాల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఉత్సవాలను ప్రారంభించనున్నారు. కలెక్టరేట్, న్యూస్‌లైన్: తెలంగాణ ఆవిర్భావ సంబురాలను అధికారికంగా నిర్వహించనున్నారు. జూన్ 2న ఉదయం 8.45 గంటలకు సంగారెడ్డిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఉత్సవాలను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్, ఎస్పీ షెముషీ బాజ్‌పాయ్‌తో కలిసి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను ఆంశాల వారీగా వివిధ శాఖల జిల్లా అధికారులకు అప్పగించారు. పరేడ్ గ్రౌండ్లో జూన్ 2న జరగనున్న కార్యక్రమాల షెడ్యూల్ ఇది.. -
కలెక్టరమ్మ ఇక్కడే
సాక్షి ప్రతినిధి,సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిత్మా సబర్వాల్నే జిల్లా కలెక్టర్‌గా కొనసాగించనున్నారు. మెదక్ పార్లమెంటు ఉప ఎన్నిక ముగిసేంత వరకు ఆమెను ఇక్కడే కొనసాగించే అవకాశాలున్నాయి. రాజకీయ వివాదాలకు దూరంగా ఉండటం, సమర్థురాలైన అధికారిగా గుర్తింపు పొందడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కొత్త రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పంపిణీ ప్రక్రియలో భాగంగా సిత్మా సబర్వాల్‌కు బదిలీ తప్పదని అందరూ భావించారు. ‘ఓటరు పండుగ’ కార్యక్రమంలో స్వయంగా కలెక్టరే జూన్ 2 తర్వాత తన బదిలీ ఉంటుందని సన్నిహితులతో చెప్పారు. ప్రస్తుతం వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులు ఏ రాష్ట్రంలో పని చేయడానికి ఇష్టపడుతున్నారో తెలపాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. చిన్ననాటి నుంచీ హైదరాబాద్‌తో అనుబంధం ఉన్న సిత్మా సబర్వాల్ తెలంగాణ రాష్ట్రంలోనే పనిచేయడానికి తొలి ఆప్షన్ ఇచ్చినట్టు సమాచారం, లేదంటే కేంద్ర సర్వీసుల్లోకి తీసుకోవాలని కోరినట్టు తెలిసింది. కొత్త ప్రభుత్వంలో కీలకమైన జిల్లా కలెక్టర్ల కూర్పుపై కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటెలిజెన్స్, ఇతర ముఖ్యుల ద్వారా సమాచారం తెప్పించుకుని కసరత్తు చేసినట్టు సమాచారం. స్మితా సబర్వాల్ పనితీరు పట్ల కేసీఆర్, హరీష్‌రావు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. 2001 బ్యాచ్‌కు చెందిన ఆమె అక్టోబర్‌లో జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. అస్తవ్యస్తంగా ఉన్న పాలనను గాడిలో పెట్టారు. సమయ పాలన పాటించని అధికారులపై కొరడా ఝుళిపించారు. బడా పారిశ్రామికవేత్తల నుంచి సీఎస్ఆర్ నిధులు వసూలు చేశారు. అన్నిటికీ మించి రాజకీయ వివాదాలకు దూరంగా ఉన్నారు. ఎలాంటి ఫిర్యాదులు లేకుండా మూడు ఎన్నికలను సమర్థవంతంగా పూర్తిచేశారు. మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నిక ముగిసేంత వరకు ఆమెను జిల్లాలోనే కొనసాగించాలని హరీష్‌రావు చేసిన సూచన మేరకు కేసీఆర్ పై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
ఓటు వేసి పండగ చేసుకోండి: సిత్మా సభర్వాల్
ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తివంతమైనది ఓటు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. డబ్బు, మద్యం ప్రలోభాలకు లోనుకాకుండా సక్రమంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. అప్పుడే ప్రజల ఆకాంక్షలతో కూడిన ప్రభుత్వం ఏర్పడుతుంది. తద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి మార్గం ఏర్పడుతుంది. అందుకే అందరూ ఎన్నికలను పండుగలా జరుపుకోవాలి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించడం మా బాధ్యత. దీనికోసం ‘ఓటరు పండగ’ కార్యక్రమం చేపట్టాం. మెదక్ జిల్లాలో పోలింగ్ శాతం గణనీయంగా పెంచడానికి ప్రోత్సాహక బహుమతులు ప్రకటించాం. 95 శాతం పోలింగ్ నమోదైన గ్రామాలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం కోసం రూ.2 లక్షలు ప్రత్యేక ప్రోత్సాహకంగా అందిస్తాం. ముఖ్యంగా రక్షిత మంచినీటి ప్లాంటు ఏర్పాటుకు ప్రాముఖ్యం ఇస్తాం. దీనితో పాటు లక్కీడిప్ ద్వారా ఓటరును విజేతగా ఎంపిక చేస్తాం. విజేతలకు కారు, ఎల్సీడీ,ల్యాప్‌టాప్, మోటార్‌సైకిల్, కూలర్, ఫ్రిజ్ బంపర్ బహుమతులను అందజేస్తాం. ఓటు వేసినట్టు వేలుపై సిరా గుర్తు చూపించిన వారికి పోలింగ్ రోజున లీటర్ పెట్రోల్‌పై రూ.1 రాయితీ ఇస్తున్నాం. పారిశ్రామిక ప్రాంతాల్లో 90 శాతం పోలింగ్ నమోదైతే లక్కీడిప్ ద్వారా మొదటి 20 మంది ఓటర్లకు కూలర్లు, మరో 20 మందికి ఆరోగ్య తనిఖీ కూపన్లు ఇస్తాం. వీటితో పాటు మిగిలిన బంపర్ బహుమతులు కూడా వీళ్లకు వర్తిస్తాయి. 92 శాతం ఓటింగ్నమోదైన గ్రామాల్లో ఓటు వేసిన వారికి 10 మందికి డ్రాద్వారా ఒక్కొక్కరికి కనీసం రూ.1200 విలువైన బహుమతులు అందిస్తున్నాం. ఇవి కాకుండా చీరలు, కుట్టుమిషన్లు, రైతు ఉపకరణాలు,ధోవతి, ఫ్యాను తదితర వాటికి డ్రా ద్వారా ఎంపిక చేసి అంద జేస్తాం. - సిత్మా సభర్వాల్, మెదక్ జిల్లా కలెక్టర్ -
వైఎస్సార్ సీపీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు
సంగారెడ్డి అర్బన్, న్యూస్‌లైన్: జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలకు, 10 అసెంబ్లీ స్థానాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బుధవారం నామినేషన్లు సమర్పించారు. మెదక్ పార్లమెంట్ స్థానానికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పుల్లయ్యగారి ప్రభుగౌడ్ తన నామినేషన్ పత్రాలను జిల్లా ఎన్నికల అధికారి, మెదక్ పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి స్మితా సబర్వాల్‌కు అందజేశారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి మహ్మద్ మొహియొద్దీన్ తన నామినేషన్ పత్రాలను జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి శరత్‌కు అందజేశారు. దుబ్బాక అసెంబ్లీ స్థానానికి మరపడగ శ్రవన్‌కుమార్ గుప్త, గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి దొంతి పురుషోత్తంరెడ్డి, అందోల్ నుంచి బందిరగల్ల సంజీవరావు, నర్సాపూర్ అసెంబ్లీ స్థానానికి డాక్టర్ దండెపు బస్వానందం, పటాన్చెరు అసెంబ్లీ స్థానానికి గురజార శ్రీనివాస్‌గౌడ్, జహీరాబాద్ అసెంబ్లీ స్థానానికి నల్లా సూర్యప్రకాష్‌రావు, సిద్దిపేట అసెంబ్లీ స్థానానిక తడక జగదీశ్వర్, మెదక్ అసెంబ్లీ స్థానానికి అల్లారం క్రీస్తుదాస్, నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానానికి అప్పారావు షెట్కార్, సంగారెడ్డి అసెంబ్లీ స్థానానికి గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు ఆయా నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. -
అ‘సాధారణ’ రీతిలో లావాదేవీలు
సాక్షి, సంగారెడ్డి: సాధారణ ఎన్నికల వేళ ఏటీఎంల ద్వారా నగదు లావాదేవీలు అసాధారణ రీతిలో జరుగుతున్నాయి. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు కొందరు అభ్యర్థులు ఏటీఎంలను డబ్బు రవాణా మార్గాలుగా ఉపయోగించుకుంటున్నారనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. కోట్ల రూపాయలు చేతులు మారుతుం డడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. జిల్లా సరిహద్దుల్లో నలువైపులా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనఖీలు చేస్తుండడంతో కొందరు అభ్యర్థులు నగదు రవాణా, పంపిణీ అవసరాలకు ఏటీఎంలను వినియోగించుకుంటున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారం నేపథ్యంలో .. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్మితా సబర్వాల్ బుధవారం ఏటీఎంలకు సంబంధించిన లావాదేవీలపై ఆరాతీశారు. గడిచిన మూ డు నెలల్లో జిల్లాలోని ఏటీఎంల ద్వారా జరిగిన నగదు బదిలీలకు సంబంధించిన సమాచారాన్ని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బ్యాంకుల నుంచి తెప్పించుకుని విశ్లేషిస్తున్నారు. గడిచిన రెండు నెలల్లో ఏటీఎంల ద్వారా డబ్బుల డ్రా అసాధారణ రీతిలో పెరిగిపోయినట్లు కలెక్టర్ పరిశీలనలో తేలింది. జిల్లాలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థలైన ఎస్బీఐ, ఎస్బీహెచ్, ఆంధ్రబ్యాంక్లకు సంబంధించిన 86 ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. ఈ ఏటీఎంల ద్వారా.. జనవరిలో 174.16 కోట్లు, ఫిబ్రవరిలో 165.07 కోట్లు డ్రా అయితే మార్చి నెలలో రూ.190.59 కోట్లు డ్రా అయ్యాయి. ఫిబ్రవరితో పోల్చితే ఒక్క మార్చి నెలలోనే ఏకంగా రూ.25.59 కోట్లు అదనంగా డ్రా అయ్యాయి. బ్యాంకుల వారీగా పరిశీలిస్తే.. ఎస్‌బీహెచ్‌కు సంబంధించిన 19 ఏటీఎంల ద్వారా ఫిబ్రవరిలో రూ.92.39 కోట్ల లావాదేవీలు జరిగితే మార్చిలో రూ.110.65 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఆంధ్రబ్యాంక్‌కు చెందిన 31 ఏటీఎంల ద్వారా ఫిబ్రవరిలో రూ.32.49 కోట్లు డ్రా అయితే, మార్చిలో రూ.41.21 కోట్లు డ్రా అయ్యాయి. దీంతో ఈ లావాదేవీలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఏటీఎంల లావాదేవీలపై దర్యాప్తు పనిని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో ఏటీఏంల ద్వారా అసాధారణ లావాదేవీలు జరిపిన బ్యాంకు ఖాతాదారులను పిలిపించి ఏ విషయంలో డబ్బులు డ్రా చేశారనే అంశంపై విచారించే అవకాశాలున్నాయి. డ్వాక్రా సంఘాల ఖాతాలను సైతం పరిశీలించి చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఆ నాలుగు నియోజకవర్గాలపై కన్ను.. పారిశ్రామికంగా వృద్ధి చెందిన పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని 15 ఏటీఎంల ద్వారా ఫిబ్రవరిలో రూ.32.49 కోట్లు డ్రా అయితే మార్చిలో రూ.40 కోట్లు డ్రా అయ్యాయి. అదే విధంగా సంగారెడ్డి నియోజకవర్గం పరిధిలో 19 ఏటీఎంల ద్వారా ఫిబ్రవరిలో రూ.41.85 కోట్లు డ్రా అయితే మార్చిలో రూ.45.40 కోట్లు డ్రా అయ్యాయి. సిద్దిపేట నియోజకవర్గం పరిధిలోని 11 ఏటీంఎంలలో సైతం రూ.3.73 కోట్లు అదనంగా డ్రా అయ్యాయి. జహీరాబాద్ నియోజకవర్గంలోని 5 ఏటీఎంలో ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో రూ.3.84 కోట్లు అదనంగా డ్రా అయ్యాయి. లోతుగా దర్యాప్తు జరిపితే ఎన్నికల కోణం బయట పడే అవకాశాలున్నాయి. -
సర్వం సిద్ధం
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ప్రాదేశిక ఎన్నికల నిర్వహణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు నిర్భయంగా ఓటేసేందుకు తగిన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. ఎవరైన శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఈ నెల 6వ తేదీన తొలి విడత, 11వ తేదీన మలి విడత ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశామన్నారు. ప్రాదేశిక ఎన్నికలను బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. ఎంపీటీసీ ఎన్నికల బ్యాలెట్ పేపర్లు గులాబీ రంగులో.. జెడ్పీటీసీ ఎన్నికల బ్యాలెట్ పేపర్లు తెలుపు రంగులో ఉంటాయన్నారు. ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్‌తో కలిసి శుక్రవారం ఆమె కలెక్టరేట్ సమావేశ మందిరంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రాదేశిక ఎన్నికల ఏర్పాట్ల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఓటు హక్కుపై ఓటర్లలో చైతన్యం పెంపొందించడం కోసం రూపొందించిన వీడియో సీడీ, సంకల్ప పత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో జేసీ శరత్, జెడ్పీ సీఈఓ ఆశీర్వాదం, డీపీఓ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థుల వాహనాలపై పరిమితి పోలింగ్ రోజు ఎంపీటీసీ అభ్యర్థులు ఒక వాహనాన్ని, జెడ్పీటీసీ అభ్యర్థులు రెండు వాహనాలకు మించి వినియోగించుకోరాదని స్పష్టం చేశారు. ఈ వాహనాల ఖర్చులు సైతం అనుమతించిన వ్యయపరిమితి లోబడి ఉండాలన్నారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. ఏదైన పోలింగ్ కేంద్రంలో అవాంఛనీ య కారణాలతో రీ-పోలింగ్ నిర్వహించాల్సి వస్తే పోలింగ్‌కు మరుసటి రోజే రీ-పోలింగ్ నిర్వహిస్తామన్నారు. ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన తేదీని సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి ఉంటుందన్నారు. అప్పటివరకు బ్యాలెట్ పెట్టెలను పోలీసుల సంరక్షణలో స్ట్రాంగ్ రూముల్లో భద్రపరుస్తామన్నారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఇప్పటివరకు రూ.2.20 కోట్ల నగదు ను తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. నగదు రవాణాకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతోనే ఈ నగదును సీజ్ చేశామన్నారు. తొలి విడత ఎన్నికలు జరగనున్న 24 మండలాల్లో ఈ నెల 4 ను ంచి 6వ తేదీ వరకు.. మలి విడత ఎన్నికలు జరిగే 22 మండలాల్లో ఈ నెల 9 నుంచి 11 వ తేదీ వర కు మద్యం, కల్లు విక్రయాలను నిలిపివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. మంచి నీటి సమస్యపై ఫిర్యాదు చేయండి : కలెక్టర్ విజ్ఞప్తి ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఏదైన ప్రాంతంలో తాగునీటి సమస్య ఉత్పన్నమైతే కలెక్టరేట్లో ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నంబర్ 800-8321666కు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కలెక్టర్ జిల్లా ప్రజలకు సూచించారు. పటిష్ట బందోబస్తు: ఎస్పీ ప్రాదేశిక ఎన్నికల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ వెల్లడించారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల నేపథ్యంలో 227 మొబైల్ పార్టీలను ఏర్పాటు చేసి శాంతిభద్రతలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. -
అసలు పోరు షురూ
నోటిఫికేషన్ జారీ ఏప్రిల్ 2 నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 2 నామినేషన్ల స్వీకరణకు ఆఖరి గడువు: ఏప్రిల్ 10 నామినేషన్ల ఉపసంహరణ ఏప్రిల్ 12 పోలింగ్ తేదీ ఏప్రిల్ 30 కౌంటింగ్, ఫలితాల ప్రకటన మే 16 సాక్షి, సంగారెడ్డి: మరో సమరానికి తెరలేవనుంది. సార్వత్రిక ఎన్నికలకు బుధవారం నగారా మోగనుంది. మెదక్, జహీరాబాద్ లోక్‌సభ స్థానాలతో పాటు జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల నిర్వహణకు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ నెల 2 నుంచి 9వ తేదీ వరకు పనిది నాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. శాసనసభ నియోజకవర్గాలకు పోటీచేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాలలోని రిటర్నింగ్ అధికారులకు తమ నామినేషన్లను సమర్పించాల్సి ఉంటుంది. మెదక్, జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్లను కలెక్టరేట్లో స్వీకరించనున్నారు. మెదక్ లోక్‌సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా కలెక్టర్, జహీరాబాద్ లోక్‌సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా జాయింట్ కలెక్టర్ డాక్టర్ శరత్ వ్యవహరించనున్నారు. గడువులోగా దాఖలైన నామినేషన్లను ఈ నెల 10వ తేదీన పరిశీలించనున్నారు. అనంతరం 12వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఈ నెల 30వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మే 16న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు. కొత్త పోలింగ్ కేంద్రాలు 271 గత సాధారణ ఎన్నికల సందర్భంగా జిల్లాలో 2,407 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. ఈసారి ఓటర్ల సంఖ్య పెరిగినందున అదనంగా 271 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే పోలింగ్ కేంద్రాల సంఖ్య 2,678కు పెరగనుంది. ఓటరుకు బ్రహ్మాస్త్రం ‘నోటా’ తొలిసారిగా ఈ ఎన్నికల్లో ఓటర్లు తిరస్కరణ(నోటా) ఓటును వినియోగించుకునే అవకాశాన్ని పొందనున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఒక్కరూ నచ్చకపోతే ఈవీఎంపై ఉండే ‘నోటా’ మీటను నొక్కి అందరినీ తిరస్కరించే వెసులుబాటును ఓటర్లు పొందనున్నారు. అయితే, ఈ ఎన్నికల సందర్భంగా జిల్లాలో వీవీ పాడ్(ఓట్ వెరిఫయబుల్ ప్రింట్ ఆడిట్ ట్రయల్) సౌకర్యాన్ని ఓటర్లకు కల్పించడం లేదని ఈవీఎంల నోడల్ అధికారి, డీఆర్వో దయానంద్ ‘సాక్షి’కి తెలిపారు. ఓటేసిన తర్వాత తమ ఓటు ఎవరికి పోలైందో తెలుసుకోడానికి ఓటరుకు ప్రింట్ రశీదు అందేలా ‘వీవీ పాడ్’ సౌకర్యం ఓటర్లకు కల్పించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. ఓటు నమోదుకు 9వ తేదీ వరకు జనవరి 31న ప్రచురించిన తుది ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో 21 లక్షల 36 వేల 348 మంది ఓటర్లున్నారు. ఇంకా ఓటరుగా నమోదు కాని వారు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లోని ‘ఫారం-6’ నింపి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోడానికి గత నెలాఖరు వరకు అవకాశం కల్పించారు. దీనికి ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువును పొడిగించినట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. అనంతరం కొత్త దరఖాస్తులపై విచారణ జరిపి అర్హులైన ఓటర్లతో అనుబంధ(సప్లిమెంటరీ) ఓటరు జాబితాను ప్రచురించనున్నారు. -
నరేన్.. మారరేం!
సాక్షి, సంగారెడ్డి: మెదక్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న చాగండ్ల నరేంద్రనాథ్ చుట్టూ కష్టాలు ముసురుకుంటున్నాయి. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నందున ఆయనపై చర్యలకు సిఫారసు చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్మితా సబర్వాల్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌కు గురువారం సాయంత్రం నివేదిక పంపించారు. రామాయంపేట, శంకరంపేట, మెదక్, గజ్వేల్, కౌడిపల్లి, సిద్దిపేట తదితర ప్రాంతాల్లో ఎన్నికల అధికారులు కొన్ని రోజు లుగా జరిపిన దాడుల్లో భారీ ఎత్తున గృహోపకరణాలు, క్రీడా సామగ్రి లభ్యమైంది. బీరువాలు, వీధి దీపాలు, డ్రమ్ములు, క్యారం బోర్డు లు, క్రికెట్ కిట్లు, వాలీబాల్ నెట్లు, వాచీలు తదితర వస్తువులు వీటిలో ఉన్నాయి. వీటి విలువ రూ.30 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదంతా ఓటర్లకు పంపిణీ చేసేందుకు నరేంద్రనాథ్ నిల్వ చేసినవేనని అనుమానిస్తున్నారు. దీనిపై వివరణ కోరుతూ ఆయనకు మూడు సార్లు కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. ఈ సరుకుతో తనకెలాంటి సంబంధం లేదని నరేంద్రనాథ్ తొలి రెండు నోటీసులకు జవాబు ఇచ్చుకున్నట్టు సమాచారం. ఎక్కడో ఓ చోట ఆయనకు సంబంధించిన సరుకు లభిస్తుండడంతో.. మిగిలిన నిల్వలను మంగళవారం సాయంత్రంలోగా బయటపెట్టాలని గడువు విధిస్తూ నరేంద్రనాథ్‌కు జిల్లా కలెక్టర్ మూడో నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుకు నరేంద్రనాథ్ గడువులోగా సమాధానం ఇవ్వలేదు. ఈ పరిణామాలను వివరిస్తూ జిల్లా కలెక్టర్ ఎన్నికల సంఘానికి నివేదికను పంపించారు. ఈసీ నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం నరేంద్రనాథ్‌పై చర్యలు తీసుకునే అవకాశముంది. సామగ్రి పట్టుబడిన విషయంలో ఇప్పటికే నరేంద్రనాథ్‌పై వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో ఏడు కేసులు నమోదయ్యాయి. ఓసారి ఆయన అరెస్టయి ఆ వెంటనే బెయిలుపై విడుదలయ్యారు కూడా. తాజాగా కలెక్టర్ తీసుకున్న నిర్ణయంతో ఆయన మరింత చిక్కుల్లో చిక్కుకున్నారు. ఎన్నికలకు ఏడాది ముందే ప్రజలకు పంపిణీ చేయడానికి మధ్యవర్తులకు సరుకును అప్పగిస్తే.. వారు పంపిణీ చేయకుండా దాచి పెట్టుకోవడంతోనే ఈ సమస్య వచ్చిందని నరేంద్రనాథ్ సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం. దీని మూలంగా సరుకు ఎవరి వద్ద ఉందో ఇప్పుడు చెప్పడం తనకు సాధ్యం కాదని ఆయన చేతులెత్తేసినట్లు ప్రచారం జరుగుతోంది. -
పోలింగ్ బూత్‌లో సెల్‌ఫోన్ నిషేధం
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: ఈ నెల 30న జరుగునున్న మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది సెల్ఫోన్లను వినియోగించరాదని కలెక్టర్ స్మి తా సబర్వాల్ తెలిపారు. బుధవారం మున్సిప ల్ సమావేశ మందిరంలో ప్రొసిడింగ్, అసిస్టెం ట్ ప్రొసిడింగ్ అధికారులకు ఈవీఎంల నిర్వాహణపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆమె హాజరై మాట్లాడారు. ఎన్నికల కమిషన్ తాజా ఆదేశాల మేరకు సెల్ఫోన్ల వినియోగా న్ని నిషేధించినట్లు తెలిపారు. పోలింగ్ కేం ద్రాల్లో విధులు నిర్వహించే పోలింగ్, అదనపు పోలింగ్ అధికారులకు మాత్రమే సెల్ఫోన్లు వినియోగించాలన్నారు. ఈవీఎంల బ్యాటరీ చార్జింగ్ విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏదైన ఇబ్బంది ఉంటే ఆర్ఓ(రిటర్నింగ్ ఎన్నికల అధికారి) సమాచారం అందించాలని సూచించారు. ఓటర్లను ఎవరైనా బెదిరించినట్లయితే తమకు సమాచారం అందించాలని సూచించారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చూడాలని సిబ్బందికి సూచించారు. తొలిసారిగా వెబ్‌కాస్టింగ్ పద్ధతి లో అన్ని పోలింగ్ కేంద్రాలను స్వయంగా తా ను పరిశీలిస్తానని చెప్పారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయకుండా పోలింగ్ అధికారి ఓటర్ లేని సమయంలో ఈవీఎం దగ్గరికి వెళ్లి పరిశీలించాలని సూచించారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చే జెడ్ క్యాటగిరీ ప్రముఖుల సెక్యురిటీ గార్డ్లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించవద్దని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్, ఎన్నికల అధికారి సాయిలుతో పాటు పోలింగ్ అధికారులు పాల్గొన్నారు. ఓటరుకు గుర్తింపు కార్డు తప్పనిసరి సదాశివపేట: ఎన్నికల్లో ఓటు వేసే ఓటరు తప్పనిసరిగా గుర్తింపుకార్డుతో పోలింగ్ కేంద్రానికి రావాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ సూచించా రు. బుధవారం సదాశివపేట మున్సిపల్ సర్వసభ్య సమావేశ మందిరం నిర్వహిస్తున్న ఎన్నికల అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఓటరు గుర్తింపు కార్డు లేదా రేషన్‌కార్డు, పాన్‌కార్డు, ఆధార్ కార్డులతో పాటు ప్రభుత్వం ప్రకటించిన గుర్తింపుకార్డుల్లో ఏదో ఒకటి తప్పని సరిగా తీసుకుని రావాలన్నారు. పట్టణంలో 29,255 మంది ఓటర్లు ఉన్నారని, పట్టణ పరి ధిలో 28 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేశామని, ఎన్నికలు ప్రశాం తంగా జరిగేలా సహకారించాలని కోరారు. -
ఎన్నికల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
సంగారెడ్డి క్రైం, న్యూస్‌లైన్: ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తూ ఫిర్యాదుల స్వీకరణ కేంద్రాలకు వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్మితా సబర్వాల్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. సాధారణ ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులు, పోలీసు అధికారులతో మంగళవారం ఆమె కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. సమావేశానికి ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్, జేసీ శరత్, ఏజేసీ మూర్తి, డీఆర్వో దయానంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేసే విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లాలో 2407 పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను ఈనెల 16లోగా పూర్తి చేసి నివేదికను ఎలక్షన్ వెబ్సైట్లో నిక్షిప్తం చేయాలన్నారు. ఈ సారి ఎన్నికల సంఘం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‌లో ‘పైన పేర్కొన్న వారు ఎవరూ కాదు’ అనే ఆప్షన్‌ను పొందుపర్చిందని, ఈ ఆప్షన్‌ను ప్రతి రిటర్నింగ్ అధికారి కార్యాలయాల వద్ద బ్యానర్ల ద్వారా ప్రదర్శించి ప్రచారం చేయాలన్నారు. పోలింగ్ కేంద్రానికి రెండు కిలోమీటర్లు దూరం ఉంటే అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఈనెల 16లోగా ప్రతిపాదనలు పంపాలని చెప్పారు. ఎన్నికల విధులకు గైర్హాజరయ్యే ఉద్యోగులను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఏ విధమైన కారణం లేకుండా ఎన్నికల విధులకు గైర్హాజరైన ఉద్యోగులపై ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి చర్యలు చేపట్టాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి, వ్యయ పరిశీలకులు 40 మంది ఎన్నికల సంఘం నుంచి జిల్లాకు వచ్చే అవకాశం ఉందని, జిల్లాలోని విశ్రాంతి గృహాలన్నింటినీ సంబంధిత రిటర్నింగ్ అధికారులు స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో ప్రతి అంశంపై ఎన్నికల సంఘం లిఖిత పూర్వక నిబంధనలు జారీ చేసిందని, ఏ అధికారి కూడా తమ సొంత విధానాలతో ఎన్నికల ప్రక్రియ చేపట్టవద్దని సూచించారు. శాసన సభా నియోజకవర్గాల వారీగా జోన్ రూట్‌మ్యాప్‌లను, పోలింగ్ కేంద్రాల టెలిఫోన్ నంబర్‌ఏర్పాటు, సంబంధిత అధికారి వివరాలను, రిటర్నింగ్ అధికారి కార్యాలయం, అధికారి చాంబర్ వివరాలు, రిసెప్షన్ సెంటర్, పంపిణీ కేంద్రం, టెంపరరీ స్ట్రాంగ్ రూమ్‌ల వివరాలను ఈనెల 20లోగా తయారు చేసి సమర్పించాలన్నారు. ప్రతిపోలింగ్ కేంద్రంలో వెబ్‌కాస్టింగ్‌పై ట్రయల్ రన్, వెబ్‌కాస్టింగ్ మైక్రో అబ్జర్వర్ వీడియో గ్రఫీని ఈనెల 20లోగా తయారు చేసి సమర్పించాలని సూచించారు. ప్రతి శాసన సభా నియోజకవర్గం వారీగా ఈనెల 13లోగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లాలోని సమస్యాత్మక, సున్నిత, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పోలింగ్ కేంద్రాలను గుర్తించి నివేదిక సమర్పించాలని జిల్లా ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ సూచించారు. పోలీసులు, అధికారులు సమన్వయంతో సమస్యాత్మక, సున్నిత పోలింగ్ కేంద్రాలను గుర్తించాలన్నారు. జిల్లాలో ఆయుధాల లెసైన్సులు, కొత్త ఆయుధాలకు లెసైన్సులు రెన్యువల్ చేయవద్దని సూచించారు. -
ఓటరు నమోదుకు చివరి అవకాశం
కలెక్టరేట్, న్యూస్‌లైన్:ఓటరు జాబితాలో పేర్లు లేని వారు నమోదు చేసుకోవడానికి చివరి అవకాశాన్ని కల్పిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు. ఆదివారం రోజు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ఫారం-6 ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చని సూచించారు. ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం ఆమె కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2,047 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల సంఘం రూపొందించిన నిబంధలను రాజకీయ పార్టీలు తప్పని సరిగా పాటించాలని సూచించారు. ఓటర్లకు లంచం ఇవ్వడం, ప్రలోభాలకు గురిచేయడం, ఇతరుల ఓట్లను వినియోగించుకునేందుకు వేరేవారు ఓటర్లుగా వ్యవహరించడం సరికాదన్నారు. పోలీసుల అనుమతి మేరకే ర్యాలీలు, సభలు నిర్వహించాలన్నారు. కోడ్‌ను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మెదక్ లోక్‌సభ నియోజకవర్గానికి కలెక్టర్, జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి జేసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారని తెలిపారు. నగదు తరలింపు విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, అవసరమైతే క్రిమినల్ కేసులు పెడతామన్నారు. అతిక్రమిస్తే కేసులు: ఎస్పీ ఎన్నికల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ హెచ్చరించారు. అతిక్రమించిన వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామన్నారు. పోలింగ్ బూత్‌లను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. సమావేశంలో జేసీ శరత్, ఏజేసీ మూర్తి, డీఆర్ఓ దయానంద్, వివిధ పార్టీల నాయకులు జగన్మోహన్రెడ్డి, గోపాల్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, నర్సింహారెడ్డి, రాజయ్య, దయానంద్‌రెడ్డి పాల్గొన్నారు. ఈవీఎం గోదాం పనుల పరిశీలన సమావేశం అనంతరం కలెక్టర్ స్మితా సబర్వాల్ పాత డీఆర్డీఏ కార్యాలయంలో నూతనంగా నిర్మిస్తున్న ఈవీఎం గోదాం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 17లోగా పనులు పూర్తి చేయాలని హౌసింగ్ పీడీ బాల్రెడ్డికి సూచిం చారు. జిల్లాకు దాదాపు 10 వేలకు పైగా ఈవీఎంలు వస్తున్నట్టు చెప్పారు. వీటిని భద్రపర్చేందుకు అవసరమైన ఏర్పాట్లు గోదాంలో ఉండాలన్నారు. కంట్రోల్ రూమ్ ప్రారంభం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు వీలుగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ స్మితా సబర్వాల్ శుక్రవారం ప్రారంభించారు. ఈ విభాగంలోని 08455-272525 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ సూచించారు. ఈ కంట్రోల్ రూమ్ 24 గంటలూ పనిచేస్తుందన్నారు. -
అంతర్జాతీయ మహిళా దినోత్సవం
ఆకాశంలో సగం.. అవకాశాల్లోనూ సగమంటూ.. మహిళాలోకం నినదిస్తోంది. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తోంది. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన అతివలు ఇపుడు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారు. అటు సమాజాభివృద్ధికి పాటుపడుతూ.. ఇటు కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. జిల్లాలో కలెక్టర్, ఎస్పీ తదితర అత్యున్నత పదవులను అలంకరించిన నారీమణులు జిల్లా అభివృద్ధిలో తమ ముద్ర వేస్తున్నారు. ఇక వ్యాపార, వ్యవసాయ రంగాలతో పాటు విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లోనూ ఇంతులంతా ఇంతింతై...అన్న చందంగా ఎదుగుతున్నారు. సాగు సలహాల్లోనూ మగువే తడ్కల్, న్యూస్‌లైన్: దేశాభివృద్ధికి వెన్నుముకగా నిలుస్తోన్న వ్యవసాయంలోనూ మగువలే ముందున్నారు. గ్రామీణ మహిళలు పురుషులతో పోటీ పడి వ్యవసాయ పనులు చేస్తుండగా, వ్యవసాయాధికారులుగా విధులు నిర్వర్తిస్తున్న వారు ఆధునిక వ్యవసాయం గురించి రైతులకు వివరిస్తూ సాగుకు సాయం చేస్తున్నారు. పంటలకు సోకే చీడ, పీడల బాధ నుంచి రైతులకు విముక్తులను చేస్తున్నారు. రైతులతో పాటు ధీటుగా వ్యవసాయ క్షేత్రాల్లో అలుపు లేకుండా తిరుగుతూ వ్యవసాయాభివృద్ధికి తోడ్పడుతున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో వ్యవసాయ శాఖలో కల్హేర్ ఏఓగా అరుణ, పెద్దశంకరంపేట ఏఓగా రత్న, కల్హేర్, కంగ్టి, మనూర్ వ్యవసాయ విస్తరణ అధికారులుగా స్వాతి, శ్రీదేవి, గీతలు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరితో పాటు రైతుల పొలాలను సందర్శించడానికి తరచుగా ైరె తు శిక్షణ కేంద్రం నుంచి ఏడీఏ రమాదేవి, ఏఓ మీనా వ్యవసాయంలో మేముసైతం... అంటూ సేవలు అందిస్తున్నారు. ఖేడ్ వ్యవసాయ కార్యాలయంలో సహాయకురాలిగా సైతం సరిత అనే మహిళ విధులు నిర్వర్తిస్తున్నారు. వీటన్నింటికీ మించి జిల్లా వ్యవసాయాధికారిగా ఉన్న ఉమామహేశ్వరి రైతులకు విలువైన సూచనలు, సలహాలు చేస్తూ సాగుకు సాయం చేస్తున్నారు. ఆ ఇద్దరూ రథ సారథులై.. కలెక్టర్, ఎస్పీల సమర్థ పాలన జిల్లా అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధించడానికి ఆ ఇద్దరూ రథసారథులై నడిపిస్తున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇద్దరూ మహిళే కావడం విశేషం. కలెక్టర్‌గా స్మితా సబర్వాల్ జిల్లా పాలనను సమర్థవంతంగా నిర్వహిస్తుండగా, ఇటీవల జిల్లాకు వచ్చిన జిల్లా ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ శాంతిభద్రతల పరిరక్షణలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం,ఆరోగ్యం, మహిళా సంక్షేమం, వ్యవసాయం, పారిశుధ్యం తదితర అంశాలపై కలెక్టర్ స్మితా సబర్వాల్ ప్రత్యేక దృష్టి సారించారు. అంతేగాక వైద్యం విషయంలో ‘మార్పు’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. పదవ తరగతి ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు సైతం విద్యార్థులకు సాయంత్రం వేళల్లో అల్పాహార కార్యక్రమాన్ని చేపట్టిన ఘనత కూడా రాష్ట్ర వ్యాప్తంగా మెదక్ జిల్లా కలెక్టర్‌కే దక్కింది. ఈ కార్యక్రమం అమలు కోసం సామాజిక భద్రత నిధి నుంచి ప్రతి విద్యార్థికి రూ.6 రూపాయలు కేటాయించారు. అలాగే జిల్లా ఎస్పీగా శెముషీ బాజ్‌పాయ్ నేతృత్వంలో జిల్లాలో శాంతిభద్రతలు ప్రశాంతంగా ఉన్నాయి. రానున్న ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆమె ఇప్పటికే జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించారు. జిల్లాలో నెలకొన్న శాంతిభద్రతల పరిరక్షణ గురించి తెలుసుకున్నారు. డివిజన్ల వారీగా సంబంధిత పోలీసు అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ఇప్పటి నుంచే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. వీరిద్దరూ ఉత్తమ సేవలందిస్తూ జిల్లాలోని మహిళల్లో స్ఫూర్తి నింపుతున్నారు. స్వశక్తితో ఎదగాలి మహిళా దినోత్సవ సభలో కలెక్టర్ కలెక్టరేట్, న్యూస్‌లైన్: స్వశక్తిపై ఆధారపడి సమాజంలో గౌరవనీయమైన స్థానానికి చేరుకోవాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ మహిళా ఉద్యోగులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో టీఎన్జీఓల ఆధ్వర్యంలో ప్రపంచ మహిళ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దశాబ్దం క్రితం నాటికి ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయన్నారు. బాలికలపై గతంలో మాదిరిగా వివక్షలేద న్నారు. చిత్తశుద్ధితో విధులు నిర్వహించడంలో మహిళలే ముందున్నారని పేర్కొన్నారు. మహిళా సాధికారతకు ప్రత్యేక కృషి చేస్తున్నట్టు తెలిపారు. టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు రాజేందర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మనోహర పాల్గొన్నారు. వివిధ పోటీల్లో గెలుపొందిన మహిళా ఉద్యోగులకు కలెక్టర్ జ్ఞాపికలు అందజేశారు. -
మున్సిపోల్స్‌కు సర్వం సన్నద్ధం
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికలకు జిల్లా వ్యాప్తంగా 179 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు. గురువారం రాష్ర్ట ఎన్నికల కమిషన్ రమాకాంత్‌రెడ్డి మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాలో చేపట్టినఏర్పాట్లపై కలెక్టర్ వివరించారు. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలు ఉన్నాయని, 145 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించడానికి 179 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రమాకాంత్‌రెడ్డికి కలెక్టర్ వివరించారు. పోలింగ్ కేంద్రాలను కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. మున్సిపల్ పరిధిలో ఉన్న ఓటర్ల వివరాలను ఈనెల 7న మరోసారి ప్రకటిస్తామని, పోలీసు సిబ్బంది నియామకంపై ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. పోలింగ్‌కు ఐదు రోజుల ముందుగా ఓటరు స్లిప్పుల పంపిణీకి చర్యలు తీసుకున్నామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల జోనల్ బాధ్యతను గెజిటెడ్ అధికారులకే ఇస్తున్నామనీ, వీరికి మెజిస్ట్రీయల్ అధికారాలు కూడా కల్పించామని కలెక్టర్ వెల్లడించారు. ఎన్నికల నియమావళిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను నియమించామని, ఈ బృందాలు ఇప్పటికే వివిధ పార్టీల హోర్డింగ్‌లు, బ్యానర్లు, వాల్‌రైటింగ్‌లు తొలగిస్తున్నాయన్నారు. బెల్ట్ షాప్‌లు మూసివేయాలని ఆదేశించినట్లు చెప్పారు. సమావేశంలో ఎస్పీ శెముషీ, డీఆర్ఓ దయానంద్తోపాటు మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఎన్నికల తర్వాత బదిలీ
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: డీఈఓబదిలీ వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఎన్నికలు ముగిసిన తరువాత రమేష్‌ను జిల్లా నుంచి రిలీవ్ చేస్తామని కలెక్టర్ స్మితా సబర్వాల్ ఉపాధ్యాయ సంఘాలకు హామీ ఇచ్చారు. డీఈఓను బదిలీ చేయాలని, లేకుంటే ఎన్నికల విధులు బహిష్కరిస్తామని బుధవారం ఉపాధ్యాయ సంఘాల నేతలు కలెక్టర్‌కు అల్టిమేటం ఇచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో గురువారం ఆమె పీఆర్టీయూ నాయకులు సత్యనారాయణరెడ్డి, లక్ష్మణ్, యూటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మారెడ్డి, సాయిలు, తదితరులతో చర్చలు జరిపారు. అనంతరం ఉపాధ్యాయ సంఘాల నేతలే ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. తాము డీఈఓ అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేయగా, అందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. డీఈఓపై వచ్చిన ఆరోపణల గురించి త్వరలోనే విచారణ జరిపి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు ప్రకటనలో వెల్లడించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకే డీఈఓ రమేష్‌ను కొనసాగిస్తున్నట్లు ఆమె వెల్లడించారనీ, ఎన్నికలు ముగిసిన వెంటనే ఆయన్ను రిలీవ్ చేస్తామని కలెక్టర్ స్పష్టం చేసినట్లు ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఉపాధ్యాయుల సమస్యలపట్ల కూడా కలెక్టర్ సానుకూలంగా స్పందించి పరిష్కరించేందుకు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. -
తిరుగుబాటు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: డీఈఓ రమేష్ బదిలీ... మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయాలు ఊపందుకున్న ఈ సమయంలోనూ రమేష్ బదిలీ వ్యవహారమే తీవ్ర చర్చనీయాంశమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను బదిలీ చేయగా... రిలీవ్ చేసేది లేదని జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ గత నెలలో తేల్చిచెప్పారు. అయితే తాజాగా ఉపాధ్యాయ సంఘాలు ఆమెపై తిరుగుబాటు అస్త్రాన్ని సంధించాయి. రమేష్‌ను బదిలీ చేయకపోతే ఎన్నికల విధులను బహిష్కరిస్తామంటూ ఎనిమిది ఉపాధ్యాయ సంఘాలు జిల్లా కలెక్టర్‌కు అల్టిమేటం జారీ చేశాయి. ఈ మేరకు గురువారం ఆయా ఉపాధ్యాయ సంఘాల నేతలు జిల్లా కలెక్టర్‌కు ఒక లేఖ అందజేశారు. రోజుకో మలుపు డీఈఓ రమేష్‌ను బదిలీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆయన్ను బదిలీ చేస్తూ ఫిబ్రవరి 12 రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ఒంగోలు డీఈఓ రాజేశ్వర్‌రావును నియమించింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రంగప్రవేశం చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఆయన్ను రిలీవ్ చేయలేమని, పైగా పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ఆయన్ను బదిలీ చేయడం కుదరదని కలెక్టర్ తేల్చిచెప్పారు. మార్చి 3 తేదీ వరకు ఆయన ఎన్నికల విధుల్లో ఉంటారని ఆ తర్వాత బదిలీ విషయం పరిశీలిస్తామని చెప్పారు. ఇదే విషయాన్ని కలెక్టర్ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి, ఎన్నికల కమిషన్‌కు లేఖ కూడ రాశారు. ఇక డీఈఓ బదిలీ దాదాపుగా ఆగిపోయిందనుకుంటున్న సమయంలో అనూహ్యంగా మళ్లీ డీఈఓ బదిలీ వ్యవహారం తెర మీదకు వచ్చింది. డీఈఓను బదిలీ చేయాల్సిందేనని పట్టుబడుతున్న ఉపాధ్యాయ సంఘాల నేతలు ఈ సారి ఆయనపై అవినీతి ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఓ లేఖను వారు జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. లేఖలో పేర్కొన్న అంశాలు నెలవారీ పదోన్నతుల ప్రక్రియ సరిగా నిర్వహించలేదనీ, కార్యాలయంలో సిటిజన్ చార్టును కూడా అమలు చేయడం లేదని ఉపాధ్యాయ సంఘాలు కలెక్టర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. సీనియార్టీ జాబితాను ఎప్పటికప్పుడు ప్రకటించకుండా దాచి పెడుతున్నారని వివరించారు. అంతేకాకుండా అక్రమంగా డిప్యుటేషన్లకు డీఈఓ తెరలేపారని, ప్రైవేట్ పాఠశాలలకు అనుమతులు ఇవ్వడంలోనూ అక్రమాలు జరిగాయని ఉపాధ్యాయ సంఘాల నేతలు పేర్కొన్నారు. అంతేకాకుండా అనుమతి లేని పాఠశాలలు నడుస్తున్నట్లు డీఈఓకు సమాచారం వచ్చినా.. కొన్ని పాఠశాలల విషయంలో చూసీచూడనట్టుగా వ్యవహరించారని వారు లేఖలో ఆరోపించారు. ఉపాధ్యాయ సంఘాల మధ్య విభేదాలు సృష్టిస్తూ కొన్ని సంఘాలను ప్రోత్సహిస్తున్నారని, ఉమ్మడి పరీక్ష నిర్వహణకు ఖర్చు చేయాల్సిన నిధులు కార్యాలయ ఆధునికీకరణ పనులకు డీఈఓ అక్రమంగా వినియోగించారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపించాయి. వీటిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ వారు కలెక్టర్‌కు లేఖ అందజేశారు. అయితే ఆరోపణలు కాకుండా తగిన ఆధారాలు తీసుకొని వస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఉపాధ్యాయులకు చెప్పి పంపించినట్లు సమాచారం. -
లక్ష్యం సాధించి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో 20 సూత్రాల పథకం అమలులో లక్ష్యం సాధించి జిల్లాను రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలపాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లో 20 సూత్రాల పథకం పురోగతిపై ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గృహ నిర్మాణం, అంగన్వాడీ మినహా మిగిలిన అన్ని శాఖలు పురోగతిలో ఉన్నాయన్నారు. ఇందిరా ఆవాస్‌యోజన కింద చేపట్టిన 900కు పైగా ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మినీ అంగన్వాడీ భవనాల నిర్మాణ పనులకు ఇప్పటికే మంజూరు తీసుకున్నా పనులు పూర్తి చేయకపోవటంపై ఐసీడీఎస్ పీడీ శైలజపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో సీపీఓ గురుమూర్తి, డీఆర్డీఏ , డ్వామా, హోసింగ్ పీడీలు రాజేశ్వర్‌రెడ్డి, రవీందర్, బాల్‌రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ విజయప్రకాశ్ పాల్గొన్నారు. నిర్వాసితులకు నెలలోగా పట్టాలు దుండిగల్ వైమానిక దళ అకాడమీలో ఓపెన్ టెస్టు రేంజ్ ఏర్పాటుతో నిర్వాసితులవుతున్న దాచారం, దరుగుల్ల గ్రామ ప్రజలకు ఈనెలాఖరులోగా ఇళ్ల స్థలాలు అందజేస్తామని కలెక్టర్ స్మితా సబర్వాల్ భరోసా ఇచ్చారు. నెలాఖరులోగా నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు అందజేసేలా చూస్తామన్నారు. బుధవారం కలెక్టర్ చాంబర్లో నిర్వాసితుల పునరావాస కల్పనపై సమీక్ష సమావేశం జరిగింది. కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జేసీ శరత్, భూ సేకరణ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దుండిగల్ సమీపంలో కేంద్ర రక్షణ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఓపెన్ టెస్టు రేంజ్ ఏర్పాటు చేస్తోందన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో భూములు, ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులకు మండల పరిధిలోని కిష్టాయపల్లిలో 35 ఎకరాల భూమి గుర్తించి పునరావాసం కల్పించేందుకు గతంలోనే నిర్ణయించినట్లు చెప్పారు. పునరావాసం, పరిహారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.14.40 కోట్లు విడుదల చేసిందన్నారు. జాతీయ పునరావాస పథకం కింద రూ.7.20 కోట్లు మంజూరైనట్లు కలెక్టర్ చెప్పారు. రెండు గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి 350కు పైగా నిర్వాసిత కుటుంబాలను గుర్తించినట్లు తెలిపారు. 191 పక్కా కట్టడాలను గుర్తించామని వాటికి నష్టపరిహారం అందజేస్తామన్నారు. ప్రాజెక్టు ద్వారా నష్టపోతున్న 175 కుటుంబాలకు రూ.3.09 కోట్లు ఆర్ఆర్ ప్యాకేజీ కింద అందించేందుకు మెదక్ ఆర్డీవో ప్రతిపాదించినట్లు తెలిపారు. ప్లాట్ల కేటాయింపు, మార్కింగ్ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆర్డీవోను ఆదేశించారు. సమావేశంలో మెదక్ ఆర్డీవో వనజాదేవి, రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ డిప్యుటేషన్లపై కలెక్టర్ ఆగ్రహం
సంగారెడ్డి అర్బన్, న్యూస్‌లైన్: డీఎంహెచ్ఓ కార్యాలయంలో అక్రమ డిప్యుటేషన్ల హవా శీర్షికన సాక్షి దినపత్రికలో వెలువడిన కథనానికి కలెక్టర్ స్మితా సబర్వాల్ స్పందించారు. మంగళవారం ఇన్చార్జ్ డిఎంహెచ్ఓ డాక్టర్ పద్మను ఏజేసీ మూర్తి సమక్షంలో విచారణకు ఆదేశించారు. పీహెచ్సీలో పనిచేస్తున్న ఉద్యోగులు జిల్లా కార్యాలయంలో దర్శనమివ్వడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు విధులకు హాజరుకాకుండా పైరవీలేమిటని ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో కార్యాలయ పనుల నిమిత్తం మాత్రమే జిల్లా కేంద్రానికి వస్తున్నారని డీఎంహెచ్ఓ కలెక్టర్‌కు వివరణ ఇచ్చారు. కాగా డిప్యుటేషన్లపై కేవలం ఇద్దరు (వాచ్మెన్, ఇమ్యునైజేషన్ సిబ్బంది) మాత్రమే పనిచేస్తున్నారని డీఎంహెచ్ఓ తెలిపారు. కానీ వాస్తవంగా ఆమె పేర్కొంటున్న వివరాలకు పొంతన లేకుండా ఉంది. ఉద్యోగుల తరఫున వత్తాసు పలుకుతున్నట్టు స్పష్టమవుతోంది. అంతేగాక నిబంధనల మేరకే డిప్యుటేషన్లపై పనిచేస్తున్నారని చెప్పారు. కొత్తవారినెవరిని తీసుకోలేదన్నారు. రికార్డుల ప్రకారం పుల్కల్ పీహెచ్సీ నుంచి పెంటయ్య ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖలో ఎల్డీ కంప్యూటర్‌గా, ఆంజనేయులు ఎంఎన్ఓగా జగదేవ్‌పూర్ పీహెచ్సీలో పనిచేయాల్సి ఉండగా ఎపడమిక్ సెల్లో ఆఫీస్ సబార్డినేట్‌గా, ప్రేమ్‌సాగర్ తూప్రాన్ పీహెచ్సీలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేయాల్సి ఉండగా డీఎంహెచ్ఓ సీసీగా పనిచేస్తున్నారు. ఎంపీహెచ్‌ఓగా కొండాపూర్ పీహెచ్సీలో పనిచేయాల్సిన ఫయీం మలేరియా శాఖలో, తాజుద్దీన్ వెల్దుర్తి పీహెచ్సీలో ఎంపీహెచ్‌ఓగా పనిచేయాల్సి ఉండగా మలేరియా శాఖలో పనిచేస్తున్నారు. -
సీఎస్ఆర్ నిధులతో సామాజిక కార్యక్రమాలు
కలెక్టరేట్, న్యూస్‌లైన్: కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఇప్పటివరకు జిల్లాలో రూ.3.87 కోట్లు సేకరించినట్లు కలెక్టర్ స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. జిల్లాలోని పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థలు తమ ఆదాయంలో 1 నుంచి 5 శాతం నిధులను సామాజిక సేవా కార్యక్రమాల కింద ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. ఈ పథకం గత కొన్నేళ్లుగా జిల్లాలో అమలు కావడంలేదు. ఏ ఒక్క పరిశ్రమ యాజమాన్యం, కార్పొరేట్ సంస్థ అధికార యంత్రాంగానికి పీఎస్ఆర్ నిధులను అందించలేదన్నారు. ఈ పథకంపై దృష్టి సారించి జిల్లాలోని పరిశ్రమలకు నోటీసులు జారీ చేయడంతో రూ.3.87 కోట్లు సమకూరినట్లు తెలిపారు. ఇందులో భాగంగా శనివారం బహుళ జాతి సంస్థకు చెందిన అల్లానా పరిశ్రమ డెరైక్టర్ సీకే తోట రూ.20లక్షల చెక్కును కలెక్టర్‌కు అందజేశారు. ఈ నిధులతో విద్య,వైద్య రంగాలకు ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఇప్పటికే రక్తహీనత, పోషకాహార లోపంతో ఉన్న గర్భిణుల కోసం ఏర్పాటు చేసిన హైరిస్క్ కేంద్రాలకు ఈ నిధులు ఉపయోగిస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. సంక్షేమ వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు, అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సాయంత్రం వేళ అల్పాహారం కోసం ఈ నిధులను వెచ్చిస్తున్నట్టు చెప్పారు. నిధుల వినియోగాన్ని కమిటీ నిర్ణయిస్తుందన్నారు. జిల్లా నుంచి సీఎస్ఆర్ కింద రూ.41 కోట్లు రావాల్సి ఉందని, మిగిలిన మొత్తాన్ని త్వరలోనే రాబట్టి జిల్లా సంక్షేమానికి వినియోగిస్తామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జేసీ శరత్, సీపీఓ గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
మోడల్ కాలనీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు
చేగుంట, న్యూస్‌లైన్: మోడల్ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని కలెక్టర్ స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. బుధవారం చేగుంటలో కలెక్టర్ చేతుల మీదుగా మోడల్ కాలనీ లబ్ధిదారులు పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేగుంటలో నిరుపేదలకు ఇండ్ల స్థలాలు అందించడం, లబ్ధిదారులు సర్టిపికెట్లకన్నా ముందుగా ఇండ్ల నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు. మోడల్ కాలనీ ఏర్పాటుకు ఎమ్మెల్యే ముత్యంరెడ్డి చేస్తున్న కృషిని కలెక్టర్ అభినందించారు. కాలనీలో అంతర్గత రోడ్లు విద్యుత్ సౌకర్యం తదితర వసతుల కల్పనకు ప్రత్యేక నిధులు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మోడల్ కాలనీలో వాటర్ ట్యాంకు నిర్మాణానికి, షాదీఖానా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వందశాతం ఉత్తీర్ణత సాదించండి పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించి గ్రామం పేరు నిలబెట్టాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ రాంపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సూచించారు. పదోతరగతి పరీక్షల కొసం విద్యార్థులు చదువుతున్న తీరును అడిగితెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు బెంచీలు, క్రీడా సామాగ్రి అందించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వనజాదేవి, డీఎఫ్ఓ సుధాకర్‌రెడ్డి, డీఈఓ రమేశ్, తహశీల్దార్ వెంకన్న పాల్గొన్నారు. -
పథకాల అమలుపై అవగాహన తప్పనిసరి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ‘మీరు గ్రామాల పాలకులు.. ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమం గురించి మీకు తెలిసి ఉండాలి. సంక్షేమ పథకాల అమలుపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలి. అప్పుడే ఆ ఫలాలు అర్హులకు అందుతాయి’ అని కలెక్టర్ స్మితా సబర్వాల్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో మెదక్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు జీఓ 10లోని 25 అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల సమగ్రాభి వృద్ధికి సర్పంచ్‌లు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం ద్వారా వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు గ్రామాల్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నందున వాటిపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. స్కోర్ కార్డు అనే ప్రత్యేక వెబ్సైట్ ద్వారా గ్రామం ఏ ర్యాంకులో ఉందో తెలుసుకోవచ్చన్నారు. ఇతర గ్రామాల్లో అమలవుతున్న విధానాలను గుర్తించడంతోపాటు మన గ్రామంలోనూ ఎలాంటి చర్యలు చేపట్టవచ్చో తెలుసుకునేందుకు వీలుకలుగుతుందన్నారు. వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుంటే ప్రభుత్వం నిర్మల్ గ్రామంగా గుర్తించి రూ.20 లక్షలు విడుదల చేస్తుందన్నారు. ఈ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చన్నారు. ఉపాధి హమీలో కూలీల సంఖ్యను పెంచాలని సూచించారు. ‘మార్పు’ కార్యక్రమం కింద ఎస్‌హెచ్‌జీ సమావేశాల్లో గర్భిణుల నమోదు, మాతాశిశు మరణాల రేటు తగ్గించడంలో సహకరించాలన్నారు. ఈ సదస్సులో జడ్పీ సీఈఓ ఆశీర్వాదం, డీపీఓ ప్రభాకర్‌రెడ్డి, హౌసింగ్ పీడీ బాల్‌రెడ్డి, డ్వామా పీడీ రవీందర్, డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు
కలెక్టరేట్, న్యూస్‌లైన్: కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన మేరకు పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ఆర్డీఓ, తహశీల్దార్లపై ఉందని కలెక్టర్ స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఆమె అధికారులతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ సూచన మేరకు పోలింగ్ కేంద్రాల్లో ఈనెల 28 లోగా ర్యాంప్‌లు, విద్యుత్ ఏర్పాటు చేయాలన్నారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చెక్‌లిస్ట్ ఆధారంగా అన్ని పనులు సకాలంలో పూర్తి చేసేలా పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఇంజినీర్లతో సమన్వయమయ్యేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలను నిర్వహిస్తే ఆ నివేదికలను కలెక్టరేట్‌కు అందజేయాలని సూచించారు. మెదక్ ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ నెల రోజుల వ్యవధిలో కేవలం రెండు ర్యాంప్‌లు మాత్రమే నిర్మాణం చేపట్టడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా వాటిని ఈనెల 28లోగా పూర్తి చేయాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. లబ్ధిదారులకు రుణాలు వెంటనే ఇవ్వాలి వివిధ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పన కింద ఆర్థిక సాయం అందించేందుకు లబ్ధిదారుల జాబితాను ఈ నెల 28లోగా అందజేయాలని ఎంపీడీఓలను కలెక్టర్ ఆదేశించారు. జీఓ 101 ప్రకారం మిగిలిపోయిన వారి జాబితాను మండల కమిటీ ద్వారా రూపొందించి సకాలంలో అందజేయాలన్నారు. కులం, నివాసం, ఆదాయ విషయాల్లో ఏవైనా సమస్యలుంటే స్థానిక తహశీల్దార్లను సంప్రదించి జాప్యం లేకుండా సరిచేసుకోవాలన్నారు. బ్యాంకర్ల సమావేశంలో వారికి లక్ష్యాలను నిర్దేశించామని, ఆ మేరకు రుణాలు మంజూరయ్యేలా చూడాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవన్నారు. భూమి కొనుగోలు పథకం కింద ప్రతి మండలంలో కనీసం ఆరు ఎకరాల భూమి కొనుగోలు చేయాలని, ఆ ప్రతిపాదనలను వెంటనే పంపాలని సూచించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు రాజేశ్వర్‌రెడ్డి, రవీందర్, దయానంద్, చరణ్‌దాస్, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. న్యాయ సలహా కేంద్రం ప్రారంభం కలెక్టరేట్: నిరుపేదలు, మహిళలకు న్యాయపరమైన సలహాలు, పరిష్కార మార్గాలు అందించేందుకు కలెక్టరేట్ కార్యాలయంలో న్యాయ సహాయ సలహా కేంద్రాన్ని సోమవారం కలెక్టర్ స్మితా సబర్వాల్ ప్రారంభించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో డీఆర్డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం రాష్ట్రంలోనే మొదటిదని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో నిరుపేదలు న్యాయపరమైన సమస్యలు, కుటుంబ సమస్యలపై కలెక్టరేట్‌ను ఆశ్రయిస్తున్నారన్నారు. వీరికి సలహాలు, సూచనలు అందజేయడానికి ఈ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి గురువారం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కేంద్రం పనిచేస్తుందన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కనకదుర్గ మాట్లాడుతూ కేంద్రానికి వచ్చే ఫిర్యాదులపై న్యాయవాదుల ఆధ్వర్యంలో న్యాయ సలహా, కౌన్సెలింగ్ ఇప్పిస్తామన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా సమైక్య అధ్యక్షురాలు సునీత తదితరులు పాల్గొన్నారు. -
మాతృభాషను గౌరవించాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: మాతృభాషను గౌరవించాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ సూచించారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవా న్ని పురస్కరించుకుని కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం జరి గిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలో ఐదో భాషగా గుర్తిం పు పొందిన తెలుగు ప్రస్తుతం నిరాదరణకు గురవుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. భాషను సంరక్షించేందుకు పాటుపడుతున్న సాహితీ కళాకారులు, కవులు, రచయితలకు ధన్యవాదాలు తెలిపారు. తాను బెంగాళీనైనా తెలుగును ఇష్టంతో కష్టపడి నేర్చుకున్నట్టు చెప్పారు. జిల్లా యంత్రాంగం కూడా ప్రజలకు అర్థమ య్యేలా, సులభంగా ఉండే విధంగా స్థానిక భాషల్లోనే సమాచారం అందించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. జేసీ డా.ఎ.శరత్ మాట్లాడుతూ మాతృభాషపై అలసత్వం వహిస్తే తల్లిని మర్చినట్లేనని అన్నారు. విలువలకు పునరజ్జీవనం, ప్రేరణ పొందాలంటే మాతృభాషను ప్రేమించాలన్నారు. అనంతరం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువైన వేలేటి మృత్యుంజయశర్మను శాలువా, పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మృత్యుంజయ శర్మ మాట్లాడుతూ భాషా పరిరక్షణ పేరుతో ఉద్యమం నిర్మించుకోవాల్సిన పరిస్థితి దాపురించడం బాధాకరమన్నారు. అధికారికంగా భాషను వినియోగించుకొనేందుకు కృషిచేయాలని కోరారు. చిన్నారులకు మాతృభాష నేర్పించడంతో పాటు విలువలను నేర్పినపుడే భాష పరిరక్షణ సాధ్యమన్నారు. అంతకుముందు తెలు గు భాష పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు బోర్పట్ల హనుమంతాచారి మాట్లాడుతూ భాష సంరక్షణ కోసం యం త్రాంగం చొరవ తీసుకోవడంతో పాటు ఉత్తర, ప్రత్యుత్తరాలు మాతృభాషలో జరిగేలాచూడాలన్నారు. అనంతరం మా తృభాష అంశాలపై నిర్వహించిన పోటీ ల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేయగా, ఉత్తమ ఉపాధ్యాయులు శ్రీపాద బాలాజీ, పరమేష్,వి.రాజయ్యలను సన్మానం చేశారు. ఈ సమావేశంలో డీఈఓ రమేష్ పాల్గొనగా వ్యా ఖ్యాతగా భానుప్రకాష్ వ్యవహరించారు. అంతకుముందు సరస్వతీ శిశు మందిర్ విద్యార్థులు ప్రార్థనాగీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. -
‘ఇందిర జలప్రభ’తో ఎస్సీ, ఎస్టీ భూముల అభివృద్ధి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఇందిర జలప్రభ (ఐజేపీ) కింద జిల్లాలో ఎస్సీ, ఎస్టీ భూములు అభివృద్ధి చేసి మార్చి నెలాఖరు నాటికి 10 వేల ఎకరాలను సాగులోకి తెస్తామని కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు. శుక్రవారం సమీకృత కలెక్టరేట్లోని అడిటోరియంలో సంగారెడ్డి రెవెన్యూ డివిజన్లోని సర్పంచులకు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఓలకు జీవో నం. 10లోని 25 అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఐజేపీ కింద ఎంపికైన బ్లాక్‌ల లో ఈ నెల చివరి నాటికి 5వేల ఎకరాలను సాగులోకి తెచ్చేలా పనులను వేగవంతం చేస్తామన్నారు. ట్రాన్స్‌కో, ఉద్యాన శాఖ ద్వారా మొక్కలు, ఎపీఎంఐపీ ద్వారా బిందుసేద్యం, బోరు మోటార్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సంగారెడ్డి మండలం ఎర్ధనూర్, నర్సాపూర్ మండలం గోమార్ గ్రామాలు ఐకేపీ కింద ఉన్నాయన్నారు. కోహీర్ మండలంలోని కేవలం 6 గ్రామాలు మాత్రమే ఐజేపి కింద ఎంపిక చేశారని ఆ మండల పరిధిలోని వివిధ గ్రామల సర్పంచులు కలెక్టర్ దృష్టికి తేగా ఏపీడీల ద్వారా ప్రతిపాదనలు పంపాల్సిందిగా కలెక్టర్ సూచించారు. న్యాల్కల్ మండలం టేకూర్ గ్రామంలో వాటర్‌షెడ్ పథకం చేపట్టి భూగర్భ జలాలు పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ అధికారుల దృష్టికి తెచ్చారు. మనూర్ మండలం కారముంగిలో ఐజేపీ కింద 100 ఎకరాలను గుర్తించామని మార్చి నాటికి దానిని పూర్తి అభివృద్ధిలోకి తేస్తామని కలెక్టర్ తెలిపారు. వ్యక్తి గత మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం చేయండి గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించేందుకు నిర్దేశించిన వ్యక్తి గత మరుగుదొడ్ల నిర్మాణాన్ని 100 శాతం పూర్తి చూస్తే నిర్మల్ భారత్ అభియాన్ పథకం కింద ప్రతి గ్రామానికి రూ. 20 లక్షల నిధులు వస్తాయని సర్పంచ్‌లకు సూచించారు. వీటి ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించుకోవచ్చన్నారు. సదస్సులో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ విజయ్ ప్రకాశ్, హౌసింగ్ పీడీ బాల్‌రెడ్డి, పశుసంవర్థక శాఖ జేడీ లకా్ష్మరెడ్డి, డీపీఓ ప్రభాకర్‌రెడ్డి, డ్వామా పీడీ రవీందర్, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 37 కోట్ల వ్యయంతో 42 ఎకరాల అభివృద్ధి సంగారెడ్డి రూరల్ : ఇందిర జల ప్రభ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీలకు చెందిన బీడు భూములను అభివృద్ధి చేస్తామని కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు. సంగారెడ్డి మండలం ఎర్దనూర్ శివార్లో ఇందిర జల ప్రభ బ్లాక్‌లను శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రామంలో ఒకే ప్లాట్‌గా ఉన్న 42 ఎకరాలను అభివృద్ధి చేసేందుకు రూ.37.72 కోట్ల వ్యయంతో బోరుబావుల తవ్విస్తున్నట్లు ఆమె వివరించారు. ఎర్దనూర్‌లో ఇందిర జలప్రభ బ్లాక్‌లో 26 మంది లబ్దిదారులు ఉండగా, వీరిలో 24 మంది ఎస్సీలు కాగా, మిగతా ఇద్దరు గిరిజనులని తెలిపారు. ప్రస్తుతం 18 ఎకరాల భూమిలో నాలుగు బోరుబావులు ఏర్పాటు చేశామన్నారు. ఈ భూముల్లో సూక్ష్మ బిందుసేద్యం ద్వారా పంటలు సాగు చేసేందుకు రైతులకు పరికరాలను కూడా అందజేస్తున్నట్లు వివరించారు. -
నేనేం చేయలేను
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: ‘‘నేను ఆయన్ను(డీఈఓ రమేష్)ను ఇంకా రిలీవ్ చేయలేదు.. అలాంటప్పుడు మీకు ఎలా బాధ్యతలు అప్పగిస్తాను. అయినా ఎన్నికల విధుల్లో ఉన్న డీఈఓ రమేశ్‌ను ఇక్కడి నుంచి పంపడం నా పరిధిలో లేదు. అదంతా ఎన్నికల కమిషన్ చూసుకుంటుంది. అంతవరకూ మీ విషయంలో నేనేం చేయలేను’’ విధుల్లో చేరడానికి వచ్చిన కొత్త డీఈఓ రాజేశ్వర్‌రావుతో కలెక్టర్ స్మితా సబర్వాల్ అన్న మాటలివి. తొలినుంచీ డీఈఓ రమేష్ బదిలీ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్ స్మితా సబర్వాల్ తన పంథాను ఏ మాత్రం మార్చుకోలేదు. రమేష్‌ను ఇక్కడనుంచి పంపే అవకాశమే లేదంటూ మరోసారి తేల్చిచెప్పారు. ప్రకాశం జిల్లా డీఈఓగా పనిచేస్తున్న రాజేశ్వర్‌రావును మెదక్ జిల్లా డీఈఓగా బదిలీ కావడంతో బాధ్యతలు స్వీకరించేందుకు బుధవారం కలెక్టర్ వద్దకు రాగా ఆమె జాయిన్ చేసుకునేందుకు నిరాకరించారు. ప్రస్తుత డీఈఓ రమేష్‌ను రిలీవ్ చేయలేదనీ, అందువల్ల మీకు బాధ్యతలు అప్పగించలేనని రాజేశ్వర్‌రావుకు కలెక్టర్ స్మితాసబర్వాల్ స్పష్టం చేశారు. దీంతో ఏంచేయాలో అర్థం కాక కొత్త డీఈఓ తలపట్టుకుంటున్నారు. డీఈఓగా విధులు నిర్వహిస్తున్న రమేశ్‌ను విద్యాశాఖ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేస్తూ ఈ నెల 12న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ప్రకాశం జిల్లా విద్యాశాఖాధికారి రాజేశ్వర్‌రావును నియమించారు. ఈ మేరకు 18న ప్రకాశం జిల్లా నుంచి రిలీవ్ అయిన రాజేశ్వర్‌రావు బుధవారం మెదక్ డీఈఓగా విధుల్లోకి చేరేందుకు బుధవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్‌కు వచ్చారు. ముందుగా కలెక్టర్ స్మితా సబర్వాల్‌ను ఆమె చాంబర్లో కలవగా, బాధ్యతలు అప్పగించేందుకు కలెక్టర్ పూర్తిగా నిరాకరించారు. డీఈఓ రమేష్‌ను రిలీవ్ చేసేంతవరకు వేచి ఉండాలంటూ కలెక్టర్ ఆమె జాయిన్ చేసుకునేందుకు నిరాకరించారు. ప్రస్తుత డీఈఓ రమేష్‌ను రిలీవ్ చేయలేదనీ, అందువల్ల మీకు బాధ్యతలు అప్పగించలేనని రాజేశ్వర్‌రావుకు కలెక్టర్ స్మితాసబర్వాల్ స్పష్టం చేశారు. దీంతో ఏంచేయాలో అర్థం కాక కొత్త డీఈఓ తలపట్టుకుంటున్నారు. డీఈఓగా విధులు నిర్వహిస్తున్న రమేశ్‌ను విద్యాశాఖ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేస్తూ ఈ నెల 12న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ప్రకాశం జిల్లా విద్యాశాఖాధికారి రాజేశ్వర్‌రావును నియమించారు. ఈ మేరకు 18న ప్రకాశం జిల్లా నుంచి రిలీవ్ అయిన రాజేశ్వర్‌రావు బుధవారం మెదక్ డీఈఓగా విధుల్లోకి చేరేందుకు బుధవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్‌కు వచ్చారు. ముందుగా కలెక్టర్ స్మితా సబర్వాల్‌ను ఆమె చాంబర్లో కలవగా, బాధ్యతలు అప్పగించేందుకు కలెక్టర్ పూర్తిగా నిరాకరించారు. డీఈఓ రమేష్‌ను రిలీవ్ చేసేంతవరకు వేచి ఉండాలంటూ కలెక్టర్ సూచించడంతో రాజేశ్వర్‌రావు వెనుదిరిగారు. కాగా డీఈఓ రమేశ్‌ను విధుల్లో నుంచి రిలీవ్ చేయలేమని, ఆయనకు ఎన్నికల బాధ్యతలు అప్పగించినందున ఎన్నికలు అయ్యేంతవరకు బదిలీని తాత్కాలికంగా నిలుపుదల చేయాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. వచ్చే నెల 3 వరకు ఎన్నికల విధుల్లో ఉన్నందున అప్పటివరకు డీఈఓ రమేశ్‌ను రిలీవ్ చేయలేమని కలెక్టర్ స్పష్టం చేసినట్లు సమాచారం. జిల్లా కలెక్టర్ విద్యాశాఖకు రాసిన లేఖను పరిగణనలోకి తీసుకుంటే ఇప్పట్లో డీఈఓ రిలీవ్ అయ్యే అవకాశాలు కానరావటం లేదు. మరోవైపు ఇప్పటికే ప్రకాశం జిల్లా డీఈఓగా రిలీవ్ అయిన రాజేశ్వర్‌రావుకు ఇక్కడ బాధ్యతలు అప్పగించకపోవడంతో ఆయోమయంలో పడిపోయారు. -
అవినీతి దారి
ప్రైవేటు వెంచర్‌కు సర్కారీ రహదారి ఒక్క ఇల్లూ లేకపోయినా సీసీ రోడ్డు కలెక్టరేట్ పక్కనే అక్రమం రూ.38 లక్షల అంచనాలతో టెండర్ ప్లాట్ల విలువ పెంచేందుకు‘మాస్టర్ ప్లాన్’ ఇదీ అభివృద్ధి నిధి ప్రత్యే‘కథ’ అదో ప్రైవేటు వెంచర్. ఓ ఎమ్మెల్యే బంధువు, మరో ఎమ్మెల్యే అనుచరులు ఆ వెంచర్లో పార్ట్నర్స్. ఆ స్థల యాజమాన్యం హక్కుల విషయంలో లెక్క లేనన్ని వివాదాలు. ఇప్పుడా వెంచర్‌ను సీఎం ప్రత్యేక నిధులతో అభివృద్ధిపరచడానికి రంగం సిద్ధమైంది. రూ.38 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి టెండర్లు సైతం పూర్తి కావడంతో రేపో మాపో పనులు ప్రారంభం కానున్నాయి. ప్రత్యేకాభివృద్ధి నిధి ప్రత్యే‘కథ’పై ‘సాక్షి’ కథనం.. సాక్షి, సంగారెడ్డి: కలెక్టర్ కార్యాలయ భవన సముదాయాన్ని ఆనుకుని ఎడమ వైపు ఓ ప్రైవేటు వెంచర్ ఉంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల బంధువులు, అనుచరవర్గం రియల్టర్లుగా అవతారమెత్తి ఈ వెంచర్‌ను వేశారు. ప్రజాధనంతో ఆ వెంచర్‌ను అభివృద్ధిపరిచి ప్లాట్ల విలువ పెంచుకోడానికి పక్కా ప్రణాళిక రచించారు. ప్రధాన రహదారి నుంచి వెంచర్‌కు వెళ్లే మార్గంలో 460 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించి సీఎం ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.38 లక్షలు నిధులు మంజూరు చేయించుకున్నారు. ప్రత్యేకాభివృద్ధి నిధులు కావడంతో ఈ పని కోసం కలెక్టర్ స్మితా సబర్వాల్ నుంచి పరిపాలనపరమైన అనుమతులూ తీసుకున్నారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం సంగారెడ్డి మునిసిపాలిటీ అధికారులు గత నెలలో ఆన్లైన్ టెండర్లు కూడా నిర్వహించారు. ఆ వెంచర్ వేసిన రియల్టర్లే కాంట్రాక్టర్లు కావడంతో త్వరలో పనులు సైతం ప్రారంభం కానున్నాయి. పక్కా ప్లాన్.. మాస్టర్ ప్లాన్ రోడ్డు కావడంతోనే అక్కడ రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు సంగారెడ్డి మునిసిపల్ ఇంజినీర్లు బుకాయిస్తున్నారు. రోడ్డు కోసం రియలర్టర్లు వదిలేసిన స్థలమేనని టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక రోడ్డు నిర్మాణం తలపెట్టిన ప్రాంతంలో ఒక్క ఇల్లూ లేదు. మార్గంలో ఇసుక ట్రాక్టర్లు తప్ప ఇతర వాహనాల రాకపోకలూ ఉండవు. కేవలం వెంచర్‌ను అభివృద్ధి పరిచి ప్లాట్ల ధరలను పెంచుకోడానికే ఈ రోడ్డును నిర్మిస్తున్నారని ఈ విషయాలు చెప్పకనే చెప్పుతున్నాయి. సంగారెడ్డి పట్టణంలో రోడ్లు, డ్రైనేజీలు లేని కాలనీలు ఎన్నో ఉన్నాయి. ఈ వెంచర్‌కు అవతలివైపు ‘4వ తరగతి ఉద్యోగుల కాలనీ’ ఉంది. ఆ కాలనీలో 184 ఇళ్లు ఉన్నా రోడ్డు మాత్రం లేదు. ప్రజావసరాల ముసుగులో రియల్టర్లకు లబ్ధి చేకూర్చి పాలకులు విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నడానికి ఈ ఉదంతం ఓ మచ్చుతునక మాత్రమే. మాస్టర్ ప్లాన్ రోడ్డు .. పట్టణ మాస్టర్ ప్లాన్‌లో అక్కడ రోడ్డు ఉండడంతో ఆ మేరకు సీసీ రోడ్డు నిర్మిస్తున్నాం. సాంకేతికంగా అన్నీ విషయాలు పరిశీలించిన తర్వాతే రోడ్డు పనికి టెండర్లు పిలిచాము. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు. - మునవ్వర్ అలీ, డీఈ, సంగారెడ్డి మునిసిపాలిటీ -
పోలింగ్‌కు 48 గంటల ముందూ ఓటరుగా నమోదు చేసుకోవచ్చు
కలెక్టరేట్, న్యూస్‌లైన్: పోలింగ్‌కు 48 గంటల ముందు వరకు అర్హత కలిగిన వారు ఓటరు జాబితాలో నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని కోర్టు హాల్లో జేసీ శరత్‌తో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎవరైనా అర్హులుంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా 2.5 కిలో మీటర్ల దూరంలో ఉన్న పోలింగ్ కేంద్రాల వివరాలను అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 2,407 పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, 21,36,348 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఇందులో పురుషులు 10,77,742, స్త్రీలు 10,58,496, ఇతరులు 110 మంది ఉన్నారన్నారు. 18 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్న నూతన ఓటర్లు 29,976 మంది నమోదయ్యాయన్నారు. ఎన్నికల వ్యయంపై ఇంకా స్పష్టమైన ఆదేశం రాలేదన్నారు. ఎన్నికల వ్యయంపై పరిశీలించేందుకు భారీసంఖ్యలో పరిశీలకులు నియోజకవర్గాలకు కేటాయించనున్నట్లు తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో అధికార పక్షానికి సహకరించేలా కొందరు అధికారులు పనిచేస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకు రాగా అలాంటి వారిని పక్కన పెట్టి భరోసా ఉన్నవారిని నియమిస్తామన్నారు. ఎన్నికల సమస్యలపై టోల్‌ఫ్రీ నంబరును ఏర్పాటు చేస్తామన్నారు. పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతులైన టాయిలెట్లు, ర్యాంపులు, విద్యుత్ మరమ్మతులు, నీటి సదుపాయం తదితర వాటిని కల్పించేందుకు ఇప్పటికే నియోజక వర్గ స్థాయిలో ఇంజనీరింగ్ విభాగాల ఈఈలను నియమించామని నియోజక వర్గ స్థాయిలో రాజకీయ పార్టీలు సహకరించి నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు మంద పవన్, ప్రేమానందం, నర్సింలు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతే లక్ష్యం
గజ్వేల్/జగదేవ్‌పూర్, న్యూస్‌లైన్ : ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతే లక్ష్యంగా ‘ఇందిర జలప్రభ’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ స్మితాసబర్వాల్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం గజ్వేల్ మండలం ఆహ్మాదీపూర్ గ్రామంలోని 10 మంది ‘ఇందిర జలప్రభ’ లబ్ధిదారులకు చెందిన 20 ఎకరాల్లో డ్రిప్ పథకాన్ని వర్తింప జేసిన పథకాన్ని ఎమ్మెల్యే నర్సారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో సూక్ష్మనీటి సేద్యపు పథకం అమలుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. కూరగాయలు, పండ్ల తోటల రైతులకు ఈ పథకంతో భారీ ప్రయోజనం చేకూరుతుందన్నారు. జిల్లాలో వచ్చే మార్చి కల్లా 60 వేల ఎకరాల్లో పరికరాలను బిగిస్తామని, ఇప్పటివరకు 5 వేల ఎకరాల్లో ఈ ప్రక్రియ పూర్తి కావస్తున్నదని వెల్లడించారు. ఈ సందర్భంలో సూక్ష్మ నీటి పథకం నిబంధనలు మార్చి స్పెసింగ్ పెంచడం, ప్రతి రైతుకు గ్రామసభ తీర్మానాన్ని కోరటం వంటి కొత్త నిబంధనల వల్ల ఎంతోమంది రైతులు దీనిపై ఆసక్తి చూపటం లేదని, ఫలితంగా లక్ష్యం నెరవేరడం లేదని ‘న్యూస్‌లైన్’ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. నిబంధనల విషయమై తామేమీ చేయలేమని వెల్లడించారు. నిబంధనలకు లోబడే రైతులు ఈ పథకాన్ని వినియోగించుకోవాలని తేల్చిచెప్పారు. అనంతరం కలెక్టర్ ఆహ్మాదీపూర్ గ్రా మంలో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నర్సారెడ్డితో పాటు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డెరైక్టర్ రవీందర్, జిల్లా సూక్ష్మ నీటి పథకం ప్రాజెక్ట్ డెరైక్టర్ రామలక్ష్మి, ఉపాధిహామీ పథకం గజ్వేల్ నియోజకవర్గ ఏపీడీ వసంత సుగుణ, ఎంపీడీఓ కౌసల్యాదేవి, మండల సహకార సంఘం చైర్మన్ వెంకట్‌నర్సింహ్మారెడ్డి, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులకు కలెక్టర్ శంకుస్థాపన ఎస్సీ, ఎస్టీల భీడు భూములను సాగులోకి తీసుకవచ్చి వారిని ఆర్థికంగా అభివృద్ధి చెందించడమే ఇందిర జలప్రభ ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ స్మితా సబర్వాల్ అన్నారు. శుక్రవారం జగదేవ్‌పూర్ మండల తిమ్మాపూర్‌లో ఇందిర జలప్రభ బ్లాక్‌తో పాటు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నర్సారెడ్డితో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సంధర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్మితా సభర్వాల్ మాట్లాడుతూ విద్యుత్ కోతల వల్ల రైతులు ఆరుతడి పంటల వైపు దృష్టి సారించాలన్నారు. జిల్లాలో 5 వేల ఎకరాల్లో ఇందిర జలప్రభ పథకం ద్వారా బోరు మోటార్లు అందించి బిందు సేద్యం ద్వారా ఆరుతడి పంటలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో 9 మంది ఇందిర జలప్రభ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ పథకాన్ని రైతులకు ఆధునాతన పద్ధతుల్లో అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో పీర్ ఈఈ కనకరత్నం, డిప్యూటీ ఈఈ చంద్రమౌళి, ఆర్ఎంఎస్ ఎఈ అనిల్ కుమార్, ఎంపీడీఓ సలోమి ప్రియదర్శిని, పశుగణాభివృద్ధి సంస్థ జిల్లా చైర్మన్ జనార్దన్ రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, కొండ పోచమ్మ చైర్మన్ మల్లేశ ం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, గ్రామ సర్పంచ్ నవ్య, నాయకులు యాదగిరి, చల్లా బాలకిషన్, లకా్ష్మరెడ్డి, బంగా శ్రీనివాస్ రెడ్డి, బాలేశం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
తిరుగుబాటు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా విద్యాధికారిని బదిలీ వ్యవహారం పీటముడిగా మారుతోంది. ఎట్టి పరిస్థితుల్లో డీఈఓను రిలీవ్ చేసే ప్రసక్తే లేదని తేల్చేసిన కలెక్టర్ స్మితా సబర్వాల్ రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. డీఈఓ రమేష్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాల్సిందేనని ఆమె తెగేసి చెప్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్‌కు లేఖలు కూడా రాశారు. ప్రస్తుతం ఉన్న డీఈఓ రమేష్‌ను బదిలీ చేస్తూ , ఆయన స్థానంలో ప్రకాశం జిల్లా డీఈఓ రాజేశ్వర్‌రావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రంగ ప్రవేశం చేశారు. గత ఏడాది 10వ తరగతి పరీక్షల్లో జిల్లా అట్టడుగు స్థానంలో ఉందనీ, ఈ ఏడాది మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఆరు నెలలుగా ప్రణాళిక వేసుకొని, ఆ ప్రణాళిక ప్రకారం వెళ్తున్నామంటున్నారు. ఈ పరిస్థితుల్లో అర్ధాంతరంగా డీఈఓను బదిలీ చేయడం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయని కలెక్టర్ చెప్తున్నారు. పైగా డీఈఓను రాబోయే సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం మ్యాన్‌పవర్ మేనేజ్మెంటు నోడల్ అధికారిగా నియమించామనీ, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారిని ఎన్నికల కమిషన్‌కు తెలియకుండా ఎలా బదిలీ చేస్తారని కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈమేరకు ఆమె ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి, ప్రాథమికోన్నత విద్యాశాఖ కమిషనర్‌కు నివేదించారు. అంతకుముందే కలెక్టర్ స్మితా సబర్వాల్ డీఈఓను మ్యాన్‌పవర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిగా నియమించిన సర్టిఫికెట్ కాపీని ఈసీకి పంపినట్టు తెలిసింది. అయితే ఎన్నికల షెడ్యూలు వెలువడిన తర్వాతే కలెక్టర్ లేవనెత్తిన బదిలీ అంశం ఈసీ నిబంధనల కిందకు వస్తుందని సదరు ఉన్నతాధికారులు తెలిపినట్టు సమాచారం. మరోవైపు ప్రకాశం జిల్లా నుంచి బదిలీ అయిన రాజేశ్వర్‌రావు తన భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. అక్కడ నుంచి రిలీవ్ కాలేక, ఇక్కడ జాయిన్ కాలేక ఆయన ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. -
మార్చి నెలాఖరుకల్లా మెద క్లో ‘హైరిస్క్ కేంద్రం’
మెదక్‌టౌన్, న్యూస్‌లైన్ : మాతాశిశు మరణాలను నివారించేందుకు మార్చి నెలాఖరు కల్లా మెదక్‌లో ‘హైరిస్క్ కేంద్రం’ ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు. శుక్రవారం ఆమె, కేంద్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ అరుణ్‌సింగ్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ సహానీలతో కలిసి మెదక్ ఏరియా ఆస్పత్రిని సందర్శిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆస్పత్రిలో మార్చి 31లోగా ఏర్పాటు చేయనున్న హైరిస్క్ కేంద్రానికి కాంట్రాక్ట్ పద్ధతిన సిబ్బందిని నియమించుకోవడంతో పాటు అవసరమైన పరికరాలను కొనుగోలు చేసుకోవాలని సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ఆదేశిం చారు. ఆస్పత్రిలో ప్రస్తుతం నెలకు 125 కాన్పులు జరుగుతున్నాయనీ, వీటిని 250కి పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం కావాల్సిన సిబ్బందిని, పరికరాలను సమకూరుస్తామన్నారు. ఆ స్పత్రి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఇప్పటికే సిద్దిపేటలో హైరిస్క్ కేంద్రం ప్రారంభించామని త్వరలోనే మరికొన్ని చోట్ల ప్రారంభించి మాతాశిశు మరణాలను తగ్గించేం దుకు కృషి చేస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ సహానీ తెలిపారు. జి ల్లా కలెక్టర్ ఆరోగ్య విషయాలపై చూపిస్తున్న శ్రద్ధను ఆయన అభినందించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు జాయిం ట్ కలెక్టర్ మూర్తి, ఆర్డీఓ వనజాదేవి, డీసీహెచ్ వీణాకుమారి, డీఎం,హెచ్ఎం పద్మ, డీపీఎం జగన్నాథ్‌రెడ్డి, తహశీల్దార్ విజయలక్ష్మి, వైద్యులు చంద్రశేఖర్, శివదయాల్, హేమ్రాజ్ పాల్గొన్నారు. -
ఎలా పంపుతారో చూస్తాం
కలెక్టర్‌కు జిల్లా ప్రజానీకం బాసట పారిశ్రామిక వేత్తలకు బుద్దిచెబుతామన్న ప్రజాసంఘాలు లాబీయింగ్‌ను అడ్డుకుని తీరుతామన్న ఎమ్మెల్యేలు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కలెక్టర్ స్మితా సబర్వాల్‌కు జిల్లా ప్రజానీకం, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు బాసటగా నిలిచారు. ఆమెను జిల్లా నుంచి పంపించేందుకు పారిశ్రామిక వేత్తలంతా ఏకమై చేస్తున్న లాబీయింగ్‌ను తీవ్రంగా గర్హించారు. ప్రజలకు కాలుష్యం పంచి, రూ. కోట్లు దండుకుంటూ సామాజిక బాధ్యతను విస్మరించిన పారిశ్రామికవేత్తలకు బుద్దిచెప్పి తీరుతామంటున్నారు. ప్రజల కోసం పని చేస్తున్న కలెక్టర్‌ను వారు ఎలా పంపిస్తారో తాము కూడా చూస్తామంటున్నారు. జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు అవసరమైతే ముఖ్యమంత్రి కలిసి పారిశ్రామిక వేత్తల పన్నాగం వివరిస్తామని తేల్చి చెప్పారు. ‘పంపేందుకు పైరవీ.. కలెక్టర్ బదిలీకి పారిశ్రామిక వేత్తల లాబీయింగ్ ’ శీర్షికన శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం జిల్లాలో చర్చాంశనీయంగా మారింది. ఈ కథనంపై టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ తదితర పార్టీల ఎమ్మెల్యేలు స్పందించారు. కలెక్టర్ బదిలీ కోసం పారిశ్రామిక వేత్తల వేస్తున్న ఎత్తులను ఎలాగైనా చిత్తు చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యేలు హరీష్‌రావు, నందీశ్వర్‌గౌడ్, కిష్టారెడ్డి, నర్సారెడ్డి, మైనంపల్లి హన్మంతరావు తదితరులు శనివారం వేర్వేరుగా ‘సాక్షి’తో మాట్లాడారు. పారిశ్రామికవేత్తల తీరును ఎండగట్టారు. రూ.కోట్లు మూటగట్టుకుంటున్న పారిశ్రామికవేత్తలు ’సామాజిక బాధ్యత’ను విస్మరించడం నేరమేనన్నారు. వెంటనే సీఎస్ఆర్ ఫండ్‌ను చెల్లించాల్సిందేనని పట్టుబట్టారు. ఉపాధి కల్పించాల్సిన పరిశ్రమలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంపాదనే పరమావధిగా కంపెనీలు నడుపుతున్న పారిశ్రామికవేత్తలు కాలుష్యాన్ని ప్రజల మీదకు వదిలి వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. పారిశ్రామిక వేత్తలకు ఏమాత్రం మానవత్వం ఉన్నా, వెంటనే సీఎస్ఆర్ ఫండ్‌ను చెల్లించాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. డబ్బు బలంలో ఏమైనా చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని, నిజాయితీపరురాలైన కలెక్టర్ స్మితా సబర్వాల్‌కు తామంతా అండగా నిలుస్తామన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసి వాస్తవ పరిస్థితిని వివరిస్తామని చెప్పారు. పరిశ్రమల కాలుష్యంతో కునారిల్లిపోయిన పాశమైలారం గ్రామ ప్రజలు పారిశ్రామిక వేత్తల దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండించారు. కలెక్టర్‌కు తామంతా అండగా నిలుస్తామని ఆ గ్రామ సర్పంచు సుధాకర్‌గౌడ్ తెలిపారు. కలెక్టర్ బదిలీ కోసం పారిశ్రామిక వేత్తలు చేసే లాబీయింగ్‌నే కాదు, ప్రతిప్రయత్నాన్ని అడ్డుకొని తీరుతామని టీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్‌రావు, టీడీపీ ఎమ్మెల్యే హన్మంతరావు స్పష్టం చేశారు. ఆమె ఇక్కడే ఉండాలి సిద్దిపేట రూరల్: కలెక్టర్ స్మిత సబర్వాల్ పని తీరు బాగుందని, ఆమె మెదక్ జిల్లాలోనే ఉండాలని రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు అన్నారు. శనివారం సిద్దిపేటకు విచ్చేసిన ఆయన, సాక్షి పత్రికలో ప్రచురించిన ‘పంపేందుకు పైరవీ’ అనే కథనంపై స్పందించారు. స్మితా సబర్వాల్ లాంటి నిజాయతీ గల కలెక్టర్ తెలంగాణకు అవసరమన్నారు. పరిశ్రమల స్థాపనకయ్యే వ్యయంలో 0.02 శాతం ఆ ప్రాంతం ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించడం కోసం ఖర్చు చేయాల్సిన బాధ్యత పారిశ్రామిక వేత్తలపై ఉందన్నారు. ఈ అంశాన్ని గుర్తించిన కలెక్టర్‌ను సంస్థలపై ఒత్తిడి పెంచితే ఆమెను ఇక్కడి నుంచి బదిలీ చేయించేందుకు కుట్రలు చేయడం అన్యాయమన్నారు. పారిశ్రామికవేత్తల కుట్రలను ప్రటిఘటించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. కలెక్టర్ పనితీరు వల్ల జిల్లాలోని నిరుపేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు. -
టెన్త్‌లో మాస్‌కాపీయింగ్ లేకుండా చర్యలు
కలెక్టర్ స్మితాసబర్వాల్ జిన్నారంలోని జెడ్పీహెచ్ స్కూల్, గురుకుల పాఠశాలల సందర్శన జె డ్పీహెచ్ఎస్లో పదోతరగతిలో ఉత్తీర్ణతాశాతం తగ్గుదలపై కలెక్టర్ ఆగ్రహం జిన్నారం, న్యూస్‌లైన్: పదోతరగతిలో మాస్‌కాపీయింగ్ లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని, విద్యార్థులు కష్టపడి చదవాలని, అప్పుడే ఉత్తమ ఫలితాలు వస్తాయని జిల్లా కలెక్టర్ స్మితాసబర్వాల్ సూచించారు. జిన్నారంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదోతరగతిలో విద్యార్థుల ఉత్తీర్ణతాశాతం తక్కువగా ఉండటంతో మంగళవారం కలెక్టర్ స్మితాసబర్వాల్ పాఠశాలను సందర్శించారు. పదోతరగతిలో ఉత్తీర్ణతాశాతం ఎందకు తగ్గుతుందని కలెక్టర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేశ్వర్‌నాయక్, ఎంఈఓ ప్రకాశ్‌లను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోనే అట్టడుగు స్థాయిలో జిన్నారం పాఠశాల రెడ్‌జోన్‌లో ఎందుకుందని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. ఉపాధ్యాయుల పనితీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో స్వయంగా మాట్లాడి, ఉపాధ్యాయులు విద్యను అందిస్తున్న తీరును తెలుసుకున్నారు. సీ కెటగిరికి చెందిన విద్యార్థులను ఎందుకు అడాప్షన్ చేసుకోవటం లేదని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. మీరు ఏంచేస్తారో నాకు తెలియదు, ఈ ఏడాది మాత్రం ఉత్తీర్ణతాశాతాన్ని పెంచే విధంగా విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. చిట్టీలకు తావులేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని, చిట్టీలపై విద్యార్థులు ఆశలు పెట్టుకోవద్దని కలెక్టర్ సూచించారు. అనంతరం జిన్నారంలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ స్మితాసబర్వాల్ సందర్శించారు. అర్దవార్షిక పరీక్షల్లో 40మంది విద్యార్థులు ఎందుకు ఫెయిల్ అయ్యారని పాఠశాల వైస్ ప్రిన్సిపల్ వెంకటయ్యను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సరైన విద్యనుఅ ందించే విదంగా ఉపాధ్యాయులు కష్టపడాలని సూచించారు. పదోతరగతి పరీక్షలకు మరో 50 రోజుల సమయం ఉన్నందును విద్యార్థులను పరీక్షలకు సన్నద్దం చేయాలని సూచించారు. పదోతరగతిలో విద్యార్థులు కష్టపడి చదవాలని కలెక్టర్ సూచించారు. మరో పదిరోజుల్లో జిన్నారంలో పర్యటిస్తానని, అప్పుడు విద్యార్థుల్లో మార్పు కనిపించాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచించారు. విద్యార్థులు ఎలా చదువుతున్నారో తెలుసుకునే విధంగా ఎంపీడీఓ, తహశీల్దార్లు పాఠశాలలను సందర్శించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ స్మితాసబర్వాల్ వెంట మెదక్ ఆర్డీవో వనజాదేవీ, జిన్నారం ఎంపీడీఓ శ్రీనివాస్‌రావు, తహశీల్దార్ శ్రీనివాస్, ఎంఈఓ ప్రకాశ్ తదితరులు ఉన్నారు. 28పిటిసి15 : జిన్నారం : జిన్నారంలోని జెడ్పీపాఠశాలలో విద్యార్థులతో మాట్లాడుతున్న కలెక్టర్ 28పిటిసి15ఏ : జిన్నారం : జిన్నారంలోని జెడ్పీ పాఠశాలలో ఉత్తీర్ణతాశాతం ఎందుకు తగ్గుతుందని ఎంఈవో, పాఠశాల ప్రధానోపాద్యాయుడిని ప్రశ్నిస్తున్న కలెక్టర్ 28పిటిసి15బీ : జిన్నారం : జిన్నారంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులకు విద్యను అందిస్తున్నతీరుపై వైస్ప్రిన్సిపల్తో మాట్లాడుతున్న కలెక్టర్ -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమన్నారు. బ్లాక్, బ్లూ బాల్‌పాయింట్ పెన్, హాల్‌టికెట్‌తో మాత్రమే అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్, లైజన్ అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే నెల 2న వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్షల కోసం 154 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 60,463 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. వీఆర్ఓ పోస్టులకు 57,820 మంది, వీఆర్ఏ పోస్టులకు 2,643 మంది హాజరవుతున్నారన్నారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వీఆర్ఓ, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు వీఆర్ఏ పరీక్ష ఉంటుందన్నారు. అభ్యర్థుల సౌకర్యార్థం సిద్దిపేట, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్చెరు, రామచంద్రాపురం బస్టాండ్లలో ఈ నెల 30వ తేదీ నుంచే పరీక్ష కేంద్రాల వివరాలను వాటి మధ్య ఉన్న దూరాన్ని తెలియజేస్తూ హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు జేసీ డాక్టర్ ఎ. శరత్ తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల ఎడమ చేతి బొటన వేలిముద్రను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఏపీపీఎస్సీ నియమ నిబంధనలను క్షుణ్ణంగా చదివి ఆ మేరకు పరీక్ష నిర్వహణ చేపట్టాలన్నారు. పరీక్ష కేంద్రాన్ని, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా ఎప్పటికప్పుడు వీడియో ద్వారా చిత్రీకరించేలా ఆర్డీఓలు చర్యలు తీసుకోవాలన్నారు. ఏ ఒక్క అభ్యర్థి కింద కూర్చోకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షలకు హాజరవుతున్న అంధులకు, రెండు చేతులు లేనివారికి పదో తరగతి చదివే విద్యార్థులను సహాయకులుగా ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. వీఆర్వోలకు 999 కోడ్, వీఆర్ఏలకు 888 కోడ్ ఉంటుందని వాటిని పరిశీలించి తగిన జాగ్రత్త వహించాల్సిందిగా ఏపీపీఎస్సీ పరిశీలకులు తెలిపారు. అభ్యర్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో సాయిలు, కలెక్టరేట్ ఏవో శివకుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆర్డీవోలు ధర్మారావు, ముత్యంరెడ్డి, వనజాదేవి, తహశీల్దార్లు, ఎంపీడీవో, వ్యవసాయశాఖ అధికారులు, వివిధ కళాశాలలు, పాఠశాలల ప్రిన్సిపాల్స్, ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘మార్పు’.. వేగిరం
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: జిల్లాలో సంక్షేమ కార్యక్రమాల అమలును మరింత వేగవంతం చేయనున్నట్లు కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు. మాతా శిశు సంరక్షణ, గర్భిణులకు పౌష్టికాహార సేవలు అందించే మార్పు కార్యక్రమాన్ని పట్టణ ప్రాంతాలకూ విస్తరించనున్నట్లు చెప్పారు. జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ఆదివారం 65వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీసు పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ జాతీయజెండాను ఎగురవేశారు. సాయుధ పోలీసుల నుంచి గౌరవందనం స్వీకరించారు. అనంతరం కలెక్టర్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వచ్చేనెల నుంచి ఐదు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో ‘మార్పు’ అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రాష్ట్రంలోనే మొదటి సారిగా సిద్దిపేటలో మార్పు అమలుకు హైరిస్క్ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. జహీరాబాద్, పటాన్చెరు, గజ్వేల్, మెదక్, నారాయణఖేడ్‌లో కూడా దశల వారీగా హైరిస్క్ కేంద్రాలు ప్రారంభిస్తామని అన్నారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు వీలుగా జిల్లా వ్యాప్తంగా రైతుహిత సదస్సులు నిర్వహించామన్నారు. వ్యవసాయ యాంత్రీకరణపై రైతులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. రబీలో రైతులు 94వేల హెక్టార్లలో వివిధ పంటుల సాగు చేశారన్నారు. రైతులకు వచ్చేనెలాఖరులోగా నిర్దేశించిన లక్ష్యం మేరకు రూ.1,134 కోట్ల రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పశుసంవర్ధకశాఖ ద్వారా సునందిని పథకంలో భాగంగా రైతులకు 3,961 మేలుజాతి దూడల పోషణకు 75 శాతం సబ్సిడీపై దాణ, మందులు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. పదో తరగతిలో వందశాతం ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ ప్రసంగంలోని ప్రధాన అంశాలు ఆమె మాటల్లో.. మార్పు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య 1600 నుంచి 2100 వరకు పెరిగాయి. కొత్తగా 18 పీహెచ్సీలో ప్రసవాల సేవలు ప్రారంభిస్తున్నాం. పది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈనెలాఖరులోగా మార్పు హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేస్తున్నాం. జిల్లాలో 219,033 కనెక్షన్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఈ ఏడాది కొత్తగా 4,763 ఉచిత విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశాం. సదాశివపేటలో 220/132 కేవీ. సబ్‌స్టేషన్ పనులు పూర్తి కానున్నాయి. ఇందిర జలప్రభ ద్వారా 1,764 బోర్లు, సీఎల్డీపీ పథకం ద్వారా 862 బోర్లకు రూ.11 కోట్లతో విద్యుద్దీకరణ పనులు చేపడుతున్నాం. ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో 11,865 కుటుంబాలకు వందరోజుల పనిదినాలు కల్పించాం. రూ.354 కోట్లతో 72,763 పనులు పూర్తి చేశాము. ఈ ఆర్థిక సంవత్సరంలో 86,458 మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యం కాగా 17,685 పూర్తి కాగా 31వేల మరుగుదొడ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయి. జిల్లాలోని 36,623 స్వయం సహాయక సంఘాలకు రూ.37 కోట్ల వడ్డీలేని రుణాలు అందజేశాం. స్త్రీనిధి బ్యాంకు ద్వారా 3,738 సంఘాలకు రూ.25 కోట్ల రుణాలు మంజూరు చేశాం. రాజీవ్ యువకిర ణాలు పథకం ద్వారా 7,939 మంది నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించాం. బంగారుతల్లి పథకం ద్వారా 8,125 మంది అడపిల్లల వివరాలు నమోదు చేసుకోగా 6వేల మంది పిల్లలు లబ్ధిపొందారు. జడ్పీ ద్వారా జిల్లాలో ఈ ఏడాది రూ.11.98 కోట్లతో 2,593 పనులు చేపట్టగా వివిధ దశల్లో ఉన్నాయి. జడ్పీ సాధారణ నిధుల కింద నియోజకవర్గానికి రూ.10 లక్షల చొప్పున రూ.3 కోట్లు విడుదల చేశాం. ఏడవ విడత భూ పంపిణీలో భాగంగా 1192 మంది లబ్ధిదారులకు 1249 ఎకరాల భూమి పంపిణీ చేశాం. జిల్లాలో 238 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా వారి కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున రూ.2.38 కోట్ల ఆర్థిక సహాయం అందజేశాం. కాగా అంతకు ముందు కలెక్టర్ స్మితా సబర్వాల్, ఎస్పీ విజయ్‌కుమార్‌తో కలిసి వాహనంలో నిల్చుని గౌరవ వందనం స్వీకరించారు. సాయుధ పోలీసులు నిర్వహించిన పరేడ్ అందరినీ ఆకట్టుకుంది. గణతంత్ర వేడుకల్లో విప్ జయప్రకాశ్‌రెడ్డి, జేసీ శరత్, ఏజేసీ మూర్తి, డీఆర్ఓ సాయిలు, ఆర్డీవో ధర్మారావు, హౌజింగ్ పీడీ బాల్‌రెడ్డి, పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ లక్ష్మారెడ్డి, డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి, డీఎస్ఓ ఏసురత్నం, డ్వామా పీడీ రవీందర్, ఏపీఎంఐపీ పీడీ రామలక్ష్మి, వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ, వికలాంగుల సంక్షేమశాఖ జేడీ లక్ష్మణచారి, ఐసీడీపీఎస్ పీడీ శైలజ, సంక్షేమశాఖ జిల్లా అధికారులు కిరణ్, శ్రీనివాస్‌రెడ్డి, చరణ్‌దాస్, రశీద్, బాల్‌చందర్, అదనపు ఎస్పీ మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. -
పిల్లలను బడికి పంపకపోతే ‘సంక్షేమం’ కట్
సంగారెడ్డి మున్సిపాలిటీ/మెదక్, న్యూస్‌లైన్: తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపకపోతే ఆ ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేసే దిశగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్మితా సబర్వాల్ హెచ్చరించారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు వీలుగా రూపొందించిన ప్రత్యేక కార్యాచరణను పకడ్బందీగా అమలుచేయాలని కలెక్టర్ ఆదేశించారు. పదో తరగతి అర్ధవార్షిక పరీక్ష ఫలితాల పై బుధవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్ లో ప్రధానోపాధ్యాయులతో నిర్వహిం చిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ ప్రసంగించారు. త్రైమాసిక పరీక్ష ఫలితాలతో పోల్చితే అర్ధవార్షిక పరీక్షల ఫలితాల్లో గణనీయమైన వృద్ధి కన్పించిందన్నారు. అయితే విద్యార్థుల హాజరు శాతం పడిపోవడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశా రు. జిల్లాలోని 556 పాఠశాలల్లో 31,100 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతుండగా అందులో 27,930మంది విద్యార్థులు పరీక్షలు రాశారన్నారు. మిగతా 3,170 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరు కావడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల హాజరుశాతం చాలా తక్కువగా ఉన్నచోట అవసరమైతే తాను సమావేశం నిర్వహిస్తానని తెలిపారు. హాజరుశాతాన్ని పెంచేం దుకు సంబంధిత సర్పంచ్ల సహకారం తీసుకోవాలని అవసరమైతే వారితో మాట్లాడతానని చెప్పారు. గత త్రైమాసిక పరీక్షల్లో జిల్లాలో కేవలం 38.60 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. ప్రత్యేక కార్యాచరణ, క్విజ్ పోటీలు, ప్రత్యేక తరగతులు, విద్యార్థుల దత్తత, సన్నిహిత అధికారుల నియామకం తదితర చర్యల వల్ల అర్ధవార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత 56.92 శాతానికి పెరిగిందన్నారు. జోగిపేట డివిజన్లో 57 శాతం, మెదక్ డివిజన్లో 54, సంగారెడ్డిలో 56, సిద్దిపేట డివిజన్లో 59 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. తగ్గిన రెడ్ జోన్ పాఠశాలలు.. త్రైమాసిక పరీక్షల్లో 226 పాఠశాలలు రెడ్‌జోన్‌లో ఉండగా, ఈసారి కేవలం 18 పాఠశాలలు మాత్రమే ఆ జోన్లో ఉం డటం సంతోషకరమని కలెక్టర్ తెలిపా రు. ఇప్పుడున్న 18 పాఠశాలలపై ప్ర త్యేక దృష్టి సారించాలని డీఈఓను ఆదేశించారు. ఈసారి ఫలితాలు అన్ని గ్రేడ్ల లో మెరుగ్గా ఉన్నాయన్నారు. త్రైమాసిక పరీక్షల్లో బ్లూ జోన్లో ఉన్న నల్లవాగు పాఠశాల ఈసారి అట్టడుగుస్థాయికి పడిపోవడం దారుణమన్నారు. వచ్చే మార్చి 14న జరగబోయే ప్రీఫైనల్ పరీక్షల్లో కనీ సం 80 శాతం, పబ్లిక్ పరీక్షల్లో వందశా తం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని హెచ్ఎంలకు సూచిం చారు. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా 40 రోజుల ప్రత్యేక కార్యాచరణను కలెక్టర్ ప్రారంభించారు. సబ్జెక్ట్ టీచర్ల కొరత తీర్చాం: డీఈఓ జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్ల కొరతను తీర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని డీఈఓ జి.రమేశ్ తెలిపారు. కలెక్టర్ కృషితో ఈసారి జిల్లాకు వంద అకడమిక్ ఇన్ స్ట్రక్టర్ల పోస్టులు మంజూరైనట్టు చెప్పారు. వర్క్ అడ్జెస్ట్మెంట్ కింద ఉపాధ్యాయులను వివిధ పాఠశాలలకు సర్దుబాటు చేశామన్నారు. 40 రోజుల కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను తయారుచేశామని తెలిపారు. దానికి అనుగుణంగా పదో తరగతి విద్యార్థులకు బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. సమావేశంలో డిప్యూటీ ఈఓలు, ఎంఈఓలు, జిల్లాలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. -
గణతంత్ర వేడుకల నిర్వహణ
కలెక్టరేట్, న్యూస్‌లైన్: గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ స్మి తా సబర్వాల్ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె కలెక్టరేట్లో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలు నివేదికలను జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారికి అందజేయాలని ఆదేశించారు. శాఖల వారీగా ప్రగతి శకటాలను ఏర్పాటు చేయడంతో పాటు వాటిపై పథకాల వివరాలు అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా రూపొందించాలన్నారు. శకటాలకు రోలింగ్ షీల్డ్‌తో ప్రగతి బహుమతి అందజేస్తామన్నారు. ఎగ్జిబిషన్ స్టాల్‌ను ఏర్పాటు చేయడంతో పాటు కార్యక్రమానికి హాజరయ్యే వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించేలా ఏర్పాటు చేయాలని డీఈఓ రమేశ్‌ను ఆదేశించారు. సమావేశంలో డాక్టర్ శరత్, అదనపు ఎస్పీ మధుసూదన్‌తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు బాల్‌రెడ్డి, రవీందర్, రామలక్ష్మి, ఆశీర్వాదం, లక్ష్మణాచారి, కిరణ్‌కుమార్, రమేశ్, శ్రీనివాసులు సంగారెడ్డి డీఎస్పీ వెంకటేశం, సంగారెడ్డి ఆర్డీఓ ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. పల్స్‌పోలియో విజయవంతం సంగారెడ్డి అర్బన్: జిల్లాలో పల్స్ పోలి యో కార్యక్రమం విజయవంతమైందని కలెక్టర్ స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా 0-5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడంతో 101శాతం సాధించామని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 3,57,200 మంది చిన్నారులకు పో లియో చుక్కలు వేసి 101శాతం లక్ష్యం సాధించామన్నారు.19వ తేదీన 3,34,204 మంది చిన్నారులకు, 20వ తేదీన 19,204 మంది చిన్నారులకు, 21న 3,642 మందికి పోలియో చుక్కలు వేశామన్నారు. జిల్లా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కూడా పోలియో చుక్కలు వేశామన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, గ్రామైక్య సంఘాలు, వైద్య శాఖ అధికారులు, సిబ్బందితోపాటు ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పల్స్‌పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు భినందనలు తెలిపారు. -
దళితులంటే అంత అలుసా?
కలెక్టరేట్, న్యూస్‌లైన్: దళితులంటే అంత అలుసా? వారికి సంక్షేమ పథకాలు అందించడంలేదు, హత్యాచారానికి గురైన బాధితులకు ఎక్స్‌గ్రేషియో చెల్లించడం లేదు, సబ్ ప్లాన్‌ను సక్రమంగా అమలు చేయడంలేదంటూ విజిలెన్స కమిటీ సభ్యులు మండిపడ్డారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్ కలెక్టర్ స్మి తాసబర్వాల్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఆర్ సుబ్బారావు ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీలపై అరాచకం, అత్యాచారాలకు గురైన బాధితులకు సకాలంలో నష్టపరిహారం అం దడం లేదని కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు, అర్జునయ్యలు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. బ్యాంక్ రుణాల మంజూ రులోను బ్యాంకర్లు సహకరించడం లేద ని ఆరోపించగా స్పందించిన కలెక్టర్ గత నెల 20న బ్యాంకర్ల సమావేశం నిర్వహించి స్పష్టమైన ఆదేశాలను జారీ చేశామని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 95 శా తం లక్ష్యాన్ని సాధించినట్లు వివరిం చారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుపేద వ్యవసాయ కూలీలకు భూమి కొనుగోలులో లబ్ధిదారుల ఎంపికే జరగలేదని గ్రౌండింగ్ ఎప్పటిలోగా పూర్తి చేస్తారని సభ్యులు ప్రశ్నించిగా ప్రభుత్వం నుంచి ఎస్సీ, ఎస్టీలకు సబ్సిడీ రూ.30 వేల నుంచి రూ.లక్షకు పెంచుతూ నిర్ణ యం తీసుకున్న నేపథ్యంలో గ్రౌండింగ్ చేయకుండా నిలిపి వేశామనానరు. ఈ నెల 25వ తేదీలోగా మండల కమిటీలను ఏర్పాటు చేసి వయో నిబంధనల మేరకు కొత్త జాబితాను రూపొందిస్తామన్నారు. ఆర్బీఐ నిబంధనల మేరకు ఔత్సాహికులైన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకుఎలాంటి పూచికత్తు లేకుండా బ్యాంక్ రుణాలు ఇవ్వాల్సి ఉన్నా బ్యాం కర్లు సహకరించడం లేదన్నారు. గజ్వేల్ మండలం రాజిరెడ్డిపల్లిలోని సర్వే నం బరు 138లో సాగులో ఉన్న 18 మంది ఎస్సీ మహిళలపై కేసులు నమోదు చేశారంటూ వెంకటేశ్వర్లు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ప్రభుత్వం నిబంధనల మేరకు ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. దుబ్బాక మండలం చెల్లాపూర్ ఎస్టీ మహిళ ఎస్ఐ లెనిన్‌బాబుపై రాష్ట్ర మాన వ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయ గా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని సభ్యులు అధికారుల దృష్టికి తెచ్చా రు. శాఖా పరమైన విచారణ చేపట్టి నివేదికను అందజేయాల్సిందిగా డీఎస్పీని ఆదేశించింది. కమిటీ సభ్యుడిగా హ ద్నూర్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్ర హ స్థాపనలో బాధితుల పక్షాన పోలీసుస్టేషన్‌కు వె ళ్లిన తననే కేసులో ఇరికించారని కమిటీ సభ్యులు బాల్‌రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సుబ్బారావు మా ట్లాడుతూ ప్రతివారం నిర్వహించే గ్రామదర్శినిలో పోలీసు అధికారులు పాల్గొం టే స్థానికంగా ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొం టున్న సమస్యలు వారి దృష్టికి వచ్చి పరి ష్కరించే అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటి వరకు అట్రాసిటీ కింద 41 కేసు లు నమోదయ్యాయని కమిటీ కన్వీనర్ సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డెరైక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బాధితులకు రూ.53లక్షల 25వేలను నష్టపరిహారంగా చెల్లించామన్నారు. సమీక్షలో ఏఎస్పీ మధుసూదన్‌రెడ్డి, కమిటీ సభ్యులు సత్యనారాయణ, గోపాల్, మాణిక్యంతోపాటు డ్వామా పీడీ రవీందర్, డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ విజయ్‌ప్రకాశ్, ఏ పీఎంఐపీ పీడీ రామలక్ష్మీ, డీఎస్పీలు, సీఐలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అధికార పార్టీ ఎమ్మెల్యేలకు లభించని కలెక్టర్ దర్శనం
సాక్షి, సంగారెడ్డి: జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ వ్యవహార శైలి ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఖంగు తినిపించింది. కలెక్టర్‌ను కలవడానికి గురువారం ఆమె కార్యాలయానికి వచ్చిన దుబ్బాక, పటాన్చెరు ఎమ్మెల్యేలు చెరుకు ముత్యంరెడ్డి, నందీశ్వర్ గౌడ్లకు పరాభవం ఎదురైంది. ఇద్దరిలో ఓ ఎమ్మెల్యే కలెక్టర్‌ను కలుసుకోలేకే వెనుతిరిగిపోగా.. మరో ఎమ్మెల్యే దాదాపు రెండు గంటలకు పైగా ఎదురు చూడాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే...జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ గురువారం మధ్యాహ్నం తన కార్యాలయ సమావేశ మందిరంలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ఈ సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభమైన కొద్ది సేపటి తర్వాత ఎమ్మెల్యేలు చెరుకు ముత్యంరెడ్డి ముత్యం రెడ్డి, నందీశ్వర్ గౌడ్లు కలెక్టర్‌ను కలవడానికి ఆమె కార్యాలయానికి వచ్చారు. ఎమ్మెల్యేలు వచ్చిన విషయాన్ని కార్యాలయ సిబ్బంది సమావేశంలో ఉన్న కలెక్టర్‌కు చేరవేశారు. అయితే, కలెక్టర్ స్మితా సబర్వాల్ సమావేశంలో పాల్గొనడానికే మొగ్గు చూపడంతో ఎమ్మెల్యేలు వేచి చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. దాదాపు అర్ధగంటకు పైగా వేచి చూసిన పటాన్చెరు ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కలెక్టర్‌ను కలుసుకోకుండానే వెనుతిరిగారు. ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి మాత్రం మధ్యాహ్నం 3 గంటల వరకు వేచి చూసి కలెక్టర్‌ను రాగానే ఆమెతో కాసేపు మాట్లాడి వెళ్లిపోయారు. ఈ అంశంపై ముత్యంరెడ్డి ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ .. మొక్కజొన్న కొనుగోళ్లు పూర్తై రైతులకు మార్క్‌ఫెడ్ ఇంకా డబ్బులు చెల్లించలేదనే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకురావడానికి వచ్చినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ నేతలిద్దరూ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలో సభ్యులైనప్పటికీ సమావేశంలో పాల్గొనకుండా కలెక్టర్‌ను కలవడానికే మొగ్గు చూపడం విశేషం. -
31 వరకు ఐజీపీ విద్యుదీకరణ పూర్తిచేయాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఇందిరా జలప్రభ పథకం(ఐజీపీ) కింద బోర్లకు విద్యుదీకరణ ప్రక్రియ ను ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 31వ తేదీ నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ స్మితాసబర్వాల్ ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశంలో ఇంది రా జలప్రభ పథకంపై డ్వామా, విద్యుత్, ఏపీఎంఐపీ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరా జలప్రభ పథకం కింద చేపట్టిన 20 వేల ఎకరాల భూమిని పూర్తిస్థాయిలో సాగులోకి తెచ్చేందుకు సమన్వయంలో పనిచేయాలన్నారు. వీటికి ఓఆర్సీచెల్లింపులను డ్వామా అధికారులు చెల్లించాలన్నారు. డ్రిప్ పరికరాలను 15 రోజుల్లోగా అమర్చేలా చర్యలు తీసుకోవాలని ఏపీఎంఐపీ పీడీ రామలక్ష్మీని ఆదేశించారు. ఈ సమావేశంలో జేసీ డాక్టర్ ఎ.శరత్, ట్రాన్స్‌కో ఎస్ఈ రాములు, డ్వామా ఏపీడీలు, విద్యుత్‌శాఖ డీఈలు పాల్గొన్నారు. -
రైతుహితమే లక్ష్యం
నారాయణఖేడ్ రూరల్, న్యూస్‌లైన్: రానున్న రోజుల్లో సాగునీరు, విద్యుత్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున రైతులు రబీలో ఆరుతడి పంటలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ సూచించారు. నారాయణఖేడ్‌లోని సాయిబాబా ఫంక్షన్‌హాలులో మంగళవారం నియోజకవర్గ రైతులకు ‘రైతుహిత’ సదస్సు ద్వారా పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ సదస్సుకు హాజరైన జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ మాట్లాడుతూ, రైతులంతా వరిసాగుపై దృష్టి సారించకుండా, నీటి లభ్యత, విద్యుత్ సరఫరాను దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటలైన మొక్కజొన్న, జొన్న పంటలను అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. బోర్లు తవ్వించే రైతులు కూడా భూగర్భ జలాలను దృష్టిలో ఉంచుకుని బోర్లు వేసేందుకు ప్రయత్నించాలన్నారు. లేకపోతే బోర్లు తవ్వినా నీరుపడక తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని కలెక్టర్ హెచ్చరించారు. రైతులు సాగులో అధునాతన పద్ధతులు పాటించేలా చూసేందుకే ‘రైతుహిత’ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో వరి, మొక్కజొన్న, పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర అందేలా చూస్తామన్నారు. సాగులో రైతులకు కావాల్సిన సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించేందుకే ’రైతుహిత’ ముఖ్య ఉద్దేశమన్నారు. ఖేడ్ ప్రాంతంలో వలసల నివారణకు ఈజీఎస్‌లో పనులు కల్పిస్తున్నట్టు తెలిపారు. జలప్రభ పథకం ద్వారా 6,500 మంది ఎస్సీ, ఎస్టీ రైతులకు చెందిన 16వేల హెక్టార్ల భూమిని సాగులోకి తెచ్చేందుకు పనులు జరుగుతున్నాయన్నారు. రబీ సీజన్లో ఖేడ్ నియోజకవర్గ రైతులకు బ్యాంకర్ల ద్వారా రూ.20 కోట్ల వరకు పంట రుణాలను అందించామనీ, వీటిని సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు సాధించాలన్నారు. మార్కెట్ యార్డుకు కృషి జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ మాట్లాడుతూ, ఉపాధి హామీని వ్యవసాయానికి అనుబంధం చేయాలని పార్లమెంట్లో ప్రశ్నించానన్నారు. రైతుల కృషితోనే దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతున్నాయన్నారు. నారాయణఖేడ్‌లో మార్కెట్ యార్డు, ఉల్లి, టమాటలకు కోల్డ్‌స్టోరేజీలకు కృషి చేస్తామన్నారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి మాట్లాడుతూ, ఖేడ్ నియోజకవర్గంలో పరిశ్రమలు లేవనీ, అందువల్లే అందరూ వ్యవసాయంపైనే ఆధారపడ్డారన్నారు. భూగర్భ జలాలు కూడా అంతంతమాత్రంగానే ఉండడంతో రైతులు అధికంగా వర్షాధార పంటలపై ఆధారపడి ఉన్నారన్నారు. అంతకుముందు వ్యవసాయ, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో ప్రదర్శించిన స్టాల్స్‌లను కలెక్టర్ పరిశీలించారు. రైతులు, అధికారులతో మాట్లాడారు. కార్యక్రమంలో నారాయణఖేడ్ సర్పంచ్ అప్పారావ్షెట్కార్, అగ్రికల్చర్ జేడీ ఉమామహేశ్వరమ్మ, ఆర్డీఓ ధర్మారావు, హార్టికల్చర్ ఏడీ శేఖర్, సీడీసీ చైర్మన్ నర్సింహారెడ్డి, ఏఎంసీ చైర్మన్ వీరారెడ్డి, ఏడీఏ ప్రసాద్, ఏఓ శ్రీనివాస్, ఆత్మ చైర్మన్ భాస్కర్, మాజీ జెడ్పీటీసీ సంజీవ్‌రెడ్డి, రషీద్, కాంగ్రెస్ నేతలు చంద్రశేఖర్‌రెడ్డి, శంకరయ్యస్వామి, సుధాకర్‌రెడ్డి, సంగారెడ్డి, భోజిరెడ్డి,మాణిక్‌రెడ్డి, తాహెర్, వినోద్‌పాటిల్, పండరిరెడ్డి, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అనుసంధానం..అంతంతే
సాక్షి, సంగారెడ్డి: వంట గ్యాస్-ఆధార్ కార్డు అనుసంధానం ప్రక్రియ జిల్లాలో చతికిలపడింది. ఇక ఆధార్-బ్యాంక్ ఖాతాల అనుసంధానం పక్రియ మరింత దిగజారింది. ఇప్పటి వరకు జిల్లాలో కేవలం 50 శాతం వినియోగదారులు మాత్రమే ఆధార్‌తో అనుసంధానం చేయించుకున్నారు. జిల్లాలో 4,89,707 గృహ అవసర గ్యాస్ కనెక్షన్లు ఉండగా, అందులో 2,47,978 కనెక్షన్లు మాత్రమే ఆధార్‌తో అనుసంధానమయ్యాయి. ఇక ఆధార్‌తో బ్యాంక్ ఖాతాల అనుసంధానమైతే కేవలం 1,35,097 కనెక్షన్లకు మాత్రమే పూర్తైది. వంట గ్యాస్ సబ్సిడీని ఆధార్‌తో ముడిపెట్టవద్దని సుప్రీం కోర్టు, రాష్ట్ర హైకోర్టుల తీర్పుల నేపథ్యంలో వినియోగదారుల్లో కొంత అయోమయం నెలకొందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం న్యాయ స్థానాల తీర్పులను అమలు చేయకపోవడంతో వినియోగదారులందరూ ఆధార్‌తో అనుసంధానం కాక తప్పని పరిస్థితి నెలకొంది. అయినా వినియోగదారులు ముందుకు రాకపోవడంతో ఈ ప్రక్రియ సా..గుతూ పోతోంది. ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాలు లేకపోవడం సైతం అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో ఈ నెల 29, 30 తేదీల్లో జిల్లాలో మళ్లీ బ్యాంకు మేళాలు నిర్వహించి రాయితీ పథకాల లబ్ధిదారులకు జీరో బ్యాలెన్స్(నో ఫ్రిల్) ఖాతాలు అందించడానికి జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త ఖాతాల జారీతో పాటు బ్యాంకు ఖాతాలను ఆధార్ కార్డులతో అనుసంధానం కోసం ఈ మేళాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. పెరిగిన గడువు .. వంట గ్యాస్-ఆధార్ అనుసంధానికి తుది గడువు డిసెంబర్ 31తో ముగిసిపోయింది. పురోగతి లేకపోవడంతో జనవరి 31 వరకు గడువును పొడిగిస్తూ చమురు సంస్థలు వెసులుబాటు కల్పించాయి. దీంతో ప్రస్తుతం ఆధార్‌తో అనుసంధానం కాని వినియోగదారులకు సబ్సిడీపైనే గ్యాస్ అందిస్తున్నారు. పొడిగించిన గడువులోగా ఆధార్‌తో అనుసంధానం కాకపోతే ఆతర్వాత రాయితీపై వంట గ్యాస్ లభించదని అధికాారులు తేల్చి చెబుతున్నారు. ప్రస్తుతం వంట గ్యాస్ రాయితీపై రూ.444, రాయితీ లేకుండా రూ.1,327కు లభిస్తోంది. గడువులోగా అనుసంధానం కాని వినియోగదారులు ఒక్కో సిలిండర్‌పై రూ.900 వరకు అదనపు భారాన్ని మోయాల్సిన పరిస్థితి ఉత్పన్నం కానుంది. 8 వేల కనెక్షను బ్లాక్ ఒక కుటుంబానికి ఒకే కనెక్షన్ విధానాన్ని గ్యాస్ కంపెనీలు అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లుంటే ఏరివేయడానికి గత ఏడాది వినియోగదారుల నుంచి కేవైసీ ఫారాలను స్వీకరించి సమాచారాన్ని విశ్లేషించాయి. దీని ఆధారంగా జిల్లాలో 8 వేల మంది వినియోగదారులు ఒకటికి మించి కనెక్షన్లు కలిగి ఉండడంతో ఆ కనెక్షన్లను బ్లాక్ చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అందులో 3,600 కనెక్షన్లు భారత్ గ్యాస్‌కు సంబంధించినవి కాగా..మిగిలిన కనెక్షన్లు ఇండెన్, హెచ్‌పీ కంపెనీలవి ఉన్నాయి. -
ఆర్నెల్లుగా అదే మాట
సర్కార్ ప్రోత్సాహం... మాటలకే పరిమితమైంది. పంచాయతీ ఖజానా వెక్కిరిస్తోంది. ఎన్నో ఆశలతో గెలిపించిన ప్రజలు మాత్రం ఏదో చేస్తారంటూ ఎదురుచూస్తున్నారు. దీంతో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. సర్పంచ్ పీఠం ఎక్కి ఆరు నెలలు దాటినా గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టలేక, ప్రశ్నించే వారికి సమాధానం చెప్పలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాలకులు మాత్రం నిధుల సాకుతో ప్రోత్సాహక సొమ్ముల ఫైలును తొక్కిపెట్టారు. పదవికి ఇద్దరు నామినేషన్లు వేసినా పరిశీలనలో అవి తిరస్కరణకు గురయ్యాయి. ఇక రాయిలాపూర్‌లో 5వ వార్డులు, చింతపల్లిలో ఒక వార్డుకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఇటీవలి కాలంలో జిల్లాలోని ముగ్గురు వార్డు సభ్యులు మరణించగా, మరో ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో జిల్లాలో మొత్తం 21 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. కలెక్టర్ స్మితా సబర్వాల్ పరిశీలనలో వున్న ఫైలు ఆమోదం పొందిన వెంటనే మూడో తేదీన నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. -
‘ఆరుతడి’ని ప్రోత్సహించండి
సిద్దిపేట రూరల్, న్యూస్‌లైన్: రానున్న రోజుల్లో విద్యుత్, భూగర్భ జలాల సమస్యల నుంచి గట్టెక్కెందుకు ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేయాలని జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ సూచించారు. ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదు కావడంతో రైతులు మూకుమ్మడిగా వరి సాగుకు సిద్ధమతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్నా, వేసవిలో విద్యుత్ సరఫరా సమస్యలు ఎదురైతే వరి రైతాంగం నష్టపోయే అవకాశాలున్నాయని ఆమె హెచ్చరించారు. ఆరుతడి పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని ఆదర్శ రైతులను ఆమె ఆదేశించారు. సిద్దిపేట మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన ఆదర్శ రైతులకు అవగాహన కార్యక్రమంలో ఆమె స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్మితా సబర్వాల్ మాట్లాడుతూ, ప్రస్తుతం పల్లెల్లో వరి నాట్లు ఉధృతంగా సాగుతున్నాయనీ, అయితే రైతులంతా వరి సాగుపైనే దృష్టి సారిస్తే రానున్న రోజుల్లో సాగునీరు, విద్యుత్ సమస్య తలెత్తే ప్రమాదం ఉన్నందున ఇంకా నార్లుపోయని రైతులతో వరి సాగును మాన్పించి, ఆరుతడి పంటల సాగు వైపునకు వారి దృష్టి మళ్లించాలని సూచించారు. ఆరుతడి పంటల విత్తనాలను రైతుల కోసం అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఇంకా అవసరమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తెప్పిస్తామని హామీ ఇచ్చారు. వరి సాగు విస్తీర్ణం అమాంతంగా పెరిగిపోతే వచ్చే ఏడాది భూగర్భ జలాల మట్టం పడిపోయే ప్రమాదముందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే హరీష్‌రావు మాట్లాడుతూ, ప్రభుత్వం వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ సరఫరా చేయలేక ఇప్పుడే చేతులెత్తేసిందన్నారు. ప్రస్తుతం ఆరు గంటల మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారని, రానున్న రోజుల్లో సరఫరా మరింత తగ్గే అవకాశాలున్నాయన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ఆరుతడి పంటల సాగుకే మొగ్గు చూపాలన్నారు. బహిరంగ మార్కెట్లో ఆరుతడి పంటల దిగుబడులకు మంచి గిట్టుబాటు ధర లభిస్తోందన్నారు. సమావేశంలో ఆర్డీఓ ముత్యంరెడ్డి, ఎంపీడీఓ బాలరాజు, ఏడీఏ వెంకటేశ్వర్లు, ఏఓ అనీల్ కుమార్, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులతో పాటు సుమారు 200 మంది ఆదర్శ రైతులు పాల్గొన్నారు. -
పంచాయతీ ‘ఉప’ ఎన్నికలకు రెడీ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: వివిధ కారణాలతో గత ఏడాది జూన్‌లో ఎన్నికలు నిలిచిపోయిన రెండు గ్రామ పంచాయతీలకు ఈ నెల 18న ఎన్నికలకు జరగనున్నాయి. ఈ మేరకు జిల్లా పంచాయతీ కార్యాలయం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు పూర్తి చేసింది. మరణాలు, రాజీనామాలతో ఖాళీగా ఉన్న 21 పంచాయతీ వార్డులకు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఈ ఎన్నికలకు ఈ నెల మూడో తేదీ నుంచి ఆరు వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. పంచాయతీ పోరు ఇప్పుడెందుకంటే... గత ఏడాది జూన్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సంగారెడ్డి మండలం చింతల్‌పల్లి పంచాయతీ సర్పంచ్ పదవిని ఎస్టీలకు రిజర్వు చేశారు. అయితే అర్హులైన ఎస్టీ ఓటర్లు ఎవరూ పంచాయతీ పరిధిలో సర్పంచ్ పదవికి నామినేషన్లు దాఖలు కాలేదు. కౌడిపల్లి మండ లం రాయిలాపూర్‌లో సర్పంచ్ పదవికి ఇద్దరు నామినేషన్లు వేసినా పరిశీలనలో అవి తిరస్కరణకు గురయ్యాయి. ఇక రాయిలాపూర్‌లో 5వ వార్డులు, చింతపల్లిలో ఒక వార్డుకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఇటీవలి కాలంలో జిల్లాలోని ముగ్గురు వార్డు సభ్యులు మరణించగా, మరో ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో జిల్లాలో మొత్తం 21 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. కలెక్టర్ స్మితా సబర్వాల్ పరిశీలనలో వున్న ఫైలు ఆమోదం పొందిన వెంటనే మూడో తేదీన నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. -
జాబితాలో నిజమైన ఓటర్లను గుర్తించాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఓటరు జాబితాలో నిజమైన ఓటరును గుర్తించాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆర్డీఓలు, తహశీల్దార్లతో ఎన్నికల జాబితా, దరఖాస్తులపై కలెక్టర్‌సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిసెంబర్ 23వ తేదీ వరకు ఓటరు జాబితాలో పేరు నమోదు, మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఈ జాబితాలో ఎటువంటి తప్పులు దొర్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఓటరు జాబితాలో నిజమైన ఓటరును గుర్తించి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలన్నారు. ఓటరు దరఖాస్తులను, సవరణకోసం వచ్చిన వాటిని సంబంధిత అధికారులంతా ఇంటింటికీ వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని అన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం, తుది జాబితాను ఈనెల 16వ తేదీన విడుదల చేస్తామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జేసీ శరత్, డీఆర్ఓ సాయిలు, ఆర్డీఓలు ధర్మారావు, వనజారెడ్డి, ముత్యంరెడ్డి పాల్గొన్నారు. ప్రసవాల సంఖ్య పెంచాలి ‘మార్పు’లోని 20 అంశాలపై చర్చ జరిగినప్పుడే క్షేత్రస్థాయిలో మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని కలెక్టర్ స్మితాసబర్వాల్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో మార్పు, సన్నిహిత, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ ప్రగతిపై సంబంధిత క్లస్టర్ ప్రత్యేక అధికారులు, సీడీపీవోలు, తహశీల్దార్, ఎంపీడీవో, ఏపీవో, ఐకేపీ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాల సంఖ్య పెంచేలా వీవోల సమావేశాలలో చర్చిస్తూ ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లకు వీటిపై విస్తృత అవగాహన, శిక్షణ కల్పించాల్సిన అవసరముందన్నారు. క్రమ శిక్షణ అతిక్రమించే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో అర్హత కలిగిన నిరుపేదలు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ముందుకు వస్తే ఎన్ఆర్ఈజీఎస్ అమలు కాని ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా జాబ్‌కార్డులను జారీ చేసి నిర్మించుకునేలా ప్రభుత్వ అనుమతి తీసుకుంటామని ఈ లోపు అర్హులను గుర్తించాలని ప్రత్యేక అధికారి జెడ్పీ సీఈవో ఆశీర్వాదంకు జేసీ డాక్టర్ శరత్ సూచించారు. -
ఇవేం పరీక్షలు?
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: విద్యార్థుల ప్రతిభను సమగ్రంగా మధింపు చేసేందుకు ప్రభుత్వం సీసీఈ విధానాన్ని రాజీవ్ విద్యా మిషన్ ద్వారా అమలు చేస్తోంది. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఈ విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. గతంలో త్రైమాసిక, అర్ధవార్షిక, వార్షిక పరీక్షల ప్రశ్న పత్రాలను జిల్లా పరీక్షల ఉమ్మడి బోర్డు(డీసీఈబీ) ద్వారా పాఠశాలలకు పంపిణీ చేసేవారు. గురువారం నుంచి ప్రారంభమయ్యే అర్ధవార్షిక పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాలను రాష్ట్ర స్థాయిలో రాజీవ్ విద్యా మిషన్ రూపొందించింది. ‘ఆర్క్బర్డ్’ పబ్లికేషన్స్ అనే ప్రైవేటు సంస్థకు ముద్రణ, పంపిణీ బాధ్యతలు అప్పగించింది. సదరు సంస్థ ప్రశ్న పత్రాలను 1000, 500 కట్టలుగా కట్టి బస్తాల్లో జిల్లాకు పంపింది. మెదక్‌లోని ప్రభుత్వ పాఠ్య పుస్తకాల గోడౌన్లో సదరు ఏజెన్సీ ప్రశ్న పత్రాలు డంప్ చేసి చేతులు దులుపుకుంది. దీంతో తరగతులు, పాఠశాలల వారీగా ప్రశ్న పత్రాలను వేరు చేసి సీల్డ్ కవర్లలో పాఠశాలలకు చేరవేయాల్సిన బాధ్యత రాజీవ్ విద్యా మిషన్ అధికారులపైనే పడింది. 2023 ప్రాథమిక పాఠశాలలు, 434 ప్రాథమికోన్నత పాఠశాలలకు 2.64లక్షల ప్రశ్న పత్రాలను సకాలంలో చేరవేయ లేక విద్యాశాఖ, ఆర్వీఎం అధికారులు, సిబ్బంది తల పట్టుకుంటున్నారు. ప్రాథమిక పాఠశాల స్థాయిలో 18, ప్రాథమికోన్నత స్థాయిలో 19 టైటిళ్లకు సంబంధించిన ప్రశ్న పత్రాలను లెక్క తప్పకుండా సర్దుబాటు చేయలేక పోతున్నారు. మండల వనరుల కేంద్రాలకు(ఎంఆర్సీ) ప్రశ్న పత్రాలు పంపినా, తిరిగి అక్కడా ప్రశ్న పత్రాలను వేరు చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే ఆదరాబాదరాగా కొన్ని పాఠశాలలకు ప్రశ్న పత్రాలను చేరవేయగలిగారు. అయితే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రశ్న పత్రాలు సరఫరా కాకపోవడంతో ప్రధానోపాధ్యాయులు తిరిగి మండల కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ప్రశ్న పత్రాలకు రక్షణ ఏదీ? భద్రంగా సీల్డ్ కవర్లలో సరఫరా చేయాల్సిన ప్రశ్న పత్రాలు ఓపెన్ కవర్లలో పాఠశాలలకు చేరవేస్తున్నారు. దీంతో ప్రశ్న పత్రాల్లో వున్న ప్రశ్నలను ఉపాధ్యాయులు ముందుగానే తెలుసుకునే అవకాశం ఏర్పడింది. అర్ధవార్షిక పరీక్షల ఫలితాలను పాఠశాలలు, సబ్జెక్టుల వారీగా సమీక్షిస్తామని కలెక్టర్ స్మితాసబర్వాల్ హెచ్చరించారు. ప్రశ్న పత్రాలు ముందే వెల్లడవుతుండటంతో ఉపాధ్యాయులు ప్రశ్నలను విద్యార్థులకు ముందస్తుగా వెల్లడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో డీసీఈబీ ద్వారా సరఫరా చేసే ప్రశ్న పత్రాలను సీల్డ్ కవర్లలో పంపేలా తగిన ఏర్పాట్లు చేసేవారు. ప్రస్తుతం రాజీవ్ విద్యా మిషన్ రాష్ట్ర స్థాయిలో ప్రశ్న పత్రాలు ముద్రించాలనే నిర్ణయం వెనుక అధికారుల ప్రయోజనాలు దాగి ఉన్నాయనే అనుమానాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. సర్దుబాటు చేస్తున్నాం: ఎఎంఓ సత్యనారాయణ ప్రశ్న పత్రాలు కట్టలుగా సర ఫరా చేయడంతో వేరు చేయడంలో సమస్య తలెత్తిందని ఆర్వీఎం అకడమిక్ మానిటరింగ్ అధికారి సత్యనారాయణ ‘సాక్షి’కి వెల్లడించారు. ప్రశ్న పత్రాలు తక్కువ పడిన పాఠశాలలకు తక్షణమే ప్రశ్న పత్రాలు పంపేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. టైటిళ్లు ఎక్కువగా వుండటంతో బండిల్స్ చేయడంలో శ్రమిస్తున్నామన్నారు. -
వీఆర్ఓ, వీఆర్ఏల నోటిఫికేషన్ విడుదల
కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో 98 గ్రామ రెవెన్యూ అధికారి, 172 గ్రామ రెవెన్యూ సహాయకుల ఉద్యోగాల భర్తీ కోసం ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామ రెవెన్యూ అధికారిగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జిల్లా వాసులై ఉండడంతో పాటు కనీసం ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండాలన్నారు, ఈ ఏడాది జులై 1 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల వయస్సు కలిగి ఉన్న వారు మాత్రమే అర్హులన్నారు. ఎస్సీ, అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, మాజీ సైనిక ఉద్యోగులకు 39 ఏళ్ల వయస్సు సడలింపు ఉందన్నారు. ఓపెన్ స్కూల్ విధానంలో ఇంటర్మీడియెట్ విద్యార్హత కలిగిన వారు కూడా అర్హులన్నారు. వీఆర్వో పరీక్ష 2014 ఫిబ్రవరి 2న ఉదయం నిర్వహిస్తామని ఆమె తెలిపారు. గ్రామ రెవెన్యూ సహాయకుడి పోస్టుకు ఏ గ్రామానికి చెందిన వారు అక్కడే అర్హులన్నారు. కనీస విద్యార్హత పదో తరగతి పాసై ఉండాలన్నారు. 18 నుంచి 36 ఏళ్ల వయస్సు కలిగిన వారు అర్హులన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల సడలింపు, మాజీ సైనిక ఉద్యోగులకు 39 ఏళ్ల వరకు అర్హులన్నారు. ఈ పరీక్ష ఫిబ్రవరి 2న మధ్యాహ్నం ఉంటుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ద్వారా మీ-సేవ, ఇంటర్నెట్ సెంటర్ ద్వారా జనవరి 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు రూ. 300, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 150 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. వికలాంగులు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. అభ్యర్థులు పరీక్ష ఫీజును జనవరి 12లోగా చెల్లించాలన్నారు. రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బోత్ ఆప్షన్ చేయించుకుంటే ఒకే సెంటర్లో రెండు పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. దరఖాస్తులను ఠీఠీఠీ.ఛిఛ్చి.ఛిజజ.జౌఠి.జీ లో నమోదు చేసుకోవచ్చన్నారు. అభ్యర్థులు తెలుగు, ఉర్దూ, ఆంగ్ల మాధ్యమంలో పరీక్ష రాయవచ్చన్నారు. మరిన్ని వివరాల కోసం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన 08455-272525కు సంప్రదించవచ్చన్నారు. -
ఆరోగ్యవంతమైన సమాజమే ‘మార్పు’ లక్ష్యం
గజ్వేల్ రూరల్, న్యూస్‌లైన్: ఆరోగ్యవంతమైన సమాజమే ‘మార్పు’ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ సిత్మా సబర్వాల్ అన్నారు. శుక్రవారం గజ్వేల్ పట్టణంలోని కోలా అభిరాం గార్డెన్స్‌లో ‘మార్పు’ కార్యక్రమంపై నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ, ‘మార్పు’ పథకం అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి గర్భిణి ఈ పథకంలో తన పేరు నమోదు చేసుకునేలా అధికారులు వారికి అవగాహన కల్పించాలన్నారు. మాత, శిశు సంరక్షణ కార్డులో పేర్లు నమోదు చేసుకోవడం ద్వారా ఉచితంగా పౌష్టికాహారం, వైద్య సేవలు, సూచనలు అందుతాయని తెలియజెప్పాలన్నారు. ఓ మహిళ గర్భం ధరించినప్పటి నుంచీ ఆమెకు అన్ని విధాలా సలహాలు, సూచనలు అందిస్తూ, ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవం అయ్యే విధంగా ఆశ వర్కర్లు, అంగన్వాడీలు, ఏఎన్ఎంలు చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు సమన్వయంతో పని చేసి ‘మార్పు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ, కొత్తగా బాధ్యతలు చేపట్టిన సర్పంచ్‌లు నెలకోసారి గ్రామంలో సమావేశం జరిగేలా చూడాలన్నారు. ప్రతి పథకాన్నీ మహిళలకు అందించడంలో చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి పద్మ, డీసీహెచ్ వీణ, డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి, ఆర్డీఓ ముత్యంరెడ్డి, డీపీఓ జగన్నాథం, డీఈఎంఓ వసంతరావు, నియోజకవర్గంలోని ఎంపీడీఓలు, తహశీల్దార్లు, పీహెచ్సీ ైవె ద్యాధికారులు, ఐకేపీ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. -
పంచాయతీ కార్యదర్శిపై వేటు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన మెదక్ మండలం అవుసులపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్‌ను కలెక్టర్ స్మితాసబర్వాల్ సస్పెండ్ చేశారు. పారిశుద్ధ్య వారోత్సవాల్లో భాగంగా జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్‌రెడ్డి ఈ నెల 19న అవుసులపల్లిని సందర్శించారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉన్నట్లు గుర్తించారు. పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన నర్సాపూర్ మండలం నత్నాయపల్లి కార్యదర్శి శ్రీనివాస్‌ను కూడా కలెక్టర్ నవంబర్‌లో సస్పెండ్ చేసిన విషయం విదితమే. కాగా పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసిన 230 సర్పంచ్‌లకు కూడా తాజాగా నోటీసులు జారీ చేశారు. 13వ ఆర్థిక సంఘం, జనరల్ ఫండ్ తదితర పద్దుల కింద పంచాయతీ ఖాతాల్లో ఉన్న నిధులను కొందరు సర్పంచ్‌లు ఒకే పర్యాయం డ్రా చేశారు. వీటికి సంబంధించిన సరైన లెక్కలు చూపని పక్షంలో చర్యలు తీసుకుంటామంటూ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం సదరు సర్పంచ్‌లకు నోటీసులు జారీ చేసింది. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ‘మార్పు’
మెదక్, న్యూస్‌లైన్: మాత, శిశు సంరక్షణే లక్ష్యంగా.. నిరుపేద మహిళల ఆరోగ్యమే ధ్యేయంగా కలెక్టర్ స్మితాసబర్వాల్ ‘మార్పు’ పథకానికి ఊపిరి పోశారు. ఫలితంగా ఇంత వరకూ కాన్పుకు నోచుకోని ప్రభుత్వాస్పత్రుల్లో అనునిత్యం ప్రసవాలు జరుగుతున్నాయి. చిన్నారుల కేరింతలు... బోసి నవ్వులతో ప్రభుత్వాస్పత్రులు కళకళలాడుతున్నాయి. పాపన్నపేట ప్రభుత్వాస్పత్రిలో ఒకేరోజు ఆరు కాన్పులు జరగడం ఇందుకు నిదర్శనం. కాని కొన్ని సౌకర్యాలలేమి వల్ల అక్కడక్కడా అపశ్రుతులు చోటు చేసుకుంటున్నాయి. గ్రామీణ ఆస్పత్రుల్లో సైతం అధునాతన సౌకర్యాలు కల్పిస్తే నిజమైన ‘మార్పు’ వస్తుందని పల్లెజనం పేర్కొంటున్నారు. రామాయంపేట క్లస్టర్ పరిధిలో 9 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు మెదక్, రామాయంపేట పెద్దాస్పత్రులు ఉన్నాయి. డిసెంబర్ నెలలో పాపన్నపేటలో 19, పొడ్చన్‌పల్లిలో 4, సర్ధనలో 6, వెల్దుర్తిలో 8, డి.ధర్మారంలో 8, చిన్నశంకరంపేటలో 4, చేగుంటలో 2, దౌల్తాబాద్‌లో 1, నార్సింగిలో 7 ప్రసవాలు జరిగాయి. మెదక్‌లో 107, రామాయంపేటలో ఒక ప్రసవం నమోదయ్యింది. సాధారణంగా మారుమూల గ్రామాల్లో గతంలో మంత్రసానులే ప్రసవాలు చేసేవారు. అప్పట్లో మాత, శిశు మరణాలు కూడా అధికంగా ఉండేవి. కాలం మారుతున్న తరుణంలో నిరుపేద మహిళలు సైతం పట్టణంలోని ప్రైవేట్ఆస్పత్రుల్లోనే ప్రసవాలు చేయించుకుంటున్నారు. వీరి అవసరాన్ని ఆసరాగా తీసుకుంటున్న ప్రైవేట్ ఆస్పత్రుల యజమానులు అవసరమైనా..లేకున్నా..90 శాతం కాన్పులకు సిజేరియన్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. జిల్లాలోని ఏ పట్టణంలో చూసినా ఇదే తంతు కొనసాగుతుంది. ఒక్కకాన్పునకు ఎంతలేదన్న రూ.10 నుంచి 15వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. మార్పుతో మారిన పరిస్థితులు కలెక్టర్ స్మితాసబర్వాల్ చొరవతో ఊపిరి పోసుకున్న మార్పు పథకం. సత్ఫలితాలిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకు కనీసం 20 ప్రసవాలైనా జరగాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో సుమారు 12యేళ్లుగా ప్రసవాలు నమోదు కాని సర్ధన, పొడ్చన్‌పల్లి లాంటి ఆస్పత్రుల్లో కూడా వరుసగా ప్రసవాలు జరుగుతున్నాయి. పాపన్నపేట ప్రభుత్వాస్పత్రిలో ఈనెల 18న ఆరు ప్రసవాలు జరగడం గమనార్హం. ఇందులో ఓ ప్రభుత్వ మహిళా టీచర్, ఒక రెవెన్యూ అధికారి కుమార్తె ఉండటం విశేషం. ప్రభుత్వాస్పత్రుల్లో పురుడు పోసుకుంటే జననీ సురక్ష యోజన పథకంతోపాటు ఇతర ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. అసౌకర్యాలతో అపశ్రుతులు గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సౌకర్యాలలేమితో కొన్ని అపశ్రుతులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఈనెల 11న మెదక్ ఏరియా ఆస్పత్రిలో కౌడిపల్లి మండలం అన్నసాగర్ గ్రామానికి చెందిన మంజుల ప్రసవానికి వచ్చింది. ప్రసవం అనంతరం 24 గంటలలోపు మృత్యువాత పడింది. అదే విధంగా డిసెంబర్ 1న సిద్దిపేటలో ప్రశాంత్‌నగర్‌కు చెందిన రుద్రోత్ రేవతి అనే బీడీ కార్మికులు ప్రసవం కోసం ప్రభుత్వాస్పత్రికి వెళ్లగా చివరి సమయంలో మా వల్ల కాదంటూ పట్టణానికి పంపడంతో కుటుంబీకులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇటీవల నర్సాపూర్‌లో సైతం ఇలాంటి దారుణం చోటు చేసుకోవడం గమనార్హం. ప్రసవాలు జరిగే అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో అనస్తీషియన్, డీజీఓ, పిడియాట్రిషియన్, బ్లడ్‌బ్యాంకు, వార్మర్, ఇంక్యుబెటర్, ఆక్సిజన్, అంబులెన్స్ లాంటి సౌకర్యాలుంటే సుఖంగా ప్రసవాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
కానరాని ‘సామాజిక బాధ్యత’!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్సార్) కింద పరిశ్రమల నుంచి కోట్లాది రూపాయలు వసూలు కావాల్సి ఉంది. నిబంధనలపై అధికారులకు అవగాహన లేకపోవడంతో ఏళ్ల తరబడి సీఎస్సార్ పద్దు కింద నిధుల సేకరణ నత్తనడకన సాగుతోంది. సమస్యలను సాకుగా చూపుతూ ‘సామాజిక బాధ్యత’ కింద ఇవ్వాల్సిన నిధిని యజమానులు అరకొరగా విదుల్చుతున్నారు. దీంతో సామాజిక అవసరాల కోసం వినియోగించాల్సిన సొమ్ము కోసం అధికారులు పరిశ్రమల యజమానుల వేటలో పడ్డారు. జిల్లాలో సుమారు 400 పైగా భారీ, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. వసూలయ్యే సీఎస్సార్ నిధిని విద్య, వైద్యం, కుటుంబ సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, రక్షిత తాగునీటి సరఫరా, బలహీనవర్గాల సంక్షేమం తదితర సామాజిక అవసరాల కోసం వెచ్చించాల్సి ఉంటుంది. జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి(సీపీఓ) కన్వీనర్‌గా వ్యవహరించే కలెక్టర్ ఆమోదంతో సామాజిక అవసరాలకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. సీఎస్సార్ కింద నిధి ఇవ్వడం తప్పనిసరి కాకపోయినా, పరిశ్రమల పెట్టుబడిలో కనీసం 0.2 శాతం యజమానులు జిల్లా యంత్రాంగానికి ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా రూపొందిస్తున్న విధానం మేరకు పరిశ్రమలు ఆర్జించే లాభాల్లో 0.2 శాతం సీఎస్సార్ పద్దుకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో ఏళ్ల తరబడి పరిశ్రమల నుంచి సీఎస్సార్ నిధికి డబ్బు సమకూరడం లేదు. గతంలో కలెక్టర్లుగా పనిచేసిన సురేశ్ కుమార్, దినకర్‌బాబు సుమారు మూడు కోట్ల రూపాయలు సీఎస్సార్ ఫండ్‌గా సమకూర్చారు. పరిశ్రమలన్నీ స్పందిస్తే ఈ మొత్తం సుమారు రూ.30 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. కలెక్టర్‌గా స్మితాసబర్వాల్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీఎస్సార్ ఫండ్ సేకరణపై దృష్టి సారించారు. సీపీఓ కన్వీనర్‌గా ఎనిమిది మంది జిల్లా అధికారులతో ప్రస్తుతం ఓ కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్, డీపీఓ, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నట్లు సమాచారం. పరిశ్రమలకు లేఖలు పరిశ్రమల వారీగా సీఎస్సార్ మొత్తాన్ని లెక్కగట్టి లేఖలు రాసే పనిలో సంబంధిత అధికారులు నిమగ్నమయ్యారు. బడా పరిశ్రమల నుంచి పెద్ద మొత్తంలో సీఎస్సార్ నిధి అందాల్సి ఉండటంతో వాటిపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా నుంచే సుమారు రూ.70 లక్షలకు పైగా నిధి వసూలు కావాల్సి ఉంది. ప్రత్యేక ఖాతాలో జమ చేయాల్సిన డబ్బును కొన్ని పరిశ్రమలు తామే సొంతంగా ఖర్చు చేసినట్లు లెక్కలు చూపుతున్నాయి. గ్రామాల్లో వైద్య శిబిరాలు, పాఠశాలల్లో యూనిఫారాలు, పుస్తకాలు పంపిణీ చేసినట్లు చెప్తున్నాయి. సీఎస్సార్ నిధి ఇవ్వకుండా తప్పించుకునేందుకే పరిశ్రమలు ఇలాంటి ఎత్తుగడలకు పాల్పడుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎస్సార్ నిధిని సొంతంగా ఖర్చు చేసే పరిశ్రమలకు కలెక్టర్ స్మితా సబర్వాల్ కొత్త మెలిక పెట్టారు. ఇకపై సొంతంగా నిధులు వెచ్చించే పరిశ్రమలు కచ్చితంగా కలెక్టర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని లేఖలు రాస్తున్నారు. సీఎస్సార్ ద్వారా సమకూరే నిధిని సంక్షేమ హాస్టళ్లలో సౌకర్యాల మెరుగు పరిచేందుకు వినియోగించాలని కలెక్టర్ యోచిస్తున్నారు. హాస్టళ్లలో మౌలిక సౌకర్యాల కొరతపై ఈ నెల 28లోగా నివేదించాల్సిందిగా ‘సన్నిహిత’ అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. కాగా సీఎస్సార్ నిధి వసూలుకు ఈ నెల 30వ తేదీ గడువుగా నిర్ణయించారు. -
తెలంగాణ ఆగదు
మునిపల్లి, న్యూస్‌లైన్: సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ రావడం ఖాయమని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అన్నారు. సీమాంధ్ర నేతలు ఆడుతున్న నాటకాలను కేంద్రం గమనిస్తోందని తెలిపారు. మునిపల్లి మండలంలో ఆదివారం పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజనర్సింహ మాట్లాడుతూ ఆత్మగౌరవంతో కూడిన తెలంగాణ కోసం వెయ్యి మందికిపైగా యువకులు ఆత్మ బలిదానాలకు పాల్పడ్డారని గుర్తుచేశారు. సమానత్వంతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్టాన్ని ప్రకటించారని చెప్పారు. ప్రజల మనోభావాలను గుర్తించే రాష్ట్ర ఏర్పాటుకు సిద్ధమయ్యారని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 2004-09 కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నప్పుడు ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయని సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు ప్రస్తుతం అడ్డు తగలడం తగదన్నారు. సీమాంధ్ర పాలనలో అన్ని రంగాల్లో తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తేనే ప్రజలు సుఖ, సంతోషాలతో ఉంటారని అన్నారు. జిల్లా అభివృద్ధికి తాను ఎల్లవేళలా పాటుపడుతున్నానని తెలిపారు. అందోల్ నియోజకవర్గంలో రూ.300 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్టు ప్రకటించారు. నియోజకవర్గంలో 40 వేల ఎకరాలకు సాగునీరందించనున్నట్టు వెల్లడించారు. రైతుల సంక్షేమం కోసం అధిక నిధుల మంజూరుకు కృషి చేసినట్లు తెలిపారు. అక్షరాస్యత పెంపుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, అందరూ విద్యావంతులు కావాలన్నారు. కాగా మునిపల్లి మండలంలో రూ. 19 కోట్లతో పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీ సురేష్‌షెట్కార్, కలెక్టర్ స్మితా సబర్వాల్, రాయికోడ్, మునిపల్లి మండలాల మార్కెట్ కమిటీ చైర్మన్ రాంరెడ్డి, మాజీ ఎంపీపీలు అంజయ్య, రాజేశ్వర్‌రావు, టీడీపీ మాజీ అధ్యక్షుడు బాబూ పాటిల్, వీరన్న తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా డిప్యూటీ సీఎం సమక్షంలో టీడీపీకి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
జహీరాబాద్, న్యూస్‌లైన్: రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తోందని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జె.గీతారెడ్డి అన్నారు. శనివారం జహీరాబాద్ పట్టణంలోని ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘రైతు హిత’ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గీతారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ హయాంలో రైతులకే పెద్దపీట వేశామన్నారు. అందువల్లే రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరిస్తున్నామన్నారు. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా సబ్సిడీలపై వ్యవసాయ పరికరాలను అందిస్తున్నామన్నారు. వీటిని వినియోగించుకుని రైతులు లబ్ధి పొందాలన్నారు. అంతేకాకుండా వ్యవసాయ శాస్త్రవేత్తల చేత రైతులకు సూచనలు, సలహాలు ఇప్పిస్తూ దిగుబడులు పెరిగేలా చూస్తున్నామన్నారు. రైతు బాగుంటే దేశం బాగుంటుందని భావించే సర్కార్ తమదనీ, అందువల్లే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్సార్ తన తొలి సంతకర వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్ అందించే ఫైలుపైనే చేశారని ఆమె గుర్తుచేశారు. ఆ పథకాన్ని ఇప్పటికీ అమలు చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా సకాలంలో రైతులకు పంపిణీ చేశామన్నారు. చెరకు రైతుకూ చేయూనిచ్చాం రైతు సంక్షేమాన్ని విస్మరించిన అప్పటి పాలకులు జహీరాబాద్‌లోని నిజాం షుగర్స్ లిమిటెడ్ చక్కెర కర్మాగారాన్ని కారుచౌకగా విక్రయించారని గీతారెడ్డి ఆరోపించారు. యాజమాన్యం చెరకు ధరను రూ.2,400లు మాత్రమే ఇచ్చేందుకు సిద్ధపడగా, తాము రూ.2,600 ఇచ్చే విధంగా ఒత్తిడి చేసి రైతులకు మేలు చేకూర్చామన్నారు. అంతేకాకుండా సాగుకు అవసరమయ్యే పెట్టుబడులు కూడా బ్యాంకుల ఇప్పిస్తూ రైతులను చేయూతనిచ్చామన్నారు. పండ్ల తోటల సాగుపట్ల రైతులు ఆసక్తి చూపాలి: కలెక్టర్ జహీరాబాద్ ప్రాంతంలోని భూములు పండ్ల తోటల సాగుకు అనుకూలంగా ఉన్నందున రైతులు ఈ దిశలో శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ స్మిత సబర్వాల్ సూచించారు. పండ్ల తోటలతో పాటు కూరగాయలు కూడా సాగు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందన్నారు. ప్రస్తుతం సుమారు 10 వేల ఎకరాల్లో పండ్ల తోటలు సాగవుతున్నాయనీ, దీన్ని మరో రెండు వేల ఎకరాలకు పెంచుకోవాలన్నారు. పండ్లతోటల సాగుకు ముందుకు వచ్చే రైతులకు తగిన విధంగా సహకారం అందిస్తామన్నారు. పూల తోటల సాగుకు కూడా ప్రభుత్వం తగిన చేయూతనిస్తోందన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ ఎం.జైపాల్‌రెడ్డి, వ్యవసాయ శాఖ జాయింట్ డెరైక్టర్ ఉమా మహేశ్వరమ్మ, ఏపీ ఎంఐపీ పీడీ రామలక్ష్మి, హార్టికల్చర్ అసిస్టెంట్ డెరైక్టర్ శేఖర్, పశు సంవర్థక శాఖ జేడీ లక్ష్మారెడ్డి, సెరి కల్చర్ ఏడీ ఈశ్వరయ్య, పరిశ్రమల శాఖ జీఎం సురేష్‌కుమార్, వ్యవసాయ శాఖ జేడీ ఉమా మహేశ్వరమ్మ, కమిషనరేట్ ఓఎస్డీ అశోక్, సంగారెడ్డి ఆర్డీఓ ధర్మారావు, డ్వామా పీడీ రవీందర్, ఆత్మ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, ఆయా మండలాల రైతులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదమృతుల కుటుంబాలకు పరిహారం గత నెల 19వ తేదీన కోహీర్ మండలం దిగ్వాల్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన నలుగురు విద్యార్థులు, ఆటో డ్రైవర్ కుటుంబాలకు మంత్రి గీతారెడ్డి పరిహారం అందించారు. శనివారం జహీరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో నలుగురు విద్యార్థుల కుటుంబీకులతో పాటు ఆటో డ్రైవర్ కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల వంతున పరిహారం పంపిణీ చేశారు. గత నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జహీరాబాద్ పట్టణంలోని మాణిక్‌ప్రభు వీధికి చెందిన విద్యార్థి జేమ్స్, మండలంలోని విఠునాయక్ తండాకు చెందిన విద్యార్థి విఠల్, జహీరాబాద్ పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ జహీరుద్దీన్, న్యాల్కల్ మండలం ముంగి గ్రామానికి చెందిన విద్యార్థి యాదగిరి, ఝరాసంగంకు చెందిన మేఘమాలు మృతి చెందిన విషయం పాఠ కులకు విదితమే. -
రెడ్డి ల్యాబ్స్ రూ. 9.5 కోట్ల విరాళం
కలెక్టరేట్, న్యూస్‌లైన్: కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎన్ఆర్) కింద పారిశ్రామిక వేత్తలు తమవంతు బాధ్యతలు నిర్వహించేందుకు ముందుకు రావాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ పిలుపునిచ్చారు. శుక్రవారం రెడ్డిల్యాబ్స్ సంస్థ ప్రతినిధులు రవికుమార్, ప్రసాద్, బాలేశ్ సీఎన్ఆర్ కింద రూ.9.5 లక్షల చెక్కును కలెక్టర్ స్మితాసబర్వాల్కుకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద పారిశ్రామికవేత్తలు జిల్లా అభివృద్ధికి తమవంతు చేయూతనందించాలని కోరారు. ఈ నిధులను వసతి గృహాల మౌళిక వసతుల మెరుగు, ఇతర సామాజిక అంశాలపై వెచ్చిస్తున్నామనీ, వీటికి సంబంధించిన వివరాలను జిల్లా వెబ్సైట్లో ఎప్పటికప్పుడు పొందుపరుస్తున్నామని ఆమె తెలిపారు. సామాజిక బాధ్యతతో జిల్లా అభివృద్ధికి విరాళమిచ్చిన రెడ్డి ల్యాబొరేటిస్ యాజమాన్యాన్ని కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు. -
జనవరిలోగా రబీ రుణాలివ్వాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: రబీ పంట కాలానికి నిర్ధేశించిన రూ.280 కోట్ల పంట రుణాలను వచ్చే నెల మాసాంతానికి మంజూరు చేయాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ బ్యాంకర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పంటరుణాలు, స్వయం సహాయక సంఘాలకు, ఇతర ప్రభుత్వ పథకాల బ్యాంక్ రుణాలపై బ్యాంకర్ల సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 2013-14 సంవత్సరంలో రూ.1,134 కోట్ల బ్యాంక్ రుణాలకు గాను రూ.854 కోట్లు మంజూరు కాగా మిగిలిన రూ.280 కోట్ల రుణాన్ని రైతులకు సకాలంలో అందజేయాలని ఆదేశించారు. కౌలురైతులకు పంట రుణాలను విరివిగా అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పంట రుణాల పంపిణీలో గతంలో ఉన్న రుణాలకు ముడిపెడుతూ ఎలాంటి కోతలు విధించవద్దని బ్యాంకర్లను కోరారు. స్వయం సహాయక సంఘాలకు సంబంధించి రూ.486 కోట్లకు గాను ఇప్పటి వరకు రూ.335 కోట్లు రుణాలను అందించారని మిగిలిన లక్ష్యాన్ని సైతం త్వరగా పూర్తి చేయాలన్నారు. రుణాల రికవరీపై కలెక్టర్ స్పందిస్తూ ఐకేపీ తరపున ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి రికవరీ చేస్తామని బ్యాంకర్లకు తెలిపారు. నెలాఖరులోగా గ్రౌండింగ్ పూర్తి చేయాలి ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా అందజేస్తున్న వ్యక్తిగత, ఇతర పథకాలకు సంబంధించి బ్యాంక్ సమ్మతి, గ్రౌండింగ్ ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరం ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించి 948 యూనిట్లకు బ్యాంక్ సమ్మతి ఇవ్వాల్సి ఉందన్నారు. 22 పాడి గేదెల యూనిట్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వికలాంగులకు సంబంధించిన వాటన్నింటిని ఈ నెల చివరి నాటికి మంజూరు చేయాలని సూచించారు. సిద్దిపేట పట్టణంలో పందుల బెడదను శాశ్వతంగా నిర్మూలించేందుకు ఆయా కుటుంబాలకు ప్రత్యామ్నయ జీవనోపాధి పథకాలను రూపొందించామని కలెక్టర్ తెలిపారు. ఆ కుటుంబాల అభిష్టం మేరకు గుర్తించిన వారికి విరివిగా బ్యాంక్ రుణాలు అందజేసి ఆర్థికంగా ఆదుకోవాలని బ్యాంకర్లకు సూచించారు. అనంతరం రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ సీనియర్ కన్సల్టెంట్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మణివెంకటప్ప మాట్లాడుతూ, చదువుకున్న నిరుద్యోగ యువతకు సొంతం వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా రుణాలు అందించేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలన్నారు. సమావేశంలో ఏజేసీ మూర్తి, లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటయ్య వివిధ శాఖల జిల్లా అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు. -
డెడ్‌లైన్ దడ
సాక్షి, సంగారెడ్డి: వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు(బీఆర్జీఎఫ్) వ్యయంపై కలెక్టర్ ఆదేశాలు అధికారుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. 2010-11, 2011-12, 2012-13 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన పెండింగ్ పనులన్నింటినీ వచ్చే నెలాఖరుగాలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ అధికారులకు డెడ్‌లైన్ విధించారు. ఒక వేళ గడువులోగా పూర్తి కాని పనులను రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాస్తామని ఆమె తేల్చి చెప్పేశారు. అయితే చోటామోటా నేతలు అడ్వాన్సులు తినేసి ప్రారంభించని పనులు ఎక్కువ శాతం ఉన్నట్లు వెలుగు చూస్తుండడం అధికారుల్లో దడ మొదలైంది. బీఆర్జీఎఫ్ కింద 2010-13 కాలంలో జిల్లాకు మంజూరైన రూ.110.80 కోట్ల నిధులతో 12,353 పనులు చేపట్టగా.. అందులో 7,889 పనులు మాత్రమే పూర్తయ్యాయి. 2,491 పనులు ప్రారంభమైనా ఇంకా పూర్తి కాలేదు. 1,973 పనులైతే ఇంకా ప్రారంభమే కాలేదు. దీంతో కోట్ల రూపాయలు నిరుపయోగంగా మూలుగుతున్నాయి. బీఆర్జీఎఫ్ నిధుల్లో 20 శాతం జెడ్పీ, 30 శాతం మండల పరిషత్, 50 శాతం గ్రామపంచాయతీలకు వాటాలుగా కేటాయిస్తారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖలు ఈ నిధులతో పనులు చేయిస్తాయి. దాదాపు అన్ని పనులకు రూ.5 లక్షల వ్యయం లోపే అంచనాలు తయారు చేసి స్థానిక ప్రజాప్రతినిధుల అనుచరులు, చోటా మోటా నేతలకు నామినేషన్ల ప్రాతిపదికన అడ్వాన్స్‌లు కట్టబెట్టారు. కొన్ని చిన్న పనులకు రూ.10 వేల నుంచి రూ. లక్ష వ్యయంతో అంచనాలు రూపొందించి పనులు చేయకుండానే నిధులను స్వాహా చేశారు. ఈ క్రమంలో నిధుల వినియోగం, ఒక్కో పని స్థితి గతిపై కలెక్టర్ స్పష్టమైన నివేదిక కోరడంతో అధికారుల గుండెల్లో దడ పుడుతోంది. ఎంపీడీఓల కసరత్తు నిధుల వినియోగంపై ఇప్పటికే ఓ సారి సమగ్ర నివేదిక తెప్పించుకున్న కలెక్టర్.. వారం రోజుల్లో స్పష్టమైన సమాచారంతో మరో నివేదికలను అందించాలని జెడ్పీ సీఈఓను ఆదేశించారు. నివేదికల తయారీ కోసం ఆమే స్వయంగా ఆరు రకాల ఫార్మాట్లను తయారు చేసి ఇచ్చారు. దీంతో రెండు రోజులుగా జిల్లాలోని ఎంపీడీఓ కార్యాలయాల్లో ఈ నివేదికలపై కసరత్తు జరుగుతోంది. మరో ఐదు రోజుల్లో నివేదికలన్నీ అందాక జెడ్పీ సీఈఓ, ఇంజనీరింగ్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కలెక్టర్ నిర్ణయించారు. -
నేటినుంచి ‘రైతుహిత’ సదస్సులు
కలెక్టరేట్, న్యూస్‌లైన్: వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆధునిక పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు సాధించేందుకు వీలుగా రైతులను సమాయత్తం చేయడానికి ‘రైతుహిత’ పేరిట ఆదివా రం నుంచి సమగ్ర రైతు సదస్సులు నిర్వహించనున్నట్టు కలెక్టర్ స్మితా సబర్వాల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సులో వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించి సాగు పద్ధతులు, పంట మార్పిడి, కలుపు నివారణ, ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం, ఆరుతడి పంటలు, ఉద్యా న పంటలు, పూలు, పండ్ల తోటల పెంపకంతోపాటు పాల ఉత్పత్తి తదితర అంశాలపై నియోజకవర్గ పరిధి లో ఉత్తమ ఫలితాలు సాధించిన రైతులతో సలహా లు, సూచనలతో కూడిన అవగాహన కల్పిస్తామని ఆ మె పేర్కొన్నారు. జిల్లాలో మట్టి సామర్థ్యానికి అనుగుణంగా పంటలను పండించడంపై అవగాహన కల్పిస్తామన్నారు. సాగులో రైతు పెట్టుబడిని తగ్గించడానికి అనుగుణంగా యాంత్రీకరణను ప్రోత్సహించడం, డ్రమ్ సీడింగ్ విధానంలో వరి నాటడంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తామని తెలిపారు. వీటితోపాటు వ్యవసాయం, పశుసంవర్ధక, ఉద్యాన, మత్స్య, పట్టుపరిశ్రమ, విద్యుత్, బ్యాంకర్లు తదితరులు పాల్గొంటారని ఆమె పేర్కొన్నారు. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే అవగాహన సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. దుబ్బాక నుంచి ప్రారంభం.. నియోజకవర్గాల వారీగా నిర్వహించే రైతు హిత సదస్సులను దుబ్బాక నుంచి ప్రారంభిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన అవగాహనసదస్సును మిరుదొడ్డిలోని టీటీ డీ కళ్యాణ మండపంలో ఆదివారం ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. డి సెంబర్ 4న గజ్వేల్, 5న సిద్దిపేట, 6న నర్సాపూర్, 12న నా రాయణఖేడ్, 20న సంగారెడ్డి, 21న పటాన్చెరు ని యోజకవర్గాలకు సంబంధించి సమగ్ర రైతు అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్టు కలెక్టర్ తెలిపారు. -
రైతు ప్రయోజనాల మేరకే ‘మద్దతు’ నిర్ణయించాలి
సంగారెడ్డి టౌన్, న్యూస్‌లైన్: చెరుకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మద్దతు ధరను ప్రకటించాలని జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ చక్కెర కర్మాగారాల యాజమాన్యాలకు సూచించారు. చెరుకు మద్దతు ధర నిర్ణయించేందుకు కలెక్టర్ తన చాంబర్లో జిల్లాలోని చక్కెర కర్మాగారాల ప్రతినిధులు, రైతు సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. చక్కెర ధర తక్కువగా ఉండడం వల్ల ఫ్యాక్టరీలు నష్టాల్లో ఉన్నాయని సమావేశంలో పాల్గొన్న ఆయా కంపెనీల ప్రతినిధులు కలెక్టర్‌కు వివరించారు. గత ఏడాది నిర్ణయించినట్లుగానే ఈ సారి కూడా క్వింటాలు చెరుకుకు రూ. 2,600 చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కంపెనీల ప్రతినిధులు తెలిపారు. దీంతో ఆగ్రహించిన రైతు సంఘాల నాయకులు కంపెనీలకు ఏ రోజు కూడా నష్టం రాలేదన్నారు. చెరకు క్రషింగ్ తర్వాత చక్కెర ధర పెరిగినప్పటికీ ఏ కంపెనీ యాజమమాన్యం కూడా రైతులకు అదనంగా ధర ఇవ్వలేదన్నారు. అలాంటప్పు డు ఇపుడు చక్కెర ధర తక్కువగా ఉందని చెరకుపంటకు తక్కువ ధర ఇవ్వడం సమంజ సంగా లేదన్నారు. ఇరు వర్గాల ప్రతిపాదనలు విన్న కలెక్టర్ స్పందిస్తూ, ఈ ఏడాది రైతులకు కూలీ, రవాణా, ముడిసరుకుల ధర అధికంగా పెరిగాయని వాటిని దృష్టిలో ఉంచుకుని ధర నిర్ణయించాలన్నారు. కనీస మద్దతు ధరగా రూ.2,720 పెంచుతూ నిర్ణయం తీసుకోవాలన్నారు. ఫ్యాక్టరీ ప్రతినిధులు వారి యాజమాన్యాలతో చర్చించి సోమవారమ ఉదయం వరకు సంబంధిత నివేదికను అందజేయాలన్నారు. లేని పక్షంలో కమిటీ వేసి ధరను తామే నిర్ణయించాల్సి వస్తుందన్నారు. ఆ కమిటీ నిర్ణయించిన ధరను ఫ్యాక్టరీ యాజమాన్యాలు, రైతులు స్వాగతించాల న్నారు. సమావేశంలో జేసీ శరత్, కేన్ అసిస్టెంట్ కమిషనర్ వెంకట రవి, మాగి సీడీసీ చైర్మన్ నర్సింహారెడ్డి, మంజీర రైతు సమాఖ్య జిల్లా అధ్యక్షుడు పృథ్విరాజ్, రైతు సంఘం నాయకులు నర్సింహరామ శర్మ, రవీందర్, జయరాజ్, యాదిగిరిరెడ్డిలతో పాటు ఆయా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
రైతు ప్రయోజనాల మేరకే ‘మద్దతు’ నిర్ణయించాలి
సంగారెడ్డి టౌన్, న్యూస్‌లైన్: చెరుకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మద్దతు ధరను ప్రకటించాలని జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ చక్కెర కర్మాగారాల యాజమాన్యాలకు సూచించారు. చెరుకు మద్దతు ధర నిర్ణయించేందుకు కలెక్టర్ తన చాంబర్లో జిల్లాలోని చక్కెర కర్మాగారాల ప్రతినిధులు, రైతు సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. చక్కెర ధర తక్కువగా ఉండడం వల్ల ఫ్యాక్టరీలు నష్టాల్లో ఉన్నాయని సమావేశంలో పాల్గొన్న ఆయా కంపెనీల ప్రతినిధులు కలెక్టర్‌కు వివరించారు. గత ఏడాది నిర్ణయించినట్లుగానే ఈ సారి కూడా క్వింటాలు చెరుకుకు రూ. 2,600 చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కంపెనీల ప్రతినిధులు తెలిపారు. దీంతో ఆగ్రహించిన రైతు సంఘాల నాయకులు కంపెనీలకు ఏ రోజు కూడా నష్టం రాలేదన్నారు. చెరకు క్రషింగ్ తర్వాత చక్కెర ధర పెరిగినప్పటికీ ఏ కంపెనీ యాజమమాన్యం కూడా రైతులకు అదనంగా ధర ఇవ్వలేదన్నారు. అలాంటప్పు డు ఇపుడు చక్కెర ధర తక్కువగా ఉందని చెరకుపంటకు తక్కువ ధర ఇవ్వడం సమంజ సంగా లేదన్నారు. ఇరు వర్గాల ప్రతిపాదనలు విన్న కలెక్టర్ స్పందిస్తూ, ఈ ఏడాది రైతులకు కూలీ, రవాణా, ముడిసరుకుల ధర అధికంగా పెరిగాయని వాటిని దృష్టిలో ఉంచుకుని ధర నిర్ణయించాలన్నారు. కనీస మద్దతు ధరగా రూ.2,720 పెంచుతూ నిర్ణయం తీసుకోవాలన్నారు. ఫ్యాక్టరీ ప్రతినిధులు వారి యాజమాన్యాలతో చర్చించి సోమవారమ ఉదయం వరకు సంబంధిత నివేదికను అందజేయాలన్నారు. లేని పక్షంలో కమిటీ వేసి ధరను తామే నిర్ణయించాల్సి వస్తుందన్నారు. ఆ కమిటీ నిర్ణయించిన ధరను ఫ్యాక్టరీ యాజమాన్యాలు, రైతులు స్వాగతించాల న్నారు. సమావేశంలో జేసీ శరత్, కేన్ అసిస్టెంట్ కమిషనర్ వెంకట రవి, మాగి సీడీసీ చైర్మన్ నర్సింహారెడ్డి, మంజీర రైతు సమాఖ్య జిల్లా అధ్యక్షుడు పృథ్విరాజ్, రైతు సంఘం నాయకులు నర్సింహరామ శర్మ, రవీందర్, జయరాజ్, యాదిగిరిరెడ్డిలతో పాటు ఆయా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
72 గంటల్లో డబ్బులు
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ధాన్యం కొనుగోలు చేసిన 72 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు. రైతు ఖాతాల్లోనే డబ్బు జమచేసే ఆన్లైన్ ప్రక్రియను గురువారం ఆమె సమీకృత కలెక్టరేట్ ఎదుట ఉన్న ఆక్సిస్ బ్యాంకులో ప్రారంభించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలో ప్రారంభించిన ఈ పద్ధతి ద్వారా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన 79 మంది రైతులకు ఇవ్వాల్సిన రూ.44,11,062 ఈ పేమెంట్ ద్వారా ఆయా రైతుల ఖాతాల్లోనే జమ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ధాన్యం అమ్మిన రైతులకు చెల్లించాల్సిన డబ్బును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే 72 గంటల్లో జమ చేసేందుకు ఆక్సిస్ బ్యాంకు సహకారం తీసుకున్నామన్నారు. ఈ ప్రక్రియ వల్ల దళారుల ప్రమేయం అరికట్టడంతో పాటు రైతులకు సకాలంలో డబ్బు చెల్లించవచ్చన్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 107 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామనీ, ఇందులో ఐకేపీ ద్వారా 95, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా 12 కేంద్రాల్లో 739 మంది రైతుల నుంచి రూ.3.92 కోట్ల విలువ గల 2,916 మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. బ్యాంకు ఖాతాలు లేని రైతులను గుర్తించి వారి జీరో బ్యాలెన్స్ అకౌంట్లను తెరిపించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రైతుల సెల్‌ఫోన్ నంబర్లకు ఎస్ఎంఎస్ ద్వారా జమ అయిన విషయాన్ని తెలియజేస్తామన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, డీఎస్ఓ ఏసురత్నం, డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి, ఆక్సిస్ బ్యాంక్ బిజినెస్ విభాగం వైస్ ప్రెసిడెంట్ హరినాథ్, జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ జైపాల్‌రెడ్డి, బ్రాంచ్ మేనేజర్ శ్యామ్‌సుందర్, ఇతర జిల్లా అధికారుల పాల్గొన్నారు. -
నిధులకు బూజు
సాక్షి, సంగారెడ్డి: వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల(బీఆర్జీఎఫ్)కు బూజు పట్టింది. ఏళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభం కాకపోవడంతో ఈ నిధులు రికార్డుల్లోనే మూలుగుతున్నాయి. కలెక్టర్ స్మితా సబర్వాల్ ఆదేశాలతో జిల్లా పరిషత్ కార్యాలయం అధికారులు నిరుపయోగంగా మూలుగుతున్న నిధుల లెక్కలు వెలికి తీశారు. వరుసగా 2010-11, 2011-12, 2012-13 సంవత్సరాల్లో మంజూరైన నిధులతో చేపట్టిన పనుల్లో పూర్తయినవి, పురోగతిలో ఉన్నవి, ఇంకా ప్రారంభం కాని పనుల జాబితాలను మండలాల వారీగా సిద్ధం చేశారు. దాదాపు వారం రోజుల కసరత్తు ముగియడంతో జడ్పీ అధికారులు గురువారం సాయంత్రం సమగ్ర నివేదికను కలెక్టర్‌కు సమర్పించారు. జడ్పీ నిధులతో మంజూరైన పనులు ఇంకా ప్రారంభం కాకుంటే రద్దు చేస్తామని, అలాంటి పనుల పూర్తి వివరాలు అందజేయాలని.. ఈ నెల 4న డివిజన్, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో స్పందించిన యంత్రాంగం నివేదిక సిద్ధం చేయడంతో వీటిని రద్దు చేస్తూ ఒకటి రెండు రోజుల్లో కలెక్టర్ ఆదేశాలు జారీ చేసే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. బీఆర్జీఎఫ్ కింద జిల్లాకు వచ్చే నిధుల్లో 20 శాతం జిల్లా పరిషత్, 30 శాతం మండల పరిషత్, 50 శాతం గ్రామ పంచాయతీల వాటాలుగా కేటాయిస్తారు. ఈ నిధులతో రోడ్లు, మురికి కాల్వలు, భవనాలు, తాగునీటి వనరుల నిర్మాణం, మరమ్మతు పనుల కోసం వినియోగించాల్సి ఉంది. అయితే, కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న రాజకీయ వివాదాలు, స్థల సమస్యలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారుల నిర్లిప్తత, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, తదితర కారణాల వల్ల చాలా పనులు ప్రారంభానికి నోచుకోలేకపోతున్నాయి. జిల్లా పరిషత్ పరిశీలనలో తేలిన లెక్కల ప్రకారం.. 2010-13 మధ్య కాలంలో రూ.110.80 కోట్ల బీఆర్జీఎఫ్ నిధులతో 12,353 పనులు మంజూరయ్యాయి. వీటిలో 7,889 పనులు మాత్రమే పూర్తయ్యాయి. 2,491 పనులు ప్రారంభమైనా ఇంకా పూర్తి కాలేదు. 1,973 పనులైతే ఇంకా ప్రారంభమే కాలేదు. ప్రారంభం కాని పనులను రద్దు చేయడం దాదాపు ఖాయమైంది. ఈ నిధులతో మళ్లీ అదే పనులను చేపడతారా? లేక కొత్త పనులకు ఈ నిధులను కేటాయిస్తారా ? అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. పంచాయతీలకు ఎన్నికలు జరిగి కొత్త పాలకవర్గాలు ఏర్పడ్డాయి కాబట్టి, పాత పాలకవర్గాలు చేపట్టిన పనులు రద్దు కానున్నాయి. దీంతో ఇపుడున్న పాలకవర్గాలు పనుల ఎంపిక చేసుకునే అవకాశం కలగనుంది. మరోవైపు ఈనెల 27వ తేదీన సిద్దిపేట, 28న మెదక్, 29న సంగారెడ్డి రెవెన్యూ డివిజన్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించి బీఆర్జీఎఫ్ నిధుల వినియోగంపై ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. -
రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు
మెదక్/మెదక్ టౌన్, న్యూస్‌లైన్: ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని, ఒక వేళ నిర్లక్ష ్య వైఖరి అవలంబిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్మితా సబర్వాల్ హెచ్చరించారు. గురువారం స్థానిక సాయి బాలాజీ గార్డెన్స్‌లో రైస్ మిల్లర్లు, సహకార సంఘాల చైర్మన్లు, ఐకేపీ సభ్యులతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ స్మితా సబర్వాల్ మాట్లాడుతూ ప్రమాణాలతో కూడిన ధాన్యానికి మద్దతు ధర రూ.1345 ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనన్నారు. జిల్లాలో 167 కొనుగోలు కేంద్రాలను ఐకేపీ, సహకార సంఘాల ద్వారా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తూకం వేసిన 72గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కనీస వసతులు కల్పించాలన్నారు. రైస్‌మిల్లులను, కొనుగోలు కేంద్రాలను ఎప్పటికప్పుడు తహశీల్దార్లు పర్యవేక్షించాలన్నారు. మద్దతు ఇవ్వని మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైస్ మిల్లులు, కొనుగోలు కేంద్రాల వద్ద ధరల పట్టిక, హెల్ప్‌లైన్ నంబర్‌ను విధిగా ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద తేమ యంత్రాలు, టార్పాలిన్లు, తూకాలు, బస్తాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. రైతులు బ్యాంకర్లకు అప్పులుంటే వాటితో ధాన్యం డబ్బులను ముడిపెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దన్నారు. మరో రెండు వారాల్లో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదలవుతుందన్నారు. బ్యాంకులో ఖాతాలు లేని రైతులకు అధికారులు సహకరించి ఖాతాలు తెరిచేలా చూడాలన్నారు. అనంతరం జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రపాల్ మాట్లాడుతూ మిల్లర్లు ఎల్లప్పుడు రైతుల పక్షానే ఉంటారన్నారన్నారు. సమావేశంలో జేసీ శరత్, ఆర్డీఓలు వనజాదేవి, ముత్యంరెడ్డి, డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి జిల్లా పౌర సరఫరాల అధికారి ఏసురత్నం, జిల్లా వ్యవసాయఅధికారిణి ఉమా మహేశ్వరమ్మ పాల్గొన్నారు.