మెదక్, న్యూస్‌లైన్: మాత, శిశు సంరక్షణే లక్ష్యంగా.. నిరుపేద మహిళల ఆరోగ్యమే ధ్యేయంగా కలెక్టర్ స్మితాసబర్వాల్ ‘మార్పు’ పథకానికి ఊపిరి పోశారు. ఫలితంగా ఇంత వరకూ కాన్పుకు నోచుకోని ప్రభుత్వాస్పత్రుల్లో అనునిత్యం ప్రసవాలు జరుగుతున్నాయి. చిన్నారుల కేరింతలు... బోసి నవ్వులతో ప్రభుత్వాస్పత్రులు కళకళలాడుతున్నాయి. పాపన్నపేట ప్రభుత్వాస్పత్రిలో ఒకేరోజు ఆరు కాన్పులు జరగడం ఇందుకు నిదర్శనం. కాని కొన్ని సౌకర్యాలలేమి వల్ల అక్కడక్కడా అపశ్రుతులు చోటు చేసుకుంటున్నాయి.
గ్రామీణ ఆస్పత్రుల్లో సైతం అధునాతన సౌకర్యాలు కల్పిస్తే నిజమైన ‘మార్పు’ వస్తుందని పల్లెజనం పేర్కొంటున్నారు. రామాయంపేట క్లస్టర్ పరిధిలో 9 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు మెదక్, రామాయంపేట పెద్దాస్పత్రులు ఉన్నాయి. డిసెంబర్ నెలలో పాపన్నపేటలో 19, పొడ్చన్‌పల్లిలో 4, సర్ధనలో 6, వెల్దుర్తిలో 8, డి.ధర్మారంలో 8, చిన్నశంకరంపేటలో 4, చేగుంటలో 2, దౌల్తాబాద్‌లో 1, నార్సింగిలో 7 ప్రసవాలు జరిగాయి. మెదక్‌లో 107, రామాయంపేటలో ఒక ప్రసవం నమోదయ్యింది. సాధారణంగా మారుమూల గ్రామాల్లో గతంలో మంత్రసానులే ప్రసవాలు చేసేవారు.
అప్పట్లో మాత, శిశు మరణాలు కూడా అధికంగా ఉండేవి. కాలం మారుతున్న తరుణంలో నిరుపేద మహిళలు సైతం పట్టణంలోని ప్రైవేట్‌ఆస్పత్రుల్లోనే ప్రసవాలు చేయించుకుంటున్నారు. వీరి అవసరాన్ని ఆసరాగా తీసుకుంటున్న ప్రైవేట్ ఆస్పత్రుల యజమానులు అవసరమైనా..లేకున్నా..90 శాతం కాన్పులకు సిజేరియన్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. జిల్లాలోని ఏ పట్టణంలో చూసినా ఇదే తంతు కొనసాగుతుంది. ఒక్కకాన్పునకు ఎంతలేదన్న రూ.10 నుంచి 15వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
మార్పుతో మారిన పరిస్థితులు
కలెక్టర్ స్మితాసబర్వాల్ చొరవతో ఊపిరి పోసుకున్న మార్పు పథకం. సత్ఫలితాలిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకు కనీసం 20 ప్రసవాలైనా జరగాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో సుమారు 12యేళ్లుగా ప్రసవాలు నమోదు కాని సర్ధన, పొడ్చన్‌పల్లి లాంటి ఆస్పత్రుల్లో కూడా వరుసగా ప్రసవాలు జరుగుతున్నాయి. పాపన్నపేట ప్రభుత్వాస్పత్రిలో ఈనెల 18న ఆరు ప్రసవాలు జరగడం గమనార్హం. ఇందులో ఓ ప్రభుత్వ మహిళా టీచర్, ఒక రెవెన్యూ అధికారి కుమార్తె ఉండటం విశేషం. ప్రభుత్వాస్పత్రుల్లో పురుడు పోసుకుంటే జననీ సురక్ష యోజన పథకంతోపాటు ఇతర ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది.
అసౌకర్యాలతో అపశ్రుతులు
గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సౌకర్యాలలేమితో కొన్ని అపశ్రుతులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఈనెల 11న మెదక్ ఏరియా ఆస్పత్రిలో కౌడిపల్లి మండలం అన్నసాగర్ గ్రామానికి చెందిన మంజుల ప్రసవానికి వచ్చింది. ప్రసవం అనంతరం 24 గంటలలోపు మృత్యువాత పడింది. అదే విధంగా డిసెంబర్ 1న సిద్దిపేటలో ప్రశాంత్‌నగర్‌కు చెందిన రుద్రోత్ రేవతి అనే బీడీ కార్మికులు ప్రసవం కోసం ప్రభుత్వాస్పత్రికి వెళ్లగా చివరి సమయంలో మా వల్ల కాదంటూ పట్టణానికి పంపడంతో కుటుంబీకులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇటీవల నర్సాపూర్‌లో సైతం ఇలాంటి దారుణం చోటు చేసుకోవడం గమనార్హం. ప్రసవాలు జరిగే అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో అనస్తీషియన్, డీజీఓ, పిడియాట్రిషియన్, బ్లడ్‌బ్యాంకు, వార్మర్, ఇంక్యుబెటర్, ఆక్సిజన్, అంబులెన్స్ లాంటి సౌకర్యాలుంటే సుఖంగా ప్రసవాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ‘మార్పు’
Published Thu, Dec 26 2013 11:43 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement