ఓటు వేసి పండగ చేసుకోండి: సిత్మా సభర్వాల్
ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తివంతమైనది ఓటు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. డబ్బు, మద్యం ప్రలోభాలకు లోనుకాకుండా సక్రమంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. అప్పుడే ప్రజల ఆకాంక్షలతో కూడిన ప్రభుత్వం ఏర్పడుతుంది. తద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి మార్గం ఏర్పడుతుంది. అందుకే అందరూ ఎన్నికలను పండుగలా జరుపుకోవాలి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించడం మా బాధ్యత. దీనికోసం ‘ఓటరు పండగ’ కార్యక్రమం చేపట్టాం. మెదక్ జిల్లాలో పోలింగ్ శాతం గణనీయంగా పెంచడానికి ప్రోత్సాహక బహుమతులు ప్రకటించాం. 95 శాతం పోలింగ్ నమోదైన గ్రామాలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం కోసం రూ.2 లక్షలు ప్రత్యేక ప్రోత్సాహకంగా అందిస్తాం. ముఖ్యంగా రక్షిత మంచినీటి ప్లాంటు ఏర్పాటుకు ప్రాముఖ్యం ఇస్తాం. దీనితో పాటు లక్కీడిప్ ద్వారా ఓటరును విజేతగా ఎంపిక చేస్తాం. విజేతలకు కారు, ఎల్‌సీడీ,ల్యాప్‌టాప్, మోటార్‌సైకిల్, కూలర్, ఫ్రిజ్ బంపర్ బహుమతులను అందజేస్తాం.
ఓటు వేసినట్టు వేలుపై సిరా గుర్తు చూపించిన వారికి పోలింగ్ రోజున లీటర్ పెట్రోల్‌పై రూ.1 రాయితీ ఇస్తున్నాం. పారిశ్రామిక ప్రాంతాల్లో 90 శాతం పోలింగ్ నమోదైతే లక్కీడిప్ ద్వారా మొదటి 20 మంది ఓటర్లకు కూలర్లు, మరో 20 మందికి ఆరోగ్య తనిఖీ కూపన్లు ఇస్తాం. వీటితో పాటు మిగిలిన బంపర్ బహుమతులు కూడా వీళ్లకు వర్తిస్తాయి. 92 శాతం ఓటింగ్‌నమోదైన గ్రామాల్లో ఓటు వేసిన వారికి 10 మందికి డ్రాద్వారా ఒక్కొక్కరికి కనీసం రూ.1200 విలువైన బహుమతులు అందిస్తున్నాం. ఇవి కాకుండా చీరలు, కుట్టుమిషన్లు, రైతు ఉపకరణాలు,ధోవతి, ఫ్యాను తదితర వాటికి డ్రా ద్వారా ఎంపిక చేసి అంద జేస్తాం.
- సిత్మా సభర్వాల్, మెదక్ జిల్లా కలెక్టర్