mother and child mortality
-
మాత, శిశు మరణాల కట్టడికి పటిష్ట చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మాత, శిశు మరణాల కట్టడికి వైద్య శాఖ పటిష్ట చర్యలు చేపడుతోంది. మాత, శిశు మరణాల నమోదు, విశ్లేషణలో కచ్చితత్వం ఉండేలా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రవేశపెట్టిన ‘మెటర్నల్, పెరినాటల్ డెత్ సర్వేలెన్స్ అండ్ రెస్పాన్స్’ (ఎంపీసీడీఎస్ఆర్) పోర్టల్‌లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను ఎన్రోల్ చేశారు. ఈ పోర్టల్‌కు సంబంధించి రాష్ట్ర స్థాయిలో డ్యాష్ బోర్డును ఏర్పాటు చేశారు. మాత, శిశు మరణాలకు సంబంధించి వివరాలు నమోదుకు ప్రతి ఆస్పత్రి, జిల్లాకు రెండు రకాల లాగిన్లు ఉంటాయి. మాతృ మరణాలకు సంబంధించి లాగిన్లు కేటాయింపులు ఇప్పటికే పూర్తయ్యాయి. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై నెలల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 127 మాతృ మరణాలు సంభవించాయి. ఈ వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. గతంలో మాత, శిశు మరణాలు సంభవిస్తే ఆఫ్‌లైన్ విధానంలోనే నమోదు ఉండేది. వీటిపై జిల్లా స్థాయిలో కలెక్టర్, డీఎంహెచ్వోలు మరణాలు సంభవించడానికి గల కారణాలపై సమీక్షించి.. తదుపరి ఆ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుని చర్యలు తీసుకునేవారు. అయితే నూతన విధానంలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సంభవించిన మాత, శిశు మరణాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఆన్లైన్ విధానంలో రాష్ట్రంలో ఏ జిల్లా, మండలం, గ్రామంలో ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నది సులువుగా తెలుసుకోవడానికి వీలుంటుంది. అదేవిధంగా సంబంధిత జిల్లా అధికారులు మరణాల కట్టడిపై సమీక్షలు నిర్వహించారా లేదా అన్న అంశాలు రాష్ట్ర అధికారులకు ఎప్పటికప్పుడు తెలుస్తుంది. మరణాలు యాంటేనేటల్, పోస్ట్‌నేటల్‌లో సంభవిస్తున్నాయా, మరణాలు సంభవించడానికి గల కారణాలేమిటి, గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత, పౌష్టికాహారం లోపం, ఇతర కారణాలేమిటనేది సులువుగా విశ్లేషించడానికి వీలు కలుగుతోంది. ఆన్లైన్ విధానం వల్ల వివరాల నమోదు, సమాచార మార్పిడిలో గతంలో ఉండే కాలయాపన తగ్గడంతోపాటు, కచ్చితత్వం ఉండనుంది. ఏపీకి నాలుగో స్థానం ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధతో ఇప్పటికే రాష్ట్రంలో మాత, శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గింది. జాతీయ సగటు కన్నా రాష్ట్రంలో తక్కువగా మరణాలు ఉంటున్నాయి. ప్రతి లక్ష ప్రసవాలకు తల్లుల మృతుల సంఖ్య 70కి మించకూడదనేది నిబంధన. అయితే, జాతీయ స్థాయిలో సగటున ప్రతి లక్ష ప్రసవాలకు ప్రసూతి మరణాలు రేటు (ఎంఎంఆర్) 112గా ఉంది. రాష్ట్రంలో మాత్రం లక్ష ప్రసవాలకు ఇది 58గా నమోదైంది. ఈ క్రమంలో మాతృ మరణాల కట్టడిలో దేశంలోనే నాలుగో స్థానంలో మన రాష్ట్రం ఉంది. అదే విధంగా సగటున వెయ్యి ప్రసవాల్లో జాతీయ స్థాయిలో 30 మంది శిశువులు మరణిస్తున్నారు. రాష్ట్రంలో ఈ సంఖ్య 25గా ఉంది. -
అమ్మతనానికి అడ్డుకోత
అవసరం లేకున్నా ఆపరేషన్లు ఏటా ఏడు వేలకుపైగా సిజేరియన్లు పెరుగుతున్న మాత, శిశు మరణాలు ప్రైవేటు ఆస్పత్రులకు కాసుల వర్షం తిరుపతి నగరానికి చెందిన అమ్ములు గత నెల మూడో తేదీన ప్రసవం కోసం స్థానిక ప్రసూతి ఆస్పత్రికి వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆస్పత్రిలో చేర్చుకున్నారు. తీరా అక్కడ పనిచేస్తున్న ఓ ప్రయివేట్ క్లినిక్ మధ్యవర్తి కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని.. ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లమని సలహా ఇచ్చింది. ఆమె సూచించిన ఆస్పత్రికి వెళితే అవసరం లేకున్నా అమ్ములుకు సిజేరియన్ చేసి కాన్పు చేశారు. రూ.23 వేల బిల్లు చేతికిచ్చారు. బంగారుపాళ్యంలోని తుంబకుప్పానికి చెందిన సుజాత గత నెల ఏడున చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో కాన్పు కోసం వచ్చింది. అర్ధరాత్రి ఓ మగబిడ్డకు జన్మనిచ్చి కన్ను మూసింది. సుజాత మరణం ఇక్కడి వైద్యుల పనితీరును ప్రశ్నిస్తోంది. తొట్టంబేడుకు చెందిన మునెమ్మకు నెలలు పూర్తిగా నిండడంతో స్థానిక పీహెచ్సీలో కాన్పుకోసం వెళ్లింది. పరిస్థితి విషమించిందని, ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాలని అక్కడి సిబ్బంది సూచించారు. అంబులెన్సులో వెళుతుండగానే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ మూడే కాదు జిల్లాలోని దాదాపు 90 శాతం ప్రభుత్వాస్పత్రులు, 24 గంటల పీహెచ్‌సీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏపీవీపీ ఆస్పత్రుల్లో ఇదే పరిస్థితి. గర్భిణులకు శస్త్ర చికిత్సల పేరిట కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నాయి. ప్రభుత్వపరంగా అందజేయాల్సిన ‘జాతీయ ఆరోగ్య గ్రామీణ మిషన్’లో వైద్య సేవలు అంతంత మాత్రంగా ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో గర్భిణులు ప్రైవేటు వైద్య సేవల్ని ఆశ్రయించాల్సి వస్తోంది. మాత, శిశు మరణాలను తగ్గించడానికి ఏటా రూ.కోట్లలో నిధులు విడుదలవుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో ప్రజలకు చైతన్యం కల్పించి ప్రభుత్వ ఆసుపత్రులవైపు రప్పించడంలో యంత్రాంగం విఫలమవుతోంది. దీనిని ఆసరాగా చేసుకుని కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు గర్భిణుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఎలాంటి అవసరం లేకున్నా సిజేరియన్ ఆపరేషన్లు చేసి అమ్మతనాన్ని తెలిపే పురిటినొప్పులను చెరిపేస్తున్నారు. ధరలు ఏవీ? ప్రైవేటు ఆసుపత్రులపై జిల్లా యంత్రాంగం పర్యవేక్షణ లేకపోవడంతో పరిస్థితి ఇష్టానుసారంగా తయారయ్యింది. రక్తం గ్రూపు తెలుసుకోవడం నుంచి పెద్ద స్థాయి శస్త్ర చికిత్సల వరకు ఏయే సేవలకు ఎంత రుసుం చెల్లించాలనే వివరాలు జిల్లాలో ఏ ఒక్క ప్రైవేటు ఆసుపత్రిలో కనిపించడంలేదు. ఫలితంగా కాసులకు కక్కుర్తిపడి కాన్పుల కోసం వచ్చే గర్భిణులకు సిజేరియన్లు చేయడానికే కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు వెలిశాయంటే జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని చోట్ల అనుభవం లేని వైద్యులు ఆపరేషన్లు చేస్తుండడంతో అవి వికటించి మాత, శిశు మరణాలు సైతం పెరుగుతున్నాయి. జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రులు ఏటా సగటున 7500 మంది స్త్రీలకు సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సగటున ఏదాడికి మూడువేల సిజేరియన్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులకు పోటీగా రెట్టింపు సంఖ్యలో ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్లు చేయడం విస్మయానికి గురిచేస్తోంది. -
ఇంటి వద్ద ప్రసవం చేస్తే రూ.8వేలు
వేమనపల్లి : ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని, మాతాశిశు మరణాలు అరికట్టాలని ఉన్నతాధికారులు వైద్యాధికారులకు లక్ష్యం విధిస్తున్నారు. కానీ కొందరు ఏఎన్ఎంలు ఆ లక్ష్యానికి గండికొడుతూ ఇంటి వద్ద ప్రసవాలను ప్రోత్సహిస్తున్నారు. ఇంటి వద్ద ప్రసవం చేస్తూ రూ.8వేలు వసూలు చేస్తున్నారు. ఈ విషయం సాక్షాత్తు వేమనపల్లి పబ్లిక్ హెల్త్ అధికారి సత్యనారాయణ పరిశీలనలో వెల్లడైంది. మండలంలో ఐదు హెల్త్సబ్సెంటర్లు ఉన్నాయి. వీటి పరిధిలో పనిచేస్తున్న కొందరు ఏఎన్ఎంలు రెండేళ్లుగా ఇంటివద్ద ప్రసవాలు చేస్తున్నారు. ఆస్పత్రిలో కాన్పు చేయించుకుంటే ప్రభుత్వమే రూ.వెయ్యి జననీ సురక్ష యోజన కింద బాలింతకు ప్రోత్సాహకం అందజేస్తుంది. ఆస్పత్రికి రావడానికి రూ.500 రవాణా చార్జీలూ చెల్లిస్తుంది. ప్రసవం తర్వాత బాలింతకు రొట్టె, పాలు ఇతర ఖర్చులకు గాను మూడు రోజులపాటు రోజుకు రూ.54చొప్పున అందజేస్తుంది. ఇవన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య పెంచాలనే ఉద్దేశంతో చేస్తోంది. కానీ ఇవేవీ తెలియని పల్లె ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఇంటి వద్ద కాన్పులను ప్రోత్సహిస్తున్నారు. సబ్‌సెంటర్ పరిధిలోని ఏఎన్ఎంలు గర్భిణులు, బాలింతల వివరాలు ప్రతీ నెలా ఏఎంసీ రిజిష్టర్‌లో నమోదు చేస్తుంటారు. దీంతో ఏ గ్రామంలోనైనా గర్భిణి ప్రసవ సమయం పొందుపరుస్తుంటారు. ఆయా గ్రామాల్లో ఎవరైనా పురిటినొప్పులతో బాధపడుతుంటే ఏఎన్ఎంలకు ఫోన్ చేస్తుంటారు. దీంతో ఏఎన్ఎంలు ఇంటికి వెళ్లి ప్రసవాలు చేస్తున్నారు. ఒక్కో ప్రసవానికి రూ.8వేల నుంచి రూ.12వేల వరకు వసూలు చేస్తున్నారు. ఎవరికైనా చెబితే ఆస్పత్రి నుంచి ఎలాంటి సహాయం అందదు అంటూ బెదిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో బాలింతలు జననీ సురక్ష యోజన ఆర్థిక సహాయానికి నోచుకోవడం లేదు. ఇంటి వద్ద ప్రసవంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. మరోవైపు ప్రభు త్వ ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య తగ్గుతోంది. వేమనపల్లి పీహెచ్సీ పరిధిలో డిసెంబర్లో 33 కాన్పులు జరిగాయి. ఇందులో మూడు కాన్పులు మాత్రమే పీహెచ్సీలో జరగా.. 9 ప్రైవేట్ ఆస్పత్రుల్లో, మిగితావి ఇంటి వద్దే అయినట్లు తెలిసిన వైద్యాధికారులు ఆరా తీశారు. ఏఎన్ఎంలే స్వయంగా కాన్పులు చేసి డబ్బులు తీసుకున్నట్లు పరిశీలనలో తేలింది. -
అమ్మా.. క్షమించు !
జన్మనిచ్చే అమ్మను రక్షించుకోలేకపోతున్నాం. పసికందులు భూమి మీదకు వచ్చి కళ్లు తెరవక ముందే జన్మనిచ్చిన తల్లులు శాశ్వత నిద్రలోకి జారుకుంటున్నారు. ఇళ్ల వద్ద మంత్రసానులు పురుడు పోసే కాలంలో ఎంతో మంది మాతృమూర్తులు పలు కారణాల వల్ల మృతి చెందేవారు. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చి అధునాతన విధానాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ మాతృ మరణాలు ఆగడం లేదు. అమ్మా..క్షమించు ! సాక్షి, గుంటూరు: మాతా శిశు మరణాలను నివారించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్హెచ్ఎమ్) పథకం కింద ఏటా కోట్ల రూపాయ లను విడుదల చేస్తోంది. గర్భిణులకు పౌష్టికాహారం అందించడం, ప్రభుత్వ వైద్యశాలల్లో ఆపరేషన్ థియేటర్లు, గర్భిణుల పరిరక్షణకు అవసరమైన వైద్య పరికరాల కొనుగోలుకు ఈ నిధులు వెచ్చించాలి. ఎన్ఆర్హెచ్ఎమ్ పథకం కింద గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో రూ. 21.20 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. జిల్లాలోని ప్రతి పీహెచ్‌సీకి రూ.1.75 లక్షలను హెచ్‌డీఎస్ ఖాతాలో జమచేస్తారు. వీటి ద్వారా మాతాశిశు మరణాలను నివారించేందుకు కావాల్సిన కిట్లు, ఆసుపత్రిలో వసతులు కల్పించుకోవాల్సి ఉంది. అయితే ఈ నిధులను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిజేరియన్‌కు సరైన ఆపరేషన్ థియేటర్ కూడా లేకపోవడంతో అంతా ప్రైవేట్ వైద్యశాలలను ఆశ్రయిస్తున్నారు. కొన్ని పీహెచ్‌సీల్లో అసలు ప్రసవాలు కూడా జరగడం లేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతోంది. గర్భిణులకు కావాల్సిన రక్తం కూడా అందుబాటులో ఉండకపోవడం మరో సమస్యగా మారింది. సీహెచ్‌సీల్లో సైతం గైనకాలజిస్ట్‌ల కొరత ఉండటం, ఉన్న వైద్యులు సక్రమంగా విధులు నిర్వర్తించక పోవడంతో ప్రభుత్వ వైద్యశాలల్లో కాన్పులు చేయించుకునేందుకు ఎవ్వరూ సుముఖత చూపడంలేదు. గర్భిణులకు పౌష్టికాహారం కూడా అందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైద్య, ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పెరుగుతున్న మాతృ మరణాలు... జిల్లాలో మాతృ మరణాలు ప్రతి ఏటా పెరుగుతున్నాయి. 2006-07 ఆర్థిక సంవత్సరంలో 49 మాతృ మరణాలు, 2007- 08 లో 36, 2008-09లో 40, 2009- 10 లో 49, 2010-11 లో 61, 2011-12 లో 61, 2012-13 లో 87, 2013-14 లో 81 మాతృ మరణాలు సంభవించాయి. ఈ ఏడాది ఇప్పటికే 50కి పైగా మాతృ మరణాలు నమోదయ్యాయి. ఇవి అధికారిక లెక్కల ప్రకారం మాత్రమే, లెక్కల్లోకి రానివి ఎన్నో వున్నాయి. మాతృ మరణాలు అధికంగా జరుగుతున్నా ఎవరిపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. పరిస్థితి ఇలానే కొనసాగితే గర్భం దాల్చడానికి మహిళలు భయప డే స్థితి ఏర్పడనుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పురిటి నొప్పులే నయం
కర్నూలు(హాస్పిటల్): పెద్దాసుపత్రిలో ఎలాంటి సేవలు పొందాలన్నా ఓపిక తప్పనిసరి. ప్రాణం పోతుందన్నా.. చలించరనే ఆపవాదు ఇక్కడి సిబ్బంది సొంతం. మాతా శిశు మరణాలను తగ్గించేందుకు ఉద్దేశించిన జేఎస్వై పథకం ఉద్దేశం ఆసుపత్రి అధికారుల తీరుతో నీరుగారుతోంది. ఆసుపత్రిలో ప్రసవాలను ప్రోత్సహించడం ద్వారా మరణాల శాతం తగ్గించడం వరకు బాగానే ఉన్నా.. బాలింతలకు అందించే ప్రోత్సాహకం వారి చేతికందేలోపు దేవుడు కనిపిస్తున్నాడు. గ్రామీణ ప్రాంత మహిళలకు రూ.1000.. పట్టణ ప్రాంత మహిళలకు రూ.600 చొప్పున ఆసుపత్రిలో ప్రసవించిన 48 గంటల్లోపు అందించాల్సి ఉంది. ఈ ప్రోత్సాహకం తీసుకోవాలంటే బాలింతలు ఆసుపత్రిలోని రెండో అంతస్తుకు చేరుకోవాల్సి ఉండటం గమనార్హం. మెట్లు ఎక్కి దిగలేక వీరి అవస్థలు వర్ణనాతీతం. మంగళవారం పలువురు బాలింతలు కుటుంబ సభ్యులతో కలసి ప్రోత్సాహకం అందుకునేందుకు వచ్చి ఎక్కువ సేపు నిరీక్షించలేక నేలపైనే కూర్చుండిపోయారు. కనీసం బెంచీలు కూడా ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు తావిచ్చింది. ఉక్కపోతతో అల్లాడిపోయారు. గత ఏడాది జూన్‌లో రెండో అంతస్తుకు వెళ్లేందుకు క్యాజువాలిటీని ఆనుకుని లిఫ్ట్ ఏర్పాటు చేశారు. అయితే దీనిని మొదటి అంతస్తుకే పరిమితం చేశారు. కనీసం లిఫ్ట్ బాయ్ కూడా లేకపోవడంతో లిఫ్ట్ ఉన్నా ఉపయోగం లేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో బాలింతలు మెట్ల పైనుంచి రెండో అంతస్తుకు చేరుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ దృష్ట్యా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
మార్పు ఎక్కడ..?
⇒ఏటా వేలసంఖ్యలో ప్రసవ మరణాలు ⇒అధికంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే.. ఆసుపత్రుల వివరాలు జిల్లాకేంద్ర ఆసుపత్రి 01 ఏరియా ఆసుపత్రులు 06 పీహెచ్‌సీలు 85 ఆరోగ్య ఉపకేంద్రాలు 675 క్లస్టర్లు 19 పాలమూరు: మాతాశిశు సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నా.. ఆచరణలో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. ప్రతి ఏడాదీ పొత్తిళ్లలోనే వెయ్యిమంది శిశువులు చనిపోతున్నట్లు వైద్యారోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మాతాశిశు మరణాలను తగ్గించేందుకు ఎన్నో పథకాలను అమలుచేస్తున్నా ఏ మాత్రం ‘మార్పు’ కనిపించడం లేదు. గర్భిణులు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలనే విషయాలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రసవ మరణాలు తగ్గించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గ తేడాది ‘మార్పు’ పథకానికి శ్రీకారం చుట్టింది. అందుకోసంఅంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు బలవర్థకమైన ఆహారం, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నెలవారీ పరీక్షలు, టీకాలు ఇస్తున్నారు. జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్ కింద 2007నుంచి జిల్లాలో అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయి. అయినా మాతాశిశు మరణాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగించే అంశం. జిల్లాలో ఏటా వెయ్యి వరకు శిశుమరణాలు నమోదవుతున్నాయి. మాతృమరణాల్లో మాత్రం 30చొప్పున నమోదవుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచడంలో వైద్యసిబ్బంది విఫలమవుతోంది. గర్భిణులకు, బాలింతలకు తగిన సూచనలు, సలహాలు కూడా అందడం లేదు. పీహెచ్‌సీలకు వస్తున్న వారి సంఖ్య తక్కువే అయినప్పటికీ.. ఒకరిద్దరు వచ్చినా రికార్డుల్లో పదుల సంఖ్యలో గర్భిణుల పేర్లను నమోదు చేసుకుంటున్నారు. ఆరోగ్య కేంద్రాలకు 25శాతం మంది కూడా రావడంలేదు. సర్కారు వైద్యంపై నమ్మకం లేకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రులపై ఎవ రూ రావడం లేదు. జిల్లాలో స్త్రీ వైద్య నిపుణుల కొరత! జిల్లావ్యాప్తంగా ఏటా 6.50లక్షల మంది గర్భవతులు.. బాలింతలకు వైద్యసేవలు అందించాల్సి ఉంది. వైద్యశాఖ లెక్కల ప్రకారం ప్రతి 10వేల మందికి ఓ స్త్రీ వైద్య నిపుణులు ఉండాలన్నది నిబంధన. దీని ప్రకారం చూస్తే జిల్లాలో స్త్రీ వైద్య నిపుణులు 65మంది ఉందాలి. కానీ, జిల్లా వ్యాప్తంగా కేవలం 25మంది మాత్రమే పనిచేస్తున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం సర్కారు దవాఖానాల్లో మరో 40మంది స్త్రీ వైద్య నిపుణులను భర్తీ చేయాల్సి ఉంది. ‘మార్పు’పై మరింత దృష్టి మాతాశిశు మరణాలు తగ్గించడానికి మార్పు కార్యక్రమం అమలవుతోంది. ఉన్నతాధికారులు సైతం క్షేత్రస్థాయిలో ఉన్నవారికి లక్ష్యాలు నిర్ధేశిస్తున్నారు. ఈ మేరకు ప్రతి ఆరోగ్య కార్యకర్త గర్బిణీని తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకునేలా చూడాలని సూచిస్తున్నాం. మాతాశిశు మరణాలను నివారించడానికి జిల్లా అధికారుల సూచనలను పాటిస్తున్నాం. - సరస్వతి, ఇన్చార్జి డీఎంహెచ్ఓ మరణాలకు కారణాలివే.. ⇒జిల్లాలో గర్భిణులకు సేవలందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్త్రీ వైద్యనిపుణులు లేకపోవడంతో సకాలంలో వైద్యసేవలు అందడం లేదు. ⇒మాతాశిశు మరణాల్లో 50 శాతం రక్తహీనతతో మరణాలు సంభవిస్తున్నాయని వైద్యశాఖ అధికారుల అంచనా. ⇒బాల్యంలో పెళ్లిళ్లు, పౌష్టికాహార లోపం తదితర దుష్ర్పభావాలకు గురవుతున్నారు. ⇒ప్రసవ సమయంలో తల్లికి స్త్రీవైద్య నిపుణురాలు, బిడ్డకు పిల్లల వైద్యనిపుణుల సేవలు అవసరం. జిల్లాలో ఈ సేవలు సక్రమంగా ⇒అందటంలేదు. సర్కారు ఆస్పత్రుల్లో జన్మిం చిన శిశువులను నేరుగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న పిల్లల వైద్యనిపుణుల వద్దకు తీసుకెళ్తున్నారు. -
పక్కాగా అమృతహస్తం
మాతా శిశు మరణాలను నిరోధించాలి క్షేత్రస్థాయిలోఅధికారుల పర్యటనలు తప్పనిసరి జిల్లా కలెక్టర్ యువరాజ్ ఆదేశం పాడేరు: ఏజెన్సీలో ఇందిరమ్మ అమృతహస్తం పథకాన్ని పక్కాగా అమలు చేసి పౌష్టికాహార సమస్య పరిష్కారంతోపాటు మాతా శిశు మరణాల నిరోధానికి అధికారులంతా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ యువరాజ్ ఆదేశించారు. కలెక్టర్‌గా తొలిసారి ఏజెన్సీకి వచ్చిన ఆయన స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన సంక్షేమానికి చేపడుతున్న పథకాలపై శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘంగా సమీక్షించారు. గిరిజన విద్య, వైద్యం, ఇంజినీరింగ్ పనులు, జీసీసీ, ఉపాధి హామీ పథకం, తాగునీటి సరఫరా,విద్యుత్శాఖలవారీ జిల్లా స్థాయి అధికారులతో చర్చించారు. చేపడుతున్న కార్యక్రమాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మన్యంలో వైద్య ఆరోగ్య కార్యక్రమాలు మరింత విస్తృతం కావాలన్నారు. జిల్లాస్థాయి అధికారులు గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ పథకాలను గిరిజనుల దరి చేర్చాలన్నారు. మారుమూల గూడేల్లోని అన్ని సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలన్నారు. ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగే విధంగా చర్యలు తీసుకొని మాతా శిశు ఆరోగ్య కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయాలన్నారు. ఐటీడీఏ పీఓ వినయ్‌చంద్ మాట్లాడుతూ ఏజెన్సీలోని 5.5 లక్షల మంది గిరిజనుల సంక్షేమానికి ఐటీడీఏ అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. వైద్య ఆరోగ్య కార్యక్రమాలను విస్తృతం చేశామన్నారు. వారపుసంతల్లో ప్రత్యేక వైద్యశిబిరాల ద్వారా 10 వేల మంది గిరిజనులకు ఉన్నత సేవలు అందించామన్నారు. 364 వైద్యశిబిరాలను గ్రామాల్లో నిర్వహించామన్నారు. 29,325 మంది గిరిజన విద్యార్థులకు వైద్యపరీక్షలు జరిపామన్నారు. ఏజెన్సీలోని 67 శాతం ఆస్పత్రి ప్రసవాలు జరుగుతున్నాయన్నారు. గిరిజన రైతులకు ఆర్థిక ఆసరా కల్పించాలన్న లక్ష్యంతో కాఫీ సాగును ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ఈ ఏడాది మరో 9 వేల ఎకరాల్లో కాఫీ తోటలను చేపడుతున్నామన్నారు. ఆర్డీఓ రాజకుమారి, ఐటీడీఏ ఏపీఓ పీవీఎస్ నాయుడు, గిరిజన సంక్షేమ డీడీ బి.మల్లికార్జునరెడ్డి, డీఎంహెచ్ఓ శ్యామల, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్ఈ కాంతనాధ్, ఈఈ రమణమూర్తి, డ్వామా పీడీ శ్రీరాములు నాయుడు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘నై’.. వైద్యం
- గిరిజనులను పీడిస్తున్న మలేరియా - వ్యాధులపై అవగాహన కల్పించే సిబ్బంది కరువు - ఇంకా నాటువైద్యం వైపే గిరిజనం మొగ్గు - వైద్యశాఖలో భర్తీకి నోచని ఖాళీలు - మంత్రి రాకతోనైనా తీరు మారేనా.. భద్రాచలం : ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు మెరుగైన వైద్యం అందని ద్రాక్షగానే మిగులుతోంది. కార్పొరేట్ స్థాయి వైద్యసేవలను వారి చెంతకే తీసుకెళ్తామని గత పాలకులు చెప్పిన మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. భద్రాచలం ఏజెన్సీలోని గిరిజన గూడేలలో ఆదివాసీలు నేటికీ నాటువైద్యం వైపే మొగ్గుచూపుతున్నారంటే ఇక్కడి వైద్య సేవల పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోంది. జిల్లాలో 69 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు ఉండగా, ఇందులో 50 ఏజెన్సీ ప్రాంతంలోనే ఉన్నాయి. వీటిలో 28 పీహెచ్సీలలో 24 గంటల పాటు వైద్యసేవలందే ఏర్పాట్లు ఉన్నప్పటికీ, పూర్తిస్థాయిలో ఆ ఆస్పత్రులకు వచ్చేలా గిరిజనులకు అవగాహన కల్పించేవారు లే రు. మాతా-శిశు సంరక్షణ కోసం జాతీయ ఆరోగ్యమిషన్ ద్వారా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ, భద్రాచలంలో ఏజెన్సీలో వారి మరణాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ప్రధానంగా చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాల్లోని కొండరెడ్లు, ఆదివాసీలు, వలస గొత్తికోయల గ్రామాల్లో ఎక్కువగా మాతా శిశు మరణాలు సంభవిస్తున్నాయి. గిరిజనుల్లో తగిన అవగాహన లేకనే ఇంకా ఇళ్ల వద్దనే ప్రసవాలు జరుగుతున్నాయని పరిశీలనలో వెల్లడవుతున్నా, దీనిపై అధికారులు దృష్టి సారించడం లేదు. కొండరెడ్ల మహిళల ప్రసవం కోసమని ఏడుగురాళ్లపలి, తులసిపాక, కూటూరు, కొయిదా, రేఖపల్లి పీహెచ్‌సీల ప్రాంగణాల్లో ప్రత్యేకంగా భవనాలు నిర్మించినా.. అవి వారి అభిరుచికి తగ్గట్టుగా లేకపోవటంతో అక్కడ ఉండేందుకు వారు నిరాకరిస్తున్నారు. ఇక ప్రతీ ఏటా సీజనల్ వ్యాధులతో సంభవించే మరణాలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. రాష్ట్రంలో మలేరియా వ్యాధి పీడిత కేసులు ఎక్కువగా నమోదయ్యేది కూడా భద్రాచలం ఏజెన్సీలోని చింతూరు మండలం తులసిపాక, ఏడుగురాళ్లపల్లి పీహెచ్సీ పరిధిలోనే. ప్రంపంచ బ్యాంకు సహాయంతో వీటి నివారణ కార్యక్రమాలు చేపడుతున్నా ఫలితాలు అంతంతమాత్రమే. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు 3,10,864 రక్తపూతలు సేకరించగా, ఇందులో 1713 మందికి మలేరియా వ్యాధి సోకినట్లు ఆ శాఖ అధికారుల నివేదికల్లో వెల్లడైంది. ఈ వ్యాధికి అడ్డుకట్ట వేసేందుకు దోమతెరల పంపిణీకి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు ప్రతిపాదనలు చేసినా పాలకులు పట్టించుకున్న దాఖలాలు లేవు. 6 లక్షల జనాభాకు 3.50 లక్షల దోమతెరలు కావాలని కోరినప్పటికీ ఇప్పటి వరకూ దీనిపై స్పష్టత లేదు. అవగాహన కల్పించే వారేరి... సీజనల్ వ్యాధులతో పాటు ఆసుపత్రిలోనే ప్రసవాలు జరిగేలా గిరిజనుల్లో అవగాహన కల్పించేందుకు తగిన సిబ్బంది లేకపోవటం వల్లే సమస్య జఠిలమవుతోంది. అవగాహన కల్పించే హెల్త్ ఎడ్యుకేటర్ పోస్టుల భర్తీ గత కొన్నేళ్లుగా నిలిచిపోయింది. ఏజెన్సీలో 12 క్లస్టర్లు ఉండగా, ముగ్గురు మాత్రమే హెల్త్ ఎడ్యుకేటర్లు పనిచేస్తున్నారు. వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా డీహెచ్పీఈ వంటి శిక్షణ పొందిన ఉద్యోగులు ఆ శాఖలో ఉన్నప్పటికీ వారి సేవలను వినియోగించుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో గిరిజనులు నాటు వైద్యం చేసే వజ్జోడు, భూత వైద్యులను ఆశ్రయిస్తున్నారు. చింతూరు మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో ఓ విద్యార్థిని ఇటీవల ఈ కారణంగానే మృత్యువాత పడింది. వ్యాధులు సంభవించిన తరువాత హడావిడి చేసే కంటే ముందుగానే వీటిపై గిరిజనుల్లో తగిన అవగాహన కల్పిస్తే మేలని, ఇందుకోసం అన్ని క్లస్టర్లలో హెల్త్ ఎడ్యుకేటర్ పోస్టులు భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు. పెద్దాస్పత్రిలో సమస్యలెన్నో... పెద్దాస్పత్రిగా పేరొందిన భద్రాచలం ఏరియా వైద్యశాలకు నిత్యం 500 మందికి పైగానే వస్తుంటారు. 100 మందికి పైగా ఇన్‌పేషెంట్లు ఉంటారు. కానీ ఈ ఆస్పత్రిని ఆ స్థాయిలో అభివృద్ధి చేయలేదు. 100 పడకలు ఉన్న ఏరియా ఆస్పత్రిని 200 పడకలుగా మారుస్తామని ప్రకటించినా అది కార్యరూపం దాల్చలేదు. ఈ ఆస్పత్రికి చెందిన పలువురు వైద్యులు ప్రైవేటుగా ప్రాక్టిస్ చేసుకుంటూ విధులకు డుమ్మా కొడుతున్నారు. దీంతో ఇక్కడికి వచ్చేవారికి సరైన వైద్య సేవలు అందడం లేదు. కాగా, ఇక్కడ సివిల్ సర్జన్లు 2, సివిల్ సర్జన్ స్పెషలిస్టులు 8, డిప్యూటీ సివిల్ సర్జన్ 1, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ఖాళీల భర్తీ ఎప్పుడో... ఏజెన్సీలోని వైద్యశాఖలో పలు కీలక పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగానే ఉన్నాయి. పీహెచ్‌సీల్లో వైద్యుల పోస్టులు 12, అసిస్టెంట్ మలేరియా అధికారి 1, సీహెచ్‌వో 7, పీహెచ్ఎన్ 2, స్టాఫ్‌నర్స్‌లు 21, అప్తాలమిక్ అధికారి 3, హెల్ సూపర్వైజర్లు(ఫిమేల్)1, మేల్ 17, ఎంపీహెచ్ఏ(మేల్) 161, ఎంపీహెచ్ఏ(ఫిమేల్) 83, ఫార్మసిస్టు 14, ల్యాబ్ టెక్నీషియన్లు 19, హెల్త్ ఎడ్యుకేటర్ పోస్టులు 7 ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీపై గత ప్రభుత్వం దృష్టి సారించకపోవటంతో గిరిజనులకు వైద్యసేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయి. కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు... తెలంగాణలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంపై గిరిజనులు కోటి ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి తాటికొండ రాజయ్య తొలిసారి గురువారం భద్రాచలం వస్తున్నారు. ఆయన ఏరియా ఆసుపత్రి పరిశీలనతో పాటు, గిరిజనులకు అందుతున్న వైద్య సేవలపై ఐటీడీఏలో ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన సమస్యలపై దృష్టి సారించి వైద్యశాఖను గాడిలో పెట్టాలని గిరిజనులు కోరుతున్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ‘మార్పు’
మెదక్, న్యూస్‌లైన్: మాత, శిశు సంరక్షణే లక్ష్యంగా.. నిరుపేద మహిళల ఆరోగ్యమే ధ్యేయంగా కలెక్టర్ స్మితాసబర్వాల్ ‘మార్పు’ పథకానికి ఊపిరి పోశారు. ఫలితంగా ఇంత వరకూ కాన్పుకు నోచుకోని ప్రభుత్వాస్పత్రుల్లో అనునిత్యం ప్రసవాలు జరుగుతున్నాయి. చిన్నారుల కేరింతలు... బోసి నవ్వులతో ప్రభుత్వాస్పత్రులు కళకళలాడుతున్నాయి. పాపన్నపేట ప్రభుత్వాస్పత్రిలో ఒకేరోజు ఆరు కాన్పులు జరగడం ఇందుకు నిదర్శనం. కాని కొన్ని సౌకర్యాలలేమి వల్ల అక్కడక్కడా అపశ్రుతులు చోటు చేసుకుంటున్నాయి. గ్రామీణ ఆస్పత్రుల్లో సైతం అధునాతన సౌకర్యాలు కల్పిస్తే నిజమైన ‘మార్పు’ వస్తుందని పల్లెజనం పేర్కొంటున్నారు. రామాయంపేట క్లస్టర్ పరిధిలో 9 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు మెదక్, రామాయంపేట పెద్దాస్పత్రులు ఉన్నాయి. డిసెంబర్ నెలలో పాపన్నపేటలో 19, పొడ్చన్‌పల్లిలో 4, సర్ధనలో 6, వెల్దుర్తిలో 8, డి.ధర్మారంలో 8, చిన్నశంకరంపేటలో 4, చేగుంటలో 2, దౌల్తాబాద్‌లో 1, నార్సింగిలో 7 ప్రసవాలు జరిగాయి. మెదక్‌లో 107, రామాయంపేటలో ఒక ప్రసవం నమోదయ్యింది. సాధారణంగా మారుమూల గ్రామాల్లో గతంలో మంత్రసానులే ప్రసవాలు చేసేవారు. అప్పట్లో మాత, శిశు మరణాలు కూడా అధికంగా ఉండేవి. కాలం మారుతున్న తరుణంలో నిరుపేద మహిళలు సైతం పట్టణంలోని ప్రైవేట్ఆస్పత్రుల్లోనే ప్రసవాలు చేయించుకుంటున్నారు. వీరి అవసరాన్ని ఆసరాగా తీసుకుంటున్న ప్రైవేట్ ఆస్పత్రుల యజమానులు అవసరమైనా..లేకున్నా..90 శాతం కాన్పులకు సిజేరియన్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. జిల్లాలోని ఏ పట్టణంలో చూసినా ఇదే తంతు కొనసాగుతుంది. ఒక్కకాన్పునకు ఎంతలేదన్న రూ.10 నుంచి 15వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. మార్పుతో మారిన పరిస్థితులు కలెక్టర్ స్మితాసబర్వాల్ చొరవతో ఊపిరి పోసుకున్న మార్పు పథకం. సత్ఫలితాలిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకు కనీసం 20 ప్రసవాలైనా జరగాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో సుమారు 12యేళ్లుగా ప్రసవాలు నమోదు కాని సర్ధన, పొడ్చన్‌పల్లి లాంటి ఆస్పత్రుల్లో కూడా వరుసగా ప్రసవాలు జరుగుతున్నాయి. పాపన్నపేట ప్రభుత్వాస్పత్రిలో ఈనెల 18న ఆరు ప్రసవాలు జరగడం గమనార్హం. ఇందులో ఓ ప్రభుత్వ మహిళా టీచర్, ఒక రెవెన్యూ అధికారి కుమార్తె ఉండటం విశేషం. ప్రభుత్వాస్పత్రుల్లో పురుడు పోసుకుంటే జననీ సురక్ష యోజన పథకంతోపాటు ఇతర ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. అసౌకర్యాలతో అపశ్రుతులు గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సౌకర్యాలలేమితో కొన్ని అపశ్రుతులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఈనెల 11న మెదక్ ఏరియా ఆస్పత్రిలో కౌడిపల్లి మండలం అన్నసాగర్ గ్రామానికి చెందిన మంజుల ప్రసవానికి వచ్చింది. ప్రసవం అనంతరం 24 గంటలలోపు మృత్యువాత పడింది. అదే విధంగా డిసెంబర్ 1న సిద్దిపేటలో ప్రశాంత్‌నగర్‌కు చెందిన రుద్రోత్ రేవతి అనే బీడీ కార్మికులు ప్రసవం కోసం ప్రభుత్వాస్పత్రికి వెళ్లగా చివరి సమయంలో మా వల్ల కాదంటూ పట్టణానికి పంపడంతో కుటుంబీకులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇటీవల నర్సాపూర్‌లో సైతం ఇలాంటి దారుణం చోటు చేసుకోవడం గమనార్హం. ప్రసవాలు జరిగే అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో అనస్తీషియన్, డీజీఓ, పిడియాట్రిషియన్, బ్లడ్‌బ్యాంకు, వార్మర్, ఇంక్యుబెటర్, ఆక్సిజన్, అంబులెన్స్ లాంటి సౌకర్యాలుంటే సుఖంగా ప్రసవాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.