పురిటి నొప్పులే నయం
కర్నూలు(హాస్పిటల్):
పెద్దాసుపత్రిలో ఎలాంటి సేవలు పొందాలన్నా ఓపిక తప్పనిసరి. ప్రాణం పోతుందన్నా.. చలించరనే ఆపవాదు ఇక్కడి సిబ్బంది సొంతం. మాతా శిశు మరణాలను తగ్గించేందుకు ఉద్దేశించిన జేఎస్‌వై పథకం ఉద్దేశం ఆసుపత్రి అధికారుల తీరుతో నీరుగారుతోంది. ఆసుపత్రిలో ప్రసవాలను ప్రోత్సహించడం ద్వారా మరణాల శాతం తగ్గించడం వరకు బాగానే ఉన్నా.. బాలింతలకు అందించే ప్రోత్సాహకం వారి చేతికందేలోపు దేవుడు కనిపిస్తున్నాడు. గ్రామీణ ప్రాంత మహిళలకు రూ.1000.. పట్టణ ప్రాంత మహిళలకు రూ.600 చొప్పున ఆసుపత్రిలో ప్రసవించిన 48 గంటల్లోపు అందించాల్సి ఉంది. ఈ ప్రోత్సాహకం తీసుకోవాలంటే బాలింతలు ఆసుపత్రిలోని రెండో అంతస్తుకు చేరుకోవాల్సి ఉండటం గమనార్హం.
మెట్లు ఎక్కి దిగలేక వీరి అవస్థలు వర్ణనాతీతం. మంగళవారం పలువురు బాలింతలు కుటుంబ సభ్యులతో కలసి ప్రోత్సాహకం అందుకునేందుకు వచ్చి ఎక్కువ సేపు నిరీక్షించలేక నేలపైనే కూర్చుండిపోయారు. కనీసం బెంచీలు కూడా ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు తావిచ్చింది. ఉక్కపోతతో అల్లాడిపోయారు. గత ఏడాది జూన్‌లో రెండో అంతస్తుకు వెళ్లేందుకు క్యాజువాలిటీని ఆనుకుని లిఫ్ట్ ఏర్పాటు చేశారు. అయితే దీనిని మొదటి అంతస్తుకే పరిమితం చేశారు. కనీసం లిఫ్ట్ బాయ్ కూడా లేకపోవడంతో లిఫ్ట్ ఉన్నా ఉపయోగం లేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో బాలింతలు మెట్ల పైనుంచి రెండో అంతస్తుకు చేరుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ దృష్ట్యా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.