‘నై’.. వైద్యం | Staff awareness of diseases drought | Sakshi
Sakshi News home page

‘నై’.. వైద్యం

Published Thu, Jun 26 2014 5:09 AM | Last Updated on Sat, Sep 2 2017 9:23 AM

‘నై’.. వైద్యం

‘నై’.. వైద్యం

- గిరిజనులను పీడిస్తున్న  మలేరియా
- వ్యాధులపై అవగాహన కల్పించే సిబ్బంది కరువు
- ఇంకా నాటువైద్యం వైపే గిరిజనం మొగ్గు
- వైద్యశాఖలో భర్తీకి నోచని ఖాళీలు
- మంత్రి రాకతోనైనా తీరు మారేనా..

 భద్రాచలం  : ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు మెరుగైన వైద్యం అందని ద్రాక్షగానే మిగులుతోంది.  కార్పొరేట్ స్థాయి వైద్యసేవలను వారి చెంతకే తీసుకెళ్తామని గత పాలకులు చెప్పిన మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. భద్రాచలం ఏజెన్సీలోని గిరిజన గూడేలలో ఆదివాసీలు నేటికీ నాటువైద్యం వైపే మొగ్గుచూపుతున్నారంటే ఇక్కడి వైద్య సేవల పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోంది. జిల్లాలో 69 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు ఉండగా, ఇందులో 50 ఏజెన్సీ ప్రాంతంలోనే ఉన్నాయి.

వీటిలో 28 పీహెచ్‌సీలలో 24 గంటల పాటు వైద్యసేవలందే ఏర్పాట్లు ఉన్నప్పటికీ, పూర్తిస్థాయిలో ఆ ఆస్పత్రులకు వచ్చేలా గిరిజనులకు అవగాహన కల్పించేవారు లే రు. మాతా-శిశు సంరక్షణ కోసం జాతీయ ఆరోగ్యమిషన్ ద్వారా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ, భద్రాచలంలో ఏజెన్సీలో వారి మరణాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ప్రధానంగా చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాల్లోని కొండరెడ్లు, ఆదివాసీలు, వలస గొత్తికోయల గ్రామాల్లో ఎక్కువగా మాతా శిశు మరణాలు సంభవిస్తున్నాయి.

గిరిజనుల్లో తగిన అవగాహన లేకనే ఇంకా ఇళ్ల వద్దనే ప్రసవాలు జరుగుతున్నాయని పరిశీలనలో వెల్లడవుతున్నా, దీనిపై అధికారులు దృష్టి సారించడం లేదు. కొండరెడ్ల మహిళల ప్రసవం కోసమని ఏడుగురాళ్లపలి, తులసిపాక, కూటూరు, కొయిదా, రేఖపల్లి పీహెచ్‌సీల ప్రాంగణాల్లో ప్రత్యేకంగా భవనాలు నిర్మించినా.. అవి వారి అభిరుచికి తగ్గట్టుగా లేకపోవటంతో అక్కడ ఉండేందుకు వారు నిరాకరిస్తున్నారు. ఇక ప్రతీ ఏటా సీజనల్ వ్యాధులతో సంభవించే మరణాలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి.

రాష్ట్రంలో మలేరియా వ్యాధి పీడిత కేసులు ఎక్కువగా నమోదయ్యేది కూడా భద్రాచలం ఏజెన్సీలోని చింతూరు మండలం తులసిపాక, ఏడుగురాళ్లపల్లి పీహెచ్‌సీ పరిధిలోనే. ప్రంపంచ బ్యాంకు సహాయంతో వీటి నివారణ కార్యక్రమాలు చేపడుతున్నా ఫలితాలు అంతంతమాత్రమే. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు 3,10,864 రక్తపూతలు సేకరించగా, ఇందులో 1713 మందికి మలేరియా వ్యాధి సోకినట్లు ఆ శాఖ అధికారుల నివేదికల్లో వెల్లడైంది. ఈ వ్యాధికి అడ్డుకట్ట వేసేందుకు దోమతెరల పంపిణీకి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు ప్రతిపాదనలు చేసినా పాలకులు పట్టించుకున్న దాఖలాలు లేవు. 6 లక్షల జనాభాకు 3.50 లక్షల దోమతెరలు కావాలని కోరినప్పటికీ ఇప్పటి వరకూ దీనిపై స్పష్టత లేదు.
 
అవగాహన కల్పించే వారేరి...
సీజనల్ వ్యాధులతో పాటు ఆసుపత్రిలోనే ప్రసవాలు జరిగేలా గిరిజనుల్లో అవగాహన కల్పించేందుకు తగిన సిబ్బంది లేకపోవటం వల్లే సమస్య జఠిలమవుతోంది.  అవగాహన కల్పించే హెల్త్ ఎడ్యుకేటర్ పోస్టుల భర్తీ గత కొన్నేళ్లుగా నిలిచిపోయింది. ఏజెన్సీలో 12 క్లస్టర్‌లు ఉండగా, ముగ్గురు మాత్రమే హెల్త్ ఎడ్యుకేటర్‌లు పనిచేస్తున్నారు. వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా డీహెచ్‌పీఈ వంటి శిక్షణ పొందిన ఉద్యోగులు ఆ శాఖలో ఉన్నప్పటికీ వారి సేవలను వినియోగించుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దీంతో గిరిజనులు నాటు వైద్యం చేసే వజ్జోడు, భూత వైద్యులను ఆశ్రయిస్తున్నారు. చింతూరు మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో ఓ విద్యార్థిని ఇటీవల ఈ కారణంగానే మృత్యువాత పడింది. వ్యాధులు సంభవించిన తరువాత హడావిడి చేసే కంటే ముందుగానే వీటిపై గిరిజనుల్లో తగిన అవగాహన కల్పిస్తే మేలని, ఇందుకోసం అన్ని క్లస్టర్‌లలో హెల్త్ ఎడ్యుకేటర్ పోస్టులు భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు.
 
పెద్దాస్పత్రిలో సమస్యలెన్నో...
పెద్దాస్పత్రిగా పేరొందిన భద్రాచలం ఏరియా వైద్యశాలకు నిత్యం 500 మందికి పైగానే వస్తుంటారు. 100 మందికి పైగా ఇన్‌పేషెంట్లు ఉంటారు. కానీ ఈ ఆస్పత్రిని ఆ స్థాయిలో అభివృద్ధి చేయలేదు. 100 పడకలు ఉన్న ఏరియా ఆస్పత్రిని 200 పడకలుగా మారుస్తామని ప్రకటించినా అది కార్యరూపం దాల్చలేదు. ఈ ఆస్పత్రికి చెందిన పలువురు వైద్యులు ప్రైవేటుగా ప్రాక్టిస్ చేసుకుంటూ విధులకు డుమ్మా కొడుతున్నారు. దీంతో ఇక్కడికి వచ్చేవారికి సరైన వైద్య సేవలు అందడం లేదు. కాగా, ఇక్కడ సివిల్ సర్జన్‌లు 2, సివిల్ సర్జన్ స్పెషలిస్టులు 8, డిప్యూటీ సివిల్ సర్జన్ 1, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.   
 
క్షేత్రస్థాయిలో ఖాళీల భర్తీ ఎప్పుడో...
ఏజెన్సీలోని వైద్యశాఖలో పలు కీలక పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగానే ఉన్నాయి. పీహెచ్‌సీల్లో వైద్యుల పోస్టులు 12, అసిస్టెంట్ మలేరియా అధికారి 1, సీహెచ్‌వో 7, పీహెచ్‌ఎన్ 2, స్టాఫ్‌నర్స్‌లు 21, అప్తాలమిక్ అధికారి 3, హెల్ సూపర్‌వైజర్‌లు(ఫిమేల్)1, మేల్ 17, ఎంపీహెచ్‌ఏ(మేల్) 161, ఎంపీహెచ్‌ఏ(ఫిమేల్) 83, ఫార్మసిస్టు 14, ల్యాబ్ టెక్నీషియన్‌లు 19, హెల్త్ ఎడ్యుకేటర్ పోస్టులు 7 ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీపై గత ప్రభుత్వం దృష్టి సారించకపోవటంతో గిరిజనులకు  వైద్యసేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయి.
 
కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు...

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంపై గిరిజనులు కోటి ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి తాటికొండ రాజయ్య తొలిసారి గురువారం భద్రాచలం వస్తున్నారు. ఆయన ఏరియా ఆసుపత్రి పరిశీలనతో పాటు, గిరిజనులకు అందుతున్న వైద్య సేవలపై ఐటీడీఏలో ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన సమస్యలపై దృష్టి సారించి వైద్యశాఖను గాడిలో పెట్టాలని గిరిజనులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement