అమ్మా.. క్షమించు ! | Mother .. forgive! | Sakshi
Sakshi News home page

అమ్మా.. క్షమించు !

Published Tue, Oct 7 2014 11:54 PM | Last Updated on Sat, Sep 2 2017 2:29 PM

అమ్మా.. క్షమించు !

అమ్మా.. క్షమించు !

జన్మనిచ్చే అమ్మను రక్షించుకోలేకపోతున్నాం. పసికందులు భూమి మీదకు వచ్చి కళ్లు తెరవక ముందే జన్మనిచ్చిన తల్లులు శాశ్వత నిద్రలోకి జారుకుంటున్నారు. ఇళ్ల వద్ద మంత్రసానులు పురుడు పోసే కాలంలో ఎంతో మంది మాతృమూర్తులు పలు కారణాల వల్ల మృతి చెందేవారు. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చి అధునాతన విధానాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ మాతృ మరణాలు ఆగడం లేదు.
 
 అమ్మా..క్షమించు !
 సాక్షి, గుంటూరు: మాతా శిశు మరణాలను నివారించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎమ్) పథకం కింద ఏటా కోట్ల రూపాయ లను విడుదల చేస్తోంది. గర్భిణులకు పౌష్టికాహారం అందించడం, ప్రభుత్వ వైద్యశాలల్లో ఆపరేషన్ థియేటర్లు, గర్భిణుల పరిరక్షణకు అవసరమైన వైద్య పరికరాల కొనుగోలుకు ఈ నిధులు వెచ్చించాలి.

     ఎన్‌ఆర్‌హెచ్‌ఎమ్ పథకం కింద గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో రూ. 21.20 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.

  జిల్లాలోని ప్రతి పీహెచ్‌సీకి రూ.1.75 లక్షలను హెచ్‌డీఎస్ ఖాతాలో జమచేస్తారు. వీటి ద్వారా మాతాశిశు మరణాలను నివారించేందుకు కావాల్సిన కిట్‌లు, ఆసుపత్రిలో వసతులు కల్పించుకోవాల్సి ఉంది. అయితే ఈ నిధులను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
  సిజేరియన్‌కు సరైన ఆపరేషన్ థియేటర్ కూడా లేకపోవడంతో అంతా ప్రైవేట్ వైద్యశాలలను ఆశ్రయిస్తున్నారు.

     కొన్ని పీహెచ్‌సీల్లో అసలు ప్రసవాలు కూడా జరగడం లేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతోంది. గర్భిణులకు కావాల్సిన రక్తం కూడా అందుబాటులో ఉండకపోవడం మరో సమస్యగా మారింది.

  సీహెచ్‌సీల్లో సైతం గైనకాలజిస్ట్‌ల కొరత ఉండటం, ఉన్న వైద్యులు సక్రమంగా విధులు నిర్వర్తించక పోవడంతో ప్రభుత్వ వైద్యశాలల్లో కాన్పులు చేయించుకునేందుకు ఎవ్వరూ సుముఖత చూపడంలేదు.
  గర్భిణులకు పౌష్టికాహారం కూడా అందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైద్య, ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

 పెరుగుతున్న మాతృ మరణాలు...
 జిల్లాలో మాతృ మరణాలు ప్రతి ఏటా పెరుగుతున్నాయి. 2006-07 ఆర్థిక సంవత్సరంలో 49 మాతృ మరణాలు, 2007- 08 లో 36, 2008-09లో 40, 2009- 10 లో 49, 2010-11 లో 61, 2011-12 లో 61, 2012-13 లో 87, 2013-14 లో 81 మాతృ మరణాలు సంభవించాయి.

  ఈ ఏడాది ఇప్పటికే 50కి పైగా మాతృ మరణాలు నమోదయ్యాయి. ఇవి అధికారిక లెక్కల ప్రకారం మాత్రమే, లెక్కల్లోకి రానివి ఎన్నో వున్నాయి.

  మాతృ మరణాలు అధికంగా జరుగుతున్నా ఎవరిపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. పరిస్థితి ఇలానే కొనసాగితే గర్భం దాల్చడానికి మహిళలు భయప డే స్థితి ఏర్పడనుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement