అంపశయ్యపై ‘ఆయుష్’
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఆయుష్ శాఖ అంపశయ్యపై కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో దేశీయ, సంప్రదాయ వైద్యం, ఆయుష్షు రోజురోజుకూ తగ్గుతోంది. ఆయుర్వేదిక్, హోమియో, యునాని, యోగా, సిద్ధదేశీయ వైద్యాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి ఆయుష్ శాఖను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రధానంగా ఆయుర్వేదిక్, యునాని, హోమియోపతి వైద్యానికి ప్రజల్లో ఆదరణ ఉంది.
ఆయుష్ శాఖలో పనిచేస్తున్న వైద్యులు, ఇతర ఉద్యోగులు ఒక్కొక్కరు ఉద్యోగ విరమణ పొందుతుండడంతో ఖాళీలు ఏర్పడుతున్నారుు. రెగ్యులర్ డిస్పెన్సరీలు, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిస్పెన్సరీలు ఖాళీలతో వెక్కిరిస్తున్నాయి. రెగ్యులర్ డిస్పెన్సరీలో 18 ఏళ్ల కింద చేపట్టిన నియామకాలు మినహా... ఆ తర్వాత పోస్టింగ్‌లు లేవు. ఖాళీలను భర్తీ చేసి ప్రజలకు దేశీయ వైద్యాన్ని అందించాలన్న చిత్తశుద్ధి గత పాలకుల్లో కొరవడడంతో ప్రజలకు దేశీయ, సంప్రదాయ వైద్యం అందని ద్రాక్షగా మారింది.
నిలిచిన నియూమకాలు
ఆయుష్ సేవలు విస్తృతం చేయడం, గ్రామీణ ప్రాంత ప్రజలకు దేశీయ వైద్యాన్ని చేరువ చేయాలని కేంద్ర ప్రభుత్వం 2008-2009లో ఎన్‌ఆర్‌హెచ్‌ఎం ద్వారా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్న ప్రాంతాల్లో ఆయుష్ డిస్పెన్సరీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. రెండు దశల్లో నియామకాలు కూడా చేపట్టింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వైద్యులు, సిబ్బందిని నియమించాలని నిర్ణయించింది. ఆయుర్వేదిక్, యునాని, హోమియో, నేచురోపతి డిస్పెన్సరీలు ఏర్పాటు చేసి నియామకాలు చేపట్టింది. రెండు దశల్లో చేపట్టిన నియామకాల్లో అక్రమాలు జరిగాయని కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు. నియామక ప్రక్రియ ఆలస్యం కావడంతో మూడో దశ నియామకాలు నిలిచాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమైనా ఆయుష్‌కు గుర్తింపునిచ్చి నియామకాలు చేపట్టాల్సిన అవసరముంది.
ఖాళీలు ఇలా..
వరంగల్‌లో ఉన్న ఆయుష్ ప్రాంతీయ ఉప సంచాలక కార్యాలయం(ఆర్‌డీడీ) పరిధిలో వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాలోని ఆయుష్ డిస్పెన్సరీల్లో భారీగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెగ్యులర్ డిస్పెన్సరీలకు సంబంధించి వరంగల్ ఆర్‌డీడీ పరిధిలో 185 ఆయుష్ డిస్పెన్సరీలు ఉంటే.. 43 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 181 కాంపౌండర్ పోస్టులకు 78 పోస్టులు భర్తీ కాలేదు. స్వీపర్/స్కావెంజర్ పోస్టులు 16, నర్సింగ్ ఆర్డర్లీస్ పోస్టులు 96 పోస్టులకు 15, ఏఎన్‌ఎంలు 9 పోస్టులకు 6, అటెండర్ 3 పోస్టులకు ఒకటి ఖాళీగా ఉన్నాయి.
ఎన్‌ఆర్‌హెచ్‌ఎం కింద రెండు దశల్లో 178 డిస్పెన్సరీలు ఏర్పాటు చేశారు. 69 పోస్టుల్లో వైద్యులు ఉండగా, 109 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 178 కాంపౌండర్ పోస్టులకు 79 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 178 స్వీపర్/నర్సింగ్ ఆర్డర్లీ పోస్టుల్లో 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇలా ఎక్కువ సంఖ్యలో వైద్యులు, వైద్య సహాయకుల సిబ్బంది లేకపోవడంతో ప్రజలకు ఆయుష్ సేవలు అందడం లేదు. తెలంగాణ ప్రభుత్వమైనా చొరవ తీసుకుని పోస్టులను భర్తీ చేయూల్సిన అవసరం ఉంది.