ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని, మాతాశిశు మరణాలు అరికట్టాలని ఉన్నతాధికారులు..
వేమనపల్లి : ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని, మాతాశిశు మరణాలు అరికట్టాలని ఉన్నతాధికారులు వైద్యాధికారులకు లక్ష్యం విధిస్తున్నారు. కానీ కొందరు ఏఎన్‌ఎంలు ఆ లక్ష్యానికి గండికొడుతూ ఇంటి వద్ద ప్రసవాలను ప్రోత్సహిస్తున్నారు. ఇంటి వద్ద ప్రసవం చేస్తూ రూ.8వేలు వసూలు చేస్తున్నారు. ఈ విషయం సాక్షాత్తు వేమనపల్లి పబ్లిక్ హెల్త్ అధికారి సత్యనారాయణ పరిశీలనలో వెల్లడైంది.
మండలంలో ఐదు హెల్త్‌సబ్‌సెంటర్లు ఉన్నాయి. వీటి పరిధిలో పనిచేస్తున్న కొందరు ఏఎన్‌ఎంలు రెండేళ్లుగా ఇంటివద్ద ప్రసవాలు చేస్తున్నారు. ఆస్పత్రిలో కాన్పు చేయించుకుంటే ప్రభుత్వమే రూ.వెయ్యి జననీ సురక్ష యోజన కింద బాలింతకు ప్రోత్సాహకం అందజేస్తుంది. ఆస్పత్రికి రావడానికి రూ.500 రవాణా చార్జీలూ చెల్లిస్తుంది. ప్రసవం తర్వాత బాలింతకు రొట్టె, పాలు ఇతర ఖర్చులకు గాను మూడు రోజులపాటు రోజుకు రూ.54చొప్పున అందజేస్తుంది. ఇవన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య పెంచాలనే ఉద్దేశంతో చేస్తోంది.
కానీ ఇవేవీ తెలియని పల్లె ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఇంటి వద్ద కాన్పులను ప్రోత్సహిస్తున్నారు. సబ్‌సెంటర్ పరిధిలోని ఏఎన్‌ఎంలు గర్భిణులు, బాలింతల వివరాలు ప్రతీ నెలా ఏఎంసీ రిజిష్టర్‌లో నమోదు చేస్తుంటారు. దీంతో ఏ గ్రామంలోనైనా గర్భిణి ప్రసవ సమయం పొందుపరుస్తుంటారు. ఆయా గ్రామాల్లో ఎవరైనా పురిటినొప్పులతో బాధపడుతుంటే ఏఎన్‌ఎంలకు ఫోన్ చేస్తుంటారు. దీంతో ఏఎన్‌ఎంలు ఇంటికి వెళ్లి ప్రసవాలు చేస్తున్నారు. ఒక్కో ప్రసవానికి రూ.8వేల నుంచి రూ.12వేల వరకు వసూలు చేస్తున్నారు.
ఎవరికైనా చెబితే ఆస్పత్రి నుంచి ఎలాంటి సహాయం అందదు అంటూ బెదిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో బాలింతలు జననీ సురక్ష యోజన ఆర్థిక సహాయానికి నోచుకోవడం లేదు. ఇంటి వద్ద ప్రసవంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. మరోవైపు ప్రభు త్వ ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య తగ్గుతోంది. వేమనపల్లి పీహెచ్‌సీ పరిధిలో డిసెంబర్‌లో 33 కాన్పులు జరిగాయి. ఇందులో మూడు కాన్పులు మాత్రమే పీహెచ్‌సీలో జరగా.. 9 ప్రైవేట్ ఆస్పత్రుల్లో, మిగితావి ఇంటి వద్దే అయినట్లు తెలిసిన వైద్యాధికారులు ఆరా తీశారు. ఏఎన్‌ఎంలే స్వయంగా కాన్పులు చేసి డబ్బులు తీసుకున్నట్లు పరిశీలనలో తేలింది.