Health Sub-Centres
-
రైతు కాళ్లు మొక్కిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే
మహబూబాబాద్: ఆస్పత్రి నిర్మాణానికి భూమి దానం చేసిన ఓ దాత పాదాలను మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మొక్కి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రజా ప్రయోగ కార్యక్రమానికి సహకరించిన వ్యక్తి పాదాలు మొక్కి కృతజ్ఞతలు తెలిపినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలోని ఆమన్‌గల్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆమన్‌గల్‌లో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం భవన నిర్మాణానికి రైతు వద్ది సుదర్శన్ రెడ్డి స్థలం ఇచ్చారు. రూ.30 లక్షల విలువైన 24 గుంటల భూమిని విరాళంగా ఇచ్చేందుకు అంగీకరించారు. దీంతో ఆ స్థలంలో ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థలం ఇచ్చిన రైతు సుదర్శన్‌రెడ్డి కాళ్లను ఎమ్మెల్యే మొక్కారు. పాదాభివందనం చేస్తుండగా రైతు వారించాడు. రైతు స్థలం ఇవ్వడం అభినందనీయమని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు ఆ రైతును అభినందించారు. -
5,000 ఆరోగ్య ఉపకేంద్రాలకు కొత్త భవనాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో భాగంగా ఆరోగ్య ఉపకేంద్రాలకు(సబ్ సెంటర్లు) కొత్త భవనాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం 5,000 ఉపకేంద్రాలకు కొత్త భవనాలు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో 7,458 ఆరోగ్య ఉపకేంద్రాలున్నాయి. ఇందులో 90 శాతం కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల సొంత భవనాలు ఉన్నప్పటికీ పదేళ్లుగా సరైన నిర్వహణ లేక శిథిలావస్థకు చేరాయి. ఈ నేపథ్యంలో 5,000 సబ్‌సెంటర్లకు కొత్త భవనాలు నిర్మించాలని, అందులో ఏఎన్ఎంలు, మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్లను నియమించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఒక్కో భవనాన్ని రూ.23 లక్షల వ్యయంతో నిర్మించనున్నారు. కొత్త భవనాల నిర్మాణానికి రూ.1,150 కోట్ల వ్యయం కానుంది. ఒక్కో సబ్‌సెంటర్‌ను 5 సెంట్ల నుంచి 10 సెంట్లలో నిర్మిస్తారు. ప్రతి జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని, మొత్తం 13 ప్యాకేజీలుగా విభజించి భవనాల నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. ఇప్పటికే 70 శాతం కేంద్రాలకు స్థలాల సేకరణను పూర్తిచేశారు. కొత్తగా చేపట్టబోయే సబ్‌సెంటర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జాతీయ ఆరోగ్య మిషన్, ప్రపంచ బ్యాంకు నిధులు సమకూర్చనున్నాయి. వీటి నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులను జారీ చేయనుంది. ఆరోగ్య ఉపకేంద్రంలో అందించే సేవలు - ఇక్కడ 12 రకాల ఆరోగ్య సేవలు అందిస్తారు. - సబ్‌సెంటర్ పరిధిలోని గ్రామాల్లోని గర్భిణులను పరీక్షల కోసం ఆస్పత్రులకు తీసుకొస్తారు. - ఆశా వర్కర్ల సాయంతో గర్భిణులకు క్రమం తప్పకుండా వైద్యసేవలు అందిస్తారు. - పోషకాహార లోపంతో బాధపడుతున్న గర్భిణులకు డాక్టర్ల సూచనల మేరకు ఐరన్ ఫోలిక్ మాత్రలు, విటమిన్ మాత్రలు అందజేస్తారు. - శిశువులు, బాలలకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తారు. - క్షయ, కుష్టు వ్యాధిగ్రస్థులకు డాక్టర్ల సూచనల మేరకు మందులు ఇస్తారు. - గ్రామాల్లో జనన, మరణాలను నమోదు చేస్తారు. - పల్స్‌పోలియో వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. - సబ్‌సెంటర్ పరిధిలోని ప్రభుత్వ స్కూళ్లలో రక్తహీనతతో బాధపడుతున్న విద్యార్థులకు అవసరమైన మాత్రలు పంపిణీ చేస్తారు. -
అసంక్రమణ వ్యాధులపై సర్వే
ఉట్నూర్(ఖానాపూర్): రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ అసంక్రమణ వ్యాధుల నిర్ధారణపై దృష్టి సారించింది. అసంక్రమణ వ్యాధులను అదుపులో ఉంచుతూ ప్రజల జీవణ ప్రమాణం పెంచేందుకు చర్యలు చేపట్టింది. 30 సంవత్సరాలు పైబడిన వారు అసంక్రమణ వ్యాధుల బారిన పడుతున్నారని గుర్తించిన వైద్యఆరోగ్యశాఖ నివారణ చర్యలకు పూనుకుంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 30 ఏళ్లు పైబడిన వారందరికీ మార్చి నుంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తూ వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తోంది. ఇప్పటివరకు 96వేల మందికి వైద్యపరీక్షలు నిర్వహించింది. అసంక్రమణ వ్యాధుల నిర్ధారణ ఒక్కప్పుడు మనిషి జీవన ప్రమాణం సాధారణంగా 70 ఏళ్లకు పైబడి ఉండేది. కాలక్రమంలో మనిషి ఆయుష్సు తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం 30 ఏళ్లుపై బడిన వారు ఏదో ఒక్క వ్యాధిబారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దీనికి ప్రధానంగా నాలుగు రకాల అసంక్రమణ వ్యాధులే కారణమని గుర్తించిన వైద్య ఆరోగ్యశాఖ వయస్సు పైబడిన వారందరికీ వైద్యపరీక్షలు నిర్వహించి తగిన వైద్యం అందించాలని నిర్ణయించింది. దానికి అనుగుణంగా ఫిబ్రవరిలో వైద్యసిబ్బందికి శిక్షణ ఇచ్చిన ప్రభుత్వం మార్చి నుంచి జిల్లాల్లో 30 ఏళ్లు పైబడిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తూ వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తోంది. వైద్య పరీక్షల్లో భాగంగా అసంక్రమణ వ్యాధుల కిందకు వచ్చే మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్లు (నోటి, గర్భాశయ, రొమ్ము), పక్షవాతం వ్యాధుల నిర్ధారణకు పరీక్షలు చేస్తున్నారు. జిల్లాలో 2.72 లక్షల మందికి పరీక్షలు జిల్లాలో 16 గిరిజన, 06 మైదాన ప్రాంత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 7.37 లక్షల జనాభా ఉంది. వీరిలో 2,72,690 మంది 30 ఏళ్లు నిండిన జనాభా ఉంది. అసంక్రమణ వ్యాధుల నిర్ధారణలో భాగంగా వీరందరికీ ప్రభుత్వం వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. ఏప్రిల్ చివరి నాటికి 96,324 మందికి వైద్యపరీక్షలు చేశారు. ఇందుకోసం అధికారులు వైద్యసిబ్బందితో బృందాలు ఏర్పాటు చేశారు. ప్రతీ బృందంలో హెల్త్ అసిస్టెంట్, ఇద్దరు ఏఎన్ఎంలు, సూపర్వైజర్ ఉంటారు. వీరు ప్రతీరోజు గ్రామాల్లో వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు వివరాలు ఆన్లైన్లో నమోదు చేసేలా ట్యాబ్‌లు అందించారు. దీంతో వైద్యబృందం ప్రతీరోజు 60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేలా చర్యలు చేపట్టారు. ఆన్లైన్ నమోదు సమయంలో సదరు వ్యక్తి ఫొటోతో పాటు ఆధార్ నంబర్‌కు అనుసంధానం చేసి ఆ వ్యక్తికి ఆరోగ్యశాఖ నుంచి ప్రత్యేక ఐడీ నంబర్ కేటాయిస్తారు. దీంతో వ్యక్తి ఆరోగ్య వివరాలు సంబంధిత పీహెచ్సి వైద్యాధికారి ట్యాబ్‌కు, వైద్య ఆరోగ్యశాఖకు అనుసంధానం అయి ఉంటాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రభుత్వ ఆస్పత్రిలోనైనా వైద్యసేవలు పొందే ఉంది. ప్రతీ శనివారం పరీక్షలు అసంక్రమణ వ్యాధులతో బాధపడుతూ ఆన్లైన్లో నమోదు చేయబడిన వ్యాధిగ్రస్తులకు ప్రతీ శనివారం ఆయా పీహెచ్‌సీల పరిధిలో వైద్యాధికారులు వైద్య పరీక్షలతోపాటు కావాల్సిన మందులు అందిస్తుంటారు. వ్యాధి తీవ్రతను బట్టి పైఆస్పత్రులకు రెఫర్ చేసే అవకాశం వైద్యాధికారులకు ఆరోగ్యశాఖ కల్పించింది. జిల్లాలో ఇప్పటి వరకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకున్న వారిలో 372 మంది మధుమేహం, 2213 మంది అధిక రక్తపోటు, 20 మంది నోటి, గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ల బారిన పడిన వారు, 28 మంది పక్షవాతంతో బాధపడుతున్న వారిని గుర్తించి వారి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడంతో వైద్యఆరోగ్యశాఖ ప్రతీ శనివారం ఆయా పీహెచ్సీలో వైద్యం అందిస్తోంది. -
ఇంటి వద్ద ప్రసవం చేస్తే రూ.8వేలు
వేమనపల్లి : ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని, మాతాశిశు మరణాలు అరికట్టాలని ఉన్నతాధికారులు వైద్యాధికారులకు లక్ష్యం విధిస్తున్నారు. కానీ కొందరు ఏఎన్ఎంలు ఆ లక్ష్యానికి గండికొడుతూ ఇంటి వద్ద ప్రసవాలను ప్రోత్సహిస్తున్నారు. ఇంటి వద్ద ప్రసవం చేస్తూ రూ.8వేలు వసూలు చేస్తున్నారు. ఈ విషయం సాక్షాత్తు వేమనపల్లి పబ్లిక్ హెల్త్ అధికారి సత్యనారాయణ పరిశీలనలో వెల్లడైంది. మండలంలో ఐదు హెల్త్సబ్సెంటర్లు ఉన్నాయి. వీటి పరిధిలో పనిచేస్తున్న కొందరు ఏఎన్ఎంలు రెండేళ్లుగా ఇంటివద్ద ప్రసవాలు చేస్తున్నారు. ఆస్పత్రిలో కాన్పు చేయించుకుంటే ప్రభుత్వమే రూ.వెయ్యి జననీ సురక్ష యోజన కింద బాలింతకు ప్రోత్సాహకం అందజేస్తుంది. ఆస్పత్రికి రావడానికి రూ.500 రవాణా చార్జీలూ చెల్లిస్తుంది. ప్రసవం తర్వాత బాలింతకు రొట్టె, పాలు ఇతర ఖర్చులకు గాను మూడు రోజులపాటు రోజుకు రూ.54చొప్పున అందజేస్తుంది. ఇవన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య పెంచాలనే ఉద్దేశంతో చేస్తోంది. కానీ ఇవేవీ తెలియని పల్లె ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఇంటి వద్ద కాన్పులను ప్రోత్సహిస్తున్నారు. సబ్‌సెంటర్ పరిధిలోని ఏఎన్ఎంలు గర్భిణులు, బాలింతల వివరాలు ప్రతీ నెలా ఏఎంసీ రిజిష్టర్‌లో నమోదు చేస్తుంటారు. దీంతో ఏ గ్రామంలోనైనా గర్భిణి ప్రసవ సమయం పొందుపరుస్తుంటారు. ఆయా గ్రామాల్లో ఎవరైనా పురిటినొప్పులతో బాధపడుతుంటే ఏఎన్ఎంలకు ఫోన్ చేస్తుంటారు. దీంతో ఏఎన్ఎంలు ఇంటికి వెళ్లి ప్రసవాలు చేస్తున్నారు. ఒక్కో ప్రసవానికి రూ.8వేల నుంచి రూ.12వేల వరకు వసూలు చేస్తున్నారు. ఎవరికైనా చెబితే ఆస్పత్రి నుంచి ఎలాంటి సహాయం అందదు అంటూ బెదిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో బాలింతలు జననీ సురక్ష యోజన ఆర్థిక సహాయానికి నోచుకోవడం లేదు. ఇంటి వద్ద ప్రసవంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. మరోవైపు ప్రభు త్వ ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య తగ్గుతోంది. వేమనపల్లి పీహెచ్సీ పరిధిలో డిసెంబర్లో 33 కాన్పులు జరిగాయి. ఇందులో మూడు కాన్పులు మాత్రమే పీహెచ్సీలో జరగా.. 9 ప్రైవేట్ ఆస్పత్రుల్లో, మిగితావి ఇంటి వద్దే అయినట్లు తెలిసిన వైద్యాధికారులు ఆరా తీశారు. ఏఎన్ఎంలే స్వయంగా కాన్పులు చేసి డబ్బులు తీసుకున్నట్లు పరిశీలనలో తేలింది.