అసంక్రమణ వ్యాధులపై సర్వే | Public Health Survey Begins In Telangana | Sakshi
Sakshi News home page

అసంక్రమణ వ్యాధులపై సర్వే

Published Sat, May 4 2019 8:23 AM | Last Updated on Sat, May 4 2019 9:02 AM

Public Health Survey Begins In Telangana - Sakshi

ఉట్నూర్‌(ఖానాపూర్‌): రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ అసంక్రమణ వ్యాధుల నిర్ధారణపై దృష్టి సారించింది. అసంక్రమణ వ్యాధులను అదుపులో ఉంచుతూ ప్రజల జీవణ ప్రమాణం పెంచేందుకు చర్యలు చేపట్టింది. 30 సంవత్సరాలు పైబడిన వారు అసంక్రమణ వ్యాధుల బారిన పడుతున్నారని గుర్తించిన వైద్యఆరోగ్యశాఖ నివారణ చర్యలకు పూనుకుంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 30 ఏళ్లు పైబడిన వారందరికీ మార్చి నుంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తూ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తోంది. ఇప్పటివరకు 96వేల మందికి వైద్యపరీక్షలు నిర్వహించింది.

అసంక్రమణ వ్యాధుల నిర్ధారణ
ఒక్కప్పుడు మనిషి జీవన ప్రమాణం సాధారణంగా 70 ఏళ్లకు పైబడి ఉండేది. కాలక్రమంలో మనిషి ఆయుష్సు తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం 30 ఏళ్లుపై బడిన వారు ఏదో ఒక్క వ్యాధిబారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దీనికి ప్రధానంగా నాలుగు రకాల అసంక్రమణ వ్యాధులే కారణమని గుర్తించిన వైద్య ఆరోగ్యశాఖ వయస్సు పైబడిన వారందరికీ వైద్యపరీక్షలు నిర్వహించి తగిన వైద్యం అందించాలని నిర్ణయించింది. దానికి అనుగుణంగా ఫిబ్రవరిలో వైద్యసిబ్బందికి శిక్షణ ఇచ్చిన ప్రభుత్వం మార్చి నుంచి జిల్లాల్లో 30 ఏళ్లు పైబడిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తూ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తోంది. వైద్య పరీక్షల్లో భాగంగా అసంక్రమణ వ్యాధుల కిందకు వచ్చే మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్లు (నోటి, గర్భాశయ, రొమ్ము), పక్షవాతం వ్యాధుల నిర్ధారణకు పరీక్షలు చేస్తున్నారు.

జిల్లాలో 2.72 లక్షల మందికి పరీక్షలు
జిల్లాలో 16 గిరిజన, 06 మైదాన ప్రాంత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 7.37 లక్షల జనాభా ఉంది. వీరిలో 2,72,690 మంది 30 ఏళ్లు నిండిన జనాభా ఉంది. అసంక్రమణ వ్యాధుల నిర్ధారణలో భాగంగా వీరందరికీ ప్రభుత్వం వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. ఏప్రిల్‌ చివరి నాటికి 96,324 మందికి వైద్యపరీక్షలు చేశారు. ఇందుకోసం అధికారులు వైద్యసిబ్బందితో బృందాలు ఏర్పాటు చేశారు. ప్రతీ బృందంలో హెల్త్‌ అసిస్టెంట్, ఇద్దరు ఏఎన్‌ఎంలు, సూపర్‌వైజర్‌ ఉంటారు. వీరు ప్రతీరోజు గ్రామాల్లో వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా ట్యాబ్‌లు అందించారు. దీంతో వైద్యబృందం ప్రతీరోజు 60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా చర్యలు చేపట్టారు. ఆన్‌లైన్‌ నమోదు సమయంలో సదరు వ్యక్తి ఫొటోతో పాటు ఆధార్‌ నంబర్‌కు అనుసంధానం చేసి ఆ వ్యక్తికి ఆరోగ్యశాఖ నుంచి ప్రత్యేక ఐడీ నంబర్‌ కేటాయిస్తారు. దీంతో వ్యక్తి ఆరోగ్య వివరాలు సంబంధిత పీహెచ్‌సి వైద్యాధికారి ట్యాబ్‌కు, వైద్య ఆరోగ్యశాఖకు అనుసంధానం అయి ఉంటాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రభుత్వ ఆస్పత్రిలోనైనా వైద్యసేవలు పొందే ఉంది.

ప్రతీ శనివారం పరీక్షలు
అసంక్రమణ వ్యాధులతో బాధపడుతూ ఆన్‌లైన్‌లో నమోదు చేయబడిన వ్యాధిగ్రస్తులకు ప్రతీ శనివారం ఆయా పీహెచ్‌సీల పరిధిలో వైద్యాధికారులు వైద్య పరీక్షలతోపాటు కావాల్సిన మందులు అందిస్తుంటారు. వ్యాధి తీవ్రతను బట్టి పైఆస్పత్రులకు రెఫర్‌ చేసే అవకాశం వైద్యాధికారులకు ఆరోగ్యశాఖ కల్పించింది. జిల్లాలో ఇప్పటి వరకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకున్న వారిలో 372 మంది మధుమేహం, 2213 మంది అధిక రక్తపోటు, 20 మంది నోటి, గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ల బారిన పడిన వారు, 28 మంది పక్షవాతంతో బాధపడుతున్న వారిని గుర్తించి వారి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో వైద్యఆరోగ్యశాఖ ప్రతీ శనివారం ఆయా పీహెచ్‌సీలో వైద్యం అందిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement