health deportment
-
మరో 74 కేసులు నమోదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శనివారం 74 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరుగురు చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య ఇప్పటివరకు 2,499కు చేరుకుంది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీకి చెందిన 41, రంగారెడ్డి జిల్లాకు చెందిన 5 సహా ఇతర జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలసదారులు 9 మంది, సౌదీ అరేబియాకు చెందిన ఐదుగురు ఉన్నారు. ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాని వనపర్తి జిల్లాలో ఒక కేసు నమోదైందని ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్‌రావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన బులెటిన్ విడుదల చేశారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో తెలంగాణకు చెందిన కేసులు 2,068 ఉండగా, వలస కార్మికులు, సౌదీ అరేబియా, ఇతర దేశాల నుంచి వచ్చిన వారి ద్వారా నమోదైన కేసులు 431 ఉన్నాయి. అందులో వలస కార్మికులకు సంబంధించినవి 189, సౌదీ అరేబియా నుంచి వచ్చినవి 212 కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 77 మంది చనిపోయారు. మొత్తం 1,412 మంది డిశ్చార్జి అయ్యారని తెలిపారు. ప్రస్తుతం 1,010 మంది చికిత్స పొందుతున్నారు. వరంగల్ రూరల్, యాదాద్రి జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. గత 14 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదుకాని జిల్లాలు సిరిసిల్ల, కామారెడ్డి, భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, సిద్ధిపేట, భద్రాద్రి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, గద్వాల, నల్లగొండ, జనగాం, మహబూబాబాద్, నిర్మల్ ఉన్నాయి. ఇద్దరు పీజీ వైద్య విద్యార్థులకు కరోనా.. సుల్తాన్‌బజార్: ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఉంటున్న ఇద్దరు పీజీ డాక్టర్లకు కరోనా లక్షణాలు కన్పించాయి. దీంతో స్థానిక వైద్యులు వారిని పరీక్షించి గాంధీ ఆసుపత్రికి తరలించారు. భయాందోళనకు గురైన హాస్టల్ విద్యార్థులు వెంటనే తమ గదులను ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా కలకలం అఫ్జల్‌గంజ్: ఉస్మానియా ఆసుపత్రిలోని డైట్ క్యాంటీన్లో పనిచేసే ఓ యువకుడికి కరోనా సోకింది. ఆ యువకుడు వారం కిందటే మహబూబ్‌నగర్ జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లి వచ్చాడు. తిరిగి విధుల్లో చేరిన అతడు జ్వరం, జలుబుతో బాధపడుతుండటంతో వైద్యులు కరోనా పరీక్షలు చేయించగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా, ఆసుపత్రిలోని డైట్ క్యాంటీన్లో చికిత్సలు పొందే రోగులతో పాటు సూపరింటెండెంట్, ఆర్ఎంవోలు, డ్యూటీ డాక్టర్లు భోజనం చేస్తుంటారు. -
అసంక్రమణ వ్యాధులపై సర్వే
ఉట్నూర్(ఖానాపూర్): రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ అసంక్రమణ వ్యాధుల నిర్ధారణపై దృష్టి సారించింది. అసంక్రమణ వ్యాధులను అదుపులో ఉంచుతూ ప్రజల జీవణ ప్రమాణం పెంచేందుకు చర్యలు చేపట్టింది. 30 సంవత్సరాలు పైబడిన వారు అసంక్రమణ వ్యాధుల బారిన పడుతున్నారని గుర్తించిన వైద్యఆరోగ్యశాఖ నివారణ చర్యలకు పూనుకుంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 30 ఏళ్లు పైబడిన వారందరికీ మార్చి నుంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తూ వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తోంది. ఇప్పటివరకు 96వేల మందికి వైద్యపరీక్షలు నిర్వహించింది. అసంక్రమణ వ్యాధుల నిర్ధారణ ఒక్కప్పుడు మనిషి జీవన ప్రమాణం సాధారణంగా 70 ఏళ్లకు పైబడి ఉండేది. కాలక్రమంలో మనిషి ఆయుష్సు తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం 30 ఏళ్లుపై బడిన వారు ఏదో ఒక్క వ్యాధిబారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దీనికి ప్రధానంగా నాలుగు రకాల అసంక్రమణ వ్యాధులే కారణమని గుర్తించిన వైద్య ఆరోగ్యశాఖ వయస్సు పైబడిన వారందరికీ వైద్యపరీక్షలు నిర్వహించి తగిన వైద్యం అందించాలని నిర్ణయించింది. దానికి అనుగుణంగా ఫిబ్రవరిలో వైద్యసిబ్బందికి శిక్షణ ఇచ్చిన ప్రభుత్వం మార్చి నుంచి జిల్లాల్లో 30 ఏళ్లు పైబడిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తూ వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తోంది. వైద్య పరీక్షల్లో భాగంగా అసంక్రమణ వ్యాధుల కిందకు వచ్చే మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్లు (నోటి, గర్భాశయ, రొమ్ము), పక్షవాతం వ్యాధుల నిర్ధారణకు పరీక్షలు చేస్తున్నారు. జిల్లాలో 2.72 లక్షల మందికి పరీక్షలు జిల్లాలో 16 గిరిజన, 06 మైదాన ప్రాంత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 7.37 లక్షల జనాభా ఉంది. వీరిలో 2,72,690 మంది 30 ఏళ్లు నిండిన జనాభా ఉంది. అసంక్రమణ వ్యాధుల నిర్ధారణలో భాగంగా వీరందరికీ ప్రభుత్వం వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. ఏప్రిల్ చివరి నాటికి 96,324 మందికి వైద్యపరీక్షలు చేశారు. ఇందుకోసం అధికారులు వైద్యసిబ్బందితో బృందాలు ఏర్పాటు చేశారు. ప్రతీ బృందంలో హెల్త్ అసిస్టెంట్, ఇద్దరు ఏఎన్ఎంలు, సూపర్వైజర్ ఉంటారు. వీరు ప్రతీరోజు గ్రామాల్లో వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు వివరాలు ఆన్లైన్లో నమోదు చేసేలా ట్యాబ్‌లు అందించారు. దీంతో వైద్యబృందం ప్రతీరోజు 60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేలా చర్యలు చేపట్టారు. ఆన్లైన్ నమోదు సమయంలో సదరు వ్యక్తి ఫొటోతో పాటు ఆధార్ నంబర్‌కు అనుసంధానం చేసి ఆ వ్యక్తికి ఆరోగ్యశాఖ నుంచి ప్రత్యేక ఐడీ నంబర్ కేటాయిస్తారు. దీంతో వ్యక్తి ఆరోగ్య వివరాలు సంబంధిత పీహెచ్సి వైద్యాధికారి ట్యాబ్‌కు, వైద్య ఆరోగ్యశాఖకు అనుసంధానం అయి ఉంటాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రభుత్వ ఆస్పత్రిలోనైనా వైద్యసేవలు పొందే ఉంది. ప్రతీ శనివారం పరీక్షలు అసంక్రమణ వ్యాధులతో బాధపడుతూ ఆన్లైన్లో నమోదు చేయబడిన వ్యాధిగ్రస్తులకు ప్రతీ శనివారం ఆయా పీహెచ్‌సీల పరిధిలో వైద్యాధికారులు వైద్య పరీక్షలతోపాటు కావాల్సిన మందులు అందిస్తుంటారు. వ్యాధి తీవ్రతను బట్టి పైఆస్పత్రులకు రెఫర్ చేసే అవకాశం వైద్యాధికారులకు ఆరోగ్యశాఖ కల్పించింది. జిల్లాలో ఇప్పటి వరకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకున్న వారిలో 372 మంది మధుమేహం, 2213 మంది అధిక రక్తపోటు, 20 మంది నోటి, గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ల బారిన పడిన వారు, 28 మంది పక్షవాతంతో బాధపడుతున్న వారిని గుర్తించి వారి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడంతో వైద్యఆరోగ్యశాఖ ప్రతీ శనివారం ఆయా పీహెచ్సీలో వైద్యం అందిస్తోంది. -
వైద్య ఆరోగ్యశాఖలో మరో అధికారిపై వేటు
హైదరాబాద్: తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో మరో అధికారిపై బదిలీవేటు వేశారు. ఇటీవలే వైద్య పరికరాల కొనుగోళ్లు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల్లో భారీగా అక్రమాలు జరగడం, ప్రభుత్వం దీనిపై సీరియస్ కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ర్ట మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ ఈడీ రాజేందర్‌పై కూడా బదిలీ వేటు వేశారు. ఇటీవలే రూ.208 కోట్ల విలువైన వైద్య పరికరాల కొనుగోళ్ల విషయంలో సంస్థలో అధికారులపై తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో ఆ కొనుగోళ్లు రద్దు చేశారు. కాగా, రెండ్రోజుల క్రితం కొన్ని శస్త్రచికిత్సల పరికరాలు, బ్యాండేజీ, కాటన్ కొనుగోళ్లలో సరఫరాదారులు కమీషన్లు ఇవ్వాలనిఈడీపై ఒత్తిడి తెచ్చారని, దానికి అంగీకరించని సప్లయర్లు, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శికి ఫిర్యాదు చేశారని తెలిసింది. ఈ నేపథ్యంలో రాజేందర్‌ను బదిలీ చేశారు. ఆయన స్థానంలో అదే శాఖకు చెందిన పద్మాకర్‌ను నియమిస్తూ రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులిచ్చారు.