
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో భాగంగా ఆరోగ్య ఉపకేంద్రాలకు(సబ్ సెంటర్లు) కొత్త భవనాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం 5,000 ఉపకేంద్రాలకు కొత్త భవనాలు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో 7,458 ఆరోగ్య ఉపకేంద్రాలున్నాయి. ఇందులో 90 శాతం కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల సొంత భవనాలు ఉన్నప్పటికీ పదేళ్లుగా సరైన నిర్వహణ లేక శిథిలావస్థకు చేరాయి.
ఈ నేపథ్యంలో 5,000 సబ్‌సెంటర్లకు కొత్త భవనాలు నిర్మించాలని, అందులో ఏఎన్‌ఎంలు, మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్లను నియమించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఒక్కో భవనాన్ని రూ.23 లక్షల వ్యయంతో నిర్మించనున్నారు. కొత్త భవనాల నిర్మాణానికి రూ.1,150 కోట్ల వ్యయం కానుంది. ఒక్కో సబ్‌సెంటర్‌ను 5 సెంట్ల నుంచి 10 సెంట్లలో నిర్మిస్తారు. ప్రతి జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని, మొత్తం 13 ప్యాకేజీలుగా విభజించి భవనాల నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. ఇప్పటికే 70 శాతం కేంద్రాలకు స్థలాల సేకరణను పూర్తిచేశారు. కొత్తగా చేపట్టబోయే సబ్‌సెంటర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జాతీయ ఆరోగ్య మిషన్, ప్రపంచ బ్యాంకు నిధులు సమకూర్చనున్నాయి. వీటి నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులను జారీ చేయనుంది.
ఆరోగ్య ఉపకేంద్రంలో అందించే సేవలు
- ఇక్కడ 12 రకాల ఆరోగ్య సేవలు అందిస్తారు.
- సబ్‌సెంటర్ పరిధిలోని గ్రామాల్లోని గర్భిణులను పరీక్షల కోసం ఆస్పత్రులకు తీసుకొస్తారు.
- ఆశా వర్కర్ల సాయంతో గర్భిణులకు క్రమం తప్పకుండా వైద్యసేవలు అందిస్తారు.
- పోషకాహార లోపంతో బాధపడుతున్న గర్భిణులకు డాక్టర్ల సూచనల మేరకు ఐరన్ ఫోలిక్ మాత్రలు, విటమిన్ మాత్రలు అందజేస్తారు.
- శిశువులు, బాలలకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తారు.
- క్షయ, కుష్టు వ్యాధిగ్రస్థులకు డాక్టర్ల సూచనల మేరకు మందులు ఇస్తారు.
- గ్రామాల్లో జనన, మరణాలను నమోదు చేస్తారు.
- పల్స్‌పోలియో వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
- సబ్‌సెంటర్ పరిధిలోని ప్రభుత్వ స్కూళ్లలో రక్తహీనతతో బాధపడుతున్న విద్యార్థులకు అవసరమైన మాత్రలు పంపిణీ చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment