
సాక్షి, అమరావతి: ఆరోగ్యం–సంరక్షణ కేంద్రాల నిర్వహణ, వైద్య సేవల విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. వరుసగా మూడుసార్లు మొదటి ర్యాంకు కైవసం చేసుకుని హ్యాట్రిక్ సాధించింది. కేంద్ర పథకాలైన వీటి అమలులో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. జాతీయ ఆరోగ్య మిషన్ అమలు చేస్తున్న పథకాలతో పాటు వివిధ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ చాలా రాష్ట్రాల కంటే గణనీయమైన ప్రగతి సాధించింది.
నెలనెలా ర్యాంకులు
► కేంద్ర ఆరోగ్య మిషన్ పథకాలను అమలు చేస్తున్న విధానాన్ని బట్టి ప్రతినెలా ర్యాంకులు ప్రకటిస్తారు. ఏపీ వరుసగా మూడుసార్లు మొదటి స్థానంలో నిలవగా.. గుజరాత్ రెండో స్థానం, కర్ణాటక మూడో స్థానంలో నిలిచాయి.
► గ్రామీణ ప్రాంతాల్లో వివిధ వర్గాల వారికి ఆరోగ్యం, సంరక్షణ (హెల్త్ అండ్ వెల్‌నెస్) సెంటర్ల ద్వారా ఏపీ ప్రభుత్వం విశేష సేవలు అందిస్తోంది.
► టీకాల అమలులోనూ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే మొదటి ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే.
► కరోనా సమయంలో చాలా రాష్ట్రాలు టీకాల కార్యక్రమాన్ని 50 శాతం మాత్రమే అమలు చేయగా.. ఆంధ్రప్రదేశ్ 73 శాతం పైగా టీకాలు వేసింది.
► జీవనశైలి జబ్బులను గుర్తించడంతోపాటు ట్రామా కేర్ బాధితులకు సేవలందించడంలోనూ ఏపీ మెరుగైన ఫలితాలను సాధిస్తున్నట్టు జాతీయ ఆరోగ్యమిషన్ పరిశీలనలో వెల్లడైంది.
► మొదటి మూడు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలకు.. మిగతా స్థానాల్లో ఉన్న రాష్ట్రాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉన్నట్టు వెల్లడైంది.