వైఎస్సార్ జిల్లా బద్వేలు వద్ద సెంచురీ ప్యానల్స్ ఉత్పత్తిని ప్రారంభిస్తున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం వైఎస్సార్ జిల్లాలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. బద్వేలు నియోజకవర్గం గోపవరం మండల పరిధిలోని ఇండస్ట్రియల్ పార్కులో రూ.956 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన సెంచురీ ప్యానల్స్ లిమిటెడ్ (సీపీఎల్) పరిశ్రమ ఉత్పత్తిని ఆయన ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అలాగే, కడప రిమ్స్ ప్రాంగణంలో అత్యాధునిక మౌలిక వసతులతో నిర్మించిన డా.వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, డా. వైఎస్సార్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, డా.వైఎస్సార్ క్యాన్సర్ కేర్ సెంటర్లతో పాటు ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ భవనాలకు ముఖ్యమంత్రి జగన్ వేర్వేరుగా ప్రారంభోత్సవం చేశారు.
ఆ తర్వాత.. ఆధునీకరించిన వైఎస్సార్ జిల్లా కలెక్టరేట్ భవనాన్ని, రూ.56.70కోట్లతో నిర్మించిన అంబేద్కర్ సర్కిల్–వై జంక్షన్ రోడ్డును, 15వ ఆర్థిక సంఘం, ‘కుడా’ సహకారంతో నిర్మించిన కోటిరెడ్డి సర్కిల్‌ను ఆయన ప్రారంభించారు. కలెక్టరేట్ ప్రాంగణంలోనే జిల్లాలోని అర్హులైన 50 మంది దివ్యాంగులకు ముఖ్యమంత్రి జగన్ రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ స్కూటర్లను ఉచితంగా పంపిణీ చేయడంతోపాటు అగ్నిమాపక విభాగం కొనుగోలు చేసిన రెస్క్యూ పరికరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ..
సెంచురీ ప్యానెల్స్ పరిశ్రమ జిల్లా పారిశ్రామిక ప్రగతిలో మరో మైలురాయి అని సీఎం జగన్ అభివర్ణించారు. అన్ని మౌలిక సదుపాయాలతో సహా ఎకరా రూ.15 లక్షల రాయితీ ధరతో ఏపీఐఐసి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 100 ఎకరాల విస్తీర్ణంలో సెంచరీ ప్యానెల్స్ లిమిటెడ్ (సీపీఎల్) పరిశ్రమ ఏర్పాటైందన్నారు. లాంజ్ రూమ్‌లో కంపెనీకి సంబంధించిన వీడియోను తిలకించారు. సెంచురీ సంస్థ చైర్మన్ సజ్జన్ బజంకా, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ అగర్వాల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేశన్ బజంకా సంస్థ గురించి సీఎంకు వివరించారు.
అనంతరం.. ప్రజలకు మెరుగైన వైద్యసేవలతో పాటు ఆరోగ్యకర సమాజం కోసం ఎంతోమంది వైద్యులను అందిస్తున్న రిమ్స్ (రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్).. మెడికల్ హబ్‌గా రాయలసీమకే తలమానికంగా మారిందని సీఎం జగన్ ప్రశంసించారు. జిల్లా ప్రజలకు మాత్రమే కాకుండా రాయలసీమ స్థాయిలో కూడా అత్యుత్తమ, మెరుగైన వైద్యసేవలు రిమ్స్ అందిస్తోందన్నారు. సువిశాలమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో మెరుగైన వైద్యసేవలతో వేలాది మంది ప్రజలకు నిత్యం ప్రాణరక్షణ కల్పిస్తూ సంజీవనిగా రిమ్స్ పేరొందిందన్నారు.
రిమ్స్ బోధనాసుపత్రి ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించే క్రమంలో కోట్లాది రూపాయలు వెచ్చించి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కేన్సర్ రీసెర్చ్ ఆసుపత్రి, మానసిక వైద్యశాల, ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాలలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యం దిశగా రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేసిందన్నారు. వైద్య విభాగాధిపతులు కేవలం వైద్యం వరకే పరిమితం కాకుండా ఆయా విభాగాల్లో పరికరాల నిర్వహణ, యాజమాన్యంపై ప్రత్యేక దృష్టిసారించి వైద్యరంగం పటిష్టత కోసం కృషిచేయాలని ముఖ్యమంత్రి ఆకాక్షించారు.
స్మార్ట్ సిటీగా కడప
ఇక కడప నగరాన్ని స్మార్ట్ సిటీగా చూడాలన్న ప్రజల ఆకాంక్ష నెరవేరిందని, కడపకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కడప నగరాభివృద్ధిలో భాగంగా పారిశుధ్యం, స్వచ్ఛతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఆరోగ్యకరమైన సుందర నగరంగా తీర్చిదిద్దడంలో మాట నిలబెట్టుకున్నామని చెప్పారు. నగరం అభివృద్ధి కోసం పెట్టిన ప్రతిపాదనలు అన్నింటికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు కూడా చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు.
మరికొన్ని పనులు పురోగతిలో ఉన్నాయని.. మన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పలు ప్రధాన రహదారులకు విస్తరణ పనులు చేపట్టి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కడపను అభివృద్ధి చేసి చూపించామన్నారు. అలాగే, నైపుణ్యతకు, నాణ్యతకు నిలువెత్తు నిదర్శనం వైఎస్సార్ జిల్లా కలెక్టరేట్ అని, పుష్కలమైన పరిపాలన వనరులకు కేంద్ర బిందువుగా రాష్ట్రంలో నిలిచిందని సీఎం అభివర్ణించారు.
రోడ్డుమార్గాన ఇడుపులపాయకు..
అనంతరం శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హెలికాప్టర్‌లో ఇడుపులపాయకు వెళ్లాల్సి ఉంది. అయితే, కార్యక్రమాలు ఆలస్యం కావడంతో అనుకున్న సమయానికి హెలికాపర్టర్‌లో వెళ్లలేకపోయారు. ఏవియేషన్ అధికారుల సూచన మేరకు రోడ్డు మార్గాన రాత్రి 7గంటలకు ఇడుపులపాయకు చేరుకున్నారు. రాత్రికి అక్కడ వైఎస్సార్ గెస్ట్‌హౌస్‌లో బసచేశారు.
క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని ఆదివారం ఇడుపులపాయ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత నెమళ్ల పార్కు పక్కనున్న ఓపెన్ ఎయిర్ చర్చిలో కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి క్రిస్మస్ వేడుకలు చేసుకుంటారు. అనంతరం.. సింహాద్రిపురం మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి వెళ్తారు.
ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, ఎంపీ అవినాష్‌రెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు డీసీ గోవిందరెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి, కడప మేయర్ కె. సురేష్‌బాబు, కుడా (కడప అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) చైర్మన్ గురుమోహన్, ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయప్రతాప్‌రెడ్డిలతో పాటు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ మురళీధర్, జేసీ గణేష్‌కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, కడప కమిషనర్ సీఎస్‌ఎస్ ప్రవీణ్‌చంద్ తదితరులు పాల్గొన్నారు.
వంద ఎకరాల విస్తీర్ణంలో ‘సెంచురీ’...
బద్వేలు నియోజకవర్గ కేంద్రానికి సమీపంలో గోపవరం మండల పరిధిలో ఏర్పాటైన ఇండస్ట్రియల్ పార్కులో అన్ని మౌలిక సదుపాయాలతో సహా ఎకరా రూ.15 లక్షల రాయితీ ధరతో ఏపీఐఐసి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 100 ఎకరాల విస్తీర్ణంలో సెంచరీ ప్యానెల్స్ లిమిటెడ్ (సీపీఎల్) పరిశ్రమ ఏర్పాటైంది. రూ.956 కోట్ల పెట్టుబడితో రూపుదిద్దుకున్న ఈ పరిశ్రమలో.. మీడియం డెన్సిటీ ఫైబర్‌బోర్డు, హై ప్రెజర్ లామినేట్స్ ఉత్పత్తిని సీఎం లాంఛనంగా ప్రారంభించారు. చెక్క పలకలు, అలంకరణ సంబంధ వుడ్ షీట్స్ తయారీలో దేశంలోనే ప్రసిద్ధిగాంచిన సెంచరీ ప్యానెల్స్ లిమిటెడ్ సంస్థ.. 2,266 మందికి పైగా ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా.. ఈ ప్రాంతంలో ఏర్పాటైంది.
మరోవైపు.. కంపెనీ ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకును.. బద్వేలు నియోజకవర్గ రైతుల నుండే నేరుగా కొనుగోలు చేస్తోంది. భవిష్య అవసరాల కొరతను తీర్చేందుకు ఈ కంపెనీ ద్వారా రానున్న ఎనిమిదేళ్లలో 80,000 ఎకరాల విస్తీర్ణంలో చెట్లను పెంచేందుకు స్థానిక రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే.. 1,000 మంది రైతులకు సంబంధించి 5,000 ఎకరాల్లో రాయితీ ధరతో చెట్లను నాటడానికి అవకాశం కల్పించారు. ఇక ఈ పరిశ్రమ నీటి అవసరాలకుగాను.. రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మం సాగర్ రిజర్వాయర్ నుండి 0.07 టీఎంసీల నీటిని కూడా కేటాయించింది. దీనికోసం.. రిజర్వాయర్ నుండి ప్లాంట్ సైట్ వరకు రూ.45 కోట్లతో వాటర్ పైప్‌లైన్ ఏర్పాటుచేశారు. అలాగే, నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం ఏపీఐఐసి ద్వారా రూ.19.11 కోట్లు వెచ్చించి 132 కేవీ విద్యుత్ లైన్‌ను ప్రభుత్వం ఏర్పాటుచేసింది.
డాక్టర్ వైఎస్‌ఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి..
రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎంఎస్‌ఐడీసీ ద్వారా రిమ్స్ ప్రాంగణంలో 452 పడకల సామర్థ్యంతో జి+4 అంతస్తులతో ఏ, బీ, సీ, డీ, ఈ బ్లాకులుగా డా. వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టింది. 2,38,062.46 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆసుపత్రి కోసం.. రాష్ట్ర ప్రభుత్వం రూ.125 కోట్లను వెచ్చించింది. అందులో రూ.75 కోట్లు నిర్మాణ పనులకు, రూ.50 కోట్లు వైద్య పరికరాల కోసం ఖర్చుచేశారు.
ఇందులో కార్డియాలజీ, న్యూరాలజీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, నెఫ్రాలజీ, కార్డియో థొరాసిక్–వాసు్కలర్ సర్జరీ, న్యూరో సర్జరీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ మొదలైన 10 సూపర్ స్పెషాలిటీ విభాగాలకు సంబంధించి వైద్యసేవలు అందనున్నాయి. ఇందులో సాధారణ వార్డులో 300 పడకలు, పేషెంట్ కేర్ యూనిట్లు, 100 పడకల ఐసీయూ, 12 పడకల క్యాజువాలిటీ, 40 పడకలు ఇతరులకు కేటాయించారు. అంతేకాక.. 12 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, అన్ని సూపర్ స్పెషాలిటీలకు అనువైన సెంట్రల్ లాబొరేటరీ, రేడియాలజీ విభాగం, సీఎస్‌ఎస్‌డీ, సెంట్రల్ ఫార్మసీ, అధునాతన క్యాథ్ ల్యాబ్, అధునాతన బ్లడ్ బ్యాంక్, అధునాతన సీటీ, ఎమ్మారై స్కానింగ్ సెంటర్లను ఏర్పాటుచేశారు.
డా. వైఎస్సార్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్..
మానసిక రోగులకు అత్యుత్తమ ఉపశమనం కలిగించేలా.. నిపుణులైన మానసిక వైద్యులతో వైద్యం, కౌన్సెలింగ్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక వైద్య సదుపాయాలతో.. రిమ్స్ ప్రాంగణంలో 100 పడకల మానసిక వైద్యశాలను రూ.40 కోట్లు వెచ్చించి నిర్మించింది. 97,844 చదరపు అడుగుల విస్తీర్ణంలో జి+1 అంతస్తుతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 23 మంది వైద్యులు, 27 మంది నర్సింగ్ స్టాఫ్, 29 మంది పారామెడికల్ స్టాఫ్, 37 మంది ఇతర సహాయక సిబ్బంది మానసిక రోగులకు వైద్యసేవలు అందనున్నాయి. ఇందులో ప్రతిరోజు ఓపీ సేవలతో పాటు.. డెడిక్షన్ సెంటర్, బీపాడ్ క్లినిక్, స్కిజోఫ్రెనియా క్లినిక్ సేవలతో ఐపీ సేవలతో పాటు ఇంకా అనేకం అందుబాటులో ఉన్నాయి.
డాక్టర్ వైఎస్సార్ క్యాన్సర్ కేర్ సెంటర్..
క్యాన్సర్ రోగులకు అధునాతన వైద్యసేవలతో సరికొత్త జీవితాన్నందించే దిశగా.. రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక వైద్య సదుపాయాలతో రిమ్స్ ప్రాంగణంలోనే 100 పడకల క్యాన్సర్ కేర్ సెంటర్‌ను రూ.107 కోట్లతో నిర్మించింది. 1,58,295 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏపీఎంఎస్‌ఐడీసీ ద్వారా జి+2 అంతస్తుతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 33 మంది వైద్యులతో పాటు ఇతర సిబ్బంది అందరూ కలిపి మొత్తం 148 సిబ్బందితో క్యాన్సర్ రోగులకు వైద్యసేవలు అందనున్నాయి.
ఇందులో మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ విభాగాలున్నాయి. ఇందులో 96 పడకల సాధారణ వార్డు, ఐసీయూ, క్యాజువాలిటీ, నాలుగు పడకల మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ వార్డు అందుబాటులో ఉన్నాయి. అంతేకాక.. అధునాతన పరికరాలతో లీనియర్ యాక్సిలరేటర్, డే కేర్ ఫెసిలిటీ, పెయిన్ మరియు పాలియేటివ్ కేర్, పునరావాస సేవలు, లేబొరేటరీ, రేడియాలజీ సేవలు, బ్లడ్ బ్యాంక్ యూనిట్లు అందుబాటులో వున్నాయి.
ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి..
జిల్లాలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి క్యాంపస్‌లో ఏర్పాటైన ఎల్వీ ప్రసాద్ నేత్ర ఆసుపత్రి.. టెరిటరీ నెట్‌వర్క్‌లో 4వ తృతీయ నేత్ర సంరక్షణ కేంద్రం. ఆంధ్ర రాష్ట్రంలో మూడవది. ఏపీ ప్రభుత్వం.. ఇతర దాతృత్వ ఫౌండేషన్ల మద్దతుతో ఈ ఆస్పత్రిని అభివృద్ధి చేశారు. ఇక్కడ మొత్తం 66,600 చ.అ.ల విస్తీర్ణంలో 40 పరీక్షా గదులు, నాలుగు ఆధునిక ఆపరేషన్ గదులతో నిర్మితమైంది. వృద్ధులకు, పిల్లలకు ప్రత్యేక కంటి సంరక్షణ సేవల యూనిట్ మరియు అన్ని ఇతర ప్రత్యేక నేత్ర సంరక్షణ సేవలతో పాటు దృష్టి మెరుగుదల సేవలను అందిస్తుంది. రోజుకు సుమారు 400లకు పైగా ఔట్ పేషెంట్లకు పరీక్షలు, రోజుకు 60కి పైగా శస్త్రచికిత్సలు నిర్వహించే సామర్థ్యంతో ఈ ఆసుపత్రిని నిర్మించారు.
నైపుణ్యతకు, నాణ్యతకు నిదర్శనం వైఎస్సార్ జిల్లా కలెక్టరేట్..
రూ.6 కోట్ల డీఎంఎఫ్ నిధులతో పంచాయతీరాజ్ శాఖ ద్వారా కలెక్టరేట్ భవనాన్ని ఆధునీకరించారు. ఇందులో అన్ని విభాగాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. పార్కింగ్ సౌకర్యం ఏర్పాటుతో పాటు మెకానికల్, ప్లంబింగ్, ల్యాండ్‌స్కేప్ డెవలప్‌మెంట్ వంటి సేవలను పునరుద్ధరించారు. అలాగే, పరిపాలనాపరమైన, ఉద్యోగుల పునశ్చరణ శిక్షణ కోసం సమగ్రమైన జిల్లా నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఉంది. సభా భవన్, స్పందన హాల్, వీడియో కాన్ఫరెన్స్ హాల్ వంటి వేదికలలో ఓరియంటేషన్లు, శిక్షణతో సహా ఉద్యోగుల సామర్థ్య నిర్మాణ సెషన్లు ఇక్కడ నిర్వహిస్తారు.
రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ స్కూటర్ల పంపిణీ..
శారీరక వైకల్యాలున్న వ్యక్తులు ఎదుర్కొనే చలనశీలత సవాళ్లను పరిష్కరించడానికి, వారికి సౌకర్యవంతమైన స్వతంత్ర రవాణా మార్గాలను అందించే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ స్కూటర్లను అర్హులైన వారికి పంపిణీ చేసే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్సార్) కాంపోనెంట్ కింద జిల్లా పరిపాలన యంత్రాంగం, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిల సహకారంతో దివ్యంగుల జీవన ప్రమాణాలు, వారి జీవనోపాధి, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తున్నారు. అంతేకాక.. ఏడీఐపీ పథకం కింద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నియోజకవర్గస్థాయి శిబిరాల్లో 6,509 మంది వికలాంగులకు సహాయాలు, సహాయక పరికరాలను పంపిణీ చేశారు. ఇందుకు మొత్తం రూ.5.85 కోట్లు వెచ్చించారు.
అగ్నిమాపక ఉపకరణాల ప్రారంభోత్సవం..
వరదలు, తుపానులు మొదలైన ప్రకృతి విపత్కర సమయాల్లో ప్రజల ప్రాణాలను రక్షించే చర్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే ఉద్దేశ్యంతో.. రూ.77.423 లక్షల వ్యయంతో.. వైఎస్సార్ జిల్లా అగ్నిమాపక విభాగం కొనుగోలు చేసిన రెస్క్యూ పరికరాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. వీటిలో.. రెస్క్యూ బోట్లు, వీటిని నడపడానికి ఉపయోగించే అవుట్ బోర్డ్ మోటార్లు, బాధితులను వరద నీటిలో తేలియాడేలా చేయడానికి ఉపయోగించే లైఫ్‌జాకెట్లు, లైఫ్ బాయ్స్, రెస్క్యూ బోట్‌లను శుభ్రం చేసే పోర్టబుల్ పంపులు.. రెస్క్యూ రోప్‌లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment