‘‘సోమవారం నాటికి.. ‘ఆరోగ్య సురక్ష’లో దాదాపు 85వేల మంది రోగులను తదుపరి చికిత్సల నిమిత్తం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్, బోధనాస్పత్రులకు రిఫర్ చేశారు. వీరందరినీ మొబైల్ యాప్ ద్వారా ట్రాక్‌చేసి, ఆస్పత్రులకు మ్యాప్ చేయాలి. ఆ తర్వాత వైఎస్సార్ విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, గ్రామ సచివాలయంలోని వైద్య, ఆరోగ్య సిబ్బందితో అనుసంధానించాలి. సిబ్బంది ద్వారా సంబంధిత రోగులకు జబ్బులు నయమయ్యే వరకూ వైద్యపరంగా చేయిపట్టి నడిపించాలి. చికిత్సానంతరం ఇంటికి వచ్చాక వారికి తోడుగా ఉంటూ, నిరంతరం ఆరోగ్య స్థితిపై వాకబు చేస్తుండాలి’’.
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి క్రమం తప్పకుండా జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు ఉంటాయని.. ప్రతి వారం మండలంలో ఈ క్యాంపు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇలా నెలలో ఆ మండలంలో నాలుగు క్యాంపులు నిర్వహించాలని.. ఆరు నెలల్లో ప్రతి మండలం.. ప్రతి గ్రామంలో క్యాంపు జరుగుతుందన్నారు. తద్వారా సంతృప్త స్థాయిలో ప్రజలకు వైద్యసేవలు అందుతాయన్నారు. ఇదొక నిరంతర ప్రక్రియని ఆయన తెలిపారు. అలాగే, జగనన్న ఆరోగ్య సురక్ష, డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ విధానం ప్రివెంటివ్ కేర్ అత్యంత కీలకంగా వ్యవహరించనున్నాయని సీఎం చెప్పారు.
ఏదైనా జబ్బు వచ్చాక వైద్యం అందించడం కన్నా.. అవి రాకుండా వాటిని నియంత్రించడమే ముఖ్యమని ఇందుకు ఈ వ్యవస్థలన్నీ ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. ప్రజారోగ్య రంగంలో పెనుమార్పులు తీసుకొచ్చే అత్యంత ముఖ్యమైన కార్యక్రమం జగనన్న ఆరోగ్య సురక్ష అని.. ఈ కార్యక్రమం ద్వారా వివిధ ఆరోగ్య సమస్యల బాధితులకు చేయూత అందించాలని జిల్లాల కలెక్టర్లకు ఆయన దిశానిర్దేశం చేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వర్చువల్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..
జగనన్న ఆరోగ్య సురక్షపై సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
అత్యంత కీలకం ఐదో దశ..
ఐదు దశల్లో ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఐదో దశ కార్యక్రమం మొత్తంలో అత్యంత కీలకమైంది. ప్రస్తుతం మనం నిర్వహించే వైద్య శిబిరాలు మామూలు శిబిరాలు మాత్రం కావు. సాధారణంగా నిర్వహించే వైద్య శిబిరాలు అప్పటికప్పుడు నిర్వహించి వైద్యంచేసి మందులిస్తే అక్కడితో అంతా అయిపోతుంది. అయితే, మన కార్యక్రమంలో శిబిరాల నిర్వహణ అనంతరం అసలు పనిమొదలవుతుంది. శిబిరాలు నిర్వహించిన అనంతరం వివిధ ఆరోగ్య సమస్యల బాధితులను మనం వైద్యపరంగా చేయిపట్టి నడిపిస్తాం. ఇదే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశ్యం. ఆరోగ్య సురక్షలో భాగంగా నిర్వహిస్తున్న వైద్య శిబిరాలు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి.
ఇప్పటివరకూ సురక్షలో భాగంగా పట్టణాల్లో 91 శాతం, గ్రామాల్లో 94.94 శాతం మంది జనాభా స్క్రీనింగ్ పూర్తయ్యింది. 1.44 కోట్ల గృహాలను ఏఎన్‌ఎం, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌ఓ)లు జల్లెడపట్టి 6.4 కోట్ల ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించారు. ప్రతి ఇంట్లో సగటున నాలుగు పరీక్షలు చేస్తూ జల్లెడ పట్టాం. గ్రామాల్లో 10,032 శిబిరాలకుగాను 98 శాతం అంటే 9,869 శిబిరాలు.. పట్టణాల్లో 2,390 శిబిరాలకు గాను 1,841 శిబిరాలు అంటే 77శాతం నిర్వహణ పూర్తయింది.
ఇక గ్రామాల్లో ఈనెల 22న, పట్టణాల్లో 29 నాటికి శిబిరాల నిర్వహణ ముగుస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు మనం ఐదో దశలో ఉన్నాం. ఇక ఇక్కడి నుంచి అసలు ప్రక్రియ మొదలవుతుంది. ప్రత్యేక యాప్ ద్వారా శిబిరాలకు వచ్చిన ప్రతి ఒక్కరి వివరాలు నమోదు చేస్తున్నాం. ఎవరెవరికి తదుపరి వైద్యసేవలు అవసరం ఉంది? ఎవరెవరిని ఆస్పత్రులకు రిఫర్ చేశాం? ఎవరెవరు ఏఏ సమస్యలతో బాధపడుతున్నారన్న సమగ్ర సమాచారం మన దగ్గర ఉంది. ఈ సమాచారం ఆధారంగా మనం మూడు రకాల కార్యక్రమాలు ఈ దశలో చేపట్టాలి.
కార్యక్రమం–1
జబ్బులు నయమయ్యే వరకూ చేయిపట్టి నడిపించాలి..
ఇక సోమవారం నాటికి.. దాదాపు 85వేల మంది రోగులను తదుపరి చికిత్సల నిమిత్తం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్, బోధనాస్పత్రులకు రిఫర్ చేశారు. వీరందరినీ మొబైల్ యాప్ ద్వారా ట్రాక్‌చేసి, ఆస్పత్రులకు మ్యాప్ చేయాలి. ఆ తర్వాత వైఎస్సార్ విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, గ్రామ సచివాలయంలోని వైద్య, ఆరోగ్య సిబ్బందితో అనుసంధానించాలి. సిబ్బంది ద్వారా సంబంధిత రోగులకు జబ్బులు నయమయ్యే వరకూ వైద్యపరంగా చేయిపట్టి నడిపించాలి. రిఫరల్ కేసుల్లో సంబంధిత వ్యక్తులకు ఆస్పత్రులకు వెళ్లేందుకు రవాణా ఖర్చుల కింద రూ.500 చొప్పున ఇవ్వాలి. 85వేల కేసుల్లో 13,850 మందికి ఇప్పటివరకూ చేయూతనిచ్చి తదుపరి చికిత్సల కోసం నెట్‌వర్క్/జిల్లా ఆస్పత్రులకు పంపించాం.
మిగిలిన వారిని కూడా రాబోయే రోజుల్లో నెట్‌వర్క్ ఆస్పత్రులకు పంపించి వారికి మంచి చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలి. వీరందరికీ చేయూతనందిస్తూ వైద్యపరంగా చేయిపట్టి నడిపించాలి. ఈ కార్యక్రమంపై మీ అందరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇలా అన్ని ప్రాంతాల్లో శిబిరాలు నిర్వహించి, గుర్తించిన మొత్తం రిఫరల్ కేసులన్నింటికీ కూడా తదుపరి చికిత్సలు అందించే కార్యక్రమాన్ని డిసెంబర్ నెలాఖరుకల్లా పూర్తిచేయాలి. చికిత్సానంతరం ఇంటికి వచ్చాక వారికి తోడుగా ఉంటూ, నిరంతరం ఆరోగ్య స్థితిపై వాకబు చేస్తుండాలి. ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్స్‌ను 3,300కు పెంచాం.
అయినప్పటికీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని.. ఎక్కడైనా ఆరుదైన ఆరోగ్య సమస్యలు, జబ్బులు బయటపడిన సందర్భాల్లో ఫ్యామిలీ డాక్టర్ రిఫరెన్స్ ద్వారా జిల్లా ఆస్పత్రికి, బోధనాసుపత్రులకు పంపించి ఉచితంగా వైద్య చికిత్సలు అందించాలి. అలాంటి రోగాలకు కూడా ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు ఆరోగ్యశ్రీ అధికారులకు కూడా ఆదేశాలు జారీచేస్తున్నా.
కార్యక్రమం–2
వైద్య సేవలపై ఆరా తీయాలి..
ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు చేయించుకున్న రోగులపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి. ఇందులో భాగంగా..
► డిశ్చార్జ్ అయి వచ్చిన రోగి ఇంటికి విలేజ్ క్లినిక్ సిబ్బంది వారం రోజుల్లో వెళ్లాలి.
► ఆస్పత్రుల్లో వైద్యసేవలపై ఆరా తీయాలి. ఎలాంటి లంచాలకు తావు లేకుండా పూర్తి ఉచితంగా చికిత్సలు అందాయో లేదో తెలుసుకోవాలి.
► మందులు సక్రమంగా వాడుతున్నారో లేదో పరిశీలించాలి.
► వైఎస్సార్ ఆరోగ్య ఆసరా అందిందో లేదో నిర్ధారించుకోవాలి.
► రోగితో ఫొటో తీసుకుని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి.
► ఆరోగ్యశ్రీ సేవలందుకున్న రోగులకు ఏడాదిపాటు ఉచితంగా మందులు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రమం తప్పకుండా రోగులు తిరిగి ఆస్పత్రులకు వెళ్లి మందులు తీసుకునేలా చర్యలు తీసుకోవాలి.
► కానీ, సరైన అవగాహనలేక, కొందరు తెలీక.. ఇతర కారణాలతో మరికొందరు ఆస్పత్రులకు వెళ్లి మందులు తీసుకుంటున్న వారి సంఖ్య తక్కువగా ఉంటోంది.
► ఇలా చికిత్సానంతరం మూడు నెలల తర్వాత కేవలం 33 శాతం పేషెంట్లు మాత్రమే మందులు తీసుకుంటున్నారు.
► ఆరు నెలల తర్వాత 22 శాతం, ఏడాది తర్వాత చూస్తే కేవలం 8 శాతం మాత్రమే ఉంటున్నారు.
► ఇలాంటి పరిస్థితులు ఇకపై ఉండకూడదు. నిర్ణీత సమయానికి రోగులు ఠంఛన్‌గా వెళ్లి మందులు తీసుకునేలా చూడాలి.
► ఈ మేరకు మొబైల్ యాప్‌లో తగిన విధంగా ఫీచర్లు తీసుకొచ్చాం.
► రోగులు నిర్ణీత కాలానికి ఆస్పత్రులకు వెళ్లేలా చూడాల్సిన బాధ్యత విలేజ్ క్లినిక్స్‌కు, ఫ్యామిలీ డాక్టర్‌కు ఉంది.
కార్యక్రమం–3
మందులు ఎంత ఖరీదైనా సరే అందించాలి..
కిడ్నీ, లివర్ రోగులతో పాటు, మస్క్యులర్ డిస్ట్రోపీ బాధితులు ఖరీదైన మందులు వాడాల్సి ఉంటుంది. అంత ఖరీదైన మందులను పేద, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేయలేరు. అలాంటి వారికి మందులు అందిస్తూ చేయూతనివ్వాలి. మందులు ఎంత ఖరీదైనా సరే వెనకడుగు వేయకుండా మనం అందించాలి. ఈ మేరకు అధికారులందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలిచ్చాను. గ్రామ, వార్డు సచివాలయం, విలేజ్ క్లినిక్స్ ఆధారంగా మ్యాపింగ్ చేసి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో అనుసంధానం చేయాలి.
వైద్యం కోసం ప్రజలు ఖర్చుపెట్టకుండా చూడాలి..
ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలన్న దానిపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలి. పథకం ద్వారా ఉచితంగా సేవలు పొందడం గురించి తెలియని వ్యక్తి రాష్ట్రంలో ఉండకూడదు. డిసెంబరు ఒకటో తేదీ నుంచి ఈ కార్యక్రమం నిర్వహించాలి. మంచి ఫీచర్లతో ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని ఇదివరకే ఆదేశాలిచ్చాను. ఈ కార్డుల పంపిణీ కూడా అదేరోజు నుంచి ప్రారంభించాలి. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరి ఫోన్‌లో ఆరోగ్యశ్రీ యాప్ ఉండాలి. 1.24 కోట్ల మంది మహిళలు దిశ యాప్‌ను తమ ఫోన్లలో రిజిస్టర్ చేసుకున్నారు. ఈ తరహాలోనే ప్రతి ఫోన్లో ఆరోగ్యశ్రీ యాప్ ఉండాలి.
ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగోకపోతే ఆరోగ్యశ్రీ చికిత్స కోసం ఎక్కడకు వెళ్లాలన్న దానిపై పూర్తి వివరాలు ఈ యాప్‌లో ఉంటాయి. దీనిపై ఎలాంటి సందేహాలు ఎవ్వరికీ ఉండకూడదు. యాప్‌లోకి వెళ్తే సమీపంలోని ఎంపానెల్ ఆస్పత్రికి మార్గం చూపిస్తుంది. లేకపోతే విలేజ్ క్లినిక్‌లో సంప్రదించినా, 104కు ఫోన్‌చేసినా గైడ్ చేస్తారు. ఆరోగ్యశ్రీ సేవలను ఎలా పొందాలన్న దానిపై బుక్‌లెట్ కూడా ప్రతి కుటుంబానికీ అందిస్తారు. ఆరోగ్యశ్రీని వినియోగించుకోవడంపై సీహెచ్‌ఓ, ఏఎన్‌ఎలు, ఆశా వర్కర్లు అవగాహన కలిగించాలి.
ఇక వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 950 నెట్‌వర్క్ ఆసుపత్రులుంటే, ప్రస్తుతం 2,295 ఆస్పత్రుల్లో సేవలు అందుతున్నాయి. మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లోని పెద్దపెద్ద కార్పొరేట్ ఆస్పత్రులను ఆరోగ్యశ్రీలో ఎంప్యానెల్ చేశాం. అయినా వైద్యం కోసం ప్రజలు ఎందుకు తమ జేబుల్లో నుంచి డబ్బులు ఖర్చుచేసుకోవాలి? అలాంటి పరిస్థితులు ఇకపై లేకుండా చూడటం మనందరి బాధ్యత.
8.72 లక్షల మందికి కంటి పరీక్షలు..
ఇక ఆరోగ్య సురక్షలో కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 8.72 లక్షల మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. 5.22 లక్షల మందికి కంటి అద్దాలు ఇవ్వాలని డాక్టర్లు సిఫారసు చేశారు. వీరికి వెంటనే వాటిని అందించేలా చర్యలు తీసుకోవాలి. అలాగే, 73,474 మందికి కంటి సర్జరీలు చేయాలని గుర్తించారు. వీరికీ సర్జరీలు చేయించాలి. డిసెంబర్ నెలాఖరు నాటికి ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తికావాలి. మరోవైపు.. రక్తపోటు కేసులు 2,48,638గా.. మధుమేహం 1,49,879 కేసులను గుర్తించారు.
వీరిందరికీ నిర్ధారణ పరీక్షలు చేసి మందులివ్వాలి. ఆ తర్వాత వారి ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి. ప్రివెంటివ్ కేర్‌లో ఇది చాలా కీలకమైన అంశం. పౌష్టికాహారం లోపం, రక్తహీనత సమస్యలను పూర్తిగా నివారించాలి. ఈ సమస్యలతో బాధపడుతున్న వారికి సంపూర్ణ పోషణ కింద పౌష్టికాహారం, మందులు అందుతున్నాయో లేదో విలేజ్ క్లినిక్స్ ద్వారా పరిశీలించాలి. రక్తహీనత బాధితుల మీద మహిళా, శిశుసంక్షేమ శాఖ అధికారులు దృష్టిపెట్టాలి. మందులు, సంపూర్ణ పోషణం ప్లస్ ద్వారా తగిన ఆహారం కూడా ఇప్పించాలి.
దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ వ్యవస్థలు లేవు..
దేశంలో ఏ రాష్ట్రంలోని కలెక్టర్లకు లేని యంత్రాంగం, మన రాష్ట్రంలో కలెక్టర్లకు ఉంది. అలాగే, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, గ్రామ సచివాలయంలాంటి వ్యవస్థలు లేవు. ఇవన్నీ సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనలో మనల్ని అన్ని రాష్ట్రాలకన్నా ముందు ఉంచేందుకు ఉపయోగపడతాయి. కలెక్టర్లకు మంచి అభిరుచి ఉంటే కచ్చితంగా లక్ష్యాలు సాధిస్తాం. ప్రతి కలెక్టర్ దీన్ని సవాల్‌గా తీసుకుని, జీరో ఎనీమిక్ కేసులు దిశగా ప్రయత్నించాలి. అలాగే, 9,969 లెప్రసీ అనుమానాస్పద కేసులున్నాయి.
వీరందరికీ వెంటనే నిర్ధారణ పరీక్షలు చేపట్టాలి. 442 మందికి టీబీ ఉన్నట్లుగా నిర్ధారణ అయ్యింది. వీరికి సక్రమంగా మందులు అందించాలి. 1,239 మంది చిన్నారులు 4–డి (డెఫీషియన్సీస్, డిఫెక్టŠస్ ఎట్ బర్త్, డిసీజెస్, డెవలప్‌మెంటల్ డిలేస్) సమస్యలతో బాధపడుతున్నట్లుగా తేలింది. సాధ్యమైనంత త్వరగా వీరికి అవసరమైన చికిత్సలు అందించడంపై దృష్టిపెట్టాలి. కాక్లియర్ ఇంప్లాంట్ చికిత్సలు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అందిస్తే పిల్లలు ఈ సమస్యల నుంచి బయటపడతారు.
సేవలు మరింత విస్తరిస్తాం..
టెరిషరీ కేర్ వైద్యసేవలను రాబోయే రోజుల్లో మరింత విస్తరిస్తున్నాం. ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. ప్రతి జిల్లాలో అత్యాధునిక సేవలు అందించే బోధనాసుపత్రి అందుబాటులో ఉంటుంది. ఒకవైపు పాత ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా అభివృద్ధిపరుస్తూనే ఇవన్నీ చేపడుతున్నాం. ఇక నియామకాల పాలసీ మీద కలెక్టర్లు పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. ప్రతి జిల్లాలో స్పెషలిస్టు, ఎంబీబీఎస్ డాక్టర్లు, ఇతర సిబ్బంది కొరత లేకుండా సంబంధిత జిల్లాల కలెక్టర్లు చూసుకోవాలి. ఇప్పటికే కేవలం ఆరోగ్య రంగంలో 53 వేల ఖాళీలను మనం భర్తీచేశాం.
ఈ నేపథ్యంలో.. ఎక్కడ ఖాళీలున్నా, వెంటనే భర్తీచేసేలా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలి. ఆరోగ్య రంగాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నాం కాబట్టే, రాష్ట్రంలో తొలిసారిగా మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డును çసృష్టించాం. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి, సీఎస్ డాక్టర్ జవహర్‌రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కృష్ణబాబు, అజయ్‌జైన్, కార్యదర్శులు గుల్జార్, డాక్టర్ మంజుల, చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్సెస్ గిరిజాశంకర్, ఆరోగ్యశ్రీ సీఈఓ హరేంధిరప్రసాద్, ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment