‘డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ 2.0’ ను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నాం. బకాయిలు లేకుండా మన ప్రభుత్వం తీసుకున్న చర్యలు నెట్‌వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాల్లో నమ్మకం, విశ్వాసం పెరిగేలా చేసింది. ఇప్పుడు రోగులకు మరిన్ని వైద్య సేవలను అందుబాటులోకి తీసుకు వస్తున్నాం. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల కారణంగా గాయపడే ఇతర రాష్ట్రాల వారికి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఉత్తమ సేవలు అందించిన ఆరోగ్య మిత్రలకు సేవా మిత్రలు, సేవారత్న, ఉన్నత ఆరోగ్య సేవ అవార్డులు ఇవ్వాలి.
– ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి కుటుంబాల్లోని ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెట్టింపు భరోసా కల్పించారు. ఆయా వర్గాల ప్రజలు దురదృష్టవశాత్తు ఏదైనా జబ్బు బారిన పడిన సందర్భాల్లో ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్న ‘డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’ పథకాన్ని మరింత బలోపేతం చేశారు. ఈ పథకం పరిధిలోకి మరో 809 చికిత్సలను కొత్తగా చేర్చి, మొత్తం 3,255 వైద్య చికిత్సల(ప్రక్రియలు)తో ‘డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ 2.0’ను శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. దీంతో ఇప్పటి వరకు ఉన్న 2,446 చికిత్స ప్రక్రియల సంఖ్య 3,255కు చేరింది. ఇవన్నీ శుక్రవారం నుంచే అందుబాటులోకి వచ్చాయి.
చరిత్ర సృష్టించిన సీఎం జగన్
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకూ 2014–19 మధ్య ఆరోగ్యశ్రీ పథకంలో కేవలం 1,059 చికిత్సలు మాత్రమే అందుబాటులో ఉండేవి. ప్రజారోగ్యానికి పెద్ద పీట వేసిన సీఎం జగన్ టీడీపీ హయాంలో నిర్వీర్యం అయిన ఈ పథకానికి ఊపిరిలూదేలా విప్లవాత్మక చర్యలు చేపట్టారు. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటే ప్రతి చికిత్సకు ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేసేలా అడుగులు ముందుకు వేస్తామని 2019 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారంలోకి వచి్చన వెంటనే ఆ దిశగా వడివడిగా అడుగులు వేశారు.
2020 జనవరిలో చికిత్సలను 2059కి పెంచారు. అదే సంవత్సరం జూలైలో 2,200 చికిత్సలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా అదనంగా చేర్చిన చికిత్సల్లో 54 క్యాన్సర్ చికిత్సల ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. 2020 నవంబర్‌లో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి పలు పెద్ద చికిత్సలతో సహా 2,436కు పెంచారు. 2020, 2021 సంవత్సరాల్లో ప్రపంచాన్ని కోవిడ్ మహమ్మారి అతలాకుతలం చేసింది.
ఈ వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న సీఎం జగన్ సర్కార్.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కరోనాకు సంబంధించిన 10 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీలోకి 2021 మే, జూన్ నెలల్లో చేర్చింది. తాజాగా మరో 809 చికిత్సలను చేర్చడంతో మొత్తం చికిత్సల ప్రక్రియలు 3,255కు పెరిగింది. ఇలా 2019 నుంచి ఇప్పటి వరకు 2,196 చికిత్సలను పథకంలో చేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుంది.
ఖర్చు మూడు రెట్లు అధికం
టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే సీఎం జగన్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ, 104, 108 వైద్య సేవల కోసం మూడు రెట్లు అదనంగా ఖర్చు చేస్తోంది. 2018–19లో అప్పటి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ, 104, 108 సేవల కోసం రూ.1299.01 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుత ప్రభుత్వం 2021–22లో ఆరోగ్యశ్రీ కోసం రూ.2,894.87 కోట్లు ఖర్చు పెట్టింది. మరో వైపు ఇదే ఏడాది ఆరోగ్య ఆసరా కోసం సుమారు రూ.300 కోట్లు, 104 సేవల కోసం రూ.114.05 కోట్లు, 108 సేవల కోసం రూ.172.78 కోట్లు వెచ్చించింది. ఇలా మొత్తంగా ఆ ఏడాది రూ.3481.7 కోట్లు ప్రజల ఆరోగ్యం కోసం ఖర్చు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment