సాక్షి, అమరావతి: వైద్యాన్ని పేదలకు చేరువలోకి తీసుకువచ్చి, ప్రజలందరి ఆరోగ్య సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ విజయవంతంగా కొనసాగుతోంది. సెప్టెంబర్ 30వ తేదీన ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది మొదలు ప్రజలు పెద్దఎత్తున శిబిరాలకు వచ్చి వైద్య సేవలు పొందుతున్నారు. శిబిరాల్లో స్పెషలిస్ట్ డాక్టర్లతో వైద్యం అందించడంతో పాటు.. ఉచితంగా మందులిస్తుండటంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రభుత్వం అందిస్తున్న ఈ సేవలను వినియోగించుకుంటున్నారు.
ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 12,422 ఆరోగ్య సురక్ష శిబిరాల నిర్వహణ లక్ష్యం కాగా, 93.07 శాతం.. అంటే 11,562 శిబిరాలు ఇప్పటికే పూర్తి అయ్యాయి. వైఎస్సార్, ప్రకాశం, పల్నాడు, అల్లూరి సీతారామరాజు, కృష్ణా జిల్లాల్లో వంద శాతం కార్యక్రమం పూర్తి అయింది. మిగిలిన జిల్లాల్లో 860 గ్రామాలు, పట్టణాల్లో కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. ఈ ప్రాంతాల్లో ఈనెల 15వ తేదీ లోగా పూర్తి చేసేలా వైద్య శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది.
ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం
ఆరోగ్య సురక్ష శిబిరాల్లో స్పెషలిస్ట్ వైద్యుల పరిశీలన అనంతరం మెరుగైన వైద్యం అవసరం ఉన్న వారిని ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకూ సుమారు 80 వేల మందికి పైగా రోగులను రిఫర్ చేశారు. వారిని స్థానిక ఏఎన్‌ఎం, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్‌వో)లకు అనుసంధానించి తదుపరి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందించేలా వైద్య శాఖ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో అక్టోబర్ 29వ తేదీ నాటికి 520 మందికి నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో సర్జరీ/వైద్యం చేశారు.
వీరిలో 451 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయి ఇళ్లకు కూడా వెళ్లారు. ఇదే తరహాలో మిగిలిన రోగులందరికీ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం, పరీక్షలు, మందులు, అవసరం ఉన్న వారికి సర్జరీ సేవలు అందించేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయిన అనంతరం కూడా వీరి ఆరోగ్యంపై ఫ్యామిలీ డాక్టర్ నేతృత్వంలోని వైద్య సిబ్బంది ద్వారా నిరంతరం వాకబు చేస్తున్నారు.
దీర్ఘకాలిక జబ్బుల బాధితులకు భరోసా..
కొత్తగా మధుమేహం, రక్తపోటు, క్షయ వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నవారిని ఆరోగ్య సురక్షలో ప్రభుత్వం గుర్తించింది. వీరందరికీ మెరుగైన వైద్యం అందించడంతో పాటు నిరంతరం వైద్య పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటినీ జల్లెడ పట్టి స్క్రీనింగ్ చేయగా.. గతంలో ఉన్న బీపీ, షుగర్ బాధితులు కాకుండా కొత్తగా 2,25,451 మంది బీపీ, 1,40,218 మంది షుగర్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు.
మరోవైపు నమూనాలు సేకరించి 417 మందిలో క్షయ వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. అలాగే కుష్టు వ్యాధి నిర్ధారణ ప్రక్రియ కొనసాగుతోంది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాల్లో స్పెషలిస్ట్ డాక్టర్లతో వైద్యం అందించడంతో పాటు.. ఉచితంగా మందులిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment