అమ్మతనానికి అడ్డుకోత
అవసరం లేకున్నా ఆపరేషన్లు
ఏటా ఏడు వేలకుపైగా సిజేరియన్లు
పెరుగుతున్న మాత, శిశు మరణాలు
ప్రైవేటు ఆస్పత్రులకు కాసుల వర్షం
తిరుపతి నగరానికి చెందిన అమ్ములు గత నెల మూడో తేదీన ప్రసవం కోసం స్థానిక ప్రసూతి ఆస్పత్రికి వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆస్పత్రిలో చేర్చుకున్నారు. తీరా అక్కడ పనిచేస్తున్న ఓ ప్రయివేట్ క్లినిక్ మధ్యవర్తి కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని.. ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లమని సలహా ఇచ్చింది. ఆమె సూచించిన ఆస్పత్రికి వెళితే అవసరం లేకున్నా అమ్ములుకు సిజేరియన్ చేసి కాన్పు చేశారు. రూ.23 వేల బిల్లు చేతికిచ్చారు.
బంగారుపాళ్యంలోని తుంబకుప్పానికి చెందిన సుజాత గత నెల ఏడున చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో కాన్పు కోసం వచ్చింది. అర్ధరాత్రి ఓ మగబిడ్డకు జన్మనిచ్చి కన్ను మూసింది. సుజాత మరణం ఇక్కడి వైద్యుల పనితీరును ప్రశ్నిస్తోంది.
తొట్టంబేడుకు చెందిన మునెమ్మకు నెలలు పూర్తిగా నిండడంతో స్థానిక పీహెచ్‌సీలో కాన్పుకోసం వెళ్లింది. పరిస్థితి విషమించిందని, ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాలని అక్కడి సిబ్బంది సూచించారు. అంబులెన్సులో వెళుతుండగానే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
ఈ మూడే కాదు జిల్లాలోని దాదాపు 90 శాతం ప్రభుత్వాస్పత్రులు, 24 గంటల పీహెచ్‌సీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏపీవీపీ ఆస్పత్రుల్లో ఇదే పరిస్థితి. గర్భిణులకు శస్త్ర చికిత్సల పేరిట కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నాయి. ప్రభుత్వపరంగా అందజేయాల్సిన ‘జాతీయ ఆరోగ్య గ్రామీణ మిషన్’లో వైద్య సేవలు అంతంత మాత్రంగా ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో గర్భిణులు ప్రైవేటు వైద్య సేవల్ని ఆశ్రయించాల్సి వస్తోంది. మాత, శిశు మరణాలను తగ్గించడానికి ఏటా రూ.కోట్లలో నిధులు విడుదలవుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో ప్రజలకు చైతన్యం కల్పించి ప్రభుత్వ ఆసుపత్రులవైపు రప్పించడంలో యంత్రాంగం విఫలమవుతోంది. దీనిని ఆసరాగా చేసుకుని కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు గర్భిణుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఎలాంటి అవసరం లేకున్నా సిజేరియన్ ఆపరేషన్లు చేసి అమ్మతనాన్ని తెలిపే పురిటినొప్పులను చెరిపేస్తున్నారు.
ధరలు ఏవీ?
ప్రైవేటు ఆసుపత్రులపై జిల్లా యంత్రాంగం పర్యవేక్షణ లేకపోవడంతో పరిస్థితి ఇష్టానుసారంగా తయారయ్యింది. రక్తం గ్రూపు తెలుసుకోవడం నుంచి పెద్ద స్థాయి శస్త్ర చికిత్సల వరకు ఏయే సేవలకు ఎంత రుసుం చెల్లించాలనే వివరాలు జిల్లాలో ఏ ఒక్క ప్రైవేటు ఆసుపత్రిలో కనిపించడంలేదు. ఫలితంగా కాసులకు కక్కుర్తిపడి కాన్పుల కోసం వచ్చే గర్భిణులకు సిజేరియన్లు చేయడానికే కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు వెలిశాయంటే జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని చోట్ల అనుభవం లేని వైద్యులు ఆపరేషన్లు చేస్తుండడంతో అవి వికటించి మాత, శిశు మరణాలు సైతం పెరుగుతున్నాయి. జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రులు ఏటా సగటున 7500 మంది స్త్రీలకు సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సగటున ఏదాడికి మూడువేల సిజేరియన్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులకు పోటీగా రెట్టింపు సంఖ్యలో ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్లు చేయడం విస్మయానికి గురిచేస్తోంది.