maternity hospital, doctors , pregnants, మాతాశిశు ప్రభుత్వాస్పత్రి, డాక్టర్లు, గర్భిణులు
అమ్మలకు నరకయాతన
Published Mon, Jul 11 2016 11:58 AM | Last Updated on Mon, Sep 4 2017 4:37 AM
ప్రభుత్వ మాతాశిశు ఆస్పత్రిలో వైద్యుల కొరత
క్యూలో గంటలకొద్దీ నిలబడుతున్న గర్భిణులు
రాజమహేంద్రవరం : తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మాతాశిశు ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల కొరత వేధిస్తోంది. చాలినంతమంది వైద్యులు లేకపోవడంతో గర్భిణులు గంటలకొద్దీ క్యూలో నిలబడాల్సిన దుస్థితి నెలకొంది. ఈ ఆస్పత్రికి ఉభయ గోదావరి జిల్లాల నుంచి వైద్యం నిమిత్తం గర్భిణులు వస్తూంటారు. రంపచోడవరం, చింతూరు తదితర ఏజెన్సీ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. వైద్య పరీక్షల నిమిత్తం రోజూ 200 మంది వస్తున్నారు. రోజూ 20 ప్రసవాలు జరుగుతాయి. ఇందులో 10 వరకూ సిజేరియన్‌లు ఉంటాయి. ఇంత ప్రాధాన్యం ఉన్న ఈ ఆస్పత్రిలో గర్భిణులకు సేవలందించడానికి ముగ్గురు డాక్టర్లు మాత్రమే ఉన్నారు. వీరిలో ఒకరు ప్రసవాలు,ఆపరేషన్లు చేయడానికి, మరొకరు వైద్యపరీక్షలకు, మూడో డాక్టర్ రోజువారీ ఓపీ చూస్తూంటారు.
గంటలకొద్దీ క్యూలో..
ఓపీ చీటీ రాయించుకోవడం మొదలు వైద్యం పూర్తయ్యే వరకూ అధిక సమయం గర్భిణులు క్యూలో నిలబడాల్సి వస్తోంది. ఓపీ రాయించుకుని డాక్టర్ వద్దకు వెళ్లితే అక్కడ క్యూ భారీగా ఉంటోంది. డాక్టర్ ఎంత వేగంగా సేవలందించినా గర్భిణులకు ఇబ్బందులు తప్పడం లేదు. 200 మందికి ఒక్కరే వైద్యం చేయడం చాలా కష్టమవుతోంది. అలాగే స్కానింగ్ వద్ద కూడా గంటలకొద్దీ వేచి ఉండాల్సి వస్తోంది. ఒక్క గైనకాలజిస్ట్ మాత్రమే ఉండడంతో గర్భిణులకు ఇబ్బందులు తప్పడం లేదు. డాక్టర్లు సరిపడా లేకపోవడంతో చాలామందిని కాకినాడ జీజీహెచ్‌కు పంపిస్తున్నారు.
భవనాలు కట్టారు కానీ..
జిల్లా ఆస్పత్రి ప్రాంగణంలోనే ఎన్‌ఆర్‌హెచ్‌ఎం నిధులతో 100 పడకల మాతా, శిశు సంక్షేమ ఆస్పత్రి నిర్మించారు. రూ.10 కోట్లతో నిర్మించిన ఈ ఆస్పత్రిని గత ఏడాది సెప్టెంబర్‌లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆర్భాటంగా ప్రారంభించారు. కానీ అవసరమైన మేరకు సిబ్బంది నియామకం చేపట్టలేదు. 100 పడకల ఆస్పత్రి అందుబాటులోకి వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క పోస్టు కూడా మంజూరు చేయలేదు.
స్టాఫ్‌నర్సులకూ కొరత
శిక్షణ పొందిన స్టాఫ్‌నర్సుల కొరత కూడా ఇక్కడ తీవ్రంగా ఉంది. 24 స్టాఫ్‌నర్స్, 4 హెడ్ నర్స్, 10 ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓ పోస్టులు మంజూరు చేయాల్సి ఉంది. ఎనిమిది మంది గైనకాలజిస్టులను నియమించాల్సి ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో గత్యంతరం లేక ఉన్న సిబ్బంది, వైద్యులతోనే గర్భిణులకు వైద్యసేవలు అందిస్తున్నారు.
ఎనిమిదిమంది డాక్టర్లు కావాలి
గర్భిణులకు వేగవంతంగా సేవలు అందించడానికి ఎనిమిదిమంది డాక్టర్లు కావాలి. ఇప్పుడు కేవలం ముగ్గురే ఉన్నారు. గర్భిణులు కొంత ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. అందుబాటులో ఉన్న డాక్టర్లతో మెరుగైన సేవలు అందించడానికి ప్రయత్నిస్తున్నాం. శిక్షణ పొందిన స్టాఫ్‌నర్సుల కొరత తీవ్రంగా ఉంది. మే నెలలో ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో పోస్టుల మంజూరుపై చర్చించాం. త్వరలో మంజూరయ్యే అవకాశం ఉంది.
- టి.రమేష్ కిషోర్, జిల్లా ఆస్పత్రి సంచాలకుడు, రాజమహేంద్రవరం
Advertisement
Advertisement