pregnants
-
అతడి ఐదుగురు భార్యలు ఒకేసారి ప్రెగ్నెంట్..వాళ్లందరికీ..
ఓ సంగీత కళాకారుడు తన ఐదుగురు భార్యలు ప్రెగ్నెంట్ అంటూ శ్రీమంతానికి ఆహ్వానించాడు. అందరూ రావాంటూ ఒక వ్యక్తి ఐదుగురు భార్యలు నవజాత శిశువులను ఆహ్వానించనున్నాం అంటూ ఇన్విటేషన్లో పేర్కొన్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో న్యూయార్క్ నగరానికి చెందిన జెడ్డీ వీల్ అనే 22 ఏళ్ల సంగీత కళాకారుడు జనవరి 14న క్వీన్స్‌లో తన ఐదుగురు భార్యలు ఒకేసారి గర్భవతులయ్యారని వారికి శ్రీమంతం నిర్వహిస్తున్నాని పేర్కొన్నాడు. ఆ వేడకకు అందరూ రావాలంటూ తన భార్యలో కూడిన ఫోటోను షేర్చేశాడు. పైగా సోదరీమణుల వేడుక అనే క్యాప్షన్ కూడా ఇచ్చిమరీ పోస్ట్ చేశారు. తాము ఒకరి జీవితాన్ని ఒకరు నాశనం చేసుకోమని ఎంతో కలిసి కట్టుగా ఆనందంగా ఉంటామని పోస్ట్‌లో రాసుకురావడం విశేషం. అయితే ఈ వీడియోని చూసిన నెటిజన్లు బహుభార్యత్వాన్ని వ్యతిరేకించారు. ఇది చాలా ఇబ్బందికరమైన రిలేషన్‌గా పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Lizzy Ashliegh (@lizzyashmusic) (చదవండి: విలాసవంతమైన భవనం అతని డ్రీమ్..సడెన్ మర్డర్ కేసు..ఎవరూ చంపారన్నది నేటికి మిస్టరీనే!) -
ఆ సమయంలో అలోవెరా జ్యూస్ తాగటం ప్రమాదకరం..
అనేక ఆరోగ్య సుగుణాలు ఉండడం వల్ల అలోవెరాను సూపర్ ఫుడ్‌గా పరిగణిస్తారు. దీనిలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉండడంతో జ్యూస్ చేసుకుని తాగుతుంటారు. అయితే అలోవెరా జ్యూస్‌ను కొన్ని రకాల సమయాల్లో తాగకూడదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఆ సందర్భాలేంటో చూద్దాం... ►గర్భం దాల్చిన మహిళలు అలోవెరా జ్యూస్ జోలికి పోకపోవడమే మంచిది. తల్లికాబోతున్న స్త్రీలు ఈ జ్యూస్ తాగడం వల్ల గర్భాశయం సంకోచానికి గురై గర్భస్రావం అయ్యే అవకాశాలున్నాయి. ►దీనిలోని అంథ్రోక్వినోన్ వల్ల కడుపు నొప్పి, డయేరియా సంభవిస్తాయి. అందువల్ల గర్భిణులు ఈ జ్యూస్ తాగాలనుకుంటే మాత్రం డాక్టర్ని తప్పకుండా సంప్రదించాలి. ►అలోవెరా జ్యూస్ శరీరంలోని పొటాషియం స్థాయులను తగ్గిస్తుంది. ఫలితంగా క్రమరహిత హృదయ స్పందనలు ఏర్పడి కండరాలను బలహీనపరుస్తాయి. ►మంచిది కదా అని అతిగా అలోవెరా జ్యూస్ తాగితే కిడ్నీ సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. ►అందువల్ల ఒక్క అలోవెరా జ్యూస్ అనే కాదు... ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి కదా అని ఏది పడితే అది అతిగా తాగేయడం మంచిది కాదు. చదవండి: Dry Throat: నోటి దుర్వాసన, దగ్గు, పుండ్ల సమస్యా.. ఇలా చేస్తే.. -
పాలిచ్చే తల్లులూ... తీసుకోవాల్సిన ఆహారాలు!
మీరు పాలిచ్చే బిడ్డ తల్లా? అయితే ఈ సూచనలు పాటించండి. ఇవి ఇటు తల్లికీ, అటు బిడ్డకూ మేలు చేస్తాయి. తల్లి తినే ఆహారాన్ని బట్టి బిడ్డకు పట్టే పాల రుచి (ఫ్లేవర్) కూడా మారుతూ కొత్త రుచిని సంతరించుకుంటుంటుంది. అప్పుడు బిడ్డ ఇష్టంగా ఆస్వాదిస్తూ తల్లిపాలను తాగుతుంటాడు. ఇక్కడ చిన్నజాగ్రత్త పాటించాలి. తల్లి తినే పండ్లు, కూరగాయలు వంటి వాటిని బాగా కడిగాకే తినాలి. లేకపోతే వాటిపై ఉండే క్రిమిసంహారక రసాయనాలు తల్లిలోకి, అక్కడినుంచి బిడ్డకు ఇచ్చే పాలలోకీ ప్రవేశించి, బిడ్డ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి. అందుకే వాటిని బాగా కడిగాక మాత్రమే తినాలని గుర్తుంచుకోండి. తల్లి రకరకాల కాయధాన్యాలు (హోల్‌గ్రెయిన్స్), పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తినాలి. పాలిచ్చే తల్లి ఎక్కువగా నీళ్లు తాగాలి. కానీ చాలామంది పెద్దలు తల్లిని ఎక్కువగా నీళ్లు తాగనివ్వరు. తల్లి నీళ్లు ఎక్కువ తాగితే బిడ్డకు జలుబు చేస్తుందంటూ ఆమెను తక్కువ నీళ్లు తాగేలా కట్టడి చేస్తుంటారు. తల్లి ఎక్కువ నీళ్లు తాగితే బిడ్డకు జలుబు చేస్తుందనడం అపోహ మాత్రమే. తల్లికి ఎక్కువగా పాలు ఊరి, బిడ్డకు సరిపడా పాలు పడాలంటే నీళ్లు ఎక్కువగా తాగాల్సిందే. తల్లి పాలలో బిడ్డకు మేలు చేసే ఐరన్ ఎక్కువగా ఉండటానికి బీన్స్, వేరుశెనగ పల్లీలు, అలసందలు, తృణధాన్యాలు, డ్రైఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. తల్లి పాలలో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటానికి గుడ్లు, పాలు, పాల ఉత్పాదనలు, బఠాణీలు, నట్స్ వంటివి తీసుకోవాలి. క్యాల్షియమ్ బాగా సమకూరేలా బాగా ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు, సోయామిల్క్, పెరుగు, టోఫూ వంటి ఆహార పదార్థాలు పుష్కలంగా తీసుకోవాలి. విటమిన్ బి12తో పాటు విటమిన్ డి సమృద్ధిగా లభించడానికి వీలుగా పాలు, పాల ఉత్పదనలతో పాటు మాంసాహారం తీసుకోవాలి. తీసుకోని వారు డాక్టర్ సలహా మేరకు విటమిన్ బి12, విటమిన్–డి సప్లిమెంట్స్ మాత్రల రూపంలో తీసుకోవాలి. -
7 కిలోమీటర్లు స్టెచ్రర్‌పై మోసుకుంటూ..
సాక్షి, భువనేశ్వర్ : గిరిజన గ్రామాల్లో గర్భిణులు, రోగుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. తాజాగా ఓ గర్భిణిని కొండలపై నుంచి 7 కిలోమీటర్లు స్ట్రక్చర్‌పై మోసుకు వచ్చిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కొరాపుట్ జిల్లా బరిణిపుట్ పంచాయతీ కొండప్రాంతం లోని లట్టిగుడ గ్రామానికి చెందిన గుప్త జాని భార్య లక్ష్మికి గురువారం పురిటి నొప్పులు మొదలయ్యాయి. 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా.. గ్రామానికి చేరుకునేందుకు రహదారి లేకపోవడంతో అక్కడికి వరకు చేరుకోలేమని సిబ్బంది తెలిపారు. దీంతో కొందమంది మహిళలు గ్రామం నుంచి 7 కిలోమీటర్ల స్టెచ్రర్‌పై మోసుకుంటూ కొండ దిగువన ఉన్న రోడ్డుకు చేర్చారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో జయపురం ఫూల్బడి లోని కొరాపుట్ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేర్చారు. అనంతరం లక్ష్మీ పండండి బిడ్డకు జన్మనిచ్చినట్లు సమాచారం. కాగా.. దీనిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రమంలో ఎవరికి అనారోగ్యం వచ్చినా.. ఇదే పరిస్థితి తలెత్తుతుందని, అధికారులు స్పందించి, రోడ్డు సౌకర్యం కల్పించాలని వారంతా కోరుతున్నారు. -
ప్రభుత్వ పథకాలు: ఉచితంగా రూ.2500
ముంబై : ప్రభుత్వ పథకాల పేరిట గర్భిణులను మోసగించటానికి ప్రయత్నించిన ఓ సైబర్ క్రైం గ్యాంగ్ గుట్టురట్టయింది. ఆన్లైన్ బ్యాంకింగ్ చీటింగ్ కేసులో అరెస్టయిన గ్రూపు నాయకుడిని విచారించగా ఈ మోసం వెలుగు చూసింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబైకి చెందిన ఎనిమది మంది సభ్యుల సైబర్ క్రైం గ్రూపు దాదాపు 150 మంది బ్యాంక్ అకౌంట్ల వివరాలను తెలుసుకుంది. అనంతరం అకౌంట్లలోని డబ్బులను ఇతర ఖాతాలకు బదిలీ చేసి, మోసగించింది. ఈ నేపథ్యంలో బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు గ్రూపు నాయకుడు గుణిలాల్ మండల్‌ను అరెస్ట్ చేశారు. ( విషాదం: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం) అతడి వద్దనుంచి 100 ఫోన్ నెంబర్లు కలిగిన నోట్‌బుక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సైబర్ క్రైం గ్రూపు ప్రభుత్వ పథకాల ద్వారా 2,500 రూపాయలు వస్తాయంటూ బిహార్, జార్ఖండ్‌లలోని గర్భిణుల అకౌంట్ వివరాలు సేకరించింది. అనంతరం వారి ఖాతాలలోని డబ్బు మాయం చేయటానికి ప్రయత్నించింది. ఇలోపే పోలీసులు గుణిలాల్‌ను అరెస్ట్ చేయటంతో పథకం విఫలమైంది. దాదాపు 100 మంది గర్భిణులనుంచి అకౌంట్ వివరాలు సేకరించినట్లు పోలీసుల విచారణలో గుణిలాల్ తెలిపాడు. -
దాని శాతం ఎంత ఉండాలి?
నా వయసు 28 సంవత్సరాలు. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. రక్తంలో గ్లూకోజు మోతాదు ఎక్కువగా ఉంటే పిండంలో అవయవ నిర్మాణం దెబ్బతినే అవకాశాలు ఉంటాయని చదివాను. అసలు రక్తంలో గ్లూకోజు మోతాదు ఎందుకు ఎక్కువ అవుతుంది? పెరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయగలరు.– కె.ఆమని, నర్మెట్ట సాధారణంగా తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ జీర్ణమై అనేక రకాల హార్మోన్లు, ఎంజైమ్‌ల ప్రభావం వల్ల అవి గ్లూకోజ్‌గా మారి రక్తంలోకి చేరుతుంది. సాధారణంగా పాంక్రియాస్ గ్రంథి నుంచి విడుదలయ్యే ఇన్సులిన్ హార్మోన్ రక్తంలో చేరిన గ్లూకోజ్‌ను శక్తిగా మార్చి శరీరంలోని అన్ని కణాలకు అందేలా చేస్తుంది. ఎక్కువగా ఉన్న సుగర్‌ను లివర్‌లో, కండరాల్లో భద్రపరుస్తుంది. శరీరంలో సుగర్ తక్కువగా ఉన్నప్పుడు భద్రపరచిన సుగర్‌ను వాడుకునేలా ఉపయోగపడుతుంది. పాంక్రియాస్లో సమస్యల వల్ల ఇన్సులిన్ తక్కువగా విడుదల కావడం లేదా ఇన్సులిన్ పనితీరు మందగించడం వంటి సమస్యలు ఏర్పడటం వల్ల గ్లూకోజ్ మెటబాలిజం సరిగా లేకపోవడం వల్ల రక్తంలో సుగర్ పెరుగుతుంది. దీనిని మధుమేహం లేదా డయాబెటిస్ అంటారు. డయాబెటిస్ ఉన్నవాళ్లు గర్భం దాల్చినప్పుడు సుగర్ శాతం ఎక్కువ ఉండి, మొదటి మూడు నెలల్లో సుగర్ నియంత్రణలో లేకపోతే బిడ్డలో అవయవ లోపాలు ఏర్పడే అవకాశాలు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిలో మెదడు, వెన్నుపూస, కిడ్నీలు, గుండె, జీర్ణాశయం వంటి అవయవాలకు సంబంధించిన లోపాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమందిలో డయాబెటిస్ ఉందని తెలియకుండానే, గర్భం దాలుస్తారు. వీరిలో కూడా ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గ్లూకోజ్ మోతాదు పెరగకుండా ఉండటానికి బరువు నియంత్రణలో ఉంచుకోవాలి. దీనికి తగిన వ్యాయామాలు, ఆహార నియమాలు పాటించవలసి ఉంటుంది. ఒకవేళ సుగర్ వ్యాధి ఉందని నిర్ధారణ అయితే ఆహార నియమాలు, వ్యాయామాలతో పాటు డాక్టర్ పర్యవేక్షణలో సుగర్‌ను అదుపులో ఉంచుకోవడానికి మందులు, అవసరమైతే ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటే బిడ్డలో అవయవ లోపాలు ఏర్పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కొందరిలో గర్భం దాల్చిన తర్వాత కొన్ని హార్మోన్స్ ప్రభావం వల్ల అధిక బరువు పెరగడం, కుటుంబంలో సుగర్ ఉన్నట్లయితే, ఐదో నెల తర్వాత రక్తంలో సుగర్ పెరిగి జెస్టేషనల్ డయాబెటిస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇలాంటి వాళ్లలో బిడ్డలో అవయవ లోపాలు ఏర్పడే అవకాశాలు ఉండవు. ఎందుకంటే వీరిలో ఐదో నెల లోపే అవయవ నిర్మాణం అయిపోతుంది. తర్వాత అవయవాలు పరిణామం చెందుతూ ఉంటాయి. మా బంధువుల్లో ఒకరికి యుటెరైన్ ప్రొలాప్స్ సమస్య వచ్చింది. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీనికి ఏ రకమైన చికిత్స పద్ధతులు అందుబాటులో ఉన్నాయి? – ఆర్.ప్రీతి, రాజమండ్రి పొత్తి కడుపులో గర్భాశయం అనేక లిగమెంట్లు, కండరాల ఆధారం ద్వారా వెన్నుపూసకి, పెల్విక్ ఎముకలకు అతుక్కుని ఉంటుంది. ఈ లిగమెంట్లు, పెల్విక్ కండరాలు బలహీనపడినప్పుడు అవి సాగడం వల్ల గర్భాశయానికి ఈ సపోర్ట్ తగ్గిపోయి పొత్తి కడుపులో నుంచి జారి యోని భాగంలో కిందకి, అలాగే యోని భాగం నుంచి బయటకు జారుతుంది. దీనినే యుటెరైన్ ప్రొలాప్స్ అంటారు. ఇది ఏ వయసులోనైనా రావచ్చు. ఎక్కువ సాధారణ కాన్పులు అయ్యేవారిలో, సాధారణ కాన్పు సమయంలో ఇబ్బందులు, ఎక్కువ సేపు క్లిష్టమైన కాన్పు కోసం ఎదురు చూసినప్పుడు, సాధారణ కాన్పు ద్వారా అధిక బరువు బిడ్డలను ప్రసవించినప్పుడు, దీర్ఘకాలం మలబద్ధకం, దగ్గు, అధిక బరువులు లేపడం, అధిక బరువు వల్ల, గర్భాశయం మీద ఒత్తిడి వల్ల, కండరాల బలహీనత వల్ల, మెనోపాజ్ దశలో ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గిపోవడం వంటి అనేక కారణాల వల్ల గర్భాశయం జారడం (యుటెరైన్ ప్రొలాప్స్) జరగవచ్చు. దీని నివారణ అంతా మన చేతిలో ఉండదు. కాకపోతే గర్భాశయం ఇంకా పూర్తిగా యోని బయటకు రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. పెల్విక్ కండరాలు బలపడటానికి కీగల్స్ వ్యాయామాలు, అధిక బరువు పెరగకుండా ఉండటం, బరువు తగ్గడం, మలబద్ధకం లేకుండా చూసుకోవడం, దీర్ఘకాలంగా దగ్గు ఉంటే దానికి తగిన చికిత్స తీసుకోవడం, అవసరమైతే ఈస్ట్రోజెన్ చికిత్స తీసుకోవడం, డాక్టర్‌ను సంప్రదించి వారి సలహాలను, సూచనలను పాటించడం మంచిది. ఈ జాగ్రత్తలు తీసుకున్నా, గర్భాశయం బాగా జారిపోయినప్పుడు వారి వయసు బట్టి, సమస్యను బట్టి కొందరిలో ఆపరేషన్ ద్వారా గర్భాశయాన్ని పొత్తికడుపులోకి లాగి కుట్టడం లేదా గర్భాశయాన్ని తొలగించడం జరుగుతుంది. కొందరిలో ఆపరేషన్ చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు వెజైనల్ పెసరీస్ అంటే రింగు వంటి పరికరాలను యోనిభాగంలో అడ్డు పెట్టడం వల్ల గర్భాశయం బయటకు రాకుండా చూసుకోవచ్చు. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు హై–ఫైబర్ డైట్ తీసుకుంటే పిల్లల్లో ఛ్ఛి జ్చీఛి ఛీజీట్ఛ్చట్ఛ రిస్క్ తక్కువగా ఉంటుందని ఒక టీవి కార్యక్రమంలో విన్నాను. దీని గురించి కాస్త వివరంగా తెలియజేయగలరు.– బి.చందన, హైదరాబాద్ కొన్ని రకాల ఆహార పదార్థాలలో ఉండే ‘గ్లూటెన్’ అనే ప్రొటీన్ కొందరి శరీరానికి సరిపడదు. దాని వల్ల పేగులలో మార్పులు జరిగి, పేగులు వాచి, దెబ్బతినడం జరుగుతుంది. దీనివల్ల తినే ఆహార పదార్థాల్లోని పోషకాలు రక్తంలోకి చేరవు. దీనినే ‘సీలియాక్ డిసీజ్’ అంటారు. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇది కొందరిలో జన్యువుల్లోని మార్పుల వల్ల ఏర్పడవచ్చు. గ్లూటెన్ ఎక్కువగా ఉండే గోధుమలు, బార్లీ వంటి వాటితో చేసిన పదార్థాలు తీసుకున్నప్పుడు కొందరిలో ఈ పరిస్థితి తలెత్తవచ్చు. గ్లూటెన్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకున్నప్పుడు ఈ పరిస్థితి ఉన్న వారిలో వాంతులు, గ్యాస్, పొట్ట ఉబ్బరం, డయేరియా వంటి అనేక లక్షణాలు ఏర్పడతాయి. దీర్ఘకాలంలో పిల్లలు బరువు పెరగకపోవడం, పెరుగుదలలో లోపాలు వంటి అనేక సమస్యలు ఏర్పడవచ్చు. దీనికి చికిత్స లేదు. గ్లూటెన్ ఉన్న పదార్థాలను తీసుకోకుండా ఉండటమే మార్గం. ఇటీవల చేసిన ఒక అధ్యయనంలో తల్లి గర్భిణిగా ఉన్నప్పుడు ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే, ఆ తల్లికి పుట్టే బిడ్డల్లో ‘సీలియాక్ డిసీజ్’ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. తల్లి కనీసం రోజుకు 25 గ్రాముల ఫైబర్ తీసుకోవడం మంచిది. ఇందులో ఎక్కువగా ఆకుకూరలు కూరగాయలు, పండ్లు తీసుకోవడం మంచిది. తల్లి ఫైబర్ డైట్ తీసుకుంటూ ఉన్నట్లయితే, బిడ్డకు సీలియాక్ డిసీజ్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఒక అంచనా. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బోహైదర్నగర్హైదరాబాద్ -
‘ఆరోగ్యలక్ష్మి’ అభాసుపాలు
తూప్రాన్ (మెదక్): జిల్లాలో గర్భిణులు, బాలంతల సంరక్షణ కోసం ప్రవేవపెట్టిన ఆరోగ్యలక్ష్మి పథకం అభాసుపాలవుతోంది. పేద కుటుంబాల్లోని పిల్లలు, బాలింతలు, గర్భిణుల ఆరోగ్య సంరక్షణ, రక్తహీనత నివారణ కోసం ప్రభుత్వం ఈ పథకం ద్వారా పౌష్టికాహారం అందజేస్తుంది. కానీ ప్రస్తుతం ఈ పథకం ద్వారా పంపిణీ చేయాల్సిన పాల సరఫరా నిలిచిపోయింది. ప్రభుత్వం ఐసీడీఎస్ ద్వారా ప్రభుత్వం పౌష్టికాహార మాసోత్సవాలు నిర్వహిస్తుంది. ఈ సమయంలో పాల సరఫరా నిలిచిపోవడంతో బాలింతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలల్లో ఉండే పుష్కలంగా పౌష్టిక విలువలతో కూడిన పోషక విలువలు అందకుండా పోతున్నాయి. తూప్రాన్ మండలంలో పది రోజులుగా అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా కావల్సిన పాలు అందడం లేదు. ఏజెంట్ నిర్వాకం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని ఐసీడీఎస్ అధికారులు పేర్కొంటున్నారు. నర్సాపూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో తూప్రాన్, మనోహరాబాద్, నర్సాపూర్, కౌడిపల్లి, శివ్వంపేట, చిలిపిచెడ్ మండలాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పరిధిలో గర్భిణులు 1,817, బాలింతలు 1,835 ఏడు నెలల నుంచి సంవత్సరం లోపు పిల్లలు 1,862, సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల పిల్లలు 5,991, మూడు సంత్సరాల నుంచి ఆరు సంవత్సరాలలోపు పిల్లలు 6,655 మంది ఉన్నారు. కేవలం అన్నం మాత్రమే.. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా గర్భిణులకు, బాలింతలకు 200 మిల్లీలీటర్ల పాలు, 150గ్రాముల అన్నం, రోజుకు ఒక గుడ్డు వడ్డించాలని నిర్ణయించారు. కొన్ని రోజులుగా పాలు లేకుండానే గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు భోజనాన్ని అందిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు అంగన్వాడీ టీచర్లను అడిగితే పైనుంచే సరఫరా కావడం లేదని తమ చేతుల్లో లేదని తెగేసి చెబుతున్నారని వారు వాపోతున్నారు. దీంతో కేవలం అన్నం మాత్రమే తిని ఇళ్లకు వెల్లిపోతున్నారు. ప్రభుత్వం మాత్రం ఐసీడీఎస్ ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని ఊదరగొడుతూ ఇటీవల పౌష్టికాహార వారోత్సవాలు, మాసోత్సవాలు నిర్వహిస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో అర్హులైన వారికి పౌష్టికాహారం అందకుండా పోవడంలో అధికారులు వైఫల్యం చెందారన్న విషయం ఈ సంఘటనను బట్టిచూస్తే స్పష్టమవుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అంగన్వాడీ కేంద్రాలకు సకాలంలో పౌష్టిక విలువలు కలిగిన ఆహార పదార్థాలతోపాటు పాలు సరఫరా అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని చెబుతున్నప్పటికీ అది క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. పలు చోట్ల అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు దొడ్డు బియ్యమే పంపిణీ చేస్తున్నారు. దీంతో దొడ్డు బియ్యం తినేందుకు వారు ఇబ్బందులు పడుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీ కేంద్రాల్లోనే భోజనం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం కేంద్రాల్లోనే గర్భిణులకు, బాలింతలకు భోజనం వడ్డించాలి. కానీ దొడ్డుబియ్యంతో అన్నం తినేవారు లేక కేవలం పాలు,గుడ్లు మాత్రమే ఇళ్లల్లోకి తీసుకెళ్తున్నట్లు సమాచారం. కొన్ని కేంద్రాల్లో దొడ్డుబియ్యం తమకు జీర్ణం కాదంటూ కేంద్రాలకే రావడం లేదు. ఇది కేవలం తూప్రాన్ మండలంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు కొనసాగుతోంది. అధికారులు పట్టించుకోవడం లేదు అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు, బాలింతలకు ప్రతిరోజు గ్లాసు పాలు ఇవ్వాలి. కానీ పాలు ఇవ్వడం లేదు. పౌష్టికాహారం అందిస్తున్నామని చెబుతున్నారు. కానీ మాకు మాత్రం అందడం లేదు. అధికారులు వెంటనే స్పందించి తమకు పాలు అందేలా చూడాలి. ఈ విషయమై అధికారులు పట్టించు కోవడం లేదు. –రోజా, బాలింత పది రోజుల నుంచి పాలు ఇవ్వడం లేదు పదిరోజుల నుంచి అంగన్వాడీ కేంద్రంలో పాలు ఇవ్వడం లేదు. కేవలం భోజనం, గుడ్లు మాత్రమే ఇస్తున్నారు. ఇదేమిటని అడిగితే పైనుంచి పాలు రావడం లేదని చెబుతున్నారు. పాలు కొనుగోలు చేయలేని మాలాంటి వారికి వెంటనే పాలు అందజేయాలి. –ఆకుల కృప ఏజెన్సీ నిర్వాకం వల్లే.. అంగన్వాడీ కేంద్రాలకు టెండర్ల ద్వారా ‘నేహా’ అనే సంస్థ కేంద్రాలకు పాలు సరఫరా చేస్తుంది. తూప్రాన్ మండలంలో కొన్ని రోజులుగా పాలు సరఫరా కావడం లేదని అంగన్వాడీ టీచర్లు మా దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ఈ కేంద్రాలు పాలు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటాం. –కనకదుర్గ, ఐసీడీఎస్ సీడీపీఓ, నర్సాపూర్ -
నరకం చూపించారు సార్!
ప్రసవం కోసం వస్తున్న గర్భిణుల పట్ల జిల్లాకేంద్రంలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పురిటినొప్పులు వచ్చినా.. వైద్యులతోపాటు సిబ్బంది కూడా పట్టించుకోవడంలేదు. సాధారణ కాన్పు అవుతుదంటూ గర్భిణుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. సోమవారం కూడా ఓ గర్భిణి పురిటినొప్పులతో బాధపడుతున్నా.. కాన్పు చేయలేదు. దీంతో ఆ గర్భిణికి ఫిట్స్ వచ్చింది. వైద్యసిబ్బంది నిర్లక్ష్యాన్ని గమనించిన ఆమె బంధువులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ 10 నిమిషాల్లోనే సాధారణ ప్రసవం చేసి.. మగశిశువుకు పురుడుపోశారు. కరీంనగర్‌హెల్త్: జిల్లాకేంద్రంలోని విజయపురికాలనీకి చెందిన అఫ్రీన్ పురిటినొప్పులతో బాధపడుతూ జిల్లాకేంద్ర ఆస్పత్రి ఆవరణలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో శనివారం చేరింది. పరీక్షలు చేసిన వైద్యులు.. ప్రసవానికి ఇంకా సమయం ఉందన్నారు. మధ్యాహ్నంవరకు నొప్పులు తీవ్రమైనా.. ఇంకా సమయం ఉందంటూ పట్టించుకోలేదు. నొప్పులు తీవ్రమై కాళ్లు, చేతులు మెలికలు తిరుగుతూ ఫిట్స్వచ్చి బాధితురాలు కొట్టుకుంది. పరిస్థితిని గమనించిన బంధువులు నగరంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోంకు తరలించారు. వెయ్యి కాన్పులు లక్ష్యం అంటూ గొప్పలు.. పేదలకు సత్వర వైద్యం అందించి వెయ్యి కాన్పులు చేయడమే లక్ష్యమని గొప్పలు చెబుతున్న మాతాశిశు ఆరోగ్య కేంద్రం వైద్యులు ఆదిశగా సేవలు అందించడం లేదు. ఆస్పత్రిలో గర్భిణుల పట్ల సిబ్బంది అనుసరిస్తున్న తీరు పరాకాష్ఠకు చేరుతోంది. మాతా, శిశు మరణాలు తగ్గించాలనే సంకల్పంతో రూ.16కోట్లతో ఏర్పాటుచేసిన ఈ కేంద్రంలో సత్వర సేవలు కాదుగదా.. కనీస సేవలు అందడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలలు నిండిన తర్వాత ఆస్పత్రిలో చేర్చుకుంటున్నా.. తర్వాత పట్టింపు కరువైందని, అసలు ఆసుపత్రికి ఎందుకు వస్తున్నారన్నట్లు సిబ్బంది వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ప్రభుత్వం చెబుతున్న ప్రకటనలకు.. ఆసుపత్రిలో గర్భిణులకు అందుతున్న సేవలకు పొంతన లేకుండాపోతోందని విమర్శిస్తున్నారు. నరకం చూపించారు ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి సాధారణ కాన్పు అవుతుందని కాలయాసన చేశారు. మేం కూడా వారికి సహకరించాం. నొప్పులతో తల్లడిల్లుతున్నా.. వైద్యులు పట్టించుకోలేదు. పూటకోడాక్టర్.. గంటకోనర్సువచ్చి వెళ్లారు తప్పితే.. వైద్యానికి ఎవరూ ముందుకురాలేదు. ఇంకా టైం ఉందని, తమకు తెల్వదా.. ? అంటూ నరకం చూపించారు. అప్పటికే కాళ్లు, చేతులు వంకరలు పోయి కొట్టుకుంది. ప్రైవేటుకు తీసుకుపోతామంటే సంతకం చేయాలని వేధించారు. వారి నిర్లక్ష్యాన్ని గమనించి ప్రైవేటు ఆసుపత్రికి తరలించాం. ఆలస్యమై ఉంటే ప్రాణాలకు ముప్పు ఉండేది. ప్రభు త్వ ఆస్పత్రి సిబ్బంది తీరు చాలా దారుణం. పేదలకు సేవలందించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. – సయ్యద్ ఖలీం, బాధితురాలి భర్త -
ఏడు రోజులు..ఏడు టీకాలు
అశ్వాపురం: మిషన్ ఇంద్రధనుస్సు అనే కార్యక్రమం ద్వారా చిన్నారులు, గర్భిణులకు టీకాలు వేసే కార్యక్రమానికి వైద్య, ఆరోగ్య శాఖ అంతా సిద్ధం చేసింది. ఈరోజు (సోమవారం) నుంచి ఈ నెల 26వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి రెండేళ్ల లోపు చిన్నారులకు టీకాలు వేస్తారు. అలాగే గర్భిణులకు వ్యాధి నిరోధక టీకాలు వేయనున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల నివారణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం గ్రామస్వరాజ్ అభియాన్‌లో భాగంగా ఈ ఇంద్ర ధనుస్సు కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి బుధవారం, శనివారం ఇమ్యూనైజేషన్ కార్యక్రమం నిర్వహించి చిన్నారులు, గర్భిణులకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నారు. అవి వేయించుకోని వారికి, మధ్యలో ఆపివేసిన వారికి టీకాలు వేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మిషన్ ఇంద్రధనుస్సులో ఏడు వ్యాధులకు ఏడు రోజుల పాటు ఏడు రకాల టీకాలు వేయనున్నారు. జిల్లాలో నేటి నుంచి వారం రోజుల పాటు చేపట్టే ఈ కార్యక్రమానికి డీఎంహెచ్ఓ డాక్టర్ దయానందస్వామి నేతృత్వంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. 23 పీహెచ్‌సీల పరిధిలో వ్యాక్సిన్లు సిద్ధం చేశారు. మిషన్ ఇంద్రధనుస్సు విజయవంతానికి జిల్లా స్థాయిలో శనివారమే టాస్క్‌ఫోర్స్ సమావేశం కూడా నిర్వహించారు. 1,498 మంది చిన్నారులు, 404 మంది గర్భిణులు.. మిషన్ ఇంద్రధనుస్సులో చిన్నారులు, గర్భిణులకు టీకాలు వేసేందుకు జిల్లాలోని 23 మండలాల్లో 29 పీహెచ్‌సీల పరిధిలో 205 గ్రామపంచాయతీల్లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోని వారిని, టీకాలు వేయించుకుంటూ మధ్యలో ఆపివేసిన చిన్నారులు 1,498 మంది ఉన్నట్లు నిర్ధారించారు. 404 మంది గర్భిణులకు టీకాలు వేయాల్సి ఉంటుందని తేల్చారు. మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమంలో భాగంగా జిల్లా లోని అంగన్వాడీ కేంద్రాల్లో టీకాలు వేయనున్నారు. జిల్లాలో వలస గిరిజనులు అధికంగా ఉన్న మారుమూల గ్రామాలు, సమస్యాత్మక ప్రాంతాలు, ఇటుకబట్టీల వద్దకు ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు వెళ్లి చిన్నారులు, గర్భిణులకు టీకాలు వేస్తారు. వివిధ కారణాలతో ఈ విడతలో టీకాలు వేయించుకొని వారికి మరో రెండు విడతల్లో ఆగస్టు 16, సెప్టెంబర్ 16 నుంచి వారం రోజుల పాటు మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమం నిర్వహించనున్నారు. వేసే టీకాలు ఇవే.. గర్భిణులకు ధనుర్వాతం వ్యాధి రాకుండా టీటీ. అప్పుడే పుట్టిన చిన్నారి నుంచి రెండేళ్ల లోపు చిన్నారులకు పోలియో, కామెర్లు, తట్టు, రుబెల్లా, మెదడువాపు, క్షయ, దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు బీసీజీ టీకాలు వేస్తారు. హెపటైటీస్–బీ, పోలియో, పెంటావాలెంట్, జేఈ, విటమిన్–ఏ టీకాలను వారం రోజుల పాటు వేస్తారు. ఏర్పాట్లు పూర్తి చేశాం.. జిల్లాలోని అన్ని గ్రామాల్లో నేటి నుంచి ఈ నెల 26 వరకు మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. అన్ని పీహెచ్‌సీల పరి«ధిలో వ్యాక్సిన్లు ఉంచాం. జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. ప్రోగ్రాం పర్యవేక్షణకు ఒక్కో రూట్‌కు ప్రోగ్రాం ఆఫీసర్‌ను ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర స్థాయి కన్సల్టెంట్లు ప్రోగ్రాంను పరిశీలిస్తారు. లోతట్టు పల్లెలకు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు తెలిపాం. మొబైల్ వాహనం వినియోగంలోకి రానుంది. – డాక్టర్ నరేష్ కుమార్, జిల్లా ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాం అధికారి -
గర్భిణులు..జర జాగ్రత్త
విజయనగరం ఫోర్ట్ : ప్రస్తుతం సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎండలు మండి పోతున్నాయి. ఇలాంటి సమయంలో గర్భిణులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. తినే ఆహారం నుంచి, నిద్ర, వస్త్రదారణ తదితర విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని పేర్కొంటున్నారు. తినకూడని పదార్థాలు.. బొప్పాయి, పైనాపిల్, చేపలు, సరిగా ఉడకని మాంసం, జున్ను తింటే అబార్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువ. మద్యం కూడా తీసుకోరాదు. ఒత్తిడి తగ్గించుకోవాలి.. ఒత్తిడి తగ్గించుకోవాలంటే గర్భిణులు రోజూ వ్యాయామం చేయాలి. దాని వల్ల శరీరంలో ఎండాసెన్స్ విడుదలై ఒత్తిడి తగ్గుతుంది. శ్వాస వ్యాయామం వల్ల నరాలు, కండరాల బడలిక తగ్గుతుంది. చింతపండుతో ప్రయోజనం.. ఔషధ గుణాలు ఉన్న చింతకాయలు గర్భిణుల్లో కలిగే వికారాన్ని, వాంతులను, ఉదయపు అలసటను తగ్గించడమే కాకుండా, మలబద్ధకం లేకుండా రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. గ్యాస్ట్రిక్ తగ్గించే పద్ధతులు.. నీరు అధికంగా తాగాలి. రోజూ 30 నిమిషాల సేపు వ్యాయామం, వాకింగ్ చేయాలి. దీనివల్ల మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు. మొలకెత్తిన విత్తనాలు, బంగాళ దుం వంటి పందార్థాలు తినడం వల్ల కూడా గ్యాస్ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. మందులతో జాగ్రత్త.. గర్భిణులు డాక్టర్లను సంప్రదించకుండా ఏ మందులు తీసుకోరాదు. అలా చేస్తే పుట్టబోయే బిడ్డకు ప్రమాదం వాటిళ్లుతుంది. యాంటి బయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, ముక్కుద్వారా పీల్చే డ్రాప్స్ వంటి మందులు వాడకూడదు. దుస్తులు... వదులుగా ఉండే పరిశుభ్రమైన కాటన్ దుస్తులు ధరించాలి. లేత రంగు దుస్తులు వేసుకుంటే మంచిది. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు తప్పనిసరిగా వాడాలి. డాక్టర్‌ను సంప్రదించే సమయాలు.. ప్రతీ నెలా రెగ్యులర్‌గా చెకప్‌కు వెళ్లాలి. వైద్యుడు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడాలి. నీరసంగా ఉండడం, ఆలసిపోవడం, చెమట పట్టడం, జ్వరం ఉన్నట్లు అనిపించడం, వాంతుల రావడం, కళ్లు తిరిగినట్టు అనిపిస్తే వైద్యుడి దగ్గరకు వెళ్లాలి. -
అమృత హస్తం.. లోపాలే సమస్తం
చింతలపూడి : ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత హస్తం పథకం గర్భిణులు, బాలింతల పాలిట శాపంగా పరిణవిుస్తోంది. వారిలో పోషకాహార లోపాలను నివారించేందుకు ఉద్దేశించిన ఈ పథకం లోపాలమయంగా మారింది. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న పాలు తరచూ పాడైపోతున్నాయి. పాల ప్యాకెట్లలో బ్యాక్టీరియా చేరి దుర్వాసన వెదజల్లుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని గర్భిణులు, బాలింతలకు రోజూ అన్నం, పప్పు, ఆకు కూరలతోపాటు 200 మిల్లీలీటర్ల చొప్పున పాలు అందజేయాల్సి ఉంది. అన్నం, పప్పు, ఆకు కూరలు కొంచెం అటూఇటుగా ఉంటున్నా.. పాలు మాత్రం పాడైపోయినవి ఇస్తున్నారు. ప్యాకెట్లు రోడ్డు ‘పాలు’ గర్భిణులు, బాలింతలకు ఇవ్వాల్సిన వందలాది పాల ప్యాకెట్లు రోడ్డు పక్కన గుట్టలుగా దర్శనమిస్తున్న ఘటనలు చింతలపూడి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో తరచూ చోటుచేసుకుంటున్నాయి. చింతలపూడి నుంచి నాగిరెడ్డిగూడెం వెళ్లే రహదారి పక్కన ఖాళీ స్థలంలో కొద్దిరోజులుగా ఇవి దర్శనమిస్తుండటంపై ఆరా తీయగా అసలు విషయం వెలుగు చూసింది. పాల ప్యాకెట్లలో బ్యాక్టీరియా చేరడం వల్ల దుర్వాసన వెదజల్లుతున్నాయి. వీటిని గర్భిణులు, బాలింతలకు సరఫరా చేస్తే ప్రమాదం ముంచుకొస్తుందన్న భయంతో ఐసీడీఎస్ అధికారులే వీటిని ఖాళీ స్థలంలో పడవేయిస్తున్నట్టు వెల్లడైంది. ఇలాంటి ప్యాకెట్లను వెనక్కి పంపించి.. వాటిస్థానంలో తాజా పాల ప్యాకెట్లను పొందే అవకాశం ఉన్నా అధికారులు ఎందుకో ఆ పని చేయడం లేదు. దీని వెనుక కారణం ఏమిటనేది ఇంకా వెల్లడి కాలేదు. 90 రోజులు దాటితే అంతే.. ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ‘విజయ వజ్ర’ రకం పాలను టెట్రా ప్యాకెట్లలో నింపి అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. ఇవి ప్యాక్ చేసిన తేదీ నుంచి సుమారు 90 రోజుల వరకు నిల్వ ఉంటాయి. పాల ప్యాకెట్లు లీకవుతున్నా.. ఉబ్బినట్టు ఉన్నా వాటిని గర్భిణులు, బాలింతలకు సరఫరా చేయకూడదు. ప్యాకెట్లు లీకైనా.. ఉబ్బినా వాటిలోకి బ్యాక్టీరియా చేరుతుంది. చింతలపూడి ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌కు గత నెలలో సరఫరా చేసిన పాల ప్యాకెట్లలో అత్యధిక శాతం పాడైపోవడంతో ఖాళీస్థలంలో పారబోశారు. తాజాగా.. మరోసారి వందలాది ప్యాకెట్లను నేలపాలు చేశారు. వీటిని సేవిస్తే ప్రాణాంతకమే.. బ్యాక్టీరియా చేరిన పాలను తాగితే గర్భి ణులు, బాలింతలు తీవ్ర అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. పారబోసిన ప్యాకెట్ల గడువు తేదీ దాటిపోంది. వీటిని ఎవరైనా సేవిస్తే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. కనీసం ప్యాకెట్లను కత్తిరించి పాలను పారబోసినా ఈ ప్రమాదం నుంచి బయటపడవచ్చు. అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు ఇవేమీ పట్టించుకోకుండా పాడైన ప్యాకెట్లను జనసంచారం ఉండే ప్రాంతంలో గుట్టలుగా పోస్తున్నారు. పొరపాటున వాటిపి ఎవరైనా తీసుకుని ఉపయోగిస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. 67 లీటర్లే పాడయ్యాయట చింతలపూడి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరి« దిలో 277 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నా యి. వీటి పరిధిలో 2,044 మంది గర్భి ణులు, 1,999 మంది బాలింతలు నమోదయ్యారు. వారికి ఇచ్చే నిమిత్తం అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తు న్న పాలకు ప్రభుత్వం లీటర్‌కు రూ.40 చొప్పున చెల్లిస్తోంది. ఫిబ్రవరిలో చింతలపూడి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు 15,039 లీటర్ల పాలు సరఫరా చేశారు. వీటిలో కేవలం 67.50 లీటర్ల పాలు మాత్రమే పాడయ్యాయని అధికారులు చెప్తున్నారు. మరి గుట్టలుగా పోసిన వందలాది లీట ర్ల పాల ప్యాకెట్ల సంగతేమిటని అడిగితే నీళ్లు నములుతున్నారు. నాణ్యతపై అనుమానం అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న పాల ప్యాకెట్లను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించకపోవడంతో నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గర్భిణులు చూసుకోకుండా ఈ పాలను తాగితే వాంతులు, విరేచనాల పాలై ప్రాణాపాయ స్థితికి ప్రమాదం ఉంది. పాడైన ప్యాకెట్లు తీసుకోవద్దని చెప్పాం పాడైపోయిన పాల ప్యాకెట్లు తీసుకోవద్దని అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులకు సూచించాం. గత నెలలో 67 ప్యాకెట్లు పాడైపోయినట్టు గుర్తించాం. వాటిని వెనక్కి ఇచ్చి.. వాటి స్థానంలో కొత్త ప్యాకెట్లు తీసుకున్నాం. పాడైపోయిన ప్యాకెట్లను కత్తిరించి అందులోని పాలను బయట పారబోయాల్సిందిగా పాలు సరఫరా చేస్తున్న కంపెనీ ప్రతినిధికి సూచించాం. ఇటువంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. – కె.విజయలక్ష్మి, ప్రాజెక్ట్ అధికారి, ఐసీడీఎస్, చింతలపూడి -
గర్భిణులు మరణిస్తే కఠిన చర్యలు
అధికారులపై కలెక్టర్ ముత్యాలరాజు ఆగ్రహం నెల్లూరు(పొగతోట): గ్రామీణ ప్రాంతాల్లో ఇకపై గర్భిణులు మరణిస్తే సంబంధిత వైద్యాధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు హెచ్చరించారు. మంగళవారం స్థానిక గోల్డన్జూబ్లీ హాల్లో వైద్య ఆరోగ్య శాఖ, ఐసీడీఎస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఇటివల కాలంలో ఎనిమిది మంది గర్భిణులు మరణించారన్నారు. వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో సక్రమంగా విధులు నిర్వహించకపోవడం, పౌష్టిక ఆహారం లభించకపోవడంతోనే వారు మరణిస్తున్నారన్నారు. సిబ్బంది తప్పించుకోవడానికి గర్భిణుల మృతికి హార్టు ఎటాక్ తదితర కారణాలు చూపుతున్నారన్నారు. నిరుపేదలకే హార్టు ఎటాకులు వస్తాయా ఇతరులకు రావా అని కలెక్టర్ ప్రశ్నించారు. పీహెచ్‌సీల్లో వైద్య సేవలు, సౌకర్యాలు సక్రమంగా లేనందునే గర్భిణులు ప్రైవేట్ ఆస్పత్రుల వైపు వెళుతున్నారని తెలిపారు. పీహెచ్‌సీల్లో సిబ్బంది ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తప్పకుండా విధులు నిర్వహించాలన్నారు. 3.45 గంటలకు వైద్యాధికారులు, సిబ్బంది లేకపోయినా చర్యలు చేపడతామని హెచ్చరించారు. సీహెచ్‌సీలకు ఇద్దరు వైద్యాధికారులను నియమించాలని డీఎంహెచ్ఓకు సూచించారు. ఒకరు పీహెచ్సీలో ఉండి ఓపీ చూడాలన్నారు. మరొక డాక్టర్ గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి వ్యాధులు తదితరాలను పరిశీలించాలన్నారు. ఇ–హాస్పిటల్ రిజిస్ట్రేషన్ అన్ని సీహెచ్‌సీలు చేయాలన్నారు. దాని వలన రోగులు ఎంత మంది వస్తున్నారు, గర్భిణులు, హైరిస్క్ గర్భిణులు వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బాల్యవివాహాలు జరుగుతుంటే ఐసీడీఎస్ అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వరసుందరం, నెల్లూరు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ భారతి, డీసీహెచ్ఓ డాక్టర్ సుబ్బారావు, ఐసీడీఎస్ పీడీ విద్యావతి, సీడీపీఓలు, వైద్యాధికారులు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. -
అమ్మలకు నరకయాతన
ప్రభుత్వ మాతాశిశు ఆస్పత్రిలో వైద్యుల కొరత క్యూలో గంటలకొద్దీ నిలబడుతున్న గర్భిణులు రాజమహేంద్రవరం : తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మాతాశిశు ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల కొరత వేధిస్తోంది. చాలినంతమంది వైద్యులు లేకపోవడంతో గర్భిణులు గంటలకొద్దీ క్యూలో నిలబడాల్సిన దుస్థితి నెలకొంది. ఈ ఆస్పత్రికి ఉభయ గోదావరి జిల్లాల నుంచి వైద్యం నిమిత్తం గర్భిణులు వస్తూంటారు. రంపచోడవరం, చింతూరు తదితర ఏజెన్సీ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. వైద్య పరీక్షల నిమిత్తం రోజూ 200 మంది వస్తున్నారు. రోజూ 20 ప్రసవాలు జరుగుతాయి. ఇందులో 10 వరకూ సిజేరియన్లు ఉంటాయి. ఇంత ప్రాధాన్యం ఉన్న ఈ ఆస్పత్రిలో గర్భిణులకు సేవలందించడానికి ముగ్గురు డాక్టర్లు మాత్రమే ఉన్నారు. వీరిలో ఒకరు ప్రసవాలు,ఆపరేషన్లు చేయడానికి, మరొకరు వైద్యపరీక్షలకు, మూడో డాక్టర్ రోజువారీ ఓపీ చూస్తూంటారు. గంటలకొద్దీ క్యూలో.. ఓపీ చీటీ రాయించుకోవడం మొదలు వైద్యం పూర్తయ్యే వరకూ అధిక సమయం గర్భిణులు క్యూలో నిలబడాల్సి వస్తోంది. ఓపీ రాయించుకుని డాక్టర్ వద్దకు వెళ్లితే అక్కడ క్యూ భారీగా ఉంటోంది. డాక్టర్ ఎంత వేగంగా సేవలందించినా గర్భిణులకు ఇబ్బందులు తప్పడం లేదు. 200 మందికి ఒక్కరే వైద్యం చేయడం చాలా కష్టమవుతోంది. అలాగే స్కానింగ్ వద్ద కూడా గంటలకొద్దీ వేచి ఉండాల్సి వస్తోంది. ఒక్క గైనకాలజిస్ట్ మాత్రమే ఉండడంతో గర్భిణులకు ఇబ్బందులు తప్పడం లేదు. డాక్టర్లు సరిపడా లేకపోవడంతో చాలామందిని కాకినాడ జీజీహెచ్‌కు పంపిస్తున్నారు. భవనాలు కట్టారు కానీ.. జిల్లా ఆస్పత్రి ప్రాంగణంలోనే ఎన్ఆర్హెచ్ఎం నిధులతో 100 పడకల మాతా, శిశు సంక్షేమ ఆస్పత్రి నిర్మించారు. రూ.10 కోట్లతో నిర్మించిన ఈ ఆస్పత్రిని గత ఏడాది సెప్టెంబర్‌లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆర్భాటంగా ప్రారంభించారు. కానీ అవసరమైన మేరకు సిబ్బంది నియామకం చేపట్టలేదు. 100 పడకల ఆస్పత్రి అందుబాటులోకి వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క పోస్టు కూడా మంజూరు చేయలేదు. స్టాఫ్నర్సులకూ కొరత శిక్షణ పొందిన స్టాఫ్‌నర్సుల కొరత కూడా ఇక్కడ తీవ్రంగా ఉంది. 24 స్టాఫ్‌నర్స్, 4 హెడ్ నర్స్, 10 ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ పోస్టులు మంజూరు చేయాల్సి ఉంది. ఎనిమిది మంది గైనకాలజిస్టులను నియమించాల్సి ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో గత్యంతరం లేక ఉన్న సిబ్బంది, వైద్యులతోనే గర్భిణులకు వైద్యసేవలు అందిస్తున్నారు. ఎనిమిదిమంది డాక్టర్లు కావాలి గర్భిణులకు వేగవంతంగా సేవలు అందించడానికి ఎనిమిదిమంది డాక్టర్లు కావాలి. ఇప్పుడు కేవలం ముగ్గురే ఉన్నారు. గర్భిణులు కొంత ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. అందుబాటులో ఉన్న డాక్టర్లతో మెరుగైన సేవలు అందించడానికి ప్రయత్నిస్తున్నాం. శిక్షణ పొందిన స్టాఫ్‌నర్సుల కొరత తీవ్రంగా ఉంది. మే నెలలో ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో పోస్టుల మంజూరుపై చర్చించాం. త్వరలో మంజూరయ్యే అవకాశం ఉంది. - టి.రమేష్ కిషోర్, జిల్లా ఆస్పత్రి సంచాలకుడు, రాజమహేంద్రవరం maternity hospital, doctors , pregnants, మాతాశిశు ప్రభుత్వాస్పత్రి, డాక్టర్లు, గర్భిణులు -
గర్భిణుల్లో బీ12 లోపాన్ని సవరిస్తే... పుట్టే బిడ్డకు మధుమేహం రాదు!
సాక్షి, హైదరాబాద్: పుట్టబోయే బిడ్డ... మధుమేహం, గుండె సంబంధ వ్యాధులకు దూరంగా ఉండాలనుకుంటున్నారా? అయితే గర్భిణిగా ఉన్నప్పుడే మీరు కొంచెం జాగ్రత్త పడటం మంచిదంటున్నారు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు. భారతీయ మహిళల రక్తంలో హోమోసిస్టైన్ అనే అమినోయాసిడ్ల మోతాదు ఎక్కువగా ఉండటంవల్ల పిల్లలు తక్కువ బరువుతో పుట్టడమే కాకుండా... పెరిగి పెద్దయ్యాక మధుమేహం, గుండెజబ్బుల బారిన పడే అవకాశం ఉంటుందని తమ పరిశోధనల ద్వారా తెలిసిందని సీసీఎంబీ శాస్త్రవేత్త గిరిరాజ్ చందక్ తెలిపారు. రక్తంలో హోమోసిస్టైన్ల మోతాదు ఎక్కువగా ఉన్న వారికి గుండెజబ్బులు వచ్చే అవకాశముందని ఇప్పటికే దాదాపుగా రుజువైందని, అయితే ఈ అమినోయాసిడ్కు... నవజాత శిశువులు తక్కువ బరువుతో ఉండేందుకు సంబంధం ఉన్నట్లు తాము గుర్తించామని ఆయన మంగళవారం సీసీఎంబీ ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. శాకాహారం తీసుకునే వారు ఎక్కువగా ఉండటం.. మాంసాహారం తీసుకునే వారు తక్కువగానే మాంసం ఉత్పత్తులను తీసుకుంటూండటంవల్ల దేశంలోని చాలామందిలో మరీ ముఖ్యంగా మహిళల్లో బీ12 విటమిన్ లోపం కనిపిస్తోందని, ఫలితంగా దాదాపు సగం మంది పిల్లలు తక్కువ బరువుతో జన్మిస్తున్నారని ఆయన చెప్పారు. శరీర నాడీవ్యవస్థ, మెదడు సవ్యంగా పనిచేసే విషయంలో, రక్తం తయారయ్యే అంశంలోనూ ఈ విటమిన్ కీలకపాత్ర పోషిస్తుందన్నది తెలిసిందే. బీ12 విటమిన్ తక్కువైతే రక్తంలోని హోమోసిస్టైన్ మోతాదు ఎక్కువ అవుతుంది. ఎంటీహెచ్‌ఎఫ్‌ఆర్ అనే ఎంజైమ్‌లోని జన్యులోపం దీనికి కారణం. ఈ జన్యులోపంవల్ల హోమోసిస్టైన్ను మరో రసాయనంగా మార్చే వ్యవస్థ (1-సీ మెటబాలిజం) సక్రమంగా పనిచేయదు. ఈ విషయాన్ని తాము పరిశోధనల ద్వారా గుర్తించినట్లు చందక్ వివరించారు. ఈ నేపథ్యంలోనే గర్భిణులకు ఫోలిక్ యాసిడ్‌తోపాటు బీ12 విటమిన్లను కూడా అందించడం మేలని తాము సూచిస్తున్నామని చెప్పారు. సౌష్టవ నిర్మాణం కిటుకూ అర్థమైంది... అన్ని రకాల జంతువులు, చెట్ల నిర్మాణం సౌష్టవంగా ఉండటం మనం గమనించే ఉంటాం. ఈ నిర్మాణానికి శరీరంలోని హోక్స్ (హెచ్ఓఎక్స్) జన్యువులు కారణమని కూడా తెలుసు. శరీరంలో తల నుంచి కాలివరకూ వేర్వేరు ప్రాంతాల్లో ఉండే ఈ జన్యువులు ఆయా ప్రాంతాల్లోని అవయవాలు ఏర్పడేందుకు, ఎదిగేందుకు సాయపడతాయి. ఈ జన్యువులు ఈ ఒక్క విధినే నిర్వర్తిస్తాయని నిన్నమొన్నటివరకూ అనుకుంటూండగా, ఇవి మరికొన్ని అదనపు పనులు కూడా చేస్తాయని సీసీఎంబీ శాస్త్రవేత్త రాకేశ్ మిశ్రా జరిపిన పరిశోధనల ద్వారా తెలిసింది. ఈ పరిశోధన ఫలితాలు వేర్వేరు జీవుల శరీర నిర్మాణాన్ని మరింత మెరుగ్గా అర్థం చేసుకునేందుకు ఉపయోగపడతాయని రాకేశ్ మిశ్రా తెలిపారు. ముఖ్యంగా కొన్ని రకాల కేన్సర్లలో హోక్స్ జన్యువుల్లో కొన్ని కొంచెం తేడాగా వ్యవహరించడానికి కారణమేమిటన్నది కూడా తెలుసుకునే వీలవుతుందని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా శాస్త్ర, పరిశోధన రంగాల్లో సీసీఎంబీ సామర్థ్యం గణనీయంగా పడిపోయిందన్న కొన్ని వార్తా కథనాలను సంస్థ డెరైక్టర్ డాక్టర్ మోహన్‌రావు ఖండించారు. ప్రచురితమైన పరిశోధనలు, వాటి ప్రభావం వంటి అంశాలను వేటిని పరిగణనలోకి తీసుకున్నా సామర్థ్యం ఏటికేడాది పెరుగుతూనే ఉందని ఆయన గణాంకాలతో వివరించారు. -
అమ్మకు ఆసరా ఏది?
అన్నిటా వెనకబాటుతనాన్నే ప్రదర్శిస్తున్న వేళ ఏ కొంచెమైనా ప్రగతి కనిపిస్తే ప్రాణం కుదుటపడుతుంది. మన దేశంలో ప్రసూతి మరణాల రేటు తగ్గిందని భారత రిజిస్ట్రార్ జనరల్ ఈమధ్యే విడుదల చేసిన నివేదిక తీసుకొచ్చిన కబురు ఎవరికైనా సంతోషం కలిగించకమానదు. అయితే, పేదరికంలో మనకన్నా చాలా వెనకబడివున్న దేశాలు సాధించినదాంతో పోలిస్తే మనదేమీ అంత ఎక్కువ కాదని తెలిసినప్పుడు మనసు చివుక్కుమంటుంది. ప్రసూతి సమయంలో ఏర్పడే చిక్కులవల్ల మరణించే తల్లుల సంఖ్య 2007-09 నాటి మరణాలతో పోలిస్తే 16శాతం తగ్గిందని రిజిస్ట్రార్ జనరల్ తాజా నివేదిక చెబుతోంది. లక్ష శిశు జననాలకు 2007-09లో 212 మరణాలుండగా ఇప్పుడది 178కి చేరుకుంది. గత దశాబ్దకాలంలో ఈ తగ్గుదల 40శాతంవరకూ ఉంది. ఇలా మరణాల సంఖ్య తగ్గడం ఆనందించదగ్గ అంశమే అయినా నిర్దేశించుకున్న లక్ష్యం 109తో పోలిస్తే ఇది చాలా తక్కువే. 2015కల్లా ప్రపంచమంతటా ప్రసూతి మరణాలను గణనీయంగా తగ్గించాలని నిర్దేశిస్తూ ఐక్యరాజ్య సమితి ఇచ్చిన లక్ష్యమది. మరొక్క ఏడాది కాలంలో ఆ లక్ష్యం చేరుకోగలమా అన్న సందేహం ఎవరికైనా కలిగిందంటే అలాంటివారిని నిరాశావాదులుగా కొట్టిపారేయనవసరంలేదు. మన ప్రభుత్వాల పనితీరు ఆ భరోసాను కలిగించడంలేదు. ఎందుకంటే, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఈ సంఖ్య ఒకేలా లేదు. కొన్ని రాష్ట్రాలు ఈ విషయంలో ముందుకెళ్లి తల్లీపిల్లల సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటుంటే మరికొన్ని మందకొడిగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని పరిస్థితులు ఆందోళనకర స్థాయిలోనే ఉన్నాయి. గ ర్భిణిగా ఉన్నపుడు మహిళకు అందించే కొద్దిపాటి ఆసరా ఆమె ప్రాణాలను నిలబెడుతుంది. రక్తహీనతను, ఇన్ఫెక్షన్లనూ సకాలంలో గుర్తించి అవసరమైన వైద్య సాయం అందిస్తే వేలాదిమంది తల్లులు మృత్యుఒడినుంచి బయటకు రాగలుగుతారు. కానీ, ఆ చిన్న సాయమందించే బాధ్యతను కూడా ప్రభుత్వాలు సక్రమంగా నిర్వహించలేకపోతున్నాయి. సకాలంలో లోటుపాట్లను గుర్తించి సరిచేయలేకపోతున్నాయి. గ్రామసీమల్లో గర్భిణులను గుర్తించి వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందించే విస్తృతమైన నెట్వర్క్ మనకుంది. కానీ, ఆ నెట్‌వర్క్‌లో పనిచేసే వాలంటీర్లకు ఇస్తున్న అరకొర వేతనాలు ఆ పని సక్రమంగా నడవడానికి అవరోధమవుతున్నాయి. ఏదో మొక్కుబడి సందర్శన తప్ప గర్భిణిగా ఉన్నామె పరిస్థితి ఎలా ఉన్నదో, ఏం అవసరమో గ్రహించి...అవసరమైన సందర్భంలో వైద్యుల వద్దకు తీసుకెళ్లే బాధ్యతను స్వీకరించేవారు కొరవడుతున్నారు. ఈ నెట్‌వర్క్‌కు తోడు గ్రామాల్లో అంగన్వాడీలు కూడా ఉంటున్నాయి. ఈ రెండు వ్యవస్థల నిర్వహణా సక్రమంగా లేదని తాజా నివేదికను చూస్తే అర్ధమవుతుంది. గ్రామసీమల్లో ఆరోగ్య సంబంధమైన మౌలిక సదుపాయాలు పూర్తిగా కొరవడటమే ఈ స్థితికి కారణం. బడ్జెట్లలో ప్రజారోగ్యానికి అవసరమైన ప్రాధాన్యత ఇప్పటికీ ఇవ్వడంలేదు. గ్రామసీమల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు, వాటికి అవసరమైన మౌలిక సదుపాయాల విషయంలో ఇప్పటికీ వెనకబడే ఉన్నాం. ముఖ్యంగా వైద్యుల కొరత చాలా ఎక్కువగా ఉంది. ఇదంతా మహిళల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. సాధారణంగా మహిళలు తమ తిండితిప్పలపైనా, ఆరోగ్యంపైనా శ్రద్ధపెట్టరు. వేళకు ఇంత తిన్నాం కదా చాలనుకుంటారు. గర్భస్థ శిశువుకు అవసరమైన పోషకాహారం అందజేయగలుగు తున్నామా... రక్తహీనత రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామా అని ఆలోచించరు. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న కుటుంబాలకైతే అలాంటివి సాధ్యమే కాదు. ఇక సుదూర ప్రాంతంలో ఉండే ఆస్పత్రికి వెళ్లి పురుడుపోసుకునే పరిస్థితే ఉండదు. ఫలితంగా ప్రసూతి మరణాలు, అర్భక శిశు జననాలు ఎక్కువవుతున్నాయి. పురిట్లోనే కన్నుమూసే శిశువులకు తోడు చాలామంది శిశువులు చాలా తక్కువ బరువుతో పుడుతున్నారు. రిజిస్ట్రార్ జనరల్ నివేదికతోపాటే ప్రసూతి మరణాల రేటును మరింత తగ్గించేందుకు కృషి చేయమని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం లేఖలు రాసింది. 2017 నాటికల్లా ఇవి వందకు మించకుండా చూడాలని కోరింది. కానీ, ఇలా లేఖలు రాసి సరిపెట్టుకుంటే పనికాదని రిజిస్ట్రార్ గణాంకాలు చూస్తే అర్ధమవుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో సగటున ప్రసూతి మరణాల సంఖ్య 105 ఉంటే... బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అది 257గా నమోదైంది. అయితే, 2007-09 మధ్య ఇది 308గా ఉన్నది కనుక మందకొడిగా అయినా ఈ రాష్ట్రాల్లో పరిస్థితి మెరుగవుతున్నదని భావించాలి. దక్షిణాది రాష్ట్రాలమధ్య పోల్చిచూసినా ఈ తారతమ్యాలు ఎక్కువగానే ఉన్నాయి. కేరళ, మహారాష్ట్రల్లో ప్రసూతి మరణాలను 87కి తీసుకురాగలిగితే తమిళనాడు 90తో తర్వాతి స్థానంలో ఉంది. మన రాష్ట్రంలో ప్రసూతి మరణాల సంఖ్య 110. కర్ణాటకలో ఇది 144గా ఉంది. ప్రపంచదేశాల్లో సింగపూర్ (3), స్వీడన్ (4), నార్వే (7), అమెరికా (21) వంటి దేశాలను చూస్తే మనం ఆ స్థాయికి చేరడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందో ఊహకే అందదు. మన పొరుగునున్న నేపాల్, బంగ్లాదేశ్ కూడా మనతో పోలిస్తే గర్భిణులు, బాలింతల విషయంలో అత్యంత శ్రద్ధ కనబరుస్తున్నాయి. వాటిని చూసైనా మనం మరింత శ్రద్ధ కనబరచాలి. ముఖ్యంగా పల్లెసీమల్లో ఉపాధి అవకాశాలను పెంచి, పేదరిక నిర్మూలనకు అవసరమైన పథకాలను సమర్థవంతంగా అమలుచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. తాజా గణాంకాల నేపథ్యంలోనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ కార్యాచరణ ప్రణాళికలను సవరించుకోవాల్సి ఉంది. అప్పుడే మాతాశిశు సంరక్షణ పూర్తిస్థాయిలో సాధ్యమవుతుంది.