సాక్షి, హైదరాబాద్: పుట్టబోయే బిడ్డ... మధుమేహం, గుండె సంబంధ వ్యాధులకు దూరంగా ఉండాలనుకుంటున్నారా? అయితే గర్భిణిగా ఉన్నప్పుడే మీరు కొంచెం జాగ్రత్త పడటం మంచిదంటున్నారు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు. భారతీయ మహిళల రక్తంలో హోమోసిస్టైన్ అనే అమినోయాసిడ్ల మోతాదు ఎక్కువగా ఉండటంవల్ల పిల్లలు తక్కువ బరువుతో పుట్టడమే కాకుండా... పెరిగి పెద్దయ్యాక మధుమేహం, గుండెజబ్బుల బారిన పడే అవకాశం ఉంటుందని తమ పరిశోధనల ద్వారా తెలిసిందని సీసీఎంబీ శాస్త్రవేత్త గిరిరాజ్ చందక్ తెలిపారు. రక్తంలో హోమోసిస్టైన్ల మోతాదు ఎక్కువగా ఉన్న వారికి గుండెజబ్బులు వచ్చే అవకాశముందని ఇప్పటికే దాదాపుగా రుజువైందని, అయితే ఈ అమినోయాసిడ్‌కు... నవజాత శిశువులు తక్కువ బరువుతో ఉండేందుకు సంబంధం ఉన్నట్లు తాము గుర్తించామని ఆయన మంగళవారం సీసీఎంబీ ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. శాకాహారం తీసుకునే వారు ఎక్కువగా ఉండటం.. మాంసాహారం తీసుకునే వారు తక్కువగానే మాంసం ఉత్పత్తులను తీసుకుంటూండటంవల్ల దేశంలోని చాలామందిలో మరీ ముఖ్యంగా మహిళల్లో బీ12 విటమిన్ లోపం కనిపిస్తోందని, ఫలితంగా దాదాపు సగం మంది పిల్లలు తక్కువ బరువుతో జన్మిస్తున్నారని ఆయన చెప్పారు. శరీర నాడీవ్యవస్థ, మెదడు సవ్యంగా పనిచేసే విషయంలో, రక్తం తయారయ్యే అంశంలోనూ ఈ విటమిన్ కీలకపాత్ర పోషిస్తుందన్నది తెలిసిందే. బీ12 విటమిన్ తక్కువైతే రక్తంలోని హోమోసిస్టైన్ మోతాదు ఎక్కువ అవుతుంది. ఎంటీహెచ్‌ఎఫ్‌ఆర్ అనే ఎంజైమ్‌లోని జన్యులోపం దీనికి కారణం. ఈ జన్యులోపంవల్ల హోమోసిస్టైన్‌ను మరో రసాయనంగా మార్చే వ్యవస్థ (1-సీ మెటబాలిజం) సక్రమంగా పనిచేయదు. ఈ విషయాన్ని తాము పరిశోధనల ద్వారా గుర్తించినట్లు చందక్ వివరించారు. ఈ నేపథ్యంలోనే గర్భిణులకు ఫోలిక్ యాసిడ్‌తోపాటు బీ12 విటమిన్‌లను కూడా అందించడం మేలని తాము సూచిస్తున్నామని చెప్పారు.
సౌష్టవ నిర్మాణం కిటుకూ అర్థమైంది...
అన్ని రకాల జంతువులు, చెట్ల నిర్మాణం సౌష్టవంగా ఉండటం మనం గమనించే ఉంటాం. ఈ నిర్మాణానికి శరీరంలోని హోక్స్ (హెచ్‌ఓఎక్స్) జన్యువులు కారణమని కూడా తెలుసు. శరీరంలో తల నుంచి కాలివరకూ వేర్వేరు ప్రాంతాల్లో ఉండే ఈ జన్యువులు ఆయా ప్రాంతాల్లోని అవయవాలు ఏర్పడేందుకు, ఎదిగేందుకు సాయపడతాయి. ఈ జన్యువులు ఈ ఒక్క విధినే నిర్వర్తిస్తాయని నిన్నమొన్నటివరకూ అనుకుంటూండగా, ఇవి మరికొన్ని అదనపు పనులు కూడా చేస్తాయని సీసీఎంబీ శాస్త్రవేత్త రాకేశ్ మిశ్రా జరిపిన పరిశోధనల ద్వారా తెలిసింది. ఈ పరిశోధన ఫలితాలు వేర్వేరు జీవుల శరీర నిర్మాణాన్ని మరింత మెరుగ్గా అర్థం చేసుకునేందుకు ఉపయోగపడతాయని రాకేశ్ మిశ్రా తెలిపారు. ముఖ్యంగా కొన్ని రకాల కేన్సర్లలో హోక్స్ జన్యువుల్లో కొన్ని కొంచెం తేడాగా వ్యవహరించడానికి కారణమేమిటన్నది కూడా తెలుసుకునే వీలవుతుందని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా శాస్త్ర, పరిశోధన రంగాల్లో సీసీఎంబీ సామర్థ్యం గణనీయంగా పడిపోయిందన్న కొన్ని వార్తా కథనాలను సంస్థ డెరైక్టర్ డాక్టర్ మోహన్‌రావు ఖండించారు. ప్రచురితమైన పరిశోధనలు, వాటి ప్రభావం వంటి అంశాలను వేటిని పరిగణనలోకి తీసుకున్నా సామర్థ్యం ఏటికేడాది పెరుగుతూనే ఉందని ఆయన గణాంకాలతో వివరించారు.
గర్భిణుల్లో బీ12 లోపాన్ని సవరిస్తే... పుట్టే బిడ్డకు మధుమేహం రాదు!
Published Wed, Oct 29 2014 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 3:30 PM
Advertisement