ఘోషాస్పత్రికి చికిత్స కోసం వచ్చిన గర్భిణులు
విజయనగరం ఫోర్ట్ : ప్రస్తుతం సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎండలు మండి పోతున్నాయి. ఇలాంటి సమయంలో గర్భిణులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. తినే ఆహారం నుంచి, నిద్ర, వస్త్రదారణ తదితర విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని పేర్కొంటున్నారు.
తినకూడని పదార్థాలు..
బొప్పాయి, పైనాపిల్, చేపలు, సరిగా ఉడకని మాంసం, జున్ను తింటే అబార్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువ. మద్యం కూడా తీసుకోరాదు.
ఒత్తిడి తగ్గించుకోవాలి..
ఒత్తిడి తగ్గించుకోవాలంటే గర్భిణులు రోజూ వ్యాయామం చేయాలి. దాని వల్ల శరీరంలో ఎండాసెన్స్ విడుదలై ఒత్తిడి తగ్గుతుంది. శ్వాస వ్యాయామం వల్ల నరాలు, కండరాల బడలిక తగ్గుతుంది.
చింతపండుతో ప్రయోజనం..
ఔషధ గుణాలు ఉన్న చింతకాయలు గర్భిణుల్లో కలిగే వికారాన్ని, వాంతులను, ఉదయపు అలసటను తగ్గించడమే కాకుండా, మలబద్ధకం లేకుండా రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది.
గ్యాస్ట్రిక్ తగ్గించే పద్ధతులు..
నీరు అధికంగా తాగాలి. రోజూ 30 నిమిషాల సేపు వ్యాయామం, వాకింగ్ చేయాలి. దీనివల్ల మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు. మొలకెత్తిన విత్తనాలు, బంగాళ దుం వంటి పందార్థాలు తినడం వల్ల కూడా గ్యాస్ సమస్యలు పెరిగే అవకాశం ఉంది.
మందులతో జాగ్రత్త..
గర్భిణులు డాక్టర్లను సంప్రదించకుండా ఏ మందులు తీసుకోరాదు. అలా చేస్తే పుట్టబోయే బిడ్డకు ప్రమాదం వాటిళ్లుతుంది. యాంటి బయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, ముక్కుద్వారా పీల్చే డ్రాప్స్ వంటి మందులు వాడకూడదు.
దుస్తులు...
వదులుగా ఉండే పరిశుభ్రమైన కాటన్ దుస్తులు ధరించాలి. లేత రంగు దుస్తులు వేసుకుంటే మంచిది. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు తప్పనిసరిగా వాడాలి.
డాక్టర్‌ను సంప్రదించే సమయాలు..
ప్రతీ నెలా రెగ్యులర్‌గా చెకప్‌కు వెళ్లాలి. వైద్యుడు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడాలి. నీరసంగా ఉండడం, ఆలసిపోవడం, చెమట పట్టడం, జ్వరం ఉన్నట్లు అనిపించడం, వాంతుల రావడం, కళ్లు తిరిగినట్టు అనిపిస్తే వైద్యుడి దగ్గరకు వెళ్లాలి.
Comments
Please login to add a commentAdd a comment