ప్రతీకాత్మక చిత్రం
అశ్వాపురం: మిషన్ ఇంద్రధనుస్సు అనే కార్యక్రమం ద్వారా చిన్నారులు, గర్భిణులకు టీకాలు వేసే కార్యక్రమానికి వైద్య, ఆరోగ్య శాఖ అంతా సిద్ధం చేసింది. ఈరోజు (సోమవారం) నుంచి ఈ నెల 26వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి రెండేళ్ల లోపు చిన్నారులకు టీకాలు వేస్తారు. అలాగే గర్భిణులకు వ్యాధి నిరోధక టీకాలు వేయనున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల నివారణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం గ్రామస్వరాజ్ అభియాన్‌లో భాగంగా ఈ ఇంద్ర ధనుస్సు కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రతి బుధవారం, శనివారం ఇమ్యూనైజేషన్ కార్యక్రమం నిర్వహించి చిన్నారులు, గర్భిణులకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నారు. అవి వేయించుకోని వారికి, మధ్యలో ఆపివేసిన వారికి టీకాలు వేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మిషన్ ఇంద్రధనుస్సులో ఏడు వ్యాధులకు ఏడు రోజుల పాటు ఏడు రకాల టీకాలు వేయనున్నారు.
జిల్లాలో నేటి నుంచి వారం రోజుల పాటు చేపట్టే ఈ కార్యక్రమానికి డీఎంహెచ్‌ఓ డాక్టర్ దయానందస్వామి నేతృత్వంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. 23 పీహెచ్‌సీల పరిధిలో వ్యాక్సిన్లు సిద్ధం చేశారు. మిషన్ ఇంద్రధనుస్సు విజయవంతానికి జిల్లా స్థాయిలో శనివారమే టాస్క్‌ఫోర్స్ సమావేశం కూడా నిర్వహించారు.
1,498 మంది చిన్నారులు, 404 మంది గర్భిణులు..
మిషన్ ఇంద్రధనుస్సులో చిన్నారులు, గర్భిణులకు టీకాలు వేసేందుకు జిల్లాలోని 23 మండలాల్లో 29 పీహెచ్‌సీల పరిధిలో 205 గ్రామపంచాయతీల్లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోని వారిని, టీకాలు వేయించుకుంటూ మధ్యలో ఆపివేసిన చిన్నారులు 1,498 మంది ఉన్నట్లు నిర్ధారించారు. 404 మంది గర్భిణులకు టీకాలు వేయాల్సి ఉంటుందని తేల్చారు.
మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమంలో భాగంగా జిల్లా లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో టీకాలు వేయనున్నారు. జిల్లాలో వలస గిరిజనులు అధికంగా ఉన్న మారుమూల గ్రామాలు, సమస్యాత్మక ప్రాంతాలు, ఇటుకబట్టీల వద్దకు ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు వెళ్లి చిన్నారులు, గర్భిణులకు టీకాలు వేస్తారు. వివిధ కారణాలతో ఈ విడతలో టీకాలు వేయించుకొని వారికి మరో రెండు విడతల్లో ఆగస్టు 16, సెప్టెంబర్ 16 నుంచి వారం రోజుల పాటు మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమం నిర్వహించనున్నారు.
వేసే టీకాలు ఇవే..
గర్భిణులకు ధనుర్వాతం వ్యాధి రాకుండా టీటీ. అప్పుడే పుట్టిన చిన్నారి నుంచి రెండేళ్ల లోపు చిన్నారులకు పోలియో, కామెర్లు, తట్టు, రుబెల్లా, మెదడువాపు, క్షయ, దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు బీసీజీ టీకాలు వేస్తారు. హెపటైటీస్–బీ, పోలియో, పెంటావాలెంట్, జేఈ, విటమిన్–ఏ టీకాలను వారం రోజుల పాటు వేస్తారు.
ఏర్పాట్లు పూర్తి చేశాం..
జిల్లాలోని అన్ని గ్రామాల్లో నేటి నుంచి ఈ నెల 26 వరకు మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. అన్ని పీహెచ్‌సీల పరి«ధిలో వ్యాక్సిన్లు ఉంచాం. జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. ప్రోగ్రాం పర్యవేక్షణకు ఒక్కో రూట్‌కు ప్రోగ్రాం ఆఫీసర్‌ను ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర స్థాయి కన్సల్టెంట్లు ప్రోగ్రాంను పరిశీలిస్తారు. లోతట్టు పల్లెలకు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు తెలిపాం. మొబైల్ వాహనం వినియోగంలోకి రానుంది.
– డాక్టర్ నరేష్ కుమార్, జిల్లా ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాం అధికారి
Comments
Please login to add a commentAdd a comment