దాని శాతం ఎంత ఉండాలి? | Pregnant Health Tips Article In Sakshi | Sakshi
Sakshi News home page

దాని శాతం ఎంత ఉండాలి?

Published Sun, Jun 23 2019 10:52 AM | Last Updated on Sun, Jun 23 2019 10:52 AM

Pregnant Health Tips Article In Sakshi

నా వయసు 28 సంవత్సరాలు. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్‌. రక్తంలో గ్లూకోజు మోతాదు ఎక్కువగా ఉంటే పిండంలో అవయవ నిర్మాణం దెబ్బతినే అవకాశాలు ఉంటాయని చదివాను. అసలు రక్తంలో గ్లూకోజు మోతాదు ఎందుకు ఎక్కువ అవుతుంది? పెరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయగలరు.– కె.ఆమని, నర్మెట్ట

సాధారణంగా తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్‌ జీర్ణమై అనేక రకాల హార్మోన్లు, ఎంజైమ్‌ల ప్రభావం వల్ల అవి గ్లూకోజ్‌గా మారి రక్తంలోకి చేరుతుంది. సాధారణంగా పాంక్రియాస్‌ గ్రంథి నుంచి విడుదలయ్యే ఇన్సులిన్‌ హార్మోన్‌ రక్తంలో చేరిన గ్లూకోజ్‌ను శక్తిగా మార్చి శరీరంలోని అన్ని కణాలకు అందేలా చేస్తుంది. ఎక్కువగా ఉన్న సుగర్‌ను లివర్‌లో, కండరాల్లో భద్రపరుస్తుంది. శరీరంలో సుగర్‌ తక్కువగా ఉన్నప్పుడు భద్రపరచిన సుగర్‌ను వాడుకునేలా ఉపయోగపడుతుంది. పాంక్రియాస్‌లో సమస్యల వల్ల ఇన్సులిన్‌ తక్కువగా విడుదల కావడం లేదా ఇన్సులిన్‌ పనితీరు మందగించడం వంటి సమస్యలు ఏర్పడటం వల్ల గ్లూకోజ్‌ మెటబాలిజం సరిగా లేకపోవడం వల్ల రక్తంలో సుగర్‌ పెరుగుతుంది. దీనిని మధుమేహం లేదా డయాబెటిస్‌ అంటారు. డయాబెటిస్‌ ఉన్నవాళ్లు గర్భం దాల్చినప్పుడు సుగర్‌ శాతం ఎక్కువ ఉండి, మొదటి మూడు నెలల్లో సుగర్‌ నియంత్రణలో లేకపోతే బిడ్డలో అవయవ లోపాలు ఏర్పడే అవకాశాలు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిలో మెదడు, వెన్నుపూస, కిడ్నీలు, గుండె, జీర్ణాశయం వంటి అవయవాలకు సంబంధించిన లోపాలు ఎక్కువగా ఉంటాయి.

కొంతమందిలో డయాబెటిస్‌ ఉందని తెలియకుండానే, గర్భం దాలుస్తారు. వీరిలో కూడా ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గ్లూకోజ్‌ మోతాదు పెరగకుండా ఉండటానికి బరువు నియంత్రణలో ఉంచుకోవాలి. దీనికి తగిన వ్యాయామాలు, ఆహార నియమాలు పాటించవలసి ఉంటుంది. ఒకవేళ సుగర్‌ వ్యాధి ఉందని నిర్ధారణ అయితే ఆహార నియమాలు, వ్యాయామాలతో పాటు డాక్టర్‌ పర్యవేక్షణలో సుగర్‌ను అదుపులో ఉంచుకోవడానికి మందులు, అవసరమైతే ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌లు తీసుకుంటే బిడ్డలో అవయవ లోపాలు ఏర్పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కొందరిలో గర్భం దాల్చిన తర్వాత కొన్ని హార్మోన్స్‌ ప్రభావం వల్ల అధిక బరువు పెరగడం, కుటుంబంలో సుగర్‌ ఉన్నట్లయితే, ఐదో నెల తర్వాత రక్తంలో సుగర్‌ పెరిగి జెస్టేషనల్‌ డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇలాంటి వాళ్లలో బిడ్డలో అవయవ లోపాలు ఏర్పడే అవకాశాలు ఉండవు. ఎందుకంటే వీరిలో ఐదో నెల లోపే అవయవ నిర్మాణం అయిపోతుంది. తర్వాత అవయవాలు పరిణామం చెందుతూ ఉంటాయి.

మా బంధువుల్లో ఒకరికి యుటెరైన్‌ ప్రొలాప్స్‌ సమస్య వచ్చింది. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీనికి ఏ రకమైన చికిత్స పద్ధతులు అందుబాటులో ఉన్నాయి?
– ఆర్‌.ప్రీతి, రాజమండ్రి

పొత్తి కడుపులో గర్భాశయం అనేక లిగమెంట్లు, కండరాల ఆధారం ద్వారా వెన్నుపూసకి, పెల్విక్‌ ఎముకలకు అతుక్కుని ఉంటుంది. ఈ లిగమెంట్లు, పెల్విక్‌ కండరాలు బలహీనపడినప్పుడు అవి సాగడం వల్ల గర్భాశయానికి ఈ సపోర్ట్‌ తగ్గిపోయి పొత్తి కడుపులో నుంచి జారి యోని భాగంలో కిందకి, అలాగే యోని భాగం నుంచి బయటకు జారుతుంది. దీనినే యుటెరైన్‌ ప్రొలాప్స్‌ అంటారు. ఇది ఏ వయసులోనైనా రావచ్చు. ఎక్కువ సాధారణ కాన్పులు అయ్యేవారిలో, సాధారణ కాన్పు సమయంలో ఇబ్బందులు, ఎక్కువ సేపు క్లిష్టమైన కాన్పు కోసం ఎదురు చూసినప్పుడు, సాధారణ కాన్పు ద్వారా అధిక బరువు బిడ్డలను ప్రసవించినప్పుడు, దీర్ఘకాలం మలబద్ధకం, దగ్గు, అధిక బరువులు లేపడం, అధిక బరువు వల్ల, గర్భాశయం మీద ఒత్తిడి వల్ల, కండరాల బలహీనత వల్ల, మెనోపాజ్‌ దశలో ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ తగ్గిపోవడం వంటి అనేక కారణాల వల్ల గర్భాశయం జారడం (యుటెరైన్‌ ప్రొలాప్స్‌) జరగవచ్చు.

దీని నివారణ అంతా మన చేతిలో ఉండదు. కాకపోతే గర్భాశయం ఇంకా పూర్తిగా యోని బయటకు రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. పెల్విక్‌ కండరాలు బలపడటానికి కీగల్స్‌ వ్యాయామాలు, అధిక బరువు పెరగకుండా ఉండటం, బరువు తగ్గడం, మలబద్ధకం లేకుండా చూసుకోవడం, దీర్ఘకాలంగా దగ్గు ఉంటే దానికి తగిన చికిత్స తీసుకోవడం, అవసరమైతే ఈస్ట్రోజెన్‌ చికిత్స తీసుకోవడం, డాక్టర్‌ను సంప్రదించి వారి సలహాలను, సూచనలను పాటించడం మంచిది. ఈ జాగ్రత్తలు తీసుకున్నా, గర్భాశయం బాగా జారిపోయినప్పుడు వారి వయసు బట్టి, సమస్యను బట్టి కొందరిలో ఆపరేషన్‌ ద్వారా గర్భాశయాన్ని పొత్తికడుపులోకి లాగి కుట్టడం లేదా గర్భాశయాన్ని తొలగించడం జరుగుతుంది. కొందరిలో ఆపరేషన్‌ చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు వెజైనల్‌ పెసరీస్‌ అంటే రింగు వంటి పరికరాలను యోనిభాగంలో అడ్డు పెట్టడం వల్ల గర్భాశయం బయటకు రాకుండా చూసుకోవచ్చు.

ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు హై–ఫైబర్‌ డైట్‌ తీసుకుంటే పిల్లల్లో ఛ్ఛి జ్చీఛి ఛీజీట్ఛ్చట్ఛ రిస్క్‌ తక్కువగా ఉంటుందని ఒక టీవి కార్యక్రమంలో విన్నాను. దీని గురించి కాస్త వివరంగా తెలియజేయగలరు.– బి.చందన, హైదరాబాద్‌

కొన్ని రకాల ఆహార పదార్థాలలో ఉండే ‘గ్లూటెన్‌’ అనే ప్రొటీన్‌ కొందరి శరీరానికి సరిపడదు. దాని వల్ల పేగులలో మార్పులు జరిగి, పేగులు వాచి, దెబ్బతినడం జరుగుతుంది. దీనివల్ల తినే ఆహార పదార్థాల్లోని పోషకాలు రక్తంలోకి చేరవు. దీనినే ‘సీలియాక్‌ డిసీజ్‌’ అంటారు. ఇది ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌. ఇది కొందరిలో జన్యువుల్లోని మార్పుల వల్ల ఏర్పడవచ్చు. గ్లూటెన్‌ ఎక్కువగా ఉండే గోధుమలు, బార్లీ వంటి వాటితో చేసిన పదార్థాలు తీసుకున్నప్పుడు కొందరిలో ఈ పరిస్థితి తలెత్తవచ్చు. గ్లూటెన్‌ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకున్నప్పుడు ఈ పరిస్థితి ఉన్న వారిలో వాంతులు, గ్యాస్, పొట్ట ఉబ్బరం, డయేరియా వంటి అనేక లక్షణాలు ఏర్పడతాయి. దీర్ఘకాలంలో పిల్లలు బరువు పెరగకపోవడం, పెరుగుదలలో లోపాలు వంటి అనేక సమస్యలు ఏర్పడవచ్చు. దీనికి చికిత్స లేదు. గ్లూటెన్‌ ఉన్న పదార్థాలను తీసుకోకుండా ఉండటమే మార్గం. ఇటీవల చేసిన ఒక అధ్యయనంలో తల్లి గర్భిణిగా ఉన్నప్పుడు ఫైబర్‌ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే, ఆ తల్లికి పుట్టే బిడ్డల్లో ‘సీలియాక్‌ డిసీజ్‌’ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. తల్లి కనీసం రోజుకు 25 గ్రాముల ఫైబర్‌ తీసుకోవడం మంచిది. ఇందులో ఎక్కువగా ఆకుకూరలు కూరగాయలు, పండ్లు తీసుకోవడం మంచిది. తల్లి ఫైబర్‌ డైట్‌ తీసుకుంటూ ఉన్నట్లయితే, బిడ్డకు సీలియాక్‌ డిసీజ్‌ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఒక అంచనా.

డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్‌ బై రెయిన్‌బోహైదర్‌నగర్‌హైదరాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement