helth problem
-
ఆరోగ్యంతో పాటు ఆనందం
ఆరోగ్యం కోసం వెళితే మీకు ఆనందం బోనస్...ఇది ఇప్పుడు నగరంలోని న్యూట్రిషన్ సెంటర్లలో నయా ట్రెండ్. బరువు తగ్గడం కోసం మీరు న్యూట్రిషన్ సెంటర్‌కు వెళితే బరువు తగ్గి, దీర్ఘ వ్యాధుల నుంచి ఉపశమనం లభించి ఆరోగ్యం సిద్ధిస్తుంది. దీనితో పాటు బోనస్‌గా అక్కడ ఏర్పడే కొత్త కమ్యూనిటీలతో పరిచయాలు, బర్త్ డేలు ఇతర శుభకార్యాలు సెంటర్ల నిర్వాహకులు ఘనంగా జరుపుతారు. ఇళ్లలో కాకుండా ఈ సెంటర్లలోనే వేడుకలు జరుపుకోవడంతో మైక్రో ఫ్యామిలీలతో ఒంటరితనం ఫీలవుతున్న నగర ప్రజలకు ఈ కొత్త ట్రెండ్ సరికొత్త ఆనందాన్నిస్తోంది. దీంతో నగరంలో వీటికి నానాటికీ డిమాండ్ పెరుగుతోంది. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఎన్ని ప్రయత్నాలు చేసినా శరీరంలో అదనపు బరువు తగ్గడం లేదా..అయితే మా న్యూట్రిషన్ సెంటర్‌కు ఒక సారి విజిట్ చేయండి. మేమిచ్చే షేక్ తీసుకోండి నెల రోజుల్లో బరువు తగ్గడం ఖాయం.. అంటూ న్యూట్రిషన్స్ సెంటర్లు భరోసా ఇస్తూ శరీరంలోని అదనపు బరువును తగ్గించేస్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారితో పాటుగా బరువు పెరగాలనుకునే వారు ఇప్పుడు ఈ విధమైన న్యూట్రిషన్స్ సెంటర్ల మెట్లు ఎక్కుతున్నారు. ఒక్క విజయవాడ నగరంలోనే ప్రస్తుతం సుమారు 150కు పైగా న్యూట్రిషన్స్ సెంటర్లు ఉండడం గమనార్హం. నిత్యం ఒక్కొక్క సెంటర్‌కు సుమారు 50 మందికి పైగా వెళుతున్నారు. ప్రతి వారం బరువు చెకింగ్.. కరోనా వైరస్ పుణ్యమా అని మనం నిత్యం తీసుకునే ఆహార పదార్ధంలో ఏ పోషకాలు ఎంత ఉన్నాయి, శరీరంలో రోగనిరోధక శక్తి పెరగాలంటే ఏమి తినాలి, ప్రోటీన్స్, విటమిన్స్‌పై అందరికీ కొంత అవగాహన వచ్చింది. న్యూట్రిషన్ సెంటర్‌కు వచ్చే వారందరికీ సెంటర్ల నిర్వాహకులు ఫాలోఅప్ చేస్తుంటారు. ఎంత పరిమాణంలో ఏమి ఆహారం తీసుకున్నారు, వ్యాయామం చేశారా లేదా అనే అంశాలను అడిగి తెలుసుకుని వారికి తగినట్లుగా సూచనలు చేస్తుండడం, ప్రతి వారం శరీరంలో బరువును చెక్ చేసి మరిన్ని సూచనలు చేయడంతో బరువు తగ్గుతున్నామని సెంటర్లకు వెళుతున్న వారు చెబుతున్నారు. ► న్యూటిషన్ సెంటర్‌కు వెళ్లగానే వివరాలు నమోదు చేసుకుని శరీరంలోని బరువుతో పాటుగా మజిల్, కొవ్వు శాతాన్ని పరీక్షిస్తారు. కొవ్వు శాతం ఎంత ఉండాలి..మన శరీరంలో ఎంత ఉంది అనే వాటి గురించి సెంటర్ల నిర్వాహకులు విపులంగా వివరిస్తారు. ఆ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత షేక్ (జ్యూస్ మాదిరిగా ఉంటుంది) ఇస్తారు. ఇది తాగితే చాలు నెలకు 3 నుంచి 5 కేజీల అదనపు బరువును (బరువు తగ్గాలనుకున్న వారి ప్రయత్నం, శరీర తత్వం, న్యూట్రిషన్ సెంటర్ వారు సూచించిన ఆహార నియమాలు పాటిస్తే ) తప్పకుండా తగ్గుతారని సెంటర్ నిర్వాహకులు చెబుతారు. శరీరంలోని అధిక బరువు తగ్గడంతో కొన్ని దీర్ఘ కాలిక వ్యాధులు కూడా తగ్గుతున్నాయని న్యూట్రిషన్ సెంటర్లకు వెళ్లి బరువు తగ్గిన వారు చెబుతున్నారు. కొత్త కమ్యూనిటీతో సరికొత్త ఆనందం సంతోషమే సగం బలం అన్న పెద్దల నానుడి ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఈ న్యూట్రిషన్ సెంటర్లకు వచ్చే వారంతా ఒక కొత్త కమ్యూనిటీ మాదిరిగా ఏర్పడుతున్నారు. ఈ సెంటర్లకు వచ్చే వారి పెళ్లి, పుట్టిన రోజు వేడుకలను సెంటర్ల ఆవరణలోనే నిర్వాహకులు నిర్వహిస్తుంటారు. ఇవే కాకుండా పండుగల రోజున న్యూట్రిషన్ సెంటర్లను అందంగా ముస్తాబు చేసి, ప్రత్యేకంగా ఫన్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారు. నెలలో ఒక రోజు కలర్స్ డే పేరుతో ఒక రంగును నిర్ణయించి ఆ రోజు న్యూట్రిషన్ సెంటర్‌కు వచ్చే వారందరూ ఆ రంగు దుస్తులు ధరించి వస్తారు. వారికి ఆటలు, పాటలు, నృత్యాలతో ఆ రోజంతా హుషారుగా గడుపుతున్నారు. ఇంట్లో ఒక్కరిద్దరితో ఉండే మైక్రో ఫ్యామిలీల కన్నా న్యూట్రిషన్ సెంటర్లల్లో అయితే పదుల సంఖ్యలో కొత్త స్నేహితులు ఉండటంతో చాలా మంది పండుగలు, పెళ్లి, పుట్టిన రోజు వేడుకలను న్యూట్రిషన్ సెంటర్లలోనే జరుపుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆరోగ్యం కోసం న్యూట్రిషన్ సెంటర్లో అడుగు పెడితే ఆరోగ్యంతో పాటు ఇటువంటి ఆనందాలు కూడా తోడవడంతో న్యూట్రిషన్ సెంటర్లకు డిమాండ్ పెరుగుతోంది. -
World Alzheimers Day: తెలియదు.. గుర్తు లేదు.. మర్చిపోయా అంటున్నారా..
గుంటూరు: ఇంటి నుంచి బయలుదేరిన వ్యక్తి కొంతదూరం వెళ్లాక ఇంటి అడ్రస్ మర్చిపోవటం, తన పేరు కూడా రోగి మర్చిపోయే స్థితికి చేరుకోవటం ఈ జబ్బు లక్షణం. ఆరోగ్య సంస్థల నివేదిక ప్రకారం ప్రతి ఏడు సెకన్లకు ఒకరు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. సుమారు 8.8 మిలియన్ల మంది వ్యాధితో బాధపడుతున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. జబ్బు సోకిన వారికి సహాయకులుగా ఉండేవారికి అవగాహన కల్పించటం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ 1994 నుంచి ఏటా సెప్టెంబర్ 21న అల్జీమర్స్ డే నిర్వహిస్తోంది. ప్రతిరోజూ 50 మందికి వైద్యం.. అల్జీమర్స్ వ్యాధికి చికిత్స కోసం జిల్లా వ్యాప్తంగా ఉన్న 30 మంది మానసిక వైద్యనిపుణులు, 15 మంది న్యూరాలజిస్టులను రోగుల సహాయకులు సంప్రదిస్తున్నారు. ప్రతిరోజూ న్యూరాలజిస్టులు, మానసిక వ్యాధి నిపుణుల వద్ద సుమారు 50 మంది వరకు అల్జీమర్స్ వ్యాధి బాధితులు చికిత్స పొందుతున్నట్లు అంచనా. రోజువారి పనులు మరిచిపోతారు వ్యాధి గ్రస్తులు రోజు వారి కార్యక్రమాలు మర్చిపోతారు. స్నానం చేయటం, బ్రష్ చేయటం, తిండి తినటం కూడా మర్చిపోతారు. వస్తువులను ఎక్కడో పెట్టి ఆ విషయాన్ని మర్చిపోయి ఎవరో దొంగిలించినట్లుగా అనుమానించటం, చెప్పిన విషయాన్నే పదే పదే చెప్పటం, వస్తువుల పేర్లు మర్చిపోవటం, వాటిని ఏ విధంగా వినియోగించాలో, ఎందు నిమిత్తం వినియోగించాలో అనే అంశాలను మర్చిపోవటం రోగిలో కనిపిస్తాయి. ఇంటికి తాళాలు వేయటం, కూరలో ఉప్పు వేయటం, పాలల్లో తోడు వేయటం వంటివి మర్చిపోవటం వ్యాధి గ్రస్తుల్లో కనిపిస్తాయి. వయస్సు పెరుగుతున్న కొద్ది మతిమరుపు సహజం. దీనినే అల్జీమర్స్ వ్యాధి అంటారు. గతంలో విదేశాల్లో మాత్రమే ఈ మతిమరుపు వ్యాధిబారిన పడే వారిసంఖ్య అధికంగా ఉండేది. ప్రస్తుతం మన దేశంలో కూడా బాధితుల సంఖ్య పెరిగిపోయింది. వ్యాధి లక్షణాలు... వయసు పెరిగే కొద్ది వచ్చే అల్జీమర్స్ వ్యాధి సోకిన వారు తమ పేరు మర్చిపోతారు. ఒకేచోట కూర్చుని వీడియోగేమ్స్, టీవీలు చూస్తూ ఉండటం, అతిగా మద్యం తాగడం, శారీరక, మానసిక వ్యాయామం లేకపోవటం, అధిక కొవ్వు ఉన్న మాంసం తినటం వలన ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. బంధువుల, కుటుంబ సభ్యుల పేర్లు మర్చిపోతారు. పేర్లు మర్చిపోవటంతో పాటుగా వారిని గుర్తించటం కూడా కష్టమే. ఈ వ్యాధి ఎక్కువగా 60 సంవత్సరాలు దాటిన వారిలో వస్తోంది. నేడు 45 ఏళ్ల వారిలో కూడా వ్యాధి లక్షణాలు కనిపించటం ఆందోళన కలిగిస్తోంది. -
గుండెకు గండం
ఖమ్మం వైద్యవిభాగం: గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి భరోసా కల్పించేలా జిల్లా జనరల్ ఆస్పత్రిలో కార్డియాలజీ విభాగాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏడాదిన్నరగా మెరుగైన సేవలు అందుతుండడంతో దూరప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులు తీరాయి. అయితే, వారం రోజులుగా మాత్రం ఇక్కడ చికిత్సకు అంతరాయం ఏర్పడింది. శస్త్రచికిత్సలు నిలిచిపోవడంతో బాధితులు బెడ్ల మీదే ఉంటూ దీనంగా ఎదురుచూస్తున్నారు. త్వరగా తమకు శస్త్రచికిత్స నిర్వహించాలని వేడుకుంటున్నారు. అత్యాధునిక యంత్రాలు ఇతర ప్రాంతాలతో పోలిస్తే కొన్నేళ్లుగా ఖమ్మం జిల్లాలో గుండె జబ్బులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వైద్యం అందక ప్రైవేట్ దవాఖానాలకు వెళ్లి ఆర్థికంగా నష్టపోయేవారు. మరికొందరు నిరుపేదలు వైద్యం చేయించుకునే స్థోమత లేక తనువు చాలించేవారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం రెండేళ్ల క్రితం గుండె సంబంధిత బాధితుల కోసం కార్డియాలజీ విభాగాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. శస్త్రచికిత్సలు నిర్వహించడానికి రూ.7 కోట్ల విలువైన క్యాథల్యాబ్ మిషన్‌ను కేటా యించగా, గత ఏడాది జనవరిలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. తద్వారా ఎంతో ఖర్చుతో కూడిన చికిత్స ఉచితంగా అందుబాటులోకి రాగా, వందలాది మందికి శస్త్రచికిత్స చేశారు. కార్డియాలజీ విభాగంలో కరోనరీ యాంజియోగ్రామ్ శస్త్రచికిత్సతో పాటు, స్టంట్లు, బలూన్ యాంజియోప్లాస్టీ, రెనల్ యాంజియోగ్రామ్, రూట్ యాంజియోగ్రామ్, కారోటిడ్ యాంజియోగ్రామ్, పెరిపెరల్ యాంజియోగ్రామ్, బ్రాంకియల్ యాంజియోగ్రామ్, పెరీకార్డియో సెంటెసిస్ తదితర సేవలందిస్తున్నారు. బిల్లులు పేరుకుపోవడంతో... క్యాఽథల్యాబ్ యంత్రం ద్వారా చికిత్స చేయాలంటే కాంట్రాస్ట్ ఇంజక్షన్లు అవసరమవుతాయి. బాధితులకు శస్త్రచికిత్స చేసే ముందు ఈ ఇంజక్షన్ ఇచ్చి గుండె పనితీరు, ఎక్కడ ఏ సమస్య ఉంది, స్టంట్ ఎక్కడ వేయాలనే అంశాన్ని మానిటర్ ద్వారా తెలుసుకుంటారు. అనంతరమే శస్త్రచికిత్స చేయడానికి సిద్ధమవుతారు. కానీ కాంట్రాస్ట్ ఇంజక్షన్లు లేకపోవడంతో వారం రోజులుగా శస్త్రచికిత్సలు పూర్తిగా నిలిచిపోయాయి. హైదరాబాద్ గాందీ, నిమ్స్ తదితర ఆస్పత్రుల మాదిరిగానే ఈ ఇంజక్షన్లు ఇండెంట్ పెట్టి బయట నుంచి తెప్పిస్తారు. అయితే, సరఫరా చేసే ఏజెన్సీకి బిల్లులు పేరుకుపోవడం వారు నిలిపివేశారని తెలుస్తోంది. కారణాలు ఏమైనా శస్త్రచికిత్సలు నిలిచి గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు ఇక్కట్లు ఎదుర్కొంటుండగా... కొందరు చేసేదేం లేక బయటి ఆస్పత్రులకు వెళ్తున్నారు. మరికొందరు మాత్రం శస్త్రచికిత్స ఎప్పుడు చేస్తారా అని వేయి కళ్లతో ఎదురుచూస్తూ గడుపుతున్నారు. ఇంజక్షన్ వస్తేనే.. ఈయన పేరు సీహెచ్.నాగేశ్వరరావు. వయస్సు 38 ఏళ్లు మాత్రమే. ఐదు రోజుల క్రితం గుండె భాగంలో నొప్పి రావటంతో కూలబడగా ఆయన భార్య ప్రభుత్వ ఆస్పత్రి కార్డియాలజీ విభాగానికి తీసుకొచ్చింది. వైద్యులు పరీక్షించి గుండె సమస్య ఉన్నట్లు గుర్తించారు. ఇన్‌పేషంట్‌గా చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. కానీ సమస్య తీవ్రత తెలియాలన్నా, శస్త్రచికిత్స చేయాలన్నా కాంట్రాస్ట్ ఇంజక్షన్ అవసరం. అవి లేకపోవడంతో యాంజియోగ్రామ్ నిర్వహించకపోగా ఏమవుతుందోనన్న బెంగతో నాగేశ్వరరావు, ఆయన కుటుంబం ఎదురుచూస్తోంది. ఆ ఏర్పాట్లలోనే ఉన్నాం... కాంట్రాస్ట్ ఇంజక్షన్లు లేక శస్త్రచికిత్సలు నిలిచిన మాట వాస్తవమే. బయట నుండి తెప్పించాల్సి ఉంది. ఆ ఏర్పాట్లలోనే ఉన్నాం. అయితే, ఇన్పేషంట్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కార్డియాలజీ వైద్యుడి పర్యవేక్షణలో చికిత్స అందుతోంది. – బి.వెంకటేశ్వర్లు, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
కిడ్నీలను దెబ్బతీసే లూపస్.. రోగనిరోధక వ్యవస్థ వల్లే శరీరానికి హానీ!
సాధారణంగా మనలోని రోగనిరోధక వ్యవస్థ బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా, వైరస్‌లపై దాడి చేసి మన శరీరానికి రక్షణ కల్పిస్తాయి. కానీ ఆ రోగనిరోధక వ్యవస్థ వల్లే శరీరానికి హాని జరిగితే కలిగే ఇబ్బందినే ఆటో ఇమ్యూన్ వ్యాధులంటారు. ఇందులో ప్రధానమైనది లూపస్. దీనిని సిస్టమిక్ లూపస్ ఎరిథమాటోసస్(ఎల్ఎల్ఈ) అని కూడా పిలుస్తారు. ఈ నెల 10వ తేదిన వరల్డ్ లూపస్ డే సందర్భంగా ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కథనం. కర్నూలు(హాస్పిటల్): ఎస్‌ఎల్‌ఈ లేదా లూపస్‌ను తీవ్రమైన ఆటో ఇమ్యూన్ వ్యాధిగా వైద్యులు పేర్కొంటారు. ఈ వ్యాధి మనిషి శరీరంలోని ప్రతి అవయవాన్ని ప్రభావితం చేస్తుంది. చాలా వరకు అవగాహన లోపం కారణంగా సరైన సమయంలో గుర్తించకపోతున్నారు. సాధారణంగా సమాజంలో ప్రతి లక్షలో వంద మందికి ఈ వ్యాధి ఉంటుంది. జిల్లాలోని రుమటాలజిస్టులు, జనరల్ ఫిజీషియన్లు, నెఫ్రాలజిస్టుల వద్దకు ప్రతి నెలా 60 నుంచి 100 మంది దాకా ఈ వ్యాధి బాధితులు చికిత్స కోసం వస్తున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో దాదాపు 5వేల మంది దాకా లూపస్‌తో బాధపడుతున్నట్లు అంచనా. శరీరంలోని కణాలు, కణజాలంపై వ్యక్తి యొక్క సొంత రోగనిరోధక వ్యవస్థ దాడి చేసినప్పుడు లూపస్ వ్యాధి అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల గుండె, ఊపిరితిత్తులు, చర్మం, కీళ్లు, మూత్రపిండాలు, రక్తనాళాలు, మెదడు వంటి వివిధ అవయవాలు, శరీర వ్యవస్థకు హాని జరుగుతుంది. ఇది సిస్టమిక్ లూపస్ ఎరిథమాటోసస్, డిస్కోయిడ్ లూపస్, సబ్ అక్యూట్ క్యూటేనియస్ ల్యూపస్, డ్రగ్ ఇండ్యూసెడ్ లూపస్, నియోనెటాల్ లూపస్ అనే రకాలుగా ఉంటుంది. వ్యాధి లక్షణాలు లూపస్ అన్ని రకాల అవయవాలపై ప్రభావం చూపే వ్యాధి. ముందుగా చర్మం, అనంతరం కీళ్లలో మొదలుకావచ్చు. కొందరిలో కేవలం జ్వరం, నీరసం, ఆకలి తగ్గిపోవడం వంటివి కనిపిస్తాయి. ముఖ్యంగా ముక్కుపై, చెంపపై మచ్చలు సీతాకోకచిలుక ఆకారంలో ఎర్రని దద్దుర్లు కనిపిస్తాయి. దీంతో పాటు జుట్టురాలిపోవడం, కీళ్లనొప్పి, ఉదయం లేవగానే కండరాలు పట్టేయడం (30 నిమిషాల పాటు) వంటి సమస్యలుంటాయి. గాఢంగా శ్వాస తీసుకున్నప్పుడు ఛాతిలో నొప్పి, చేతి, కాలివేళ్లు గోధుమరంగు, ఊదా రంగులోకి మారిపోవడం, నోటిలో పుండ్లు వస్తాయి. సకాలంలో చికిత్స తీసుకోకపోతే...! ► ఈ వ్యాధిని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రాణాంతకం కాదు. ఒకవేళ సరిగా గుర్తించకపోవడం, మందులు సరిగా వాడకపోవడంతో శరీరంలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఉండి అనేక అవయవాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ► కిడ్నీ ఎఫెక్ట్ కావడం వల్ల మూత్రంలో ప్రొటీన్స్ ఎక్కువ మోతాదులో బయటకు వెళ్లిపోతాయి. ఆ తర్వాత కిడ్నీ మరింత తీవ్రంగా దెబ్బతింటుంది. ► మెదడు, నరాలు దెబ్బతినడంతో తలనొప్పి, చూపు దెబ్బతినడం, మానసిక వ్యాధులు, పక్షవాతం, మూర్ఛవ్యాధి లాంటివి కూడా లూపస్‌లో భాగంగా వచ్చే ప్రమాదం ఉంది. ► గుండెకండరాలు దెబ్బతిని కొన్నిసార్లు గుండెపోటు కూడా వచ్చే అవకాశం ఉంది. ► శరీరంలో రోగనిరోధకశక్తి బలహీన పడటంతో పలుమార్లు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. ► ఎముకల్లో రక్తసరఫరా సరిగా లేకపోవడంతో ఎముకల్లో కణాలు చనిపోయి సులభంగా ఎముకలు విరిగిపోతాయి. ► లూపస్ వ్యాధి ఉండే గర్భిణిల్లో అబార్షన్స్ ఎక్కువసార్లు అవుతాయి. మరికొందరిలో బీపీ అధికంగా ఉంటుంది. ఎందుకు వస్తుందంటే...! మొదటగా జీన్స్, పర్యావరణం (ఇన్ఫెక్షన్స్, కొన్ని రకాల మందులు, ఒత్తిడి, అధిక యువీ కిరణాలు) ప్రభావం వల్ల ఆటో ఇమ్యూన్ వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా 15 నుంచి 45 ఏళ్లలోపు (9ః1 నిష్పత్తి) ఉన్న వారిలో వస్తుంది. అందుకు ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ ప్రభావంతో వారిలో సహజంగానే వస్తుంది. అయితే ఇది చిన్నవారి నుంచి పెద్దవయస్సు వారి వారికి ఎవ్వరికై నా రావచ్చు. -
ఫోర్స్ చేస్తున్నారు
నాకు ఇద్దరు పిల్లలు. కుటుంబ నియంత్రణ చేయించుకోవాలనుకుంటున్నాం. వేసక్టమీ చేయించుకోమని నేను మావారిని ఫోర్స్ చేస్తున్నాను. లేదు లేదు.. ట్యూబెక్టమీ చేయించుకో అంటూ మా వారు నన్ను బలవంతపెడుతున్నారు. ఎవరు చేయించుకుంటే మంచిది? – పి. వాసవి కళ్యాణి, మందమర్రి ఈ రోజుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లాపరోస్కోపీ ద్వారా చేస్తున్నారు. అంటే డేకేర్‌లో అయిపోతుంది. ఆసుపత్రిలో కొన్ని గంటలు మాత్రమే ఉంటే సరిపోతుంది. ట్యూబెక్టమీ అంటే ఆడవారికి చేసే ప్రొసీజర్. వెసెక్టమీ అంటే మగవారికి చేసే ప్రొసీజర్. ఈ రెండూ కూడా లాపరోస్కోపీ ద్వారే చేస్తారు. ఇద్దరిలో ఎవరికైనా డే కేర్‌లోనే ఈ శస్త్ర చికిత్సను చేస్తారు. ఈ రెండూ కూడా 99 శాతం విజయవంతమయ్యే ప్రక్రియలే. మీకు రెండు కాన్పులు కూడా సిజేరియనే అయినా.. అంతకుముందూ ఇంకేదైనా (అపెండిసైటిస్ వంటి) సర్జరీ అయినా మళ్లీ ట్యూబెక్టమీ అంటే కొంచెం కష్టం కావచ్చు. ఇంతకుముందు జరిగిన సర్జరీల తాలూకు అతుకులు ఉండవచ్చు. మళ్లీ అనెస్తీషియా తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి కేసెస్‌లో .. అదీగాక మీకు ఇంకేదైనా మెడికల్ డిజార్డర్ ఉండి.. సర్జరీ రిస్కీ అయితే మీ వారినే వేసెక్టమీ చేయించుకోమని సజెస్ట్ చేస్తాము. ఒకవేళ మీవారు వేసెక్టమీ చేసుకున్నట్టయితే.. సర్జరీ అయిన మూడు నెలల తరువాత సెమెన్ అనాలిసిస్ చెక్‌చేసి.. స్పెర్మ్ లేవని నిర్ధారణ అయ్యేవరకు కండోమ్స్ తప్పనిసరిగా వాడాలి. మీకు ఇతర మెడికల్ ప్రాబ్లమ్స్ ఏవీ లేకపోతే .. ఇదివరకు ఏ సర్జరీ జరగకపోతే ఇద్దరిలో ఎవరు చేయించుకున్నా సమస్య లేదు. ట్యూబెక్టమీ అనేది పర్మినెంట్ ప్రొసీజర్. మళ్లీ రివర్స్ చేయడం చాలా కష్టం. అందుకే డాక్టర్ డీటెయిల్డ్ కౌన్సెలింగ్ తరువాతే ఈ ప్రొసీజర్‌కు ఒప్పుకుంటారు. నాకు 33 ఏళ్లు. ఏడాది కిందట హిస్టరెక్టమీ అయింది. ఇది భవిష్యత్‌లో నా ఆరోగ్యం మీదేమైనా ప్రభావం చూపిస్తుందా? – కె. లీలారాణి, బోధన్ హిస్టరెక్టమీ అనేది సర్వసాధారణమైన శస్త్ర చికిత్స. కొన్ని అనివార్య పరిస్థితుల్లో చిన్న వయసులోనే ఈ సర్జరీ చేయాల్సి వస్తుంది. 35 ఏళ్లలోపు హిస్టరెక్టమీ అయిన వాళ్లలో ఆరోగ్య సమస్యల రిస్క్ 4.6 రెట్లు పెరుగుతుంది. కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే రక్తనాళాలు గట్టిపడడం వంటి స్థితి 2.5 రెట్లు ఎక్కువ. అందుకే యువతుల విషయంలో చాలా వరకు శస్త్ర చికిత్స జోలి లేకుండానే పేషంట్‌తో డిస్కస్ చేస్తాం. శస్త్ర చికిత్సను పేషంట్ ఆప్షనల్ చాయిస్‌గా కన్విన్స్ చేస్తాం. అధిక రక్తస్రావం, ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియాసిస్, ప్రొలాప్స్ వంటి వాటికి ప్రత్యామ్నాయ పరిష్కారాలు ఈ మధ్య చాలానే వచ్చాయి. ఇలా ఈ ఆప్షన్స్ ఏవీ పనిచేయనప్పుడు మాత్రమే గర్భసంచిని తొలగించే మార్గం గురించి ఆలోచించాలి. చిన్న వయస్సులోనే గర్భసంచిని తొలగిస్తే బరువు పెరిగే, బీపీ ఎక్కువయ్యే, హార్ట్ డిసీజెస్ వచ్చే ప్రమాదం పది నుంచి పదిహేను శాతం ఎక్కువ. అందుకే ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఫిజీషియన్, గైనకాలజిస్ట్ దగ్గర చెక్ చేయించుకోవాలి. హిస్టరెక్టమీ వల్ల నెలసరి ఆగిపోవడంతో కొంతమంది ఏదో వెలితి ఫీలవుతుంటారు. డిప్రెషన్లోకి వెళ్లే చాన్సెస్ కూడా ఎక్కువే. రోజుకు ఎనిమిది నుంచి పది గ్లాసుల మంచినీళ్లు తాగడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించడం, రోజూ వ్యాయామం చేయడం వంటి అలవాట్లతో హిస్టరెక్టమీ సైడ్ ఎఫెక్ట్స్‌ను చాలా వరకు తగ్గించవచ్చు. నలభై ఏళ్లలోపు హిస్టరెక్టమీ అయితే ఓవరీస్ కూడా త్వరగా ఫెయిలవడం చూస్తాం. ఓవరీస్ నుంచి హార్మోన్స్ విడుదలవుతాయి కాబట్టి మెనోపాజ్ లక్షణాలు కొంచెం తగ్గుతాయి. ఈస్ట్రొజెన్ తగ్గడం వల్ల ఎముకలు దృఢత్వాన్ని కోల్పోయి గుల్లబారి ఫ్రాక్చర్ అయ్యే రిస్క్ పెరుగుతుంది. చెమటలు పట్టడం, డిప్రెషన్, నీరసం, నిస్సత్తువ వంటి లక్షణాలుంటాయి. అందుకే కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవాలి. హై ప్రొటీన్ డైట్ తీసుకోవాలి. కొంతమందికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ సజెస్ట్ చేస్తాం. దీనితో హిస్టరెక్టమీతో వచ్చే సమస్యల రిస్క్‌ను కాస్త తగ్గించవచ్చు. -
దాని శాతం ఎంత ఉండాలి?
నా వయసు 28 సంవత్సరాలు. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. రక్తంలో గ్లూకోజు మోతాదు ఎక్కువగా ఉంటే పిండంలో అవయవ నిర్మాణం దెబ్బతినే అవకాశాలు ఉంటాయని చదివాను. అసలు రక్తంలో గ్లూకోజు మోతాదు ఎందుకు ఎక్కువ అవుతుంది? పెరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయగలరు.– కె.ఆమని, నర్మెట్ట సాధారణంగా తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ జీర్ణమై అనేక రకాల హార్మోన్లు, ఎంజైమ్‌ల ప్రభావం వల్ల అవి గ్లూకోజ్‌గా మారి రక్తంలోకి చేరుతుంది. సాధారణంగా పాంక్రియాస్ గ్రంథి నుంచి విడుదలయ్యే ఇన్సులిన్ హార్మోన్ రక్తంలో చేరిన గ్లూకోజ్‌ను శక్తిగా మార్చి శరీరంలోని అన్ని కణాలకు అందేలా చేస్తుంది. ఎక్కువగా ఉన్న సుగర్‌ను లివర్‌లో, కండరాల్లో భద్రపరుస్తుంది. శరీరంలో సుగర్ తక్కువగా ఉన్నప్పుడు భద్రపరచిన సుగర్‌ను వాడుకునేలా ఉపయోగపడుతుంది. పాంక్రియాస్లో సమస్యల వల్ల ఇన్సులిన్ తక్కువగా విడుదల కావడం లేదా ఇన్సులిన్ పనితీరు మందగించడం వంటి సమస్యలు ఏర్పడటం వల్ల గ్లూకోజ్ మెటబాలిజం సరిగా లేకపోవడం వల్ల రక్తంలో సుగర్ పెరుగుతుంది. దీనిని మధుమేహం లేదా డయాబెటిస్ అంటారు. డయాబెటిస్ ఉన్నవాళ్లు గర్భం దాల్చినప్పుడు సుగర్ శాతం ఎక్కువ ఉండి, మొదటి మూడు నెలల్లో సుగర్ నియంత్రణలో లేకపోతే బిడ్డలో అవయవ లోపాలు ఏర్పడే అవకాశాలు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిలో మెదడు, వెన్నుపూస, కిడ్నీలు, గుండె, జీర్ణాశయం వంటి అవయవాలకు సంబంధించిన లోపాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమందిలో డయాబెటిస్ ఉందని తెలియకుండానే, గర్భం దాలుస్తారు. వీరిలో కూడా ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గ్లూకోజ్ మోతాదు పెరగకుండా ఉండటానికి బరువు నియంత్రణలో ఉంచుకోవాలి. దీనికి తగిన వ్యాయామాలు, ఆహార నియమాలు పాటించవలసి ఉంటుంది. ఒకవేళ సుగర్ వ్యాధి ఉందని నిర్ధారణ అయితే ఆహార నియమాలు, వ్యాయామాలతో పాటు డాక్టర్ పర్యవేక్షణలో సుగర్‌ను అదుపులో ఉంచుకోవడానికి మందులు, అవసరమైతే ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటే బిడ్డలో అవయవ లోపాలు ఏర్పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కొందరిలో గర్భం దాల్చిన తర్వాత కొన్ని హార్మోన్స్ ప్రభావం వల్ల అధిక బరువు పెరగడం, కుటుంబంలో సుగర్ ఉన్నట్లయితే, ఐదో నెల తర్వాత రక్తంలో సుగర్ పెరిగి జెస్టేషనల్ డయాబెటిస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇలాంటి వాళ్లలో బిడ్డలో అవయవ లోపాలు ఏర్పడే అవకాశాలు ఉండవు. ఎందుకంటే వీరిలో ఐదో నెల లోపే అవయవ నిర్మాణం అయిపోతుంది. తర్వాత అవయవాలు పరిణామం చెందుతూ ఉంటాయి. మా బంధువుల్లో ఒకరికి యుటెరైన్ ప్రొలాప్స్ సమస్య వచ్చింది. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీనికి ఏ రకమైన చికిత్స పద్ధతులు అందుబాటులో ఉన్నాయి? – ఆర్.ప్రీతి, రాజమండ్రి పొత్తి కడుపులో గర్భాశయం అనేక లిగమెంట్లు, కండరాల ఆధారం ద్వారా వెన్నుపూసకి, పెల్విక్ ఎముకలకు అతుక్కుని ఉంటుంది. ఈ లిగమెంట్లు, పెల్విక్ కండరాలు బలహీనపడినప్పుడు అవి సాగడం వల్ల గర్భాశయానికి ఈ సపోర్ట్ తగ్గిపోయి పొత్తి కడుపులో నుంచి జారి యోని భాగంలో కిందకి, అలాగే యోని భాగం నుంచి బయటకు జారుతుంది. దీనినే యుటెరైన్ ప్రొలాప్స్ అంటారు. ఇది ఏ వయసులోనైనా రావచ్చు. ఎక్కువ సాధారణ కాన్పులు అయ్యేవారిలో, సాధారణ కాన్పు సమయంలో ఇబ్బందులు, ఎక్కువ సేపు క్లిష్టమైన కాన్పు కోసం ఎదురు చూసినప్పుడు, సాధారణ కాన్పు ద్వారా అధిక బరువు బిడ్డలను ప్రసవించినప్పుడు, దీర్ఘకాలం మలబద్ధకం, దగ్గు, అధిక బరువులు లేపడం, అధిక బరువు వల్ల, గర్భాశయం మీద ఒత్తిడి వల్ల, కండరాల బలహీనత వల్ల, మెనోపాజ్ దశలో ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గిపోవడం వంటి అనేక కారణాల వల్ల గర్భాశయం జారడం (యుటెరైన్ ప్రొలాప్స్) జరగవచ్చు. దీని నివారణ అంతా మన చేతిలో ఉండదు. కాకపోతే గర్భాశయం ఇంకా పూర్తిగా యోని బయటకు రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. పెల్విక్ కండరాలు బలపడటానికి కీగల్స్ వ్యాయామాలు, అధిక బరువు పెరగకుండా ఉండటం, బరువు తగ్గడం, మలబద్ధకం లేకుండా చూసుకోవడం, దీర్ఘకాలంగా దగ్గు ఉంటే దానికి తగిన చికిత్స తీసుకోవడం, అవసరమైతే ఈస్ట్రోజెన్ చికిత్స తీసుకోవడం, డాక్టర్‌ను సంప్రదించి వారి సలహాలను, సూచనలను పాటించడం మంచిది. ఈ జాగ్రత్తలు తీసుకున్నా, గర్భాశయం బాగా జారిపోయినప్పుడు వారి వయసు బట్టి, సమస్యను బట్టి కొందరిలో ఆపరేషన్ ద్వారా గర్భాశయాన్ని పొత్తికడుపులోకి లాగి కుట్టడం లేదా గర్భాశయాన్ని తొలగించడం జరుగుతుంది. కొందరిలో ఆపరేషన్ చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు వెజైనల్ పెసరీస్ అంటే రింగు వంటి పరికరాలను యోనిభాగంలో అడ్డు పెట్టడం వల్ల గర్భాశయం బయటకు రాకుండా చూసుకోవచ్చు. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు హై–ఫైబర్ డైట్ తీసుకుంటే పిల్లల్లో ఛ్ఛి జ్చీఛి ఛీజీట్ఛ్చట్ఛ రిస్క్ తక్కువగా ఉంటుందని ఒక టీవి కార్యక్రమంలో విన్నాను. దీని గురించి కాస్త వివరంగా తెలియజేయగలరు.– బి.చందన, హైదరాబాద్ కొన్ని రకాల ఆహార పదార్థాలలో ఉండే ‘గ్లూటెన్’ అనే ప్రొటీన్ కొందరి శరీరానికి సరిపడదు. దాని వల్ల పేగులలో మార్పులు జరిగి, పేగులు వాచి, దెబ్బతినడం జరుగుతుంది. దీనివల్ల తినే ఆహార పదార్థాల్లోని పోషకాలు రక్తంలోకి చేరవు. దీనినే ‘సీలియాక్ డిసీజ్’ అంటారు. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇది కొందరిలో జన్యువుల్లోని మార్పుల వల్ల ఏర్పడవచ్చు. గ్లూటెన్ ఎక్కువగా ఉండే గోధుమలు, బార్లీ వంటి వాటితో చేసిన పదార్థాలు తీసుకున్నప్పుడు కొందరిలో ఈ పరిస్థితి తలెత్తవచ్చు. గ్లూటెన్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకున్నప్పుడు ఈ పరిస్థితి ఉన్న వారిలో వాంతులు, గ్యాస్, పొట్ట ఉబ్బరం, డయేరియా వంటి అనేక లక్షణాలు ఏర్పడతాయి. దీర్ఘకాలంలో పిల్లలు బరువు పెరగకపోవడం, పెరుగుదలలో లోపాలు వంటి అనేక సమస్యలు ఏర్పడవచ్చు. దీనికి చికిత్స లేదు. గ్లూటెన్ ఉన్న పదార్థాలను తీసుకోకుండా ఉండటమే మార్గం. ఇటీవల చేసిన ఒక అధ్యయనంలో తల్లి గర్భిణిగా ఉన్నప్పుడు ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే, ఆ తల్లికి పుట్టే బిడ్డల్లో ‘సీలియాక్ డిసీజ్’ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. తల్లి కనీసం రోజుకు 25 గ్రాముల ఫైబర్ తీసుకోవడం మంచిది. ఇందులో ఎక్కువగా ఆకుకూరలు కూరగాయలు, పండ్లు తీసుకోవడం మంచిది. తల్లి ఫైబర్ డైట్ తీసుకుంటూ ఉన్నట్లయితే, బిడ్డకు సీలియాక్ డిసీజ్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఒక అంచనా. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బోహైదర్నగర్హైదరాబాద్ -
తల్లిదండ్రుల గుండె పగిలిపోయింది
సూర్యాపేట : రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం.. ఆ కుటుంబానికి ఒక్కసారిగా పెద్ద కష్టం వచ్చిపడింది. ఇంట్లోని తమ కూతురు ఏడాది నుంచి పొట్టలోపలి భాగంలోని ఫ్రాంక్టాటిస్లో గడ్డ కావడంతో బాధపడుతూ.. రోజురోజుకూ క్షీణిస్తున్న బిడ్డ ఆరోగ్యాన్ని చూసి ఆ తల్లిదండ్రి తల్లడిల్లిపోతున్నారు. తమ గారాలపట్టికి ఎలాగైనా వైద్యమందించి బతికించుకునేందుకు సూర్యాపేట పట్టణానికి చెందిన నిమ్మ బింధు తల్లిదండ్రులు నిమ్మ శ్రీనివాస్–రాజేశ్వరి సాయం కోసం వేడుకుంటున్నారు. పట్టణానికి చెందిన శ్రీనివాస్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శ్రీనివాస్ పట్టణంలో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇద్దరు కుమార్తెలను ప్రభుత్వ పాఠశాలలో చదవిస్తున్నాడు. వారిలో చిన్న కుమార్తె బిందు ఇమాంపేట గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. బిందు ఏడాది కాలంగా కడుపులోనొప్పితో బాధపడుతోంది. దీంతో పలు ప్రైవేట్ ఆస్పత్రులో వైద్యం చేయించాడు. ఇటీవల తీవ్రమైన కడుపులో నొప్పి రావడంతో హైదరాబాద్‌లోని నక్షత్ర హాస్పిటల్‌కు తీసుకెళ్లి వైద్యపరీక్షలు చేయించగా.. కడుపులోని ఫ్రాంక్టాటిస్లో పెద్దగడ్డ ఉందని.. దానిని ఆపరేషన్ చేసి తీయాలని.. దీని కోసం సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ఇలాంటి జబ్బు వెయ్యిలో ఒకరికి వస్తుందని వైద్యులు పేర్కొన్నారు. దీంతో ఆ పేద తల్లిదండ్రుల గుండె పగిలిపోయింది. చేతిలో చిల్లిగవ్వలేక ఇబ్బందులు 20 రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఎల్బీనగర్లో గల నక్షత్ర కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించేందుకు చిన్నారి బిందును చేర్పించారు. వారి చేతిలో ఉన్న రూ.2 లక్షల వరకు ఖర్చు చేశారు. ఆపరేషన్ కోసం మరో రూ.5 లక్షల మేర ఖర్చవుతుందని వైద్యులు తెలపడంతో చేతిలో చిల్లిగవ్వలేని ఆ తల్లిదండ్రులు దిక్కుతోచనిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎవరైనా ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. సాయం కోసం ఎదురుచూపు పేద తల్లిదండ్రులు తమ బిడ్డ బింధు ఆపరేషన్ ఖర్చుల నిమిత్తం ఎవరైనా సాయం చేస్తారేమోనని ఆశతో ఎదురుచూస్తున్నారు. దయఉంచి సహాయం చేయాలని వేడుకుంటున్నారు. సాయం చేయదలిచిన వారు 99123 69343, 90107 50593, 99487 64487 సెల్ నంబర్లను సంప్రదించవచ్చు. అకౌంట్ నంబర్ ఎస్బీహెచ్ సూర్యాపేట 62259021457.ఆర్థికసాయం అందించి ఆదుకోవాలి తన కుమార్తె బింధు వైద్యానికి మనసున్న దాతలు సాయం చేసి ఆదుకోవాలి. ఇప్పటికే వైద్యం కోసం సంవత్సర కాలంలో రూ.2 లక్షలకు పైగా ఖర్చుచేశాం. అయినా తగ్గకపోవడంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో వైద్యం చేయిస్తున్నాం. వైద్యం కోసం రూ.5 లక్షలకు పైగా ఖర్చవుతాయని వైద్యులు చెబుతున్నారు. నా బిడ్డ ఆపరేషన్ కోసం దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నా. -
అస్వస్థతకు గురైన విద్యార్థిని మృతి
యాచారం: విద్యార్థిని మృతితో మొండిగౌరెల్లి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. యాచారం మండల పరిధిలోని మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన కట్టెల క్రిష్ణ, పద్మల కుమార్తె సోనీ.. వికారాబాద్ జిల్లా గండీడ్ మండలం నంచర్ల గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. శుక్రవారం మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురైన సోనీ వాంతులు చేసుకుంది. పరిస్థితి విషమించడంతో పాఠశాల యజమాన్యం నగరంలోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో మృతి చెందింది. విద్యార్థిని మృతదేహాన్ని ఆదివారం రాత్రే మొండిగౌరెల్లి గ్రామానికి తీసుకొచ్చారు. సోమవారం గ్రామంలో విద్యార్థినికి అంత్యక్రియలు జరిగాయి. గురుకుల పాఠశాలలో జరిగిన సంఘటనపై తెలంగాణ గురుకుల పాఠశాలల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ దృష్టికి వెళ్లింది. దీంతో ప్రవీణ్‌కుమార్ ఆదేశాల మేరకు నంచర్ల పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటమ్మ మొండిగౌరెల్లి గ్రామానికి చేరుకుని విద్యార్థిని అంత్యక్రియల నిమిత్తం కుటుంబ సభ్యులకు రూ.10 వేల ఆర్థిక సహాయన్ని అందజేశారు. విద్యార్థిని తల్లిదండ్రులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ప్రిన్సిపాల్ వెంకటమ్మకు వినతిపత్రాన్ని అందజేశారు. విద్యార్థిని మృతికి గల కారణాలపై ప్రవీణ్‌కుమార్ విచారణకు ఆదేశించినట్లు వెంకటమ్మ పేర్కొంది. -
వేసవిలో జర భద్రం
పెద్దఅడిశర్లపల్లి : వేసవిలో వడ దెబ్బకు గురికా కుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పీఏపల్లి పీహెచ్సి వైద్యాధికారి హిమబిందు కోరారు. మంగళవారం ఆమె స్థానికంగా మాట్లాడుతూ వేసవిలో అధిక ఉష్ణోగ్రత, వేడి గాలుల తాకిడితో డిహైడ్రేషన్‌తో శరీరంలో నీరు తగ్గడమే వడదెబ్బగా భావించాలని అన్నారు. ఎండలో అధిక వేడిలో తిరగడంతో ఇది ఏర్పడుతుందన్నారు. ప్రతి రోజూ 5 లేదా 6 లీటర్ల నీటిని తప్పకుండా తీసుకోవడంతో పాటు పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, ద్రవ పదార్థాలు తీసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతకు ఎక్కవ ప్రాధాన్యం ఇస్తూ, శరీరంతో పాటు ఇంటిని చల్లగా ఉంచుకోవాలి. ఈ సందర్భంగా పీహెచ్సీ వైద్యాధికారిణి పలు సూచనలు చేశారు. తీవ్ర ఎండ, ఉష్ణోగ్రత సమయాల్లో ఎక్కువగా బయట తిరగకూడదు. రోడ్లపై విక్రయించే రంగు పానియాలు, కలుషిత ఆహారం తీసుకోకూడదు. మాంసాహారం తగ్గించి తాజా కూరగాయలు తీసుకోవాలి. శరీర ఉష్ణోగ్రత్త సాధారణ స్థాయికి వచ్చే వరకు తడి గుడ్డతో శరీరమంతా తూడ్చి ఫ్యాన్, చల్లని గాలి తగిలేలా చూడాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణం తాగించి వీలైనంత త్వరగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం తరలించాలి. వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు బయటికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండాలి. అత్యవసరం ఉంటే త్వరగా పనులు ముగించుకోవాలి. బయట లేత రంగు, తేలికైన, కాటన్ దుస్తువులు, టోపి, గొడుగు లాంటివి తప్పనిసరిగా వాడాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్, మజ్జిగ, గ్లూకోజ్ లాంటి ద్రావణాలు దెగ్గర ఉంచుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ వడదెబ్బకు గురికాకుండా ఉండాలి. -
నిలువెల్లా నెత్తుటేళ్లు
పేద యువతికి అంతు చిక్కని వ్యాధి తల నుంచి కాళ్ల వరకూ నిత్యం రక్తస్రావం రోగ నిర్ధారణ, చికిత్సలకు రూ.లక్షలు అవసరం ‘ఆశ’ను ఆదుకోని ఆరోగ్యశ్రీ పథకం ఉదారులే పునర్జీవితాన్నివ్వాలని వేడుకోలు ఆమె పేరు ఆశ. వయసు 20 ఏళ్లు. జీవితం గురించి రంగురంగుల కలలు కనే ఈడు అది. కానీ, ఆమెకు నిత్యం తప్పనిసరిగా కళ్లకు కట్టేది ఒకటే రంగు..ఎరుపు! ఆ ఎరుపు పెరట్లో విరిసే ఏ మందారానిదో కాదు.. ఆమె శరీరం నుంచి కురిసే నులివెచ్చని నెత్తుటిదే! కొండకొమ్ము నుంచి దూకే జలపాతంలా తుళ్లి పడాల్సిన ప్రాయంలో ఆ యువతికి తల నుంచి కాలి గోళ్ల వరకూ ‘రక్తపాతాని’కి నెలవులే! మనమంతా ‘అష్టకష్టాలు’ అంటుంటాం. కానీ ఆ ఎనిమిది కష్టాలేమిటో చెప్పమంటే చెప్పలేం. కానీ, 20 ఏళ్లకే ఆశ అంతకు మించిన కష్టాలను అనుభవించింది. ఇప్పుడు అన్ని వ్యధల్నీ మించి.. మూలమేమిటో అంతుపట్టని ‘రుధిరధారాపాత’ వ్యాధి ఆమెను పీడిస్తోంది. అయినా ఆమెలోని ‘ఆశ’.. ఇగిరిపోలేదు. తనను వెన్నాడుతున్న కష్టాలు వెన్ను చూపుతాయనీ, తన ‘రక్తకన్నీటి’కి అడ్డుకట్ట పడుతుందనీ, తిరిగి తాను చదువుకుంటాననీ, చక్కటి భవిష్యత్తు సొంతమవుతుందనీ కలలు కంటోంది. అయితే ఆమె.. రెక్కల కష్టంతో బతికే తోడబుట్టిన వారి ఆదరణతో మనుగడ సాగిస్తున్న నిరుపేద. ఆమె స్వస్థత చేకూరి, ఆమె స్వప్నాలు సాకారం కావాలంటే.. కలిగిన వారి కరుణ ఆమెపై కురవాల్సిందే! మర్రిపూడి (రంగంపేట) : ఒకదాని వెనుక ఒకటిగా కష్టాలు విరుచుకుపడుతుంటే.. ‘సినిమా కష్టాలు’ అనడం పరిపాటి. గండేపల్లి మండలం కొత్త నాయకంపల్లికి చెందిన గంధం ఆశకు నూరుశాతం వర్తిస్తుంది. ఆ గ్రామానికి చెందిన కామరాజు, దయామణి అనే దళిత దంపతులకు ఇద్దరు కొడుకులు, నలుగురు కుమార్తెలు. వారిలో చిన్నది ఆశ. 8 ఏళ్ల క్రితం కామరాజుపై ఓ వివాదంలో ప్రత్యర్థులు యాసిడ్ పోశారు. తీవ్రంగా గాయపడి పనిపాట్లు చేయలేని స్థితికి చేరిన భర్తకు సేవలు చేస్తూ వచ్చిన దయామణి తానే హద్రోగంతో తనువు చాలించింది. అది జరిగిన కొద్దిరోజులకే వారిద్దరి కొడుకులూ ఎటో వెళ్లిపోయారు. కుమార్తెల్లో పెద్ద వాళ్లిద్దరికీ పెళ్లిళ్లు కాగా మూడో కుమార్తె మేరీరత్నం ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆశ తండ్రికి సేవలు చేసేది. అదే సమయంలో ఆమెకు శరీరంలో అనేక అవయవాల నుంచి నెత్తురు స్రవించే అరుదైన వ్యాధి సోకింది. మూడేళ్ల క్రితం కామరాజు కూడా చనిపోయాడు. ఆశ నివసించే పూరిల్లు అగ్నిప్రమాదంలో కాలిపోయింది. దాంతో ఆమెను రంగంపేట మండలం మర్రిపూడిలో ఉంటున్న రెండో అక్క ఏడిద ఎలుసమ్మ, బావ నాగేశ్వరరావు తమ ఇంటికి తీసుకు వెళ్లారు. శక్తికి మించిన చికిత్స.. అంతుపట్టని రక్తస్రావంతో బాధపడుతున్న ఆశను అక్కాబావలు శక్తికి మించినా లక్షలు వెచ్చించి అనేక ఆస్పత్రులకు తీసుకువెళ్లారు. ఆశకు ఆరోగ్యశ్రీ కార్డున్నా వ్యాధి నిర్ధారణ కాకపోవడంతో ఎలాంటి ఉపయోగమూ లేకుండా పోయింది. ఆశను హైదరాబాద్ నిమ్స్‌లో, విశాఖపట్నం కేజీహెచ్‌లో, తమిళనాడులోని రాయవెల్లూరు ఆస్పత్రిలో చూపించారు. అయినా ఆమెను పీడిస్తున్న జబ్బేమిటో నిర్ధారణ కాలేదు. ఆమెకు అవసరమైన పరీక్షలు చేయడానికి, అవసరమైన ఒంట్లోని రక్తం మెుత్తం మార్చడానికి రూ.5 లక్షలకు పైగా ఖర్చవుతుందని రాయవెల్లూరు వైద్యులు చెప్పారు. దాంతో ఎలుసమ్మ, నాగేశ్వరరావు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సాయం కోసం గండేపల్లి మండలాధికారుల ద్వారా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కూలి పనులు చేసుకుని బతికే తాము దుబాయిలో ఉన్న మేరీరత్నం సహకారంతో ఆశకు తాత్కాలిక చికిత్సనే చేయిస్తున్నామని, దయగలవారు ముందుకు వచ్చి ఆర్థికంగా సాయం చేస్తేనే ఆశను బతికించుకోగలమని వారంటున్నారు. కరుణ కలిగి, హదయం కరిగి, ఆదుకోవాలనుకునే వారు 95502 73159 నంబర్లో సంప్రదించాలని కోరుతున్నారు. వ్యాధికి మూలం మనోవ్యధేనా! ఆశ పూర్వ వైద్య నివేదికలను రంగంపేట ఆదర్శ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ లక్ష్మీదేవి, పర్యవేక్షకులు బిషప్ పరిశీలించారు. ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. తణుకులో ఉన్న ప్రియాంక నర్సింగ్ హోమ్ మానసిక వైద్యుడు డాక్టర్ కె.ఆనంద్‌ను సంప్రదించారు. ఇటువంటి కేసులు తక్కువగా వస్తాయని, కౌన్సిలింగ్ ద్వారా కొంతవరకూ నయమవుతుందని ఆయన చెప్పారు. కొద్ది రోజులు ఆ డాక్టర్ సలహాలు పాటిస్తే కొంతవరకూ నయమవుతుందని చెప్పడంతో ఆశ, ఆమె అక్క ఎలుసమ్మలకు కాస్త ధైర్యం చేకూరింది. బలం కోసం ఇప్పటి వరకూ వాడిన మందులనే వాడాలని రంగంపేట వైద్యులు చెప్పారు. మర్రిపూడి ఏఎన్ఎం వి.రమణమ్మ, ఆశ కార్యకర్త కె.పద్మ సహకారంతో ఆశ, ఎలుసమ్మ ఎంపీడీవో కె.కిషోర్‌కుమార్‌ను కలుసుకుని తమ గోడు వినిపించారు. వైద్యుల నివేదికల ఆధారంగా పింఛను కానీ, అత్యవసరమైతే ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సాయం కానీ అందించడానికి కృషి చేస్తామని ఎంపీడీవో హామీ ఇచ్చారు. ఉన్నత వైద్య పరీక్షలు, మందులు, పోషకాహారం కోసం ఆర్థిక సహకారం అందించాలని బాధితులు కోరుతున్నారు. ఔదార్యం చూపితే మెరుగైన వైద్యం గంధం ఆశ ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటి వరకూ వివిధ ఆస్పత్రుల వైద్యులు ఇచ్చిన నివేదికలు చూశాను. అన్నీ మామూలుగానే ఉన్నాయి. అయితే తల్లిదండ్రులను కోల్పోయిన ఆశ తీవ్ర మానసిక ఒత్తిడికి గురై నిరంతరం కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతోంది. దీనివల్ల ఈ సమస్య తలెత్తినట్టు భావిస్తున్నాం. మానసిక వైద్యుల సలహా తీసుకోవడంతో ఈ విషయం తెలిసింది. కొద్ది రోజులపాటు మానసిక వైద్యుల సలహా మేరకు వైద్యసేవలు పొందితే బాగుంటుంది. ఆ దిశగా మావంతు కృషి చేస్తాం. పేద కుటుంబం కావడంతో దాతలు ఆదుకుంటే మెరుగైన వైద్య పరీక్షలకు, చికిత్సకు వీలవుతుంది. ఆశకు వైద్య సేవలందించడానికి స్థానిక ఏఎన్ఎం, ఆశ కార్యకర్త అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాను. – డాక్టర్ పి.లక్ష్మీదేవి, ఆదర్శ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రంగంపేట చికిత్స ఖర్చు మాకు కలలో మాటే.. ఆశను విశాఖలోని కేజీహెచ్‌లో చూపిస్తే వ్యాధి నిర్ధారణ చేయలేకపోతున్నామని.. రాయవెల్లూరు ఆస్పత్రికి తీసుకువెళ్లమని చెప్పారు. అక్కడికి తీసుకువెళితే నెలకు పైగా ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచాలని, అన్ని రకాల పరీక్షలూ చేయాలని, అవసరమైతే పూర్తిగా రక్తమార్పిడి చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇందుకు రూ.5 లక్షలకు పైగా ఖర్చవుతుందంటున్నారు. ఆ మెుత్తం మాకు కలలోని మాటే. అందుకే దాతల సాయం కోసం చేతులు జోడించి అర్థిస్తున్నాం. హైదరాబాద్ వెళ్లి ముఖ్యమంత్రిని కలుసుకుని, సాయం చేయాలని అభ్యర్థిస్తే అక్కడి సిబ్బంది పొమ్మన్నారు. ఇటీవల గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ పెండ్యాల నళినీకాంత్, ఉపసర్పంచ్ రిమ్మలపూడి సత్యనారాయణలను కలువగా సీఎం సహాయ నిధికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. తాడేపల్లిగూడేనికి చెందిన హోమియోపతి వైద్యులు పల్లా వెంకటేశ్వరరావు ఉచిత వైద్యసేవలు చేస్తూ, మందులు ఇస్తున్నారు. – ఏడిద ఎలుసమ్మ , ఆశ సోదరి జబ్బు నయమై, చదువుకోవాలనుంది మాయదారి రోగంతో మంచానికే పరిమితమయ్యాను. దాతలు కనికరిస్తే వైద్యం చేయించుకుని, ఆరోగ్యవంతురాలినై, చదువుకోవాలని ఉంది. రెండో అక్క ఎలుసమ్మ, బావ నాగేశ్వరరావు, దుబాయిలో ఉన్న మూడో అక్క మేరీ రత్నంల రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. అక్కా,బావలకు భారం కాకుండా ఆదుకోవాలని అభ్యర్థిస్తున్నాను. – గంధం ఆశ -
వింత వ్యాధి బాధితులకు జీజీహెచ్‌లో చికిత్స
కాకినాడ సిటీ : జిల్లాలోని విలీన మండలమైన వీఆర్‌పురంలోని రేఖవానిపాలెం గ్రామపంచాయతీ పరిధిలో వింతవ్యాధి బారినపడిన పదకొండు మందిని ప్రత్యేక అంబులెన్స్‌లో వైద్య ఆరోగ్యశాఖాధికారులు గురువారం సాయంత్రం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. వారిని అత్యవసర విభాగం లో చేర్చి స్కానింగ్, ఎక్స్‌రే, ఈసీజీ, రక్తపరీక్షలు చేశారు. అనంతరం మెడికల్ విభాగంలో కేటాయించిన ప్రత్యేకవార్డులో వారి కి వైద్యసేవలు అందిస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కె.చంద్రయ్య వింతవ్యాధి బాధితులను పరిశీలించి వారికి అం దించాల్సిన వైద్యసేవలపై ఆస్పత్రి సీఎస్ఆర్ఎంఓ డాక్టర్ మూర్తితో చర్చించారు. అలాగే మరో 10 మంది బాధితులను రాత్రికి జీజీహెచ్‌కు తీసుకువస్తున్నట్టు వైద్యాధికారులు తెలిపారు.