గుంటూరు: ఇంటి నుంచి బయలుదేరిన వ్యక్తి కొంతదూరం వెళ్లాక ఇంటి అడ్రస్ మర్చిపోవటం, తన పేరు కూడా రోగి మర్చిపోయే స్థితికి చేరుకోవటం ఈ జబ్బు లక్షణం. ఆరోగ్య సంస్థల నివేదిక ప్రకారం ప్రతి ఏడు సెకన్లకు ఒకరు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. సుమారు 8.8 మిలియన్ల మంది వ్యాధితో బాధపడుతున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. జబ్బు సోకిన వారికి సహాయకులుగా ఉండేవారికి అవగాహన కల్పించటం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ 1994 నుంచి ఏటా సెప్టెంబర్ 21న అల్జీమర్స్ డే నిర్వహిస్తోంది.
ప్రతిరోజూ 50 మందికి వైద్యం..
అల్జీమర్స్ వ్యాధికి చికిత్స కోసం జిల్లా వ్యాప్తంగా ఉన్న 30 మంది మానసిక వైద్యనిపుణులు, 15 మంది న్యూరాలజిస్టులను రోగుల సహాయకులు సంప్రదిస్తున్నారు. ప్రతిరోజూ న్యూరాలజిస్టులు, మానసిక వ్యాధి నిపుణుల వద్ద సుమారు 50 మంది వరకు అల్జీమర్స్ వ్యాధి బాధితులు చికిత్స పొందుతున్నట్లు అంచనా.
రోజువారి పనులు మరిచిపోతారు
వ్యాధి గ్రస్తులు రోజు వారి కార్యక్రమాలు మర్చిపోతారు. స్నానం చేయటం, బ్రష్ చేయటం, తిండి తినటం కూడా మర్చిపోతారు. వస్తువులను ఎక్కడో పెట్టి ఆ విషయాన్ని మర్చిపోయి ఎవరో దొంగిలించినట్లుగా అనుమానించటం, చెప్పిన విషయాన్నే పదే పదే చెప్పటం, వస్తువుల పేర్లు మర్చిపోవటం, వాటిని ఏ విధంగా వినియోగించాలో, ఎందు నిమిత్తం వినియోగించాలో అనే అంశాలను మర్చిపోవటం రోగిలో కనిపిస్తాయి. ఇంటికి తాళాలు వేయటం, కూరలో ఉప్పు వేయటం, పాలల్లో తోడు వేయటం వంటివి మర్చిపోవటం వ్యాధి గ్రస్తుల్లో కనిపిస్తాయి.
వయస్సు పెరుగుతున్న కొద్ది మతిమరుపు సహజం. దీనినే అల్జీమర్స్ వ్యాధి అంటారు. గతంలో విదేశాల్లో మాత్రమే ఈ మతిమరుపు వ్యాధిబారిన పడే వారిసంఖ్య అధికంగా ఉండేది. ప్రస్తుతం మన దేశంలో కూడా బాధితుల సంఖ్య పెరిగిపోయింది.
వ్యాధి లక్షణాలు...
వయసు పెరిగే కొద్ది వచ్చే అల్జీమర్స్ వ్యాధి సోకిన వారు తమ పేరు మర్చిపోతారు. ఒకేచోట కూర్చుని వీడియోగేమ్స్, టీవీలు చూస్తూ ఉండటం, అతిగా మద్యం తాగడం, శారీరక, మానసిక వ్యాయామం లేకపోవటం, అధిక కొవ్వు ఉన్న మాంసం తినటం వలన ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. బంధువుల, కుటుంబ సభ్యుల పేర్లు మర్చిపోతారు. పేర్లు మర్చిపోవటంతో పాటుగా వారిని గుర్తించటం కూడా కష్టమే. ఈ వ్యాధి ఎక్కువగా 60 సంవత్సరాలు దాటిన వారిలో వస్తోంది. నేడు 45 ఏళ్ల వారిలో కూడా వ్యాధి లక్షణాలు కనిపించటం ఆందోళన కలిగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment