మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన చికిత్స
మార్టూరు: మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు ఒక మహిళ పొట్ట నుంచి మూడున్నర కిలోల బరువైన కణితిని శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా తొలగించారు. రోగి, ఆసుపత్రి వైద్యుల వివరాలు ఇలా ఉన్నాయి.. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని పురుషోత్తమ పట్నంకు చెందిన షేక్ రిజ్వానా గత కొంతకాలంగా కడుపు నొప్పి, రక్త స్రావంతో బాధపడుతూ ఉంది. రెండు మూడు ప్రైవేట్ ఆసుపత్రులను సంప్రదించిన రిజ్వానాను వైద్యులు కడుపులో గడ్డ ఉంది తొలగించడానికి రూ.70 వేల నుంచి లక్ష వరకు ఖర్చు అవుతుందని తెలపడంతో కూలీ నాలీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే రిజ్వానాకు అంత స్తోమత లేక బంధువుల సమాచారంతో మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరింది. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో గత కొంతకాలంగా అనేక శస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తి చేసిన జనరల్ సర్జన్ జి.కిషోర్ కుమార్ రిజ్వానాను ఇన్ పేషెంట్ గా చేర్చుకొని అవసరమైన రక్తాన్ని స్థానిక ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ నుంచి ఉచితంగానే ఎక్కించి శస్త్ర చికిత్స చేశారు. ఆమె కడుపులో నుంచి సుమారు మూడున్నర కిలోల బరువైన కణితిని తొలగించి హిస్ట్రెక్టమీ ఆపరేషన్ చేసినట్లు డాక్టర్ కిషోర్ కుమార్ తెలిపారు. కోలుకొన్న రిజ్వానా సోమవారం విలేకరులతో మాట్లాడుతూ కుటుంబ పోషణే భారంగా ఉన్న తనకు శస్త్ర చికిత్స చేయించుకుని తిరిగి లేచి తిరుగుతానని అనుకోలేదని డాక్టర్ కిషోర్ కుమార్ తనకు పునర్జన్మ కల్పించారని కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా డాక్టర్ కిషోర్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ మార్టూరు ముప్పయి పడకల ఆసుపత్రిలో గత సంవత్సరం ఏప్రిల్ నుంచి 2025 జనవరి నెలాఖరులోపు 241 మందికి శస్త్ర చికిత్సలు చేసినట్లు తెలిపారు. అన్ని రకాల కణితులు, గడ్డలు తొలగించడం హైడ్రోసెల్, హెర్నియా, ఫైల్స్, షిషర్, ఫిస్టులా, అపెండిసైటిస్ మరియు షుగర్ వ్యాధి తీవ్రత వలన శరీరంలోని అవయవాలను తొలగింపు మొదలైన శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నామని రోగులు నిర్భయంగా ఆసుపత్రికి వచ్చి ఉచితంగా అవసరమైన వైద్య సదుపాయం, శస్త్ర చికిత్సలు చేయించుకోవచ్చని తెలిపారు.
మహిళ కడుపు నుంచి 3.50 కిలోల బరువైన కణితి తొలగింపు
మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన చికిత్స
Comments
Please login to add a commentAdd a comment