ఉద్యాన సాగు విస్తీర్ణం పెంచాలి
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
బాపట్ల: జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచడానికి సచివాలయాల స్థాయిలో సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి సూచించారు. ఉద్యాన పంటల సాగుపై అనుబంధ శాఖల అధికారులతో సోమవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ చెప్పారు. జిల్లాలో ప్రధానంగా మిర్చి, పసుపు, అరటి కూరగాయలు, బొప్పాయి పంటలు సాగుచేస్తున్నారన్నారు. ఇప్పటికే 50,965 ఎకరాలలో సుమారు 45 వేల మంది రైతులు ఉద్యాన పంటలను సాగు చేస్తున్నట్లు వివరించారు. తీర ప్రాంతాలలో పూల మొక్కలు విస్తారంగా సాగు అవుతున్నాయన్నారు. ప్రస్తుతం 15 రకాల పంటలు సాగు చేస్తుండగా వాటి సంఖ్య మరింత పెరగాలన్నారు. ఉద్యాన రైతులకు పంట దిగుబడి రాగానే వారి ఉత్పత్తులను విక్రయించుకోవడానికి మార్కెట్ సౌకర్యం కల్పించాలన్నారు. ముఖ్యంగా ఉద్యాన పంటలు సాగు చేసే ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన రైతులను గుర్తించి వారికి మెలకువలను నేర్పాలన్నారు. రుణాల పంపిణీతో వారికి ఆర్థిక చేయూత అందించాలన్నారు. ఎస్సీ, ఎస్టీలు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా సహకరించాలన్నారు. అంతిమంగా ఉద్యాన పంటల సాగు, ఉత్పత్తులు మరింత పెరిగేలా ప్రణాళికతో చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యాన శాఖ ఏడీ జె.జెన్నమ్మ, డ్వామా పీడీ విజయలక్ష్మి, డీఆర్డీఏ పీడీ పద్మ, తదితరులు పాల్గొన్నారు.
మోటుపల్లిని పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం
బాపట్ల: కాకతీయలు, చోళ రాజుల నాటి అభయ శాసనాల భద్రత కోసం మోటుపల్లిని పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. మోటుపల్లిలోని వీరభద్రేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధిపై సంబంధిత అధికారులు, ఎన్జీఓలతో సోమవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. కాకతీయ గణపతి దేవుని అభయ శాసనం, అనపోతారెడ్డి అభయ శాసనం, ప్రౌడ దేవరాయల అభయ శాసనాలను భద్రపరుస్తామని కలెక్టర్ చెప్పారు. ఇందుకోసం దేవాలయం సమీపంలో మ్యూజియం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ ప్రాంతంలో శ్రీకృష్ణదేవరాయులకు ముందు కొండవీటి రాజుల శాసనాలు, కాకతీయుల నాటి శాసనాలు వెలుగులోకి వచ్చాయన్నారు. తవ్వకాలలో 13 చారిత్రాత్మక పంచ లోహ విగ్రహాల లభ్యం కాగా వాటిని హైదరాబాద్‌లోని నాంపల్లి స్టేట్ మ్యూజియంలో భద్రపరిచారని, వాటిని తెప్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే విజయవాడలోని బాపూ మ్యూజియంలో భద్రపరిచిన వీరభద్ర స్వామి విగ్రహాన్ని మోటుపల్లికి తెప్పిస్తామన్నారు. మోటుపల్లి దేవస్థానంలో తమిళం, సంస్కృతంలో లిఖితమైన అభయ శాసనాలను తెలుగులోకి అనువాదించి రాళ్లపై చెక్కిస్తామని కలెక్టర్ తెలిపారు. శతాబ్దాల క్రితం సముద్ర వర్తకంపై రాజులు తీసుకున్న నిర్ణయాలు, బీమా సౌకర్యాలు, విధించిన పన్నులు వసూలపై ఆనాటి రాజుల శాసనాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్, ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పీసీ సాయిబాబు, పురావస్తు శాస్త్రవేత్త జ్యోతి చంద్రమౌళి, మోటుపల్లి హెరిటేజ్ సొసైటీ కార్యదర్శి దశరథ రామిరెడ్డి, సభ్యుడు ఓటుకూరి శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment