అంకాలమ్మతల్లి
అంకాలమ్మతల్లి వీరతిలకం దిద్దిందా.. నాగులేరు నవోత్సాహంతో పరవళ్లు తొక్కిందా.. చెన్నకేశవుని గుడిగంట గణగణ మోగుతూ సుస్వాగతమంటూ వీరాచారులకు ఆహ్వానం పలికిందా.. బ్రహ్మ నాయుడు ఆయుధం ఉగ్రనృసింహకుంతలం వీరవిహారానికి కాలుదు వ్విందా.. అన్నట్టు పల్నాడు రణక్షేత్రం ఉత్సాహంతో ఉప్పొంగుతోంది. వీరారాధనోత్సవాలకు ముస్తాబై ‘సంబర’నాదమై మార్మోగుతోంది.
కారెంపూడిః పల్నాటి రణక్షేత్రం కార్యమపూడి (కారెంపూడి)లో పల్నాటి వీరారాధన ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. కార్తిక అమావాస్య నుంచి ఐదు రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు దేశంలోని వివిధ ప్రాంతాలలో స్థిరపడిన వీరాచారులు వేలాదిగా కారెంపూడి తరలివచ్చి తమ వీరాచారాన్ని నెరవేర్చనున్నారు. పల్నాటి యుద్ధం క్రీ.శ 1182లో జరిగింది. యుద్ధంలో వీరమరణం పొందిన పల్నాటి వీరులను వారి వారసులు ఏటా రణక్షేత్రంలో స్మరించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
యుద్ధానంతరం బ్రహ్మనాయుడు నాగులేరు గంగధారి మడుగు ఒడ్డున మృతి చెందిన వీరులకు తర్పణాలు వదిలారు. అప్పటి నుంచి ఏటా వీరులను క్రమం తప్పకుండా స్మరించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. బహుశా ఇవి దేశంలోనే అత్యంత పురాతన ఉత్సవాలు కావచ్చని చరిత్రకారులు పేర్కొంటున్నారు.
ఈ ఏడాదీ పల్నాటి వీరాచార పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ ఆధ్వర్యంలో వీరాచారులు అత్యంత నిష్టతో ఉత్సవాల నిర్వహణకు తరలిరానున్నారు. దీనికోసం చెన్నకేశవుడు, అంకాలమ్మ, వీరుల గుడులను సుందరంగా ముస్తాబు చేశారు. చారిత్రక ప్రదేశాలైన కోట బురుజు, బ్రహ్మనాయుడు మేడను సందర్శకులు తిలకించేందుకు అనువుగా ఏర్పాట్లు జరిగాయి.
చెన్నకేశవుడు, అంకాలమ్మల సాక్షిగా..
ఈనెల 30వ తేదీ నుంచి డిసెంబరు నాలుగు వరకు ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. పల్నాటి యుద్ధం నాటి ముఖ్యమైన ఐదు చారిత్రక ఘట్టాల పేర్లతో వేడుకలు జరగనున్నాయి. 30న రాచగావు, 1న రాయబారం, 2న మందపోరు, 3న కోడిపోరు, చివరి రోజు 4న కళ్లిపాడు ఉత్సవాలు జరగనున్నాయి. వీరుల ఆయుధాలకు ప్రజలు నీరాజనాలు పలకనున్నారు. చెన్నకేశవస్వామిని, వీర్ల అంకాలమ్మ తల్లిని లక్షలాదిగా ప్రజలు దర్శించుకుని కొలుపులు నిర్వహించనున్నారు.
పల్నాటి వీరులు తమ ఆరాధ్య దైవం చెన్నకేశవుడు, ఆరాధ్యదేవత వీర్ల అంకాలమ్మలను 11వ శతాబ్దంలో ప్రతిష్టించుకున్నట్టు ప్రతీతి. అందుకే చెన్నకేశవస్వామిని అంకాలమ్మను వీరాచారులు స్మరించుకుంటూ కత్తి సేవలు చేసుకుంటూ గ్రామోత్సవాలు నిర్వహిస్తూ సంప్రదాయ మొక్కులు చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. వీరుల గుడిలో రోజూ రాత్రి పల్నాటి చారిత్రక కథలను వీరవిద్యా వంతులు ఆలపిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment