తెనాలి: తెనాలి సీటు విషయంలో టీడీపీలో విభేదాలు బహిర్గతమయ్యాయి. జనసేనకు టికెట్ కేటాయిస్తే ఊరుకునేది లేదంటూ ఆలపాటి వర్గీయులు హడావుడి చేశారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన పార్టీ సమావేశానికి సీనియర్లు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమ వర్గం దూరంగా ఉన్నారు. ఆలపాటి రాజా మంగళగిరిలో లోకేశ్‌ను కలిసొచ్చా క ఆయన వర్గీయుల్లోనూ స్వరం మారింది. మూకుమ్మడి రాజీనామాలంటూ చేసిన హెచ్చరికలు డాంబికాలేనని తేలిపోయింది.
టీడీపీ, జనసేన పార్టీల పొత్తుల్లో భాగంగా తెనాలి అసెంబ్లీ సీటును జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌కు ఖాయమవుతోందన్న పరిస్థితుల్లో టీడీపీ రచ్చ చేసిన విషయం తెలిసిందే. పార్టీ నాయకులు, కొందరు కౌన్సిలర్లు మంగళవారం గుంటూరులో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ నివాసానికి వెళ్లి హడావిడి చేశారు. ఎనిమిది మంది పార్టీ కౌన్సిలర్లు, పార్టీ పదవుల్లోని వారు రాజీనామా చేస్తామని కూడా రాజా ఎదుట హెచ్చరికలు చేసిన విషయం విదితమే. ఇందుకోసమేనంటూ తెనాలిలో అత్యవసర సర్వసభ్య సమావేశం ప్రకటన కూడా చేశారు. అధిష్టానంపై తన అసంతృప్తిని చాటేందుకు రాజా నడిపించిన మంత్రాంగంతోనే ఈ డ్రామా జరిగిందనే చర్చ తెనాలిలో నడుస్తోంది.
తెనాలి సీటు జనసేన నేత నాదెండ్ల మనోహర్ కి ఇవ్వొద్దంటూ మాజీ మంత్రి ఆలపాటి అనుచరుల రచ్చ. pic.twitter.com/nRM27aG4R8
— Actual India (@ActualIndia) January 17, 2024
లోకేశ్‌ను కలిశాక మారిన స్వరం
ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం చంద్రబాబును కలిసేందుకు ఆలపాటి రాజా మంగళగిరి వెళ్లారు. అక్కడ చంద్రబాబు అందుబాటులో లేకపోవడంతో లోకేశ్‌ను కలిసి వచ్చారు. ఆ తర్వాత పార్టీ వర్గాల స్వరం మారిందంటున్నారు. సాయంత్రం ఇక్కడి ఎన్‌వీఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటైన అత్యవసర సర్వసభ్య సమావేశంలో మూకుమ్మడి రాజీనామాల ఊసే లేదు.
ఆలపాటి రాజాకు సీటు ఇవ్వాలని, లేకుంటే పోరాడతామని కొందరు నాయకులు ప్రసంగించారు. ఏడు శాతం ఓట్లు కూడా లేని నాదెండ్ల మనోహర్‌కు టికెట్ ఇస్తే ఎలాగని ప్రశ్నించారు. ఆలపాటి రాజా ప్రజా చైతన్య యాత్రను జయప్రదం చేయాలని కూడా పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా, ఆ సమావేశానికి టీడీపీ సీనియర్లు ముఖం చాటేశారు.
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమ వర్గీయులు ఆ సమావేశాన్ని అస్సలు పట్టించుకోనేలేదు. అవకాశవాదం, డబ్బు ప్రాతిపదికగా చంద్రబాబు తరచూ పార్టీ అభ్యర్థులను మారుస్తారనేది అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో 1999లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన డాక్టర్ గోగినేని ఉమ, 2004లో ఓటమి చెందారు. 2009 ఎన్నికలొచ్చేసరికి వేమూరు నియోజకవర్గం నుంచి వచ్చిన ఆలపాటి రాజాకు తెనాలి సీటును కేటాయించారు. ఆ ఎన్నికల్లో తెనాలి నుంచి తనకు, వేమూరు నుంచి నక్కా ఆనందబాబుకు, గుంటూరు పశ్చిమ నుంచి చుక్కపల్లి రమేష్‌కు ముగ్గురి టికెట్లను చంద్రబాబుతో బేరమాడి ఆలపాటి సాధించుకున్నారని ప్రచారం జరిగింది.
ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఉమను పక్కన పెట్టటం, తర్వాత స్థానంలో ఉన్న తనకు సైతం అవకాశం ఇవ్వకపోవడంతో నాడు టీడీపీలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తన మద్దతుదార్లతో సమావేశం నిర్వహించారు. అయినా అప్పట్లో చంద్రబాబు డాక్టర్ ఉమ, శివకుమార్‌లను ఖాతరు చేయలేదు. ఆలపాటి రాజాకే టికెట్ కేటాయించారు. చంద్రబాబుతో ఉన్న లాబీయింగ్‌తో నాడు టికెట్ తెచ్చుకున్న ఆలపాటికి అప్పట్లో తాము పడిన బాధ గుర్తుకు రాలేదా? అంటూ టీడీపీలోని ఉమ వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయించిన ప్రకారమే పనిచేయాలని కూడా సమావేశానికి హాజరైన పలువురు వ్యాఖ్యానించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment