వారబందీ అమలు నిర్ణయం ఉపసంహరించుకోండి
నరసరావుపేట: నాగార్జున సాగర్ కుడి కాలువ ఆయకట్టు పరిధిలో వారబందీ అమలు వల్ల రెండో పంట సాగు చేసిన రైతులకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందని వైఎస్సార్‌సీపీ రైతు విభాగ జిల్లా అధ్యక్షులు అన్నెం పున్నారెడ్డి పేర్కొన్నారు. వెంటనే ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 28వ తేదీ నుంచి వారబందీ అమలు చేస్తామని అధికారులు పేర్కొన్న విషయం విదితమే. దీనిపై ఆయన స్పందిస్తూ.. ఇప్పటికే సాగర్ ఆయకట్టు కింద రైతులు రెండో పంటగా మొక్కజొన్న, వరి, మినుము, పెసరను వేల ఎకరాలలో సాగు చేశారని పేర్కొన్నారు. వారబందీ అమలు విషయం డిసెంబర్ మొదటి వారంలో అధికారులు చెప్పి ఉంటే రైతులు రెండో పంటపై నిర్ణయం తీసుకొని ఉండేవారన్నారు. వారు రెండో పంట వేసుకున్నాక ఇప్పుడు ప్రకటన చేయటం వల్ల రైతులకు ఎకరానికి రూ.20 వేలు నష్టం వస్తుందన్నారు. వారబందీగా సాగునీరు ఇవ్వాలనుకుంటే ఎకరానికి రూ.25 వేలు నష్టపరిహారం ఇవ్వాలని పున్నారెడ్డి డిమాండ్ చేశారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఎలాంటి వారబందీ లేకుండా సంపూర్ణంగా సాగునీరు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెనాయుడులను కోరారు. లేదంటే రైతుల తరఫున వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని హెచ్చరించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతు సోదరులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగునీరు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అంతేగాకుండా రైతులకు తగిన గిట్టుబాటు ధర కల్పించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చి తర్వాత గిట్టుబాటు ధర లేక మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే తమ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని సంప్రదించి రైతు మహాధర్నా చేపడతామని హెచ్చరించారు.
లేనిపక్షంలో రైతులకు తీవ్ర అన్యాయం ఎకరాకు రూ.20 వేలు వరకు నష్టం వైఎస్సార్‌సీపీ రైతు విభాగ జిల్లా అధ్యక్షులు
Comments
Please login to add a commentAdd a comment