సర్కారు జాగా.. యథేచ్ఛగా పాగా!
బాపట్ల టౌన్: పేదల అభ్యున్నతి కోసం నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హయాంలో మండలంలోని వెస్ట్ బాపట్ల పంచాయతీ పరిధిలోని వైఎస్సార్ కాలనీ సమీపంలో ప్రభుత్వ భూమిని పేదలకు కేటాయించారు. సర్వే నెంబర్ 408, 203, 207, 208, 209లలో సుమారు 6 ఎకరాలు ఇక్కడ ఉంది. దానిలో జగనన్న కాలనీ లే అవుట్ వేసి 118 మంది పేదలకు ఇళ్లపట్టాలు కూడా సిద్ధం చేశారు. ప్రస్తుతం ఆ పట్టాలు తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారుల పేరుతో ఉన్నాయి. 2024లో ఎన్నికల కోడ్ రావడం, అదే ప్రాంతానికి చెందిన కొందరు కోర్టుకు వెళ్లడంతో పట్టాల పంపిణీ నిలిచిపోయింది. ఈ స్థలం హైవేకు ఆనుకొని ఉండటంతో రూ.కోట్ల విలువ చేసే భూమిపై కన్నేసిన టీడీపీ నాయకులు కబ్జాకు తెరతీశారు.
బలవంతంగా తొలగింపు
శనివారం అర్ధరాత్రి ప్రభుత్వ స్థలంలో గుడిసెలు ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు ఆదివారం సాయంత్రం అక్కడకు చేరుకున్నారు. గుడిసెలు తొలగించాలని కబ్జాదారులను హెచ్చరించారు. ఎంతసేపటికీ వినకపోవడంతో అధికారులు బలవంతంగా గుడిసెలు ఖాళీ చేయించారు. వాటి ఏర్పాటుకు ఉపయోగించిన కలప, పట్టలను ట్రాక్టర్‌లో తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. కబ్జాదారులు మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి కబ్జా చేసి శాశ్వత భవనాలు నిర్మించుకున్న వారిని ఎందుకు ఖాళీ చేయించడం లేదన్నారు. ఇటీవల సర్వేనెంబర్ 207, 208 పరిధిలో ప్రభుత్వ భూమిని పేదలకు లాటరీ పద్ధతిలో స్థానిక టీడీపీ నాయకులు ఒక్కో ప్లాట్‌కు రూ. 20 వేలు తీసుకొని ఇచ్చినప్పుడు మీరంతా ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు.
పేదలమైన తాము గుడిసెలు వేసుకుంటే తొలగిస్తారా అంటూ నాగేంద్రపురం గ్రామానికి చెందిన ఆట్ల కృష్ణారెడ్డి, గోసంద్రం వెంకటరత్నం, జక్కిరెడ్డి జానకీలు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన పోలీసులు వారిని అడ్డుకొని చికిత్స నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
ఆక్రమిస్తే కఠిన చర్యలు
ఆర్టీవో పి.గ్లోరియా మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఇదే ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూమిని కొందరికి పంచిన విషయం తమకు తెలియదన్నారు. అధికారికంగా తాము ఏ ఒక్కరికీ పట్టాలు ఇవ్వలేదని చెప్పారు. పైగా ఈ స్థలం విషయం కోర్టు పరిధిలో ఉందని గుర్తుచేశారు. ఈ స్థలంలో ఎలాంటి కట్టడాలు చేపట్టినా, ఆక్రమించినా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒక్కొక్కరి వద్ద నుంచి రూ. 20 వేలు వసూలు చేసి స్థలాన్ని కేటాయించిన వారిపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అర్హులైన పేదలు ఉంటే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలేగానీ ఇష్టానుసారంగా కబ్జాలకు పాల్పడితే సహించేది లేదన్నారు. గుడిసెలు తొలగించే కార్యక్రమంలో తహసీల్దార్ షేక్ సలీమా, రూరల్ సీఐ కె. శ్రీనివాసరావు, ఎస్‌ఐ శ్రీనివాసరావు, వీఆర్వోలు, పోలీసులు పాల్గొన్నారు.
రాత్రికి రాత్రే గుడిసెలు ఏర్పాటు రంగంలోకి రెవెన్యూ, పోలీస్ అధికారులు తొలగింపును అడ్డుకున్న కబ్జాదారులు ముగ్గురు ఆత్మహత్యాయత్నం బాధితులు ఆసుపత్రికి తరలింపు ఎట్టకేలకు గుడిసెలు తొలగింపు
సర్కారు జాగా.. యథేచ్ఛగా పాగా!
సర్కారు జాగా.. యథేచ్ఛగా పాగా!
Comments
Please login to add a commentAdd a comment