అందుబాటులో ఆధునిక వైద్యం
ముందే గుర్తిస్తే పూర్తిగా నయం చేయొచ్చు వైద్య నిపుణుల వెల్లడి
నేడు జాతీయ క్యాన్సర్ అవగాహన దినం
క్యాన్సర్(రాచపుండు)కు ఇప్పుడు అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉంది. ముందే గుర్తిస్తే పూర్తిగా నయం చేయొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. తగు జాగ్రత్తలతో ముందుకు సాగితే క్యాన్సర్‌ను జయించడం కష్టమేమీ కాదని స్పష్టం చేస్తున్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 2014 నుంచి ఏటా నవంబర్ 7న జాతీయ క్యాన్సర్ అవగాహన దినం నిర్వహిస్తున్నారు. క్యాన్సర్ చికిత్సలో కీలకమైన రేడియంను కనిపెట్టిన పోలాండ్ దేశానికి చెందిన మేడం క్యూరీ పుట్టిన రోజునే అవగాహన దినంగా నిర్వహించడం గమనార్హం.
గుర్తించడం ఎలా?
మానకుండా ఉన్న పుండ్లు, శరీరంలోని ఏ భాగంలోనైనా ఎదుగుతున్న గడ్డలు, కణుతులు, అసహజమైన రక్తస్రావం, పెరుగుతున్న పుట్టుమచ్చలు, పులిపిరి కాయలు, మింగటం కష్టంగా ఉండటం, గొంతు బొంగురుపోయి తగ్గకుండా ఉండటం, చాలా రోజులుగా ఉన్న అజీర్ణవ్యాధి తదితర లక్షణాలు ఉంటే తక్షణమే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి.
కారకాలు
సిగిరెట్ పొగలో 400 రకాల హానికారక రసాయనాలు ఉంటాయి. వీటితోపాటు గుట్కా పాన్, మసాలాలు, వేపుళ్లు, నిల్వ ఉన్న పచ్చళ్లు, బేకరీ పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల నోటి, పేగు, కిడ్నీ క్యాన్సర్‌లు వస్తాయి. ఊబకాయుల్లో మూత్రాశయ, గర్భాశయ, పేగు క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది, పాంక్రియాటిక్ క్యాన్సర్లూ వస్తాయి. పారిశ్రామిక వ్యర్థాలు, ఫ్యాక్టరీలు వదిలే పొగల వల్ల క్యాన్సర్ వచ్చే రిస్క్ 3 నుంచి 4 శాతం ఉంటుంది.
మాంసాహారాల్లో క్యాన్సర్ కణాలు
తాజా కూరగాయలు, ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి. వీటిల్లో క్యాన్సర్ కారకాలతో పోరాడే యాంటిజెంట్స్ ఉంటాయి. మాంసాహారాల్లో క్యాన్సర్ కణాలు అధికంగా ఉంటాయి. ఇవి తినేవారు తప్పనిసరిగా వెజిటబుల్ లేదా ఫ్రూట్ సలాడ్ తినాలి. దీనివల్ల మాంసాహారంలో ఉండే క్యాన్సర్ కణాలతో సలాడ్‌లోని యాంటీజెంట్స్ పోరాడతాయి. కొవ్వుశాతం తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తక్కువ. భోజనంతో తాజా పండును రోజూ తీసుకోవాలి. రోజూ కనీసం అరగంటసేపు వ్యాయామం చేయాలి. స్మోకింగ్, మద్యం, పాన్, గుట్కా లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి.
మహిళల్లో రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్
నాన్‌కమ్యూనకబుల్ డిసీజ్ ప్రోగ్రాంలో గత ఏడాది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించగా జిల్లాలో 2,54,636 మంది రొమ్ము, సర్వైకల్, ఓరల్ క్యాన్సర్‌లతో బాధపడుతున్నట్లు గుర్తించారు. జిల్లాల్లో 40 మంది క్యాన్సర్ వైద్య నిపుణులు ఉండగా రోజూ వీరి వద్ద 30 నుంచి 50 మంది వరకు రోగులు వైద్యసేవలు పొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment