-
పేద యువతికి అంతు చిక్కని వ్యాధి
-
తల నుంచి కాళ్ల వరకూ నిత్యం రక్తస్రావం
-
రోగ నిర్ధారణ, చికిత్సలకు రూ.లక్షలు అవసరం
-
‘ఆశ’ను ఆదుకోని ఆరోగ్యశ్రీ పథకం
-
ఉదారులే పునర్జీవితాన్నివ్వాలని వేడుకోలు
ఆమె పేరు ఆశ. వయసు 20 ఏళ్లు. జీవితం గురించి రంగురంగుల కలలు కనే ఈడు అది. కానీ, ఆమెకు నిత్యం తప్పనిసరిగా కళ్లకు కట్టేది ఒకటే రంగు..ఎరుపు! ఆ ఎరుపు పెరట్లో విరిసే ఏ మందారానిదో కాదు.. ఆమె శరీరం నుంచి కురిసే నులివెచ్చని నెత్తుటిదే! కొండకొమ్ము నుంచి దూకే జలపాతంలా తుళ్లి పడాల్సిన ప్రాయంలో ఆ యువతికి తల నుంచి కాలి గోళ్ల వరకూ ‘రక్తపాతాని’కి నెలవులే! మనమంతా ‘అష్టకష్టాలు’ అంటుంటాం. కానీ ఆ ఎనిమిది కష్టాలేమిటో చెప్పమంటే చెప్పలేం. కానీ, 20 ఏళ్లకే ఆశ అంతకు మించిన కష్టాలను అనుభవించింది. ఇప్పుడు అన్ని వ్యధల్నీ మించి.. మూలమేమిటో అంతుపట్టని ‘రుధిరధారాపాత’ వ్యాధి ఆమెను పీడిస్తోంది. అయినా ఆమెలోని ‘ఆశ’.. ఇగిరిపోలేదు. తనను వెన్నాడుతున్న కష్టాలు వెన్ను చూపుతాయనీ, తన ‘రక్తకన్నీటి’కి అడ్డుకట్ట పడుతుందనీ, తిరిగి తాను చదువుకుంటాననీ, చక్కటి భవిష్యత్తు సొంతమవుతుందనీ కలలు కంటోంది. అయితే ఆమె.. రెక్కల కష్టంతో బతికే తోడబుట్టిన వారి ఆదరణతో మనుగడ సాగిస్తున్న నిరుపేద. ఆమె స్వస్థత చేకూరి, ఆమె స్వప్నాలు సాకారం కావాలంటే.. కలిగిన వారి కరుణ ఆమెపై కురవాల్సిందే!
మర్రిపూడి (రంగంపేట) :
ఒకదాని వెనుక ఒకటిగా కష్టాలు విరుచుకుపడుతుంటే.. ‘సినిమా కష్టాలు’ అనడం పరిపాటి. గండేపల్లి మండలం కొత్త నాయకంపల్లికి చెందిన గంధం ఆశకు నూరుశాతం వర్తిస్తుంది. ఆ గ్రామానికి చెందిన కామరాజు, దయామణి అనే దళిత దంపతులకు ఇద్దరు కొడుకులు, నలుగురు కుమార్తెలు. వారిలో చిన్నది ఆశ. 8 ఏళ్ల క్రితం కామరాజుపై ఓ వివాదంలో ప్రత్యర్థులు యాసిడ్ పోశారు. తీవ్రంగా గాయపడి పనిపాట్లు చేయలేని స్థితికి చేరిన భర్తకు సేవలు చేస్తూ వచ్చిన దయామణి తానే హద్రోగంతో తనువు చాలించింది. అది జరిగిన కొద్దిరోజులకే వారిద్దరి కొడుకులూ ఎటో వెళ్లిపోయారు. కుమార్తెల్లో పెద్ద వాళ్లిద్దరికీ పెళ్లిళ్లు కాగా మూడో కుమార్తె మేరీరత్నం ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆశ తండ్రికి సేవలు చేసేది. అదే సమయంలో ఆమెకు శరీరంలో అనేక అవయవాల నుంచి నెత్తురు స్రవించే అరుదైన వ్యాధి సోకింది. మూడేళ్ల క్రితం కామరాజు కూడా చనిపోయాడు. ఆశ నివసించే పూరిల్లు అగ్నిప్రమాదంలో కాలిపోయింది. దాంతో ఆమెను రంగంపేట మండలం మర్రిపూడిలో ఉంటున్న రెండో అక్క ఏడిద ఎలుసమ్మ, బావ నాగేశ్వరరావు తమ ఇంటికి తీసుకు వెళ్లారు.
శక్తికి మించిన చికిత్స..
అంతుపట్టని రక్తస్రావంతో బాధపడుతున్న ఆశను అక్కాబావలు శక్తికి మించినా లక్షలు వెచ్చించి అనేక ఆస్పత్రులకు తీసుకువెళ్లారు. ఆశకు ఆరోగ్యశ్రీ కార్డున్నా వ్యాధి నిర్ధారణ కాకపోవడంతో ఎలాంటి ఉపయోగమూ లేకుండా పోయింది. ఆశను హైదరాబాద్ నిమ్స్‌లో, విశాఖపట్నం కేజీహెచ్‌లో, తమిళనాడులోని రాయవెల్లూరు ఆస్పత్రిలో చూపించారు. అయినా ఆమెను పీడిస్తున్న జబ్బేమిటో నిర్ధారణ కాలేదు. ఆమెకు అవసరమైన పరీక్షలు చేయడానికి, అవసరమైన ఒంట్లోని రక్తం మెుత్తం మార్చడానికి రూ.5 లక్షలకు పైగా ఖర్చవుతుందని రాయవెల్లూరు వైద్యులు చెప్పారు. దాంతో ఎలుసమ్మ, నాగేశ్వరరావు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సాయం కోసం గండేపల్లి మండలాధికారుల ద్వారా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కూలి పనులు చేసుకుని బతికే తాము దుబాయిలో ఉన్న మేరీరత్నం సహకారంతో ఆశకు తాత్కాలిక చికిత్సనే చేయిస్తున్నామని, దయగలవారు ముందుకు వచ్చి ఆర్థికంగా సాయం చేస్తేనే ఆశను బతికించుకోగలమని వారంటున్నారు. కరుణ కలిగి, హదయం కరిగి, ఆదుకోవాలనుకునే వారు 95502 73159 నంబర్లో సంప్రదించాలని కోరుతున్నారు.
వ్యాధికి మూలం మనోవ్యధేనా!
ఆశ పూర్వ వైద్య నివేదికలను రంగంపేట ఆదర్శ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ లక్ష్మీదేవి, పర్యవేక్షకులు బిషప్ పరిశీలించారు. ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. తణుకులో ఉన్న ప్రియాంక నర్సింగ్ హోమ్ మానసిక వైద్యుడు డాక్టర్ కె.ఆనంద్‌ను సంప్రదించారు. ఇటువంటి కేసులు తక్కువగా వస్తాయని, కౌన్సిలింగ్ ద్వారా కొంతవరకూ నయమవుతుందని ఆయన చెప్పారు. కొద్ది రోజులు ఆ డాక్టర్ సలహాలు పాటిస్తే కొంతవరకూ నయమవుతుందని చెప్పడంతో ఆశ, ఆమె అక్క ఎలుసమ్మలకు కాస్త ధైర్యం చేకూరింది. బలం కోసం ఇప్పటి వరకూ వాడిన మందులనే వాడాలని రంగంపేట వైద్యులు చెప్పారు. మర్రిపూడి ఏఎన్‌ఎం వి.రమణమ్మ, ఆశ కార్యకర్త కె.పద్మ సహకారంతో ఆశ, ఎలుసమ్మ ఎంపీడీవో కె.కిషోర్‌కుమార్‌ను కలుసుకుని తమ గోడు వినిపించారు. వైద్యుల నివేదికల ఆధారంగా పింఛను కానీ, అత్యవసరమైతే ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సాయం కానీ అందించడానికి కృషి చేస్తామని ఎంపీడీవో హామీ ఇచ్చారు. ఉన్నత వైద్య పరీక్షలు, మందులు, పోషకాహారం కోసం ఆర్థిక సహకారం అందించాలని బాధితులు కోరుతున్నారు.
ఔదార్యం చూపితే మెరుగైన వైద్యం
గంధం ఆశ ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటి వరకూ వివిధ ఆస్పత్రుల వైద్యులు ఇచ్చిన నివేదికలు చూశాను. అన్నీ మామూలుగానే ఉన్నాయి. అయితే తల్లిదండ్రులను కోల్పోయిన ఆశ తీవ్ర మానసిక ఒత్తిడికి గురై నిరంతరం కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతోంది. దీనివల్ల ఈ సమస్య తలెత్తినట్టు భావిస్తున్నాం. మానసిక వైద్యుల సలహా తీసుకోవడంతో ఈ విషయం తెలిసింది. కొద్ది రోజులపాటు మానసిక వైద్యుల సలహా మేరకు వైద్యసేవలు పొందితే బాగుంటుంది. ఆ దిశగా మావంతు కృషి చేస్తాం. పేద కుటుంబం కావడంతో దాతలు ఆదుకుంటే మెరుగైన వైద్య పరీక్షలకు, చికిత్సకు వీలవుతుంది. ఆశకు వైద్య సేవలందించడానికి స్థానిక ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్త అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాను.
– డాక్టర్ పి.లక్ష్మీదేవి, ఆదర్శ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రంగంపేట
చికిత్స ఖర్చు మాకు కలలో మాటే..
ఆశను విశాఖలోని కేజీహెచ్‌లో చూపిస్తే వ్యాధి నిర్ధారణ చేయలేకపోతున్నామని.. రాయవెల్లూరు ఆస్పత్రికి తీసుకువెళ్లమని చెప్పారు. అక్కడికి తీసుకువెళితే నెలకు పైగా ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచాలని, అన్ని రకాల పరీక్షలూ చేయాలని, అవసరమైతే పూర్తిగా రక్తమార్పిడి చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇందుకు రూ.5 లక్షలకు పైగా ఖర్చవుతుందంటున్నారు. ఆ మెుత్తం మాకు కలలోని మాటే. అందుకే దాతల సాయం కోసం చేతులు జోడించి అర్థిస్తున్నాం. హైదరాబాద్ వెళ్లి ముఖ్యమంత్రిని కలుసుకుని, సాయం చేయాలని అభ్యర్థిస్తే అక్కడి సిబ్బంది పొమ్మన్నారు. ఇటీవల గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ పెండ్యాల నళినీకాంత్, ఉపసర్పంచ్ రిమ్మలపూడి సత్యనారాయణలను కలువగా సీఎం సహాయ నిధికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. తాడేపల్లిగూడేనికి చెందిన హోమియోపతి వైద్యులు పల్లా వెంకటేశ్వరరావు ఉచిత వైద్యసేవలు చేస్తూ, మందులు ఇస్తున్నారు.
– ఏడిద ఎలుసమ్మ , ఆశ సోదరి
జబ్బు నయమై, చదువుకోవాలనుంది
మాయదారి రోగంతో మంచానికే పరిమితమయ్యాను. దాతలు కనికరిస్తే వైద్యం చేయించుకుని, ఆరోగ్యవంతురాలినై, చదువుకోవాలని ఉంది. రెండో అక్క ఎలుసమ్మ, బావ నాగేశ్వరరావు, దుబాయిలో ఉన్న మూడో అక్క మేరీ రత్నంల రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. అక్కా,బావలకు భారం కాకుండా ఆదుకోవాలని అభ్యర్థిస్తున్నాను.
– గంధం ఆశ