ఖమ్మం వైద్యవిభాగం: గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి భరోసా కల్పించేలా జిల్లా జనరల్ ఆస్పత్రిలో కార్డియాలజీ విభాగాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏడాదిన్నరగా మెరుగైన సేవలు అందుతుండడంతో దూరప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులు తీరాయి. అయితే, వారం రోజులుగా మాత్రం ఇక్కడ చికిత్సకు అంతరాయం ఏర్పడింది. శస్త్రచికిత్సలు నిలిచిపోవడంతో బాధితులు బెడ్ల మీదే ఉంటూ దీనంగా ఎదురుచూస్తున్నారు. త్వరగా తమకు శస్త్రచికిత్స నిర్వహించాలని వేడుకుంటున్నారు.
అత్యాధునిక యంత్రాలు
ఇతర ప్రాంతాలతో పోలిస్తే కొన్నేళ్లుగా ఖమ్మం జిల్లాలో గుండె జబ్బులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వైద్యం అందక ప్రైవేట్ దవాఖానాలకు వెళ్లి ఆర్థికంగా నష్టపోయేవారు. మరికొందరు నిరుపేదలు వైద్యం చేయించుకునే స్థోమత లేక తనువు చాలించేవారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం రెండేళ్ల క్రితం గుండె సంబంధిత బాధితుల కోసం కార్డియాలజీ విభాగాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. శస్త్రచికిత్సలు నిర్వహించడానికి రూ.7 కోట్ల విలువైన క్యాథల్యాబ్ మిషన్‌ను కేటా యించగా, గత ఏడాది జనవరిలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.
తద్వారా ఎంతో ఖర్చుతో కూడిన చికిత్స ఉచితంగా అందుబాటులోకి రాగా, వందలాది మందికి శస్త్రచికిత్స చేశారు. కార్డియాలజీ విభాగంలో కరోనరీ యాంజియోగ్రామ్ శస్త్రచికిత్సతో పాటు, స్టంట్లు, బలూన్ యాంజియోప్లాస్టీ, రెనల్ యాంజియోగ్రామ్, రూట్ యాంజియోగ్రామ్, కారోటిడ్ యాంజియోగ్రామ్, పెరిపెరల్ యాంజియోగ్రామ్, బ్రాంకియల్ యాంజియోగ్రామ్, పెరీకార్డియో సెంటెసిస్ తదితర సేవలందిస్తున్నారు.
బిల్లులు పేరుకుపోవడంతో...
క్యాఽథల్యాబ్ యంత్రం ద్వారా చికిత్స చేయాలంటే కాంట్రాస్ట్ ఇంజక్షన్లు అవసరమవుతాయి. బాధితులకు శస్త్రచికిత్స చేసే ముందు ఈ ఇంజక్షన్ ఇచ్చి గుండె పనితీరు, ఎక్కడ ఏ సమస్య ఉంది, స్టంట్ ఎక్కడ వేయాలనే అంశాన్ని మానిటర్ ద్వారా తెలుసుకుంటారు. అనంతరమే శస్త్రచికిత్స చేయడానికి సిద్ధమవుతారు. కానీ కాంట్రాస్ట్ ఇంజక్షన్లు లేకపోవడంతో వారం రోజులుగా శస్త్రచికిత్సలు పూర్తిగా నిలిచిపోయాయి.
హైదరాబాద్ గాందీ, నిమ్స్ తదితర ఆస్పత్రుల మాదిరిగానే ఈ ఇంజక్షన్లు ఇండెంట్ పెట్టి బయట నుంచి తెప్పిస్తారు. అయితే, సరఫరా చేసే ఏజెన్సీకి బిల్లులు పేరుకుపోవడం వారు నిలిపివేశారని తెలుస్తోంది. కారణాలు ఏమైనా శస్త్రచికిత్సలు నిలిచి గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు ఇక్కట్లు ఎదుర్కొంటుండగా... కొందరు చేసేదేం లేక బయటి ఆస్పత్రులకు వెళ్తున్నారు. మరికొందరు మాత్రం శస్త్రచికిత్స ఎప్పుడు చేస్తారా అని వేయి కళ్లతో ఎదురుచూస్తూ గడుపుతున్నారు.
ఇంజక్షన్ వస్తేనే..
ఈయన పేరు సీహెచ్.నాగేశ్వరరావు. వయస్సు 38 ఏళ్లు మాత్రమే. ఐదు రోజుల క్రితం గుండె భాగంలో నొప్పి రావటంతో కూలబడగా ఆయన భార్య ప్రభుత్వ ఆస్పత్రి కార్డియాలజీ విభాగానికి తీసుకొచ్చింది. వైద్యులు పరీక్షించి గుండె సమస్య ఉన్నట్లు గుర్తించారు. ఇన్‌పేషంట్‌గా చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. కానీ సమస్య తీవ్రత తెలియాలన్నా, శస్త్రచికిత్స చేయాలన్నా కాంట్రాస్ట్ ఇంజక్షన్ అవసరం. అవి లేకపోవడంతో యాంజియోగ్రామ్ నిర్వహించకపోగా ఏమవుతుందోనన్న బెంగతో నాగేశ్వరరావు, ఆయన కుటుంబం ఎదురుచూస్తోంది.
ఆ ఏర్పాట్లలోనే ఉన్నాం...
కాంట్రాస్ట్ ఇంజక్షన్లు లేక శస్త్రచికిత్సలు నిలిచిన మాట వాస్తవమే. బయట నుండి తెప్పించాల్సి ఉంది. ఆ ఏర్పాట్లలోనే ఉన్నాం. అయితే, ఇన్‌పేషంట్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కార్డియాలజీ వైద్యుడి పర్యవేక్షణలో చికిత్స అందుతోంది.
– బి.వెంకటేశ్వర్లు, ఆస్పత్రి సూపరింటెండెంట్
Comments
Please login to add a commentAdd a comment